Menu Close
గూడు (కథ)
-- Dr. శేషు శర్మ MD --

ఆ రోజు విజయ దశమి. ఆదివారం. ఉదయం 7:30 అయింది. ఎందుకో లేవాలంటే మనస్సు పీకుతోంది. అయినా బలవంతాన లేచి కూర్చుంది అన్నపూర్ణ. మామూలుగా అయితే ఈ పాటికి లేచి, గుమ్మాన్నినీళ్ళతో కడిగి, పసుపు రాసి, బొట్లుపెట్టి, తనకు చేతనయినంత ముగ్గు పెట్టేది. శుచిగా స్నానం చేసి, దేవుడి పూజ సామాను సర్ది, ప్రసాదం తయారు చేసేది. ఈలోపల భర్త స్నానం చేసి వచ్చి దేవుడికి దీపం వెలిగించి పూజకి కూర్చునేవాడు. అమెరికాకి వచ్చినప్పటీ నుండీ, అంటే గత 40 ఏళ్ళగా ఇదే రొటీను. భర్తకి అమ్మవారు అంటే చాలా భక్తి. చిన్న ఊరయినా హాయిగా సంసారం గడిపేరు పూర్ణ, ఆంజనేయులు. ఒక్కగానొక్క కూతురుని ముద్దుగా సాకి, సంప్రదాయంగా పెంచేరు. ఊళ్ళో ఉన్నన్నాళ్ళూ, కూతురు కూడా, భక్తి గా నవరాత్రి పూజల్లో పాల్గొంటూ ఉండేది.

సరే అని అలోచనలను పక్కకి నెట్టి, లేచి, పక్క బట్టలు నీటుగా మడతబెట్టి భర్త కోసం చూసింది. పక్కనే ఉన్న ఆఫీసు రూములో ఏదో చదువుతూ కనిపించాడు ఆంజనేయులు.

మౌనంగా స్నానానికి వెళ్ళింది. ప్రతి ఏడాది, దసరా పండగలంటే ఎంతో హడావిడి వాళ్ళ ఇంట్లోను, గుళ్ళోను. ఆ వూళ్ళో అందరిలోకి పెద్ద వారేమో, వాళ్ళంటే గౌరవం అందరికీ. ప్రతి పూజకి, సంబరాలకి, సంధానకర్తలు వాళ్ళే. ముఖ్యంగా దసరా నవ రాత్రులు, విజయ దశమి, వాళ్ళింట్లో లలితా సహస్రనామాలూ, చండీ శతకాలు, దేవీ సప్తశతి, అన్నీ ఘనంగా జరుగుతూ ఉండేవి. గుళ్ళో చండీ హోమం, మిగతా పూజలు, అన్నిటిలో పాల్గొంటూ, ఊపిరి తిరిగేది కాదు వాళ్ళిద్దరికీ.

ఆరోజు, వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త ఘట్టం, అమ్మవారి దయ ఎలాఉందో, అనుకుంటూ, మడిగా పట్టు చీర కట్టుకొని, నిండుగా ఎప్పటి మాదిరి పెద్ద బొట్టు పెట్టుకొని వంట గది లోకి బయలుదేరింది అన్నపూర్ణ. భర్త కోసం, పక్క గదిలోకి దృష్టి మళ్ళించింది. అతను కిటికీ లోంచి బయటకు చూస్తున్నాడు శూన్యంలోకి. రాత్రంతా నిద్రపోయినట్టు లేదు. కాస్సేపు పడుకుంటే బాగుణ్ణు అనుకుంది మనస్సులో. కానీ చెప్పడానికి, గొంతు పెకిలి రాలేదు.

వంటింట్లో పనులు చేసుకుంటూ ఉంటే, ఫోన్ల మీద ఫోన్లు, విజయ దశమి శుభాకాంక్షలు చెప్పేవారు, ఆనాటి ఫంక్షన్ గురించి అడిగేవాళ్ళు. నెమ్మదిగా, అందరికీ సమాధానాలు చెప్తూనే అమ్మవారికి, గుడాన్నం, పులిహోర, దద్దోజనం చేసింది. పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి, భర్తకోసం ఎదురు చూస్తూ, ఎదురుగా ఉన్న ఫోటో మీదకి దృష్టి సారించింది. మెడికల్ కాలేజీ లో చేరినప్పుడు అపర్ణ వైట్ కోట్ సెరిమొనీ అది.

అందం గా, తెల్ల డాక్టర్ కోటులో మెరిసిపోతోంది. ఒక్కగానొక్క కూతురు, అందం, చందం, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి. చెప్పిన మాట ఎప్పుడూ జవదాటేది కాదు. అల్లాంటిది. ఎంతదూరంగా పయనిస్తోంది? మనస్సు ఆలోచించి, ఆలోచించి, మొద్దుబారిపోయింది అన్నపూర్ణకి. దేవుడి గూట్లో దీపం వెలిగించి, తన ఫోన్ లో అమ్మవారి కీర్తనలు పెట్టింది...స్రావ్యంగా వినిపిస్తూఉంటే కళ్ళు మూసుకుంది అన్నపూర్ణ.

అన్న పూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహి చ పార్వతీ
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర
భాంధవాశ్శివభక్తాశ్చ స్వదేశో  భువన త్రయం

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం. ఎన్ని సార్లు విందో ఆ వాక్యం. కాని, ఈరోజు ఎందుకో మనస్సులో నాటుకుంది. నిజమే. ఈ వయస్సులో తనకి కావల్సింది జ్ఞానం వైరాగ్యం.

ఉన్నట్టుండి మనస్సు నిర్మలంగా, ప్రశాంతం గా అయింది అన్నపూర్ణకి. ధ్యానంలోకి మెల్లిగా జారుకుంది.

పైన ఆఫీసు గదిలో కిటికీలోంచి చూస్తున్నాడు ఆంజనేయులు. ప్రకృతి, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. అక్టోబర్ నెలేమో, ఆకులు చిత్ర విచిత్రమైన రంగులు మారుతున్నాయి... నా సమయమైపోయింది...నీకూ నాకూ ఇక బంధం లేదు, అని చెప్తూ, చెట్టునుండి రాలిపోతున్నాయి.

ఏమిటో? తనూ, మరి ఆ ఆకుల్లాగా, పండి, వర్ణాలు మారుతూ ఉంటే, ఏదోనాడు రాలిపోయేవాడే కదా, అన్న ఆలోచన కలిగింది అనుక్కోకుండా ఆంజనేయులికి.

క్రింద నించి, శ్రావ్యంగా,

"అన్నపూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి, కటాక్షి" సుధా రఘునాథన్ గొంతులో.  ముత్తుస్వామి దీక్షితార్ గారు సామ రాగంలో అమ్మని ఉద్దేశిస్తూ, ఎంత అందంగా వ్రాశారో. ఎన్ని సార్లు విన్నాడీ కీర్తన? అపర్ణ పాడుతూ ఉంటే, మరీ మరీ అడిగి పాడించుకునే వాడు.

"త్రయాతీత మోక్షప్రద చతురే, త్రిపద శోభిత గురుగుహసాదరే' ఎప్పుడూ వినేదే..

ఎందుకో ఈరోజు వేరేగా వినిపిస్తోంది. పూర్వం ఆపాటలో అందాన్ని ఆశ్వాదించాడు. ఈరోజు మోక్షానికి మార్గం కోసం వెతుకుతున్నాడు. మోక్షం అంటే ఏమిటి?  మన ఆలోచనలకి మనం బందీ కాకుండా ఉండడం. కానీ అది ఎంత కష్టమో?

ఫోను గట్టిగా మ్రోగడంతో ఉలిక్కి పడ్డాడు. తమ్ముడు మారుతి రావు.

“అన్నయ్యా, ఈరోజు రాలేక పోతున్నాము. ఏమీ అనుకోకు.మీ మరదలుకి వంట్లో బాగా లేదు.

ఇంకోసారి తప్పకుండా వచ్చి కలుస్తాము". ఏదో సాకు చెప్పి, ఫొను పెట్టేశాడు. చిన్నగా నవ్వుకున్నాడు తనలోనే. ఎవరి భయాలు వాళ్ళవి. పెళ్ళి కావలసిన కూతుళ్ళు ఇద్దరున్నారు వాడికి. వాడి బాధ వాడిది.

ఫోను పెట్టేస్తూవుంటే, మాధవ రావు చేసేడు. తనకి ఆప్తమిత్రుడు.

"ఒరే అంజిగా. కొంచెం లేటవుతోంది. నేను, లలిత వస్తున్నాము. నువ్వు ధైర్యం గా వుండు. అన్నీ సర్దుకుంటాయి. నువ్వు, పూర్ణ, మనస్సు నిబ్బరం చేసుకోవాలి. అపర్ణ మాణిక్యం రా. అటువంటి కూతురు ఉండండం నీకు గర్వ కారణం రా", అంటూ హడావిడిగా ఫోను పెట్టేసాడు. ఎవరు మనవాళ్ళు? ఎవరు పరవాళ్ళు. తోబుట్టువుకి, ఆత్మబంధువుకి తేడా ఎంతో ఆరోజు బాగా అర్ధమైంది ఆంజనేయులికి.

ఎదురుగా ఆకాశంలో ప్రకాశిస్తూ, అభయహస్తం ఇస్తున్నట్టుగా గోచరించాడు సూర్యభగవానుడు. రెండు చేతులూ జోడించి కళ్ళు మూసుకున్నాడు. ఇంతకు ముందెప్పుడూ అంత నిర్మల హృదయంతో ప్రార్ధించలేదు. ఏదో ప్రశాంతత అతన్ని ఆవహరించింది. మెల్లిగా, స్నానం చేద్దామని, బాత్ రూములోకి జారుకున్నాడు.

స్నానం చేస్తూ ఉంటే, ఆమధ్య తన హై స్కూల్ వాట్స్ గ్రూపులో పెట్టిన మెసేజ్ గుర్తుకొచ్చింది. తన క్లాసుమేట్ కామేశ్వరి చిన్నపిల్లల డాక్ట రుగా బాగా పేరు ప్రతిష్టలు, డబ్బు, సంపాదించింది ఒంగోలులో. ఆ మధ్యనే రిటైర్ అయిపోయి, కోట్లలో ఉన్న తన యావదాస్తినీ, ఒక పిల్లల సంక్షేమ కేంద్రానికి విరాళంగా ఇచ్చేసిందిట. అందరితో పాటూ, తనూ హర్షించేడు ఆవిడ త్యాగాన్ని.

జీవితంలో పారమార్ధికను అర్ధం చేసుకుని, ముందుకు పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంత నిజమో కాని తను ఎందుకు ఇలా ఇరుక్కు పోతున్నాడు? తనది, తనవారు, తమ సంక్షేమం గూర్చే పగలు, రాత్రి, విరామం లేకుండా అలోచిస్తున్నాడు. వేరే మార్గంలోకి ఎందుకు వెళ్ళలేక పోతున్నాడు?

స్నానం చేసి, బట్టలు మార్చుకుని, వంటగదిలోకి వెడుతూ వుంటే, పూర్ణ ఐ ఫోనులోంచి పాట వినిపిస్తోంది.

"తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది.
ఏది కోరేది, వాడినేది అడిగేది?"

వింటూంటే నవ్వు వచ్చింది. ఆ తిక్క శంకరయ్య. అడిగితే ఏం ఇస్తాడో తెలియదు.

జీవితాంతం అమ్మవారిని, అయ్యవారిని అదీ, ఇదీ ఇమ్మని అడిగేడు. ఇప్పుడు, ఇచ్చినది వేప పూవులా చేదుగా ఉంది.

వంటింట్లో భార్య కనిపించలేదు. వెతుక్కుంటూ వెనకాతల పోర్చ్ లోకి వెళ్ళేడు. ఫోనులో మాట్లాడుతోంది ఎవరితోనో. అపర్ణతో అని తెలుసుకున్నాడు. కాస్సేపటికి నిశ్శబ్ధంగా లోపలికి వచ్చి, నైవేద్యం అమర్చి పెట్టింది పూర్ణ. వాళ్ళిద్దరి మధ్యలో మౌనం. అయినా, కళ్ళతోనే ఒకరి భావాలు ఇంకొకరు గ్రహిస్తున్నారు.

ఆచమనీయం చేసి, అమ్మవారి పూజ మొదలెట్టాడు అంజనేయులు. పెదాలు పలుకుతున్నాయి. మనసు మాట వినడం లేదు. ఎంత వద్దనుకున్నా, ఉన్నట్టుండి, అలలలా వచ్చి పోతున్నాయి ఆలోచనలు.

%%%%

సెల్ ఫోన్ అలారం కొట్టింది. స్నూజ్ బటన్ నొక్కి, పక్కకు తిరిగింది అపర్ణ. మెలుకవ వచ్చి అప్పుడే ఒక గంట పైన అయ్యింది. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదేమో, బడలికగా ఉంది. తప్పుచేస్తున్నానేమో అన్న అలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. ఎంత ప్రేమగా పెంచేరు తనని తల్లిదండ్రులిద్దరూ.

కన్నతల్లి కంటే గూడా, ప్రాణానికి ప్రాణంగా పెంచేరు నాన్న. నాన్న దగ్గర కూర్చుని ఎన్ని పాటలు విందో? ఎన్ని నేర్చుకుని నాన్న దగ్గర పాడేదో? ప్రతీ దానికి, అర్ధం అడిగి మరీ నేర్చుకునేది. ఎంతో సహనంగా చెప్పేవారు నాన్న. తను తెలుగు చక్కగా నేర్చుకుంటూ ఉంటే ఆయననకి ఎంత తృప్తిగా ఉండేదో?

చిన్నప్పటి ఒక పాట గుర్తుకొచ్చింది అపర్ణకి. తనకి ఒక 5-6 ఏళ్ళు ఉంటాయేమో ఆ పాట మొట్ట మొదటి సారి విన్నప్పుడు. రోజూ, అది వింటే గాని తను పడుకునేది కాదు.

"సిరి దేవి సింగారి చిలక. సిరిమల్లె సొగసైన నడక.
అమ్మరో అందాల బొమ్మ, ఏడేడు జనమాల గూడు కడతావమ్మ.”
మొట్టమొదట గూడు అన్న పదం వింది. ఎందుకో చాలా నచ్చింది.
“గోరొంక గూటికే చేరావు చిలకా”. గూటికి, మళ్ళీ వింది అదే పదం.

నాన్నని అడిగింది అర్ధమేమిటని.

చిలకా, గోరింక, గూడు, గురించి వివరణతో చెప్పేరు నాన్న. గూడూ, తోడూ కుదిరితే జీవితం ఎంత మధురంగా ఉంటుందో చెప్తూ ఉండేవారు.

సూరీడు నుదురెక్కితే అల్ల సిరిలక్ష్మి నవ్విందట.
సంద్రయ్య శిరమెక్కితే అల్ల సురగంగ పొంగిందట.
శివ ధనుసు చే బట్టితే అల్ల సీతమ్మ కులికిందట
ఉమరాజు డమరాలలో అల్ల హిమరాణి ఆడిందట
కలలన్ని నిజమైతే పున్నమేనంట. జలతారు ఎన్నెల్లో జలకాలెనంట

తనకి చాలా నచ్చిన చరణాలు అవి. స్త్రీ పురుష సంబంధమే ప్రకృతి. ఎంత అందంగా చెప్పాడా కవి? అది నిజమని నమ్మింది. కలలు నిజమైతే పున్నమే. కాని, తను ఎప్పుడూ, కలలు కనకపోయినా, నాన్న చెప్పింది నమ్మింది. నాన్న మాట తనకు వేదం.

బుద్ధిగా చదువుకుంది. కాలేజీలో అబ్బాయిల్ని, దూరంగా ఉంచింది. తల్లిదండ్రులు గర్వపడేటట్లు ప్రవర్తించేది. జీవితంలో తోడు అవసరం అనే నమ్మకంతో, వాళ్ళు చెప్పిన అబ్బాయిల్ని చాలామందిని కలిసింది. ఏమిటో, ఎవ్వరితోనూ, మానసికంగా పొంతన కుదిరేది కాదు. చివరికి ఒక అబ్బాయితో, అన్నీ బాగా కుదిరి, ఇక పెళ్ళి నిశ్చయం చేసుకునే సమయానికి తెలిసింది, ఆ అబ్బాయికి ఒక అమెరికనుతో సంబంధం ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది అని. ఇక ముందుకు వెళ్ళదలచుకోలేదు.

చదువు, ట్రైనింగు పూర్తి చేసుకుని ప్రాక్టిసులోకి వెళ్ళేసరికి, 30 ఏళ్ళు దాటాయి. ప్రైవేట్ ప్రాక్టీసులో ఎక్కువ సమయం ఉండేది కాదు. తనకుగా ఎవ్వరినీ కలుసుకులేక పోయింది అపర్ణ. వైద్యపరంగా మంచి పేరు సంపాదించింది. ఆర్ధికంగా కూడా, బాగా గణించింది. కొన్నాళ్ళ తరువాత తెలుగు అబ్బాయిల్నే కాకుండా, పై భాష అబ్బాయిల్ని కూడా కలవడం మొదలెట్టింది. కాని చిత్రమేమిటంటే, ఎవ్వర్ని కలిసినా, వాళ్ళని అర్ధం చేసుకునే సరికి నెలలు నెలలు గడిచిపోయేవి. కాని ఏదీ కుదిరేది కాదు. మళ్ళీ మొదలు. అలాగ ఏళ్ళు గడిచిపోయేయి.

తనకు 40 వ పుట్టినరోజు ఇంటికి వెళ్ళినప్పుడు చూసింది అమ్మ, నాన్న కళ్ళల్లో విషాదం. అంతవరుకు తన రాక కోసం తహ తహలాడే వాళ్ళిద్దరూ, తనని చూడడానికి ఎందుకో జంకే వారు. వాళ్ళకి ఒక్క గంట దూరంలో ఉన్నా, శని ఆదివారాలలో వాళ్ళదగ్గరకు వెళ్ళడం మెల్లిగా తగ్గించింది. రాను రానూ, బ్రతుకు చాలా నిర్లిప్తంగా తయారయింది. ఒంటరితనం ఎక్కువయ్యింది.

రెండేళ్ళ క్రిందట, కాలక్షేపం కోసం అయినా, ఆరోగ్యంకి కూడా మంచిదని, యోగాభ్యాసం, మెడిటేషన్ మొదలెట్టింది. అక్కడ మొట్ట మొదటిసారిగా, యోగా ఇన్స్ట్రక్టర్ సుమన్ తో పరిచయం అయింది. పెద్దచదువు లేక పోయినా, క్రమశిక్షణ, ఆత్మ గౌరవం, మనోధైర్యం పుష్కలంగా ఉన్నాయి సుమన్ లో. కష్టాలని జీవితంలో బాగా ఎదురుకున్న మనిషి. తనకన్నా చిన్న అయినా, తన భావాలతో ఏకీభవించిన వ్యక్తి తనకు తారసపడడం అపర్ణకి కొంత ఆనందాన్ని కలిగించింది. రాను రాను, వాళ్ళిద్దరి మధ్యస్నేహభావం పెరిగింది. శని, ఆదివారాలలో వీలున్నప్పుడల్లా, కలుస్తూ ఉండేవారు.

జీవిత పరమార్ధం, మనిషి చేయాల్సిన కర్తవ్యం, చేరాల్సిన గమ్యం గురించి తరచు చర్చిస్తూ ఉండేవారు. సుమన్ కి ఎక్ హార్ట్ టోల్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. పసితనంలోనే మానసిక హింసకు గురయిన సుమన్ కి టోల్ పుస్తకాలు చాలా ఊరట కలిగించాయి. ఆ పుస్తకాలు, తనూ చదువుతూ ఉండేది.

తనలో ఏదో చెప్పలేని వెలితిని గ్రహించిన సుమన్ తనతో అన్న మాటలు ఎంత స్పష్టంగా గుర్తు ఉన్నాయి!

"అపర్ణా, నీ గమ్యం నిన్ను వెతుక్కుంటూ నీదరికి రాదు. అది ఇప్పుడు నీతోనే ఉంది. నువ్వు ఈక్షణానికి ఉన్న శక్తిని గ్రహించాలి. నీ జీవితానికి ఫోకస్ ఈక్షణమే. గెలుపు అనేది వేరెక్కడో, ఎప్పుడో వస్తుంది అనే పిచ్చి ప్రంపచాన్ని నువ్వు నమ్మకు. అది ఇప్పుడు,ఇక్కడ నీలోనే ఉంది."

అవి సుమన్ మాటలు కావు. టోల్ హృదయంలోనుండి పెల్లుబికి వచ్చిన నగ్న సత్యాలు. వేద సూక్తులు.

"సారం లేని బ్రతుకులో ఇరుక్కుపోయేనని బాధ పడుతూ ఎన్నాళ్ళిలా ఉంటావు? ఏదో ఒక దారి తీసుకుని ముందుకి పో. అది తప్పు మార్గం అయితే, దాని ద్వారా ఒక పాఠం నేర్చుకుంటావు. కాని, తృప్తి లేని జీవితం ఇలా ఎన్నాళ్ళు గడుపుతావు? “

ఈ వాక్కులు తనకి టోల్ చూపుతున్న సరికొత్త బాటలు. సుమన్ సాన్నిహిత్యంలో తన జీవితంలో కొత్తచిగుర్లు రావడం గమనించింది అపర్ణ.

ఇక లేవాలి, సమయం లేదు. ప్రయత్నపూర్వకంగా లేచి తయారవడం మొదలెట్టింది. కనీసం 11 గంటలకైనా కోవెల ప్రాంగణంలో ఉంటే మంచిది. గంటన్నర ప్రయాణం. చక చకా తయరయింది. చక్కటి పట్టు చీర కట్టి, పదహారణాల తెలుగు అమ్మాయిలా రూపు సంతరించుకొంది.

నాన్నకు తను అలా తయారయితే ఎంత సంతోషమో!

ఒక్క సారి ఇల్లంతా పరికించి చూసింది. అన్ని సామాన్లు, ఫర్నిచరు, రెండు రోజుల కిందటే, పక్కింటి అబ్బాయి సహాయంతో చక్కగా అమర్చి పెట్టింది. భోజనానికి, వారానికి సరిపడా గ్రోసరీస్ అన్నీ సమకూర్చింది. ఎక్కడో గుండెల్లో చిన్న ఆందోళన ఉన్నా, ధైర్యంగా, కార్లో కూర్చుంది. అలవాటుగా, చిన్నప్పటి ఘంటశాల, సుశీల పాటలు పెట్టింది. వింటూంటే హాయిగా ఉంది. కారు రోడ్డు మీద స్పీడుగా పోతోంది.

ఉన్నట్టుండి బాలు గళం వినిపిస్తోంది. బాగా కంఠత వచ్చిన పాట.

"నడియేటి నడకంటిది బతుకు పగడాల పడవంటిది
అడుగడుగు సుడిగుండమై అల్లాడి పోతుంటది.
వయసేమో వరదంటిది.దాని సొగుసేమో నురుగంటిది.
అరిటాకు కెరటాలలో ఆటాడి పోతుంటది.
ఏ గురుడు చేశాడో ఆ పడవ సేత
ఏ బెమ్మ రాశాడో ఈ బొమ్మ రాత"

చాలా పరిచయమైన పాట. తనను ఉద్దేశించి పాడుతున్నట్టనిపించిది మొట్ట మొదటి సారిగా.

తన రాత ఎలా ఉందో? ఏది ఏమయితే అవుతుంది. తనకు సామర్ధ్యత ఉంది. తట్టుకోలేక తొట్రుపాటు పడితే, చేయూతనిచ్చే స్నేహం ఉంది. తట్టుకోగలనన్న ధైర్యం వచ్చింది అపర్ణకు.

%%%%

రాజరాజేశ్వరి అమ్మవారిగుడి పార్కింగ్ లాట్ లో కారు పార్క్ చేస్తూఉంటే ఎదురుగా కనిపించింది తనకి బాగా పరిచయమున్న కార్ ట్యాగ్ "Dr. MISRA”.  చిన్నగా నవ్వుకుంది.

మిశ్రా అంకుల్ ని కాలేజీ లో ఉన్నప్పటినుండి బాగా తెలుసు. ఆయన అంటే చాలా అభిమానం, గౌరవం అపర్ణకి. కార్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళింది. అది చాలా చిన్న కోవెల. అమ్మవారు మూలవిరాట్ అయినా, మిగతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎదురుగా అమ్మవారు. కుడి పక్కన పెద్ద చిత్రం శంకరాచార్యులవారిది. విజయ దశమి రోజేమో, చాలామంది ఉన్నారు.

శ్రావ్యంగా వినిపిస్తోంది మహిషాసుర మర్దిని స్తోత్రం "అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే"

ఇక్కడే, 20 ఏళ్ళ క్రితం మిశ్రా అంకుల్ చేప్పేరు..దాని అర్ధం.

మనలోనే ఉన్నాడు మహిషాసురుడు; మనలోనే ఉంది దుర్గా అమ్మవారు. ఈ ప్రార్ధన ద్వారా, మనలోని దుష్ట శక్తుల్ని, మనలోని ధైర్యం, వీర్యంతో జయించడం అని.

అమ్మవారి ముందు పూవులు, పళ్ళు పెట్టి, భక్తితో కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచేసరికి, నేను ఉన్నాను నీకు అన్నట్టుగా అభయ హస్తంతో చిరునవ్వుతో కనిపించింది అమ్మ వారు. మనస్సు కుదుట పడింది అపర్ణకు.

అలవాటుగా, శంకరుడి ముందు ఆగింది. మిశ్రా అంకుల్ వల్ల ఎంత నేర్చుకుందో? అద్వైతంలో రమిస్తున్న శంకరుడికి, ఈ స్తోత్రాలు, దేవీ పూజలు ఎందుకి అని అడిగినప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పేరు అంకుల్.

"చూడమ్మా. ఇవన్నీ మనకోసం. ఆ మహానుభావుడికి కాదు. నువ్వు అన్నం వండడానికి, పొయ్యిలో నిప్పు ఉంటే సరిపోతుందా? బియ్యం కావాలి, నీళ్ళు కావాలి, కుండ కావాలి. అందులో ఏది లేకపోయినా నీకు అన్నం రాదు. అలాగే, నిప్పు జ్ఞాన యోగం, బియ్యం భక్తి యోగం, నీళ్ళు రాజ యోగం, కుండ కర్మ యోగం. లేకపోతే, కేవలం నిప్పు తో అన్నం వండుకోగలవా చెప్పు?"

ఎంత లోతులు తెలిసిన మనిషో మిశ్రా అంకుల్. అందుకే ఈరోజు పూజని ఆయనని చేయమని కోరుకుంది. తన ప్రార్ధన రొటీను పూర్తిచేసుకుని, ప్రక్కనే ఉన్న, డైనింగ్ హాల్ లో కి వెళ్ళింది. అక్కడ, అమ్మ, నాన్నపూజ సామానులు ప్రసాదం అమర్చి పెడుతున్నారు. ప్రక్కనే మిశ్రా అంకుల్ వాళ్ళకి సహాయంచేస్తున్నారు.

%%%%

ఆ డైనింగ్ హాల్ లో ఒక పాతిక మంది చేరేరు. ఒక ప్రక్కగా, చక్కటి భోజనాలు కోవెల వాళ్ళే ఎరేంజ్ చేసి పెట్టేరు. అందరి మనసుల్లో ఏం జరుగుతోంది అన్న సందేహం.

అమ్మాయి పార్టీ ఇస్తోంది రమ్మని, ఆహ్వానం వచ్చింది అందరికీ. వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఆప్తులేమో, అందరి హృదయాల్లో అపర్ణకి 40 దాటినా ఇంకా పెళ్ళి కాలేదన్న చింత మట్టుకు ఉంది.

మిశ్రా గారు దీపం వెలిగించి, అపర్ణను భక్తితో ప్రార్ధించుకోమన్నారు. ఆయన చెప్పినట్టు చేసి, ఆయన సిగ్నల్ ఇవ్వగానే మాట్లాడడం మొదలెట్టింది అపర్ణ.

"మీరందరూ, చాలా ఆప్యాయంతో ఈరోజు మాతో గడపడానికి ఇక్కడికి వచ్చేరు. చాలా సంతోషం. నాకంటే కూడా, మీలో చాలా మందికి అమ్మ, నాన్న గారితో సన్నిహితం ఎక్కువ. మీ స్నేహానికి నా కృతజ్ఞతలు.”

మాట కాస్త తడబడింది అపర్ణకు.

“నా తల్లితండ్రులలాగే, నేనూ ఏదో ఓరోజు నా గూడు కట్టుకుని, హాయిగా జీవితం గడపాలని, వాళ్ళని సంతోషపెట్టాలని, అన్ని విధాలా ప్రయత్నించేను. కాని, అనుక్కున్నట్టు అవలేదు. అది నా రాతేమో."

అనుకోకుండా, కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అపర్ణకి. చటుక్కున, కళ్ళు తుడుచుకుంది,

"ఈరోజు ఆనందించాల్సిన రోజు. కంట తడి పెట్టకూడదమ్మా".. మిశ్రా గారు హెచ్చరించేరు అపర్ణని.

‘"థాంక్ యూ అంకుల్. నిజమే.

ఈ రోజు మాజీవితాల్లో ఒక గొప్ప మలుపు రాబోతోంది. మా పేరెంట్స్ నాకు మంచి చదువు నిచ్చేరు.

నాకు చక్కటి ఉద్యోగం ఉంది. డబ్బు ఉంది, మంచి ఇల్లువుంది. శారీరకంగా శక్తి ఉంది. ఆర్ధికంగా ఇంకొకళ్ళకి సాయం చేయగల స్తోమత కూడా ఉంది. కాని ఒంటరి తనం ఎక్కువ అవుతోంది. నాకు నాదీ అంటూ ఒకటి కావాలనిపిస్తోంది.. అందుకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా. ఇద్దరు పిల్లలికి తల్లిగా ప్రేమని పంచాలని నిశ్చయించుకున్నా."

సడన్ గా, అందరి మొహాలు పాలిపోయేయి. అన్నపూర్ణ, ఆంజనేయులు, కళ్ళుదింపే ఉంచుకున్నారు. ఎవ్వరి మొహాలోకి చూడడానికి వాళ్ళకి ధైర్యం లేక పోయింది.

మిశ్రా గారి మొహంలో మాత్రం చిరునవ్వు.

"రెండేళ్ళ క్రితం సుమన్ ని కలిసేను. మాకు మంచి స్నేహం కుదిరింది.

తనకుకూడా, కొన్నేళ్ళ క్రితం తన జీవిత భాగస్వామి కారు యేక్సిడెంట్ లో చనిపోవడం వల్ల, ఒంటరితనం మిగిలింది. మా ఇద్దరి అలోచనలు, ఆశయాలు ఒకటే. మేమిద్దరమూ, ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చేము. ఇద్దరు పిల్లల్ని పెంచాలని అనుకున్నాము.” ఆపి, ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది.

“ఒక్క విషయం. మా ఇద్దరి మధ్య స్నేహం తప్పితే వేరే ఎటువంటి సంబంధం లేదు. మీరెవరూ తప్పుగా అనుక్కోవద్దు. పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు. అందుకే మేమిద్దరం ఒకరికి ఇంకొకరు సహాయంగా కలిసి ఈ పని చేయాలని నిశ్చయించుకున్నాం” అంటూ ఆపింది.

తల్లిదండ్రుల ముఖంలోకి చూసింది. వాళ్ళిద్దరూ, కళ్ళు దించుకునే ఉన్నారు. మిశ్రా గారి చూపు ఆమెకు ధైర్యాన్నిచ్చింది.

“సుమన్ వాళ్ళ పని మనిషి కేన్సర్తో చని పోయింది పంజాబ్ లో, ఆరు నెలల క్రితం. ఆవిడ భర్త మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలిద్దరూ, అమ్మమ్మ దగ్గర చేరేరు. ఆవిడకి కూడా కేన్సరు. ఎప్పుడు పోతుందో అన్న పరిస్థితులలో ఉంది. ఆవిడ పోతే పిల్లలిద్దరూ అనాధలు అవుతారు.

వాళ్ళని పెంచుకోవాలని సుమన్ కోరిక కాని, ఆర్ధికంగా కొంచెం కష్టమైన పని తనకి.

అందుకే నేను సాయం చేస్తానని చేప్పేను. ఆ పిల్లలికి నేను తల్లిగా నిలబడతాను. నేను, సుమన్ కలిసి ఒక ఇంట్లోనే ఉండి పిల్లలని పెంచుతాము. నా ఈ నిర్ణయాన్ని అమ్మ, నాన్నా క్రమేణా సమర్ధించగలరని నా ఆశ."

కాసేపు ఆపి తల్లిదండ్రుల వైపు చూసింది. వాళ్ళ మనస్సులో ఎటువంటి జంజాటం జరుగుతోందో తను ఊహించుకోగలదు.

ఇంకొంచెం సేపులో మీరు సుమన్ ని కలుస్తారు.

మా పిల్లల పేర్లు శాంతి, సూరజ్. నిజానికి నాజీవితంలో శాంతి, వెలుతురు..వీళ్ళిద్దరూ అని భావిస్తున్నాను.

శాంతి కి 6, సూరజ్ కి 4 సంవత్సరాలు". అంటూ ఆపింది.

అందరూ చప్పట్లు కొట్టేరు. కాని అందరి మనసుల్లో ఏదో సందేహం. అన్నపూర్ణని, ఆంజనేయుల్ని అభినందించాలో, ఊరడించాలో తెలియటం లేదు చాలా మందికి. మాధవరావు ముందుకి వచ్చి, అపర్ణని కౌగలించుకున్నాడు. ఆశీర్వదించాడు.

"ఇంత మంచి హృదయంతో ఎవ్వరూ చేయలేని కార్యాన్ని చేస్తున్న నీకు, సుమన్ కూ, హార్టీ కంగ్రాచ్యులేషన్స్" మనస్ఫూర్తిగా దీవించేరు రావు గారు. మిశ్రా గారు అపర్ణని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.

"అపర్ణా, మరి మాకు సుమన్ ని, శాంతి ని, సూరజ్ ని పరిచయం చేయి. ఆలస్యం ఎందుకు?".

అపర్ణ తన్ ఫోన్ తీసుకుని డయల్ చేసింది.

తలుపు తీసుకొని సుమన్, పిల్లలిద్దరూ వచ్చేరు. తెల్లటి చూడీదార్లో అందంగా మెరిసిపోతోంది సుమన్.

ఆమె చేయి పట్టుకుని నవ్వుతూ ముందుకి వచ్చింది శాంతి. జంకుతూ, ఎవ్వరికీ కనపడకుండా సుమన్ వెనకాతల చున్నీ పట్టుకుని లోపలికి వచ్చేడు సూరజ్.

సుమన్ ని వేరేగా అపోహ పడ్డ అందరూ ఒక్క సారి ఊపిరి పీల్చుకున్నారు. అయినా వాళ్ళ మనస్సుల్లో ఇంకా చిన్న సందేహం. ఆ సందేహం అపర్ణ తల్లి తండ్రులను పీడిస్తోంది. తమ చిలక ఇలాంటి గూడు కట్టుకుంటుందని ఏనాడూ ఊహించలేదు వాళ్ళిద్దరూ.

వెంటనే, మిశ్రా గారు ఆ పిల్లలకి అర్ధం అయ్యేటట్టుగా హిందీ లో చెప్పేరు

"ఈరోజు శాంతి, సూరజ్, మన జీవితాలలో కొత్త వెలుగును తీసుకొచ్చేరు. ఇంకొక రెండు వారాలలో నేను, మా ఆవిడ ఇక్కడ పెద్ద దివాలీ పార్టీ ఇస్తాం. మీరందరూ తప్పకుండా రావాలి. మా ఛీఫ్ గెస్టులు శాంతి, సూరజ్.”అందరూ హర్షించేరు. ఆపకుండా చప్పట్లు కొట్టేరు. శాంతి చెవిలో, అదే విషయాన్ని సుమన్ పంజాబీలో కూడా చెప్పింది. శాంతి హాయిగా నవ్వింది. అంతటి ప్రేమని, ఆప్యాయాన్ని తన జీవితంలో మొదటిసారి అనుభవించింది ఆ పిల్ల. సూరజ్ కి అదంతా అయోమయంగా ఉంది.

సుమన్ ని గట్టిగా పట్టుకున్నాడు. వదలటంలేదు.

"శాంతి, సూరజ్, ఇదిగో మీ అమ్మమ్మ, తాతగారు, నేనూ తాతనే." నవ్వుతూ, వాళ్ళ చేతులు పట్టుకున్నారు మిశ్రా గారు. మాధవరావు, భార్య లలిత, పిల్లల్ని ప్రేమగా ఎత్తుకుని తాము తెచ్చిన బొమ్మలు వాళ్ళకిచ్చేరు.

ప్రార్ధనలో ఉన్న శక్తిని క్షుణ్ణంగా అర్ధంచేసుకుని, అనుభవించిన మిశ్రా గారు, ఆ కుటుంబ క్షేమం కోసం మనసారా దుర్గమ్మని వేడుకున్నారు. మిగతా తతంగాన్ని అర్ధవంతంగా ముగించేరు.

పూజ ముగించుకొని, అమ్మ రమ్మంటే, ఇంటికి బయలుదేరింది అపర్ణ, పిల్లలతో సుమన్ తో కలిసి.

వాళ్ళని ఆహ్వానించింది గాని భర్త ఎలా చలిస్తాడేమోనని గాభరా పడింది అన్నపూర్ణ.

"పయనించే ఓ చిలుకా. ఎగిరిపో పాడైపోయెను గూడు" అపర్ణ మనసు మౌనంగా చెప్తోంది...

ఉహు, తను పెరిగిన గూడు పాడవదు. పాడవనీయను. పాటలతో, ఆటలతో, నిత్యం కళ కళ లాడుతూ ఉండాలి. ఉండి తీరుతుంది. ఆ మాటే నాన్నతో చెప్పింది ఇంటికొచ్చాక.

"అపర్ణా, నేను వూహించని పరిణామం ఇది. నాకు కొంచెం సమయం పడుతుంది" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

" అమ్మా, నాన్నకి ఎలా చెప్పాలి నా మనస్సులోని బాధని?" జాలిగా అడిగింది అపర్ణ.

"నాకు నీమీద నమ్మకం ఉందమ్మా. కాని, మీ నాన్న గారు సంఘానికి భయపడుతున్నారు.

కాలమే ఆయన్ని మెల్లిగా మారుస్తుంది. నువ్వు నిబ్బరంగా ఉండు." బుజ్జగించింది అన్నపూర్ణ.

చటుక్కున లేచి, మాధవరావు కి ఫోన్ చేసింది అపర్ణ. తనకి సహాయం చేయమని కోరింది.

"అపర్ణా, నువ్వేమీ కంగారు పడకు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. రేపు నేను, లలిత మీ ఇంటికి వచ్చి, మీ నాన్నకి అంతా అర్ధమయ్యేలా చెప్తాము. నాకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంది తల్లీ. సర్వాభీష్ట సిద్ధిరస్తు" మాధవ రావు మాటలు అపర్ణకి కాస్త తెరిపినిచ్చాయి.

మెల్లిగా శాంతి అమ్మమ్మ ఒళ్ళో చేరింది.

సుమన్ ఒళ్ళో కూర్చుని బిక్కు బిక్కుగా అంతా చూస్తున్నాడు సూరజ్.

అపర బుద్ధ స్వరూపంగా చిరునవ్వుతో ప్రశాంతంగా వెలిగిపోతోంది సుమన్. ఆమె చిత్తం నిశ్చలంగా ఉంది.

తన గూడు మీద నమ్మకం తనకి ఉంది.

********

Posted in December 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!