Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

నాకు ఆకలేస్తున్నదయ్యా
దేనిని పడితే దానిని నేను తిననయ్యా
నీ కపాల భిక్షే తింటనయ్యా
పెడతవో...పొంమ్మటవో...?
ఎదురుచూపు ఆపనయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

ఈగై పుట్టిఉంటను
డేగై పుట్టిఉంటను
దోమై పుట్టిఉంటను
చీమై పుట్టిఉంటను
ఎన్నిసార్లు ఏమేమై పుట్టిఉంటనో...?
మనిషై పుట్టాను
మరల గర్భము చేరకుండా నీ గర్భవాసమును ఇవ్వవయ్యా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

కంట్లో నీటితో...ఒంట్లో చెమటతో...
నీకై ఎదురుచూస్తున్ననయ్యా...?
కౌగిట్లో చేర్చుకుని ఓదారుస్తవో...
కసురుకుని వదలిపోతవో...నీ ఇష్టమయ్యా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

నీరు నువ్వే...
నిప్పు నువ్వే...
నేల నువ్వే...
నింగి నువ్వే...
నింగిచూలి నువ్వే...
కానీ...! నేను..నువ్వు కానా..?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

కడుపులో కత్తులు తిప్పుతున్నట్లున్నదయ్యా
కళ్ళలలో సునామొచ్చినట్లున్నదయ్యా
గుండెలో పిడుగుపడినట్లున్నదయ్యా
వెన్నులో ఉరిమినట్లున్నదయ్యా
అయినా...! దక్షిణ దిక్కునుంచి పిలుపురాలేదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

నువ్వు తెలివైనవాడివయ్యా రాతిలో ఉన్నావు
నేను దద్దమ్మనయ్యా కట్టెలో ఉన్నాను
కట్టె తగలడినప్పుడే బూదై నిన్ను చేరుతాను
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

ఎకరాల పొలమడగలేదు
వేలకొలది డబ్బడగలేదు
చెరిగిపోని పేరు ప్రతిష్టలడగలేదు
ఊపిరున్నంతకాలం శాంతినిమ్మంటే...!
అలజడి భ్రాంతి నిస్తివా....
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

అమృతం తాగిన దేవతల మనసు విషమయ్యా
స్వలాభమే చూసుకుంటది
విషం తాగిన నీ మనసు అమృతమయ్యా
అసురులకు వరమిస్తది
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..

చేతలను చూపి చెంగున ఎగిరిన నా చేయి
నేడు చతికిలపడి
నువ్వే దిక్కని నీ చెంత సాగిలపడినదయ్యా
చెయ్యి అందిస్తవో...
చెయ్యి ఇస్తవో...నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

భళా సదాశివా...
చెబితే వింటలేమని
మూగజీవుల్ని బొంద బెడుతున్నామని
వందేళ్ళకోసారి విషక్రిమి తో శిక్షిస్తవా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in December 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!