Menu Close
Page Title

శ్రీమదాంధ్ర మహా భారతము – నన్నయ పద్యం – అంతరార్థం

“అమితాఖ్యానక శాఖ లం బొలిచి వేదార్థామల చ్ఛాయమై
సుమహాద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జనో
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై దైపాయనోద్యాన జా
త మహా భారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై”

నన్నయ భారత కథ, దాని పరమార్థం చెప్తూ, రచయితలకు కూడా ఈ పద్యారంభంలో చక్కటి సూచన చేశాడు.

“అమితాఖ్యానక శాఖ లం బొలిచి”

భారత రచన ఎట్టిది అంటే అనేక అఖ్యానకములకు నెలవైనది అని చెప్తూ ఒక రచయిత కేవలం ప్రధాన కథ నడపడంలోనే గాక దానికి పుష్టిని కల్గించే ఆఖ్యానాలతో నిండుగా ఉండాలి అని అన్ని కాలాల రచయితలకు బోధించాడు. అది ఎలా అంటే శాఖలు అనే శ్లేష పదం వాడి ఒక చెట్టుకు మూలమే గాక దాని కొమ్మలు – శాఖోపశాఖలుగా వర్ధిల్లినప్పుడే ఆ చెట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. అలాగే ఒక రచన అనేక ఆఖ్యానకములతో గూడి ఉండాలి అని రచయితలకు చక్కని సూచన చేశాడు. యువ రచయితలకు ఇతి మేలుకొలుపు. నన్నయ రచన ప్రసన్న కథాకలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తులు, అక్షర రమ్యత కలిగినది గదా!

అలాగే,
“వేదార్థామల చ్ఛాయమై” – వేదములను విడమర్చిన వ్యాసమహర్షి వాటి సారాంశాన్ని తన భారత రచనలో ఇమిడ్చి పంచమ వేదంగా భారతాన్ని రచించాడు. నన్నయ ఈ పట్టున ఛాయ అనే పదం వాడి చెట్టు నీడను భారతంలో వేదాల యొక్క విశేషాలు, ఛాయా మాత్రంగా ఇమిడి ఉన్నాయని తెల్పడం జరిగింది.

“సుమహాద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి” – ఈ వాక్యంలో మానవ జీవన విధానంలో ఉండాల్సిన నాలుగు ముఖ్యాంశాలను పువ్వులతో అభేదం చెప్తూ రూపాలంకారం లో అద్భుతంగా చెప్పిన నన్నయ ప్రతిభ అనన్య సామాన్యమైనది.

మానవ జీవన గమనంలో నాలుగు పురుషార్థాలున్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం రావాలంటే మొదటి మూడు పురుషార్థాలను వేదాలలో చెప్పినట్లు పాటిస్తే మోక్షం తప్పక లభిస్తుందని చెప్తూ, ఆ పురుషార్థాలను పుష్పాలతో అభేదం చెప్పి అతి నిర్మలము, కోమలము, స్వచ్చము మొదలైన సుగుణాలు కలిగిన పుష్పాలవలె మానవుడు తన పురుషార్థాలనుసాధించాలని, అపుడు మోక్షప్రాప్తి కల్గుతుందని దివ్య సందేశాన్ని నన్నయ అందించాడు. అంటే ఒక వాక్యంలో మానవుని జీవన విధానం ఎలా ఉండాలో తెలపడానికి పువ్వులను పోలికగా తీసుకొన్న నన్నయ ప్రాతఃస్మరణీయుడు.

పువ్వులు ప్రకృతి మనకిచ్చిన వరాలు. వాటిలో కల్మషము, కాఠిన్యము, వికృతతత్వము మొదలైన గుణాలు లేవు. అందుకే ధర్మార్థ కామములను పుష్పాలతో అభేదం చెప్పి నన్నయ పుష్పాల వలె ప్రవిత్రంగా బ్రతకండి అని మనలను హెచ్చరించాడు.

ధర్మం: పెద్దలు చెప్పిన కొన్ని ధర్మమార్గాలను అనుసరించి, ఆచరించి అర్థాన్ని సంపాదించాలి.

అర్థం: ధర్మ మార్గంలో సంపాదించిన ధనాన్ని ధర్మ పథంలో నడిచి పున్యకార్యాలను ఆచరించాలి. అర్థాన్ని అధర్మంగా సంపాదించ కూడదు.

కామం: అలా ధర్మ మార్గంలో సంపాదించిన అర్థాన్ని ధర్మపథంలో తమ తమ కోర్కెలను తీర్చుకోవాలి. సంసార జీవితం, సంతానం మొదలైన కార్యాలను ధర్మం తప్పకుండా గడపాలి.  సాటి మనిషికి సాయపడడం, పున్యకార్యాలను ఆచరించడం, కోర్కెలను అదుపులో పెట్టుకోవడం చేస్తే మోక్షం అదే లభిస్తుందని, ఇవన్నీ పువ్వుల వలె స్వచ్ఛంగా ఉండాలని నన్నయ సందేశం.

పోతన భాగవత పద్యము :

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యాకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై

-శ్రీ మహాభాగవతము -పద్యం 22 – పుట 14 – ప్రచురణ: టి టి డి -సంపుటము 1- ప్రథమ స్కందము.

వ్యాసవిరచిత సంస్కృత భాగవతాన్ని బమ్మెర పోతన (క్రీ.శ. 1500) ఆంధ్రీకరించాడు. ఆ సందర్భంగా పోతన భాగవతాన్ని కల్పతరువుతో పోల్చి శ్లేషాలంకారం లో లలితంగా తన పద్యాన్ని రచించి తన కవితా మందార మకరంద మాధుర్యాన్ని మనకు అందజేశాడు.

అర్థాలు:

భాగవతపరంగా కల్పతరువు పరంగా
లలితస్కందము=భాగవతాన్ని పన్నెండు స్కందములుగా విభజించాడు స్కందము = చెట్టు యొక్క మొదలు మనోజ్ఞమైనది
కృష్ణమూలము = కృష్ణుని కథ మూలముగా కలది కృష్ణ అనగా నలుపు. నల్లని మూలము (మొదలు) గలది.
శుకాలాపాభిరామంబు =శుకమహర్షి చే ఆలపింప బడింది.  రుక్మిణీదేవి, గోపికలు మొదలైన లతాంగుల అందం తో, పాతివ్రత్యం తో శోభిస్తున్నట్టిది. చిలుకల యొక్క చక్కని పలుకులచే మనోజ్ఞమై ఉన్నది. మనోజ్ఞమైన లతలతో కూడినది.
సువర్ణ = సద్గుణులైన
సుమనసు = విద్వాంసులచే
సువర్ణ = మంచి శరీర ఛాయగల శుకములచే
సుమనసు = పూలు
సుజ్ఞేయమున్ = బాగా తెలియజేయబడింది గానము చేయబడింది.
సుందరోజ్జ్వలవృత్తంబు = చక్కటి కథ కలది చక్కటి చెట్టు మొదలు (గుండ్రని) కలది.
మహా ఫలంబు = కృష్ణ గానామృతమనెడి ఫలం -ఫలితం గలది (మోక్షం).
వ్యాసాలవాలంబు = వ్యాసుని యొక్క భావాలకు, రచనకు నిలయమైనది
గొప్పది, సాటిలేనిది
కల్పవృక్ష ఫలం (మోక్షం)
ఆలవాలము = చక్కటి పాడు కలది (చెట్టు మొదట నీరు నిల్వడానికి వేసే కట్ట)

ఈ విధంగా పోతన తన రాచనారంభం లోనే భాగవత మహత్యాన్ని రమ్య పదజాలంతో రచించి ప్రకృతికి మూల స్తంభాలైన వృక్షాలను ధ్యానించి తరించాడు. తరతరాలకు చెట్ల యొక్క ప్రాభవాన్ని చాటి చెప్పాడు.

కొస మెరుపు :

పురాణ ఇతిహాసాదులలోని స్త్రీ పురుష పాత్రలను గూర్చి వారి కష్ట నష్టాలను గూర్చి ఆధునిక కాలంలో చర్చలు, రచనలు మరియు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చినపుడు సీతకు రాముడు అన్యాయం చేశాడు. ద్రౌపదికి ఆరుగురు భర్తలు ఎందుకు? భారతంలో అన్నీ సంకర వంకర కథలే. ఇలాంటి విమర్శలు ఆయా గ్రంధాలను నిరసించడం, విమర్శించడం పరిపాటి అయిపొయింది.

ఇటువంటి విమర్శలు చేసేముందు మనం ఒకటి గమనించాలి. మానవ సమాజం, జీవనం, సంఘం యొక్క కట్టుబాట్లు ఎప్పటికప్పుడు మారుతుండేవే గానీ స్థిరంగా ఉండవు అన్న సత్యాన్ని బాగా గమనించాలి. ఇది బాగా గమనించినప్పుడు ఒకరి కాలాన్ని మరొకరి కాలంతో పోల్చుకొని నిరసించడమో, అభినందించడమో సరికాదు అన్న సత్యాన్ని మనం గుర్తించగలము. ఉదా: ఏభై సంవత్సరాల క్రితం ఉన్న సంఘం, వివాహ వ్యవస్థ, కుటుంబ పరిస్థితులు నేడు ఉన్నాయా? అని ప్రశ్నించుకొంటే జవాబు ‘లేవు’ అని వస్తుంది. అలాంటప్పుడు వేల వందల సంవత్సరాల క్రితం ఉన్న మానవ జీవన విధానాన్ని, సంఘ నిర్మాణాదులను ఈనాడు ‘అవి సరిగా లేవు’ అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తాము. అది ఎంతవరకు సమంజసం అన్నది కూడా మనం మనసుకు తెచ్చుకోవాలి.

అందువల్ల భారత, భాగవత, రామాయణాది గ్రంథాల నుండి మనం గ్రహించాల్సింది వేరే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయా పాత్రల జీవన విధానాల వల్ల, ప్రవర్తనల వల్ల త్రికాలాలలో మానవ సమాజానికి కలిగే నష్టాలేవిటి? లాభాలేవిటి? అని విశ్లేషించి వాటి వలన మనం నేర్చుకోవలసిన అంశాలు తెలుసుకొని తద్వారా మన జీవితాలను సుఖమయం, సుగమం చేసుకోవచ్చు.  ఈ విషయాన్ని గ్రహించిన నాడు ప్రతి కాలం స్వర్ణ యుగమే అవుతుంది. ప్రసిద్ధి చెందిన ఆయా పాత్రల సంఘటనల ద్వారా మనకు మంచే జరుగుతుంది.

ముఖ్యంగా నేడు కొన్ని సంఘటనలను గమనిస్తే స్త్రీలను జరిగిన అన్యాయాలను గూర్చి చాలా లోతైన చర్చలే జరుగుతున్నాయి. ఉదా: సీత రాముని వాళ్ళ కష్టాలు పడింది. ఎలా? సీత రాముని వెంట తన ఇష్టానుసారం అడవికి వెళ్ళిందా? లేక రాముడు బలవంతంగా ఆమెను ఒప్పించి తీసుకొని వెళ్ళాడా అన్నది మొదటి ప్రశ్న. దీనికి జవాబుగా వాల్మీకాదుల రామాయణాలలో సీత తనకు తానుగా రాముని ఒప్పించి అతనితో అడవికి వెళ్ళిందే కాని ఆమెను ఎవరూ బలవంత పెట్టలేదు అన్నది స్పష్టంగా ఉంది. పైగా సీత వెళ్ళడం వాళ్ళ రాముడే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. దీనివల్ల సీతను రాముడు కష్టపెట్టలేదు అని తేలిపోయింది. అలాగే మిగతా పురాణేతిహాసాలలోని స్త్రీ పాత్రలను గూర్చి చర్చించుకొంటే కొన్ని నిజాలు మనం తెలుసుకోవచ్చు.

చారిత్రిక దృష్టితో చూస్తే కొన్ని కాలాలలో ఆడవారు అనేక కారణాల వల్ల మగవారి నిరసనలకు, ఆధిపత్యానికి గురై బాధపడటం జరిగింది. అంతమాత్రానికే స్త్రీ యొక్క ప్రతి బాధకు, నష్టానికీ పురుషుడే కారణమని అతనిపై చిన్న చూపు ప్రకటించడం సమంజసం కాదు. ఆడవారికి ఆడవారే శత్రువులన్న సత్యం మన కుటుంబాలలో, సంఘంలో కనిపిస్తుంది.

వివాహబంధం అనేది స్త్రీ పురుషులు ఇరువురి మధ్య ఉండవలసిన ఒక సత్సంబంధాన్ని గట్టి పరిచేది. దానిని చిన్న చిన్న అభిప్రాయ బేధాలతో శాశ్వతంగా విడగొట్టుకోవడం సరియైన పరిష్కార మార్గమా అని స్త్రీ పురుషులిరువురూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతకన్నా ముఖ్యం పిల్లల భవిష్యత్తు మరియు సమాజంలో మనకంటూ సంపాదించుకొన్న పరువు, ప్రతిష్ఠ. వివాహం అనేది స్త్రీ పురుషలు రెండు చక్రాలుగా కలిగిన బండి వంటింది. ఎటువంటి ఒడిదుడుకులు ఏర్పడిననూ తొలగించుకుంటూ సంసార, సంతాన శకటాన్ని మంచి ఆనందకర కుటుంబ గమ్యస్థానానికి చేర్చవలసిన బాధ్యత ఇరువురికీ సమానంగా ఉంది. చక్రాల మధ్యన సరైన పొంతన లేకపోతే బండి పడిపోయినట్లే బార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లోపిస్తే ఆ సంసారం లో చిక్కులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని గమనించకపోతే పిల్లల భవిష్యత్తు ఏక చక్ర శకటమే అవుతుంది. ఇది మన పురాణాల ద్వారా మనకు బోధపడుతుంది. గాంధారి అంతఃపురం లో ఉన్ననూ కళ్ళకు గంతలు కట్టుకొని పిల్లలకు, భర్తకు చీకటి బ్రతుకు ప్రసాదించింది. కుంటి భర్తతో, పిల్లలతో కడవరకు గడిపి కృష్ణుని కృపకు పాత్రురాలైంది.

**** సశేషం ****

Posted in August 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!