Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 95
- వరూధిని
vikshanam-95

వీక్షణం-95 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా జూలై 12, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ ఆరి సీతారామయ్య గారు ప్రధాన ప్రసంగం చేశారు.

ఇందులో భాగంగా స్వీయ అనువాద కథా పఠనం చేసి, విశ్లేషణ చేశారు. ముందుగా కార్యక్రమ నిర్వహకులు డా. కె. గీత గారు, సీతారామయ్య గారిని సభకు పరిచయం చేశారు. సీతారామయ్య గారు ఒక్లాండ్ యూనివర్సిటీ (మిషిగన్) లో బయోమెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 35-40 కథలు రాశారు. వీరివి "గట్టు తెగిన చెరువు", "కేన్యా టు కేన్యా" అనే రెండు కథా సంపుటాలు వచ్చాయి. వీరు ఓల్గా, చంద్రలత, విమల గారి కథలకు అనువాదాలు చేశారు.  సైన్స్ గురించి తెలుగులో వ్యాసాలు ఈ మధ్యే రాయడం మొదలు పెట్టారు.

తర్వాత సీతారామయ్య గారు ప్రఖ్యాత జపాను రచయిత్రి అకిమి యోషిడా రాసిన "ఉమిమాచి డైరీ" ఆధారంగా రాసిన కథ "మా చిన్న చెల్లెలు" కథను చదివారు. తరువాత కథను గురించి విశ్లేషిస్తూ ఈ కథ తనకు బాగా నచ్చుతుందని, అందుకు కారణాలు పేర్కొన్నారు. "మామూలుగా తెలుగు కథల్లో పాత్రలన్నీ మొదటి రెండు మూడు పారాగ్రాఫుల్లో పరిచయం అవుతాయి. కానీ అవసరమైనపుడు మాత్రమే పాత్రని కథలో ప్రవేశపెట్టడం కొరియా, జపాను కథల్లో ముఖ్య లక్షణం. ఉదాహరణకి ఈ కథలో ముఖ్యమైన పాత్రలైన అమ్మ, డా|| భరద్వాజ పాత్రలు మధ్యలోను, చివరిలోను వస్తాయి. ఇక కథలో అనేక పాత్రలుండడం మరో లక్షణం. అన్ని పాత్రలున్నా కథనంలో గొప్పతనం వల్ల ఎక్కడా ఎబ్బెట్టుగాను, కన్ ఫ్యూజన్ గాను అనిపించదు. ఇక తెలుగులో ఉన్నట్టు ఈ కథల్లో ముగింపుకి ముళ్లు ఉండవు. ఉదాహరణకి తల్లి బిడ్డని వదిలి వెళ్లడం అనే అంశానికి మామూలుగా అయితే ఎన్నో వైయక్తిక, సామాజికాంశాలు ముడిపడి ఉంటాయి.

ఇక ఈ కథలో ఉన్న మరో లక్షణం ఏవిటంటే పాశాత్య కథలలోలా ఒక సంఘర్షణ తీవ్రమవుతూ క్లైమాక్సుకి వచ్చి ఒక పరిష్కారమో, కొసమెరుపో ఉండడం కాకుండా సంఘర్షణని అలాగే కొనసాగనివ్వడం గొప్పతనం. ఈ కథలో పరిచయాల వల్ల వేరుకావడం అన్నది జరిగిందా? వేరు కావడం వల్లనే పరిచయాలు ఏర్పడ్డాయా? అనే అనాదికాలపు సంఘర్షణల్ని ఉన్నది వున్నట్టుగా పరిచయం చేసేరు రచయిత్రి" అని ముగించేరు.

తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో మరొక ముఖ్య అతిథి శ్రీ నారాయణస్వామి వెంకటయోగి గారు "అనంతం బందీ" అంటూ పి.వి గారి గురించి రాసిన కవితను చదవగా, సురేంద్ర గారు "నాతోనే ఉంటుంది" కవితను, శ్రీధర్ రెడ్డి గారు "పి. వి. నరసింహారావు" గురించి మధ్యాక్కరలు, వెంకట లక్ష్మి గారు "జోహారు జవాను", షంషాద్ గారు "పగిలిన పాదాల సాక్ష్యాలుగా", డా. కె.గీత గారు "ముసుగుల్లేని ఆయుధాలు", దాలిరాజు గారు "రాబోయే టీకా", అరుణ గారు "మానవత్వం" అనే కవితల్ని చదివారు.

ఆ తర్వాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరికీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

చివరగా అరుణ గారు, సుభద్ర గారు, గీత గారు లలిత గీతాల్ని ఆలపించి సభను అలరించారు.

Posted in August 2020, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *