Menu Close
ప్రేమలేఖ!
-- వెంపటి హేమ

రమ్య ముఖం అంతులేని దిగులుతో నిండివుంది. ఆమె టేబులు ముందు కూర్చుని వుంది. ఊటకలం (pen) కోసం కాబోలు వెతుకుతోంది ఆమె. టేబుల్మీద ఒక తెల్లకాగితాల బొత్తి ఉంది. కొంతసేపు వెతికాక, ఎట్టకేలకు డ్రాయర్లో ఉన్న సామాను మధ్యన ఒక మూలగా ఒదిగివున్న పెన్ను ఒకటి దొరికింది. వెంటనే ఆమె తన భర్తకొక లేఖ రాయడానికి మొదలుపెట్టింది. కొంచెం పరిశీలనగా చూస్తే తెలిసిపోతుంది, ఆమె కళ్ళలో కన్నీరు సుళ్ళు తిరుగుతోందని. మనసంతా నిండివుండి, అలలు అలలుగా చెలరేగుతున్న జ్ఞాపకాలు ఆమెను అలజడి పెడుతున్నాయి.

తెల్లకాగితాలు ముందుకు లాక్కుని కలం కాగితం మీద పెట్టబోతుండగా ఆమె కంటినుండి జారిన కన్నీటిబొట్టు ఒకటి కాగితం మీదపడి “టప్పు” మని చిన్న శబ్దం చేసింది. వెంటనే ఉలికిపడి ప్రజ్ఞలోకి వచ్చిన రమ్య ముక్కు ఎగబీలిచి, మనసు కుదుటపరచుకునే ప్రయత్నంలో పైట కొంగు ముందుకు లాక్కుని, దానితో శుభ్రంగా మొహము, కళ్ళు తుడుచుకుని, రాయడానికి ఉపక్రమించింది. కాని ఆమె కన్నీరు ఆగనంటోంది...

“ఇదిగో నిన్నే! ఇటు చూడు ... "తొలిప్రేమ ఒక భ్రమ! ఎక్కువరోజులు అక్కరలేదు, త్వరలోనే ఆ భ్రమ తొలగిపోతుంది" అంటారు! కాని అది నేను నమ్మను. నువ్వూ నమ్మవనే నా నమ్మకం. ఎందుకంటే, మన వివాహానికి నాంది మనలో పుట్టిన తొలిప్రేమేకదా! అంతేకాదు, మన ఈ ప్రేమ శాశ్వతంకూడా! ఇది నువ్వు తప్పక గుర్తుపెట్టుకోవాలి. మనిద్దరిలో ఎవరు బ్రతికివున్నా వారిలో మన ప్రేమ బ్రతికే ఉంటుంది. మృత్యువు కూడా మనల్ని విడదీయలేదు. ఇది ముమ్మాటికీ నిజం, నమ్మాలి నువ్వు. నీకు తెలియని, నా మనసులో దాగి ఉన్న ఎన్నో విషయాలను నీ ఎదుట ఈ లేఖద్వారా పరిచి పెడుతున్నాను. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అడక్కు, చదివి అర్ధం చేసుకో. నన్ను క్షమించు. ఇదే నీకు నా తొలి ప్రేమ లేఖ, అలాగే ఆఖరిది  కూడా!

అవి నేను కాలేజీలో చేరిన తొలిరోజులు. అంతవరకూ ప్రేమంటే ఏమిటో ఎరుగని నేను, నిన్ను చూసినదే తడవుగా తలమునకలుగా ప్రేమలో మునిగిపోయా. తొలి చూపులోనే నిన్నునేను, పంచకల్యాణి గుర్రాన్ని ఎక్కి నాకోసమని వచ్చిన నా  కలలలోని రాకుమారుడవు నువ్వేనని, ఇట్టే గుర్తుపట్టేశా, తెలుసా! ఆ క్షణంలోనే నేను నిన్ను మనసారా ప్రేమించా. ఆ తరువాత తెలిసింది – మంచి హైటు, చక్కని ముఖ కవళికలు కలిగి, ఇటు చదువులోనూ, అటు ఆటలలోనూ రాణించే ప్రజ్ఞావంతుడివైన నీవైపు, చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్నారని! అది మొదలు నాకు ఒకటే బెంగ, నా ప్రేమను గురించి నీకు తెలిసేలోగానే ఏ అమ్మాయయినా నీకు “ఐ లవ్ యూ” చెప్పేస్తుందేమోనని.

నా వయసప్పుడు నిండా పదహారే! పెద్ద ఆరిందాన్నేం కాను. అలాగని మరీ పసిదాన్నీ కాను, ఎటూకాని వయసది. దూరంనుండే నిన్ను చూసి ఆనందించేదాన్ని. కాని కోడిపిల్లని గ్రద్దలా, అకస్మాత్తుగా ఎవరైనావచ్చి నిన్ను ఎక్కడ ఎత్తుకుపోతారోనని - ఎప్పుడూ పక్క బెదురుతో ఉండేదాన్ని. కాని అదేమీ నీకు తెలియదు. ఇంతవరకూ నేనదేదీ నీకు చెప్పలేదు. నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు, ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉండేదాన్ని. అప్పుడు నీ గురించిన ఆలోచనలే తప్ప మరో ఆలోచన నా బుర్రలోకి వచ్చేదేకాదు. ఒట్టు!

నీ స్నేహితులెప్పుడూ నిన్ను చుట్టుముట్టి ఉండేవారు. వాళ్ళ మధ్య నీ తల ఎత్తుగా ఉండడంతో నాకు నీ ముఖం మాత్రం కనిపించేది. నాలాగే ఇంకా ఎందరో అమ్మాయిలు నిన్ను చూస్తూoటారన్న ఆలోచన వస్తే మాత్రం నా ఒళ్ళు చిరచిరలాడిపోయేది. నవ్వకు, అది సహజమైన ప్రతిక్రియ.

ఒకరోజు, ఎన్నాళ్ళనుండో ఖాళీగావున్న మా ఎదురింట్లో నువ్వు కనిపించడంతో ఆశ్చర్యపోయా. ఎదురిల్లు ఎవరో కొన్నారని విన్నాగాని, అది మీరౌతారని నేను కలలోకూడా ఊహించుకోలేదు. మీ యింటి గృహప్రవేశానికి ఇరుగుపొరుగు వాళ్ళనికూడా పిలిచారు. మీరప్పుడు మాకిచ్చిన రిటర్ను గిఫ్టుని నేను తీసుకుని దాచుకున్నా. అదిప్పటికీ నా దగ్గర పదిలంగా ఉంది, తెలుసా!

ఇంట్లో ఉన్నంతసేపూ నేను మీ ఇంటివైపు చూస్తూ ఉండేదాన్ని తమరి కోసం. ఎందుకనో రెండు రోజులపాటు తమరి దర్శనం కాలేదు నాకు, ఇంట్లోనేకాదు, కాలేజీలోకూడా. అప్పుడు నేనుపడ్డ బాధ వర్ణనాతీతం! ఏదో పోగొట్టుకున్నట్లుగా మనసంతా ఒకటే దిగులు!. తరవాత తెలిసింది మా అమ్మ ద్వారా, ఏదో పనిమీద నిన్ను మీవాళ్ళు మీ అమ్మమ్మగారి ఊరికి పంపారని. ఆ మాట వినేవరకు నా మనసు మనసులోలేదు.

ఎదురుబొదురు ఇళ్ళు కావడంతో మీ అమ్మగారితో మా అమ్మకు స్నేహం కలిసింది. ఒకరి ఇంటికి ఒకరు వస్తూ, పోతూ ఉండేవారము. ఒకరోజు మా అమ్మ ఏదో పిండివంట చేసింది, అది కొంచెం ఒక డబ్బాలో ఉంచి మీయింట్లో ఇచ్చిరమ్మని నన్ను పంపింది. అప్పుడు శలవు రోజు కావడంతో నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నేను నీవైపు చూశా. సరిగా అప్పుడే నువ్వూ నావైపు చూస్తున్నావు. మన చూపులు కలవగానే నువ్వు పలకరింపుగా చిరునవ్వు నవ్వావు. ఆ నవ్వు నాకు గిలిగింతలుకాగా నాకూ నవ్వొచ్చింది. అంతలో సిగ్గూ వచ్చింది. సిగ్గు బరువున కనురెప్పలు వాలిపోయాయి. నేను తిరిగి తలెత్తి చూసేసరికి అక్కడ నువ్వులేవు. అక్కడే నిలబడిపోయి నిన్నునేనలా  చూసినందుకు నువ్వేమనుకున్నావోనని తెగ ఇదైపోయాను. కాని అప్పుడు నీ మనసులో నువ్వేమనుకున్నావో ఇంతవరకూ నువ్వు నాకు చెప్పనేలేదు, దొంగా!

మనిళ్ళు దగ్గరకావడంతో మనం ఒకరికొకరం తరచూ కనిపిస్తూండేవాళ్ళం. ఎదురుపడ్డప్పుడల్లా మనం పలకరింపుగా చిరునవ్వు నవ్వుకునేవాళ్ళం. నీ చిరునవ్వు చూసినప్పుడల్లా నీకూ నేనంటే ఇష్టమేనన్న భావం కలిగేది నాకు. నాకది గిలిగింతలుకాగా ఉక్కిరిబిక్కిరిగా ఉండేది. నువ్వు నేనంటే ఇష్టపడుతున్నావనే భావం కలిగేది. కానీ అంతలోనే అదంతా ఉత్తిదే - అనిపించేది. నువ్వు చాలా అందగాడివి. నేనేమీ పెద్ద అందగత్తెనుకాను. నీ చుట్టూ తిరిగే అందాలభామల్నందరినీ కాదని నువ్వు నన్నే ఇష్టపడుతున్నావని తెలిసినప్పుడు మాత్రం,  నాకు కించిత్తు గర్వంగా కూడా ఉండేది, తెలుసా!

నీ నుండి నేనేమీ దాచాలనుకోలేదు, ఒక్కటంటే ఒక్కటి తప్ప - అది ఇగోకి సంబంధించినది. ఇప్పుడది ముఖ్యంగా నీకు చెప్పాలనివుంది.  ఇన్నాళ్ళు దాచినందుకు నన్ను క్షమిస్తావు కదూ! నేను కాలేజీలో చేరిననాడే నువ్వు నామనసును దోచుకున్నావని మొదట్లోనే చెప్పేశా కదా!. “లౌ ఎట్ ఫస్టు సైట్!” ఆ క్షణంలోనే నాకు నీపై ప్రేమ తలమునకలయ్యింది. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఇది పచ్చి నిజం.

ఎప్పుడూ, “నేను నీ మాయలో పడిపోయాను. నక్షత్రాల్లా మెరిసే నీకళ్ళు నన్ను అయస్కాంతంలా ఆకర్షించి నన్ను ప్రేమ మత్తులో నిలువునా ముంచెత్తాయి. ముందుగా నీ మీద ప్రేమలో పడ్డది నేను! నేనే ఫస్టు నిన్ను ప్రేమించా. నేనే విజేతనుకూడా! నాప్రేమే నీలోకూడా ప్రేమను పుట్టించి నన్ను విజేతను చేసింది” అనేవాడివి నువ్వు.

అలా నువ్వన్నప్పుడల్లా నేను చిన్నగా నవ్వి ఊరుకొనేదాన్ని. ఎందుకో తెలుసా - నువ్వన్న మాటలు నాకు ఎంతో థ్రిల్లింగుగా ఉండేవి. నిజం చెప్పి చేజేతులా అది పోగొట్టుకోడం ఇష్టంలేక.  ఇప్పుడు ఇక నీనుండి ఏమీ దాచలేను. ఈసరికి అసలు సంగతి నీకు తెలిసిపోయే ఉండొచ్చు, అయినా చెపుతున్నా... విజేతవు నువ్వుకాదు, నేను! నన్ను నువ్వు కళ్ళతో చూడకముందే నేను, నాకు నీపైనున్న  ప్రేమలో నిండా మునిగిపోయి ఉన్నా. నీపై నాలో ఉన్న అచంచలమైన ప్రేమే నువ్వు నన్ను ప్రేమించేలా చేసింది, సందేహమేమీ లేదు. అయినా మనిద్దరి మధ్య పోటీ ఏమిటి! ఎవరు నెగ్గినా ఇద్దరిదీకదా గెలుపు!

క్రమంగా సంసార జంఝాటం లో పడి సరసాలు, సరదాలూ తగ్గిపోయినా మన మధ్యనున్న ప్రేమమాత్రం చెక్కుచెదరలేదు. ఇంకా నీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పాలని ఉంది. మనం ప్రేమించుకున్న తొలినాళ్లలోని మధురమైన విషయాలెన్నో ప్రతిక్షణం గుర్తొస్తున్నాయి. కాని నువ్వు నా మాటలు వినే స్థితిలో లేవుకదా ... అందుకే ఉత్తరంలో రాస్తున్నా. దీనిని నీ వెంటనుంచుకుని కుదిరినప్పుడు చదువుకుంటావని.

గుర్తుందా - అప్పుడు నేను ఇంటర్ పరీక్షలు రాశాను. అంటే నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చావన్నమాట. వేసవి సెలవుల్లో నా పుట్టినరోజు వచ్చింది. ఒక్కర్తినే కూతుర్ని కావడంతో మా అమ్మా, నాన్నా నన్ను గారాబంగా పెంచారు. తరువాతి పుట్టినరోజుతో నాకు ఓటుహక్కు వస్తుంది. అంతేకాదు, పెళ్ళీడు కూడా వచ్చేస్తుంది. అందుకే మావాళ్ళు నాకీ పుట్టినరోజు ఘనంగా చెయ్యాలనుకున్నారు.  వాళ్ళ స్నేహితుల్ని నా స్నేహితుల్ని కూడా పార్టీకి పిలిచారు. మీ అమ్మగారికి ఆరోజు జ్వరం రావడంతో పార్టీకి నువ్వొక్కడివే వచ్చావు. నీ చేతిలో గిఫ్టురాప్ చుట్టివున్న ఒక చిన్నపెట్టి ఉంది. ఆపెట్టెని నువ్వునాకు స్వయంగా ఇవ్వాలని కాబోలు సమయం కోసం వెతుక్కుంటూ, దొంగచూపులు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నావు. నిన్నే అతుక్కునివున్న నా చూపులనుండి అది ఏమాత్రం తప్పించుకుపోలేక పోయిందది.

హాల్లో ఒకమూలగా వేసివున్న టేబుల్మీద వచ్చినవాళ్ళు, తెచ్చిన గిఫ్టు లను ఉంచుతున్నారు. నువ్వు తెచ్చిన బహుమతిని ఆగుట్టలో పడెయ్యడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమయ్యింది. నువ్వు తెచ్చిన గిఫ్టు ఎంతచిన్నదైనా ఫరవాలేదు, నువ్వు తెచ్చినది కనుక నాకది అమూల్యమైనది. నాకోసం నువ్వు ఏంతెచ్చావో చూడాలని ఆత్రగావుంది. కాని జనం ఎక్కువగా ఉండడంతో, నాచుట్టూ నా స్నేహితురాళ్ళు  చుట్టుముట్టి ఉండడంతో మన కోరికలు  తీరనే లేదు.

నెమ్మదిగా జనం వెళ్ళడం మొదలయ్యింది. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. కొందరు వచ్చి నాకు “బై” చెప్పి వెడుతున్నారు. ఈ సందడిలో నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావో నాకు తెలియనేలేదు. నా కళ్ళు నీకోసం వెతికితే నువ్వు నాకు కనిపించలేదు. నువ్వు విసిగిపోయి తెచ్చిన గిఫ్టుని టేబులుమీద పడేసి వెళ్ళిపోయావు కాబోలు - అనుకున్నా.

అతిధులందరూ వెళ్ళిపోయాక అమ్మ, వాళ్ళు తెచ్చిన గిఫ్టులను ఒకటొకటీ  పైకితీసి నా ముందుంచ సాగింది. అందులో నువ్వు తెచ్చిన చిన్నపెట్టి ఎక్కడా కనిపించలేదు. ఏమయ్యిందది - అన్నది ఒక పెద్ద ప్రశ్న, కాని దాన్ని గురించి ఎవరినడగాలో తెలియలేదు. గుండెబరువుతో ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు.

మీ అమ్మగారికి జ్వరంగావుందని తెలియడంతో మా అమ్మ మీ అమ్మగారిని చూడడానికి మీ ఇంటికి వెళ్ళింది. నాన్న ఆఫీసుకి వెళ్ళారు. ఇంట్లో నే నొక్కదానినే ఉన్నాను. అప్పుడొచ్చావు నువ్వు నా రూములోకి, నేను పోయిందనుకున్న చిన్నపెట్టెని చేత్తో పట్టుకుని. నాకు చాలా సంతోషమయ్యిoది. నేనప్పుడు నా రూములో ఈజీచైర్లో కూర్చుని, ఏదో తెలుగు నవల చదువుతున్నాను. అలికిడికి తలెత్తి చూసి, పుస్తకం టీపాయిమీద ఉంచి లేచి నిలబడ్డా. లోనికి వస్తున్న నీలో నాకు ఏదో అలజడి కనిపించింది. నువ్వు నాకు చాలాదగ్గరగా వచ్చావు. నాలోనూ అలజడి మొదలయ్యింది. నేను తప్పించుకుని వెళ్ళిపోబోయాను. కాని నువ్వు చటుక్కున  నా చెయ్యి పట్టుకుని ఆపేశావు,

“రమ్యా! ఐ లవ్ యూ! నీకుకూడా ఇష్టమైతే మనం మన పెద్దవాళ్ళకి చెపుదాము. నా డిగ్రీ పరీక్షలు అయ్యాక మన పెళ్లి జరుగుతుంది. ఏమంటావు” అని అడిగావు.

నాకు గాలి స్తంభించి పోయినట్లయ్యిoది. ఆ మాటకోసమేకదా నా ఎదురుచూపులు! అయినా నాకు నోట మాట రాలేదు.  గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆమాట నీకెలా చెప్పాలాని ఆలోచించా. ఎట్టకేలకు ఎంతో ప్రయత్నం మీద నా అంగీకార సూచకంగా తల ఊపగలిగాను. నీ ముఖం సంతోషంతో విచ్చుకుంది.

“ఈ సంతోష సమయంలో నేను నిన్నొక వరం అడుగుతాను, కాదనవుకదూ... ”

దానికీ అలాగే తలూపి నా సమ్మతి తెలియజేశా.

అప్పుడు నువ్వన్నావు, “వృద్ధాప్యం వచ్చాక నా తల్లిదండ్రుల్ని మన తల్లితండ్రులుగా చూసుకుంటావు కదూ...”

ఏమి చెప్పాలన్నా నాకు నోరు పెగలదాయే! ఆలస్యం చేస్తే నువ్వు అపార్థం చేసుకుంటావేమో! ఎలా?

నీ చేతిలోనున్న నా చేతిని కదిపి, నీ చేతిలో చెయ్యేసి నేను నీకు “ప్రామిస్” చేశా. నువ్వా చేతిని ఎత్తి ముద్దుపెట్టుకున్నావు. ఆ తరవాత చిన్నపెట్టి తెరిచి దానిలోనుండి బంగారంలా మెరుస్తున్న రిస్టువాచీని తీసి నా చేతిని అలంకరించావు. నేనానాడు చేసిన వాగ్దానాన్ని తరువాత నిలబెట్టుకున్నాను కదూ! నీ సంతోషమే నా సంతోషం!

మంచిరోజంటూ ఆ మరునాడే మీ అమ్మానాన్నలు మా ఇంటికి వచ్చారు పెళ్ళిమాటలకి. నువ్వు మీవాళ్ళకి చెప్పి పంపావని నేను అర్థంచేసుకున్నా. మొదట్లో మావాళ్ళు – మీరు వైష్ణవులు, మేము అద్వైతులం – అంటూ కొంత పేచీ పెట్టినా నేను పంతంపట్టి వాళ్ళను ఒప్పించగలిగా. చివరకు “పిల్లలు ఇష్టపడ్డారు“- అంటూ చివరకు రాజీ పడ్డారు. నీ పరీక్షలైన తరువాత,  వైశాఖమాసంలో మన పెళ్ళి జరిగిపోయింది.

మొదటిరాత్రి నేను నిన్నడిగా, “ఇంత అందగాడివి, నేనేమంత అందగత్తెను కాను కదా, నేను నీకెలా నచ్చాను” అని, గుర్తుందికదూ!

నువ్వు నవ్వి అన్నావు, “ఎవరన్నారు నువ్వు అందగత్తెవు కావని! వాళ్ళని నా కళ్ళతో చూడమని చెప్పు, తెలుస్తుంది. నువ్వు నాకు ఎంతో అందంగా కనిపిస్తావు. అయినా అద్దంలో కనిపించే అందాన్ని చూసికాదు నేను నిన్ను ప్రేమించినది, నామనసుకి నీ మనసు నచ్చింది. బాహ్యసౌందర్యానికి మెరుగులద్దెడి అంతఃసౌందర్యం నీకుంది. ముఖ్యంగా అది కావాలి నాకు” అన్నావు. అప్పుడు నాకొక పాతపాట గుర్తొచ్చి ”హం” చేశాను... “మగడు మెచ్చిన చాన కాపురములోన... మల్లె పూలా వాన ముత్యాల సోన! ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యమో ఇంటిల్లిపాదికీ అంతవైభోగము!” నువ్వు నవ్వుతూ నన్ను దగ్గరకిలాక్కున్నావు.

నువ్వు గుక్కపట్టినట్లు ఒకటే నవ్వు! నవ్వినవ్వి అన్నావు, “మీ అమ్మగారు మా అమ్మతో అన్నారు – మా రమ్యకి సంబంధాలు చూడడం మొదలెట్టాలనుకుంటున్నామని. ఆమాట పక్కగదిలోవున్న నాకు వినిపించింది. అదినన్ను భయపెట్టింది. “ఆలస్యం అమృతం విషం” అన్నారు. ఆలస్యం చేస్తే మీవాళ్ళు, “ఎవరికో మాటిచ్చేశా”మని చెపితే, నెత్తిని చెయ్యి పెట్టుకుని తిరిగిరావలసివస్తుందేమోనని భయం వేసింది. అంతకన్నా సంబంధం కుదుర్చుకున్నాక సంవత్సరం పెళ్లి వాయిదావేసినా ఫరవాలేదనిపించి, మా వాళ్ళని నేనే తొందరపెట్టా, బాగుందికదూ!”

ఆ సంవత్సరం మనం కలిసి తిరిగాం, సినిమాలకు వెళ్లాం; ఏనాడూ నువ్వు హద్దుమీరలేదు.  పెద్దవాళ్ళ గౌరవం నిలిపావు. నిజంగా నీవంటి భర్త దొరకడం నా అదృష్టం! నీ ఒద్దికలో నా జీవితం మూడుపూలు – ఆరుకాయలూ కాగా, ఏభై వసంతాలు నిత్యవసంతంగా మన దాంపత్యజీవితం దివ్యంగా సాగిపోయింది. నాలోని సౌoదర్యాన్ని నీ కళ్ళు చూడగలవు, నాలోని ఔన్నత్యాన్ని నీ మనసు కనిపెట్టగలదు, ఇంతకంటే ఇంకేమి కావాలి నాకు!

మన పెళ్ళయ్యాక కూడా కొందరమ్మాయిలు నీవైపు ఆబగా చూసేవారు. తీరికూచుని ఒకరోజు నిన్ను ఆటపట్టిoచాలని - నిన్నలా గుడ్లప్పగించి చూసే నీ కొలీగైన ఒక అమ్మాయితో కలిపి నిన్నొక అనరానిమాట అన్నాను. వెంటనే నువ్వు నన్ను పక్కకు తోసి మంచం దిగిపోయి అన్నావు ...

“రమ్యా “యు ఆర్ మై స్వీట్ హార్ట్! “ ఎప్పటికీ నువ్వన్నది జరగదు, నన్ను నమ్ము. నీకు వాగ్దానం చేస్తున్నాను – మనల్ని విడదీసేశక్తి ఒక్క మృత్యువుకి తప్ప మరెవరికీ లేదు.  ప్రామిస్!”

అప్పుడు నీ కళ్ళలో కనిపించిన బాధ నన్ను నిలువునా ఒణికించింది. అలాంటి పొల్లుమాట నేను అనకుండావుంటే ఎంత బాగుండేది – అనుకుంటూ తరువాత ఎంతో పశ్చాత్తాపపడ్డాను. ఆరోజు నేనలా అనకుండావుంటే అసలు మృత్యువు ప్రసక్తి మన జీవితంలోకి వచ్చేది కాదేమో. కానీ కాలుజారితే వెనక్కి తీసుకోవచ్చుగాని నోరుజారితే వెనక్కి తీసుకోలేముకదా! నేనిప్పుడు నీకీ లేఖ రాస్తూ అదే ఆలోచిస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా.

ఈ ఉత్తరం నీకే! నా మనసు విప్పి ఇందులో పరిచా. దీనిని నీతో ఉంచుకుని, వీలు కుదిరినప్పుడల్లా చదువుకో. నువ్వీ కాగితం మడత విప్పగానే  నీకు తెలుస్తుంది, నేనీ ఉత్తరం కలంలోని సిరాతోపాటుగా నా కన్నీరు కూడా కలగలిపి రాశానని. నాగుండెలనిండా నిండివున్న ప్రేమ చెక్కుచెదరకుండా ఎప్పటికీ అలాగే వుంటుంది. నువ్వా రోజున అన్నమాట సరిగాదు - మృత్యువుక్కూడా మనల్ని విడదీసే శక్తిలేదు. నువ్వెప్పటికీ నా హృదయంలో నిలిచివుంటావు. నానుండి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఈమాట చెపుతున్నది మరెవరోకాదు, నేను – నీరమ్యను!”

నీరమ్యను – అన్నది అండర్లైన్ చెయ్యాలనుకుంది ఆమె, కాని కలంలో సిరా ఐపోయింది.

రాయడం ముగించి కలాన్ని పక్కనపెట్టి లేచింది రమ్య. నెరసిన జుట్టు సవరించి ముడివేసుకుంది. చెదరిన చీర కుచ్చిళ్ళు సరిజేసుకుని, కన్నీటిచారికలు కనిపించకుండా కొంగుతో శుభ్రంగా మొహం తుడుచుకుంది. బల్లమీదున్న లేఖను తీసి పొందికగా మడిచిపట్టుకుని భర్తవున్న గదిలోకి నడిచింది ఆమె.

చిక్కిశల్యమై మంచాన్ని అంటిపెట్టుకుని స్పృహలేకుండావున్న భర్తను చూసేసరికి పొంగివచ్చిన కన్నీటిని బలవంతంగా అణచుకుని అతన్ని సమీపించింది రమ్య. దగ్గరగావచ్చి అతని చేయి అందుకుని తను తెచ్చిన “ప్రేమలేఖ” అతని అరచేతిలో ఉంచి అంది ...

“ఈ ఉత్తరమే  నా హృదయం. దీనిని నీ వెంట తీసుకుపో. ఆట్టే రోజులు పట్టదు, త్వరలోనే నేనూ నీదగ్గరకు వచ్చేస్తా” అంటూ ఒంగి అతనిని ముద్దుపెట్టుకుంది. ఆగక కురిసిన ఆమె కన్నీరు అతని చెంపల్ని తడిపింది. అదాటుగా అతనిలో చైతన్యం వచ్చింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చేతిలోని ఉత్తరంచుట్టూ అతని చేతివేళ్ళు బిగుసుకున్నాయి.  మరుక్షణంలో ఆమె చేతిలోవున్న అతని చేతిస్పర్శ ఆమెకు తెలియజెప్పింది అతను ఇక లేడని!

**** సమాప్తం ****

Posted in August 2020, కథలు

1 Comment

  1. VENUGOPAL Rao Gummadidala

    విషాదాంతమైనా, నెమరువేసిన ప్రేమ జీవితం అందమైన చిత్రంలా మనోఫలకం పై నిలిచి ఈ జీవితం ఇంతకంటే తీపి బరువు మోయలేదేమోననిపిస్తుంది. బాగుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!