Menu Close
SirikonaKavithalu_pagetitle
సంధ్యాసఖీ -- గంగిశెట్టి ల.నా.

సంజె వేళలో కలుద్దామని తటిల్లతలా కనుమరుగయ్యావు
ఎంత పిలిచినా ఓ య్యనే మొగ్గ తొడిగే
సడి తప్ప నువ్వగుపడవేం
ఏ సంజెలో కలుస్తున్నామో ఒక్క మాటా స్పష్టపరచవేం...
సఖీ! ఈ సూర్యచంద్రులకేమిటి నాపై ఇంతపగ?
ఎప్పుడు చూసినా ఉన్నచోటనే ఉన్నట్లుంటారు
అంత మంటలెత్తిస్తూ మందులై సాగుతుంటారు
వాళ్ళ మీదపడి బ్రతికే ఋతువులేమిటి ఇలా పరుగెడతాయి
ఇదుగో వసంతమంటే, అదిగో గ్రీష్మమంటూ
అదిగో శరత్తంటే ఇదిగో శిశిరమంటూ
ఉన్నవి నాలుగో ఆరో వాటికే తెలియకుంటూ
నీకూ నాకూ మధ్య కుట్రచేసి కార్చిచ్చు రేపుతున్నాయి
నిత్యం నన్నో కాలందుంగకు కట్టేసి ఇహపు ఏట్లోకి నెట్టేస్తున్నాయి
నీలో భాగాన్ని నీకే పరాయిగా మార్చేస్తున్నాయి...
నువ్వన్నది ఒక సంజె కాలమే
అది పగలు కనుమూసే సంజో
నేను కనుమూసే సంజో
ఈ పుడమి కనుమూసే సంజో...
సముద్రాలు మాత్రం ఉద్వేగంతో
ఘుూర్ణిల్లుతున్నాయి
నన్ను భూమి మీదికి తెచ్చినందుకు...
నీ సంజె బాసకు తొలి సాక్ష్యమై నిలుస్తున్నందుకు...
సఖీ, నీకూ నాకూ సంధి గూర్చని సంధ్య, సంధ్య ఎలా అవుతుంది
రాగారుణిమకు కాక, నిష్కారుణిమకు ప్రతీకెలా అవుతుంది?

వర్షంలో....! -- బెంగాలి-ఆంగ్ల మూలం: విప్లవ మాజీ, మిడ్నాపూర్ -- అనుసృజన: డా. పెరుగు.రామకృష్ణ

ఇన్నాళ్ళకి వచ్చిన వాన
దాంట్లో అలాగే నిల్చున్నా
జ్ఞాపకాలు మిగలని వాడికి మల్లె
ఒకటే ఆలోచన
ఏమిటో..
దేని గురించో
దిగులు
మళ్ళీ ఆలోచన...
నేనెవరు..?
నువ్వెవరు..?
ఇదంతా ఏమిటి..? ఎందుకు..?
భావాలలోకి ప్రవేసిద్దామంటే..
అంతా శూన్యం
శూన్యంలో
నీ నుదిటిమీద రాసిన భవిష్యతు
సముద్ర అలల లాంటి
నీ కురుల మధ్య అదెలా సాధ్యం ..?
నువ్వు దూరంగా...
నేను ఇలా వర్షంలో
ఎలా..?
నీకు దూరంగా నేను..
నాకు దూరంగా
నువ్వు ఒంటరిగా
నీ నక్షత్ర దేహాన్ని తడిపేస్తూ
వర్షంలో...!!

చీకటి విరుపు -- వాసిలి వసంత కుమార్

మూడుముడుల బంధానికి
మూడుమీటర్ల దూరభారం
ఏడడుగుల మురిపానికి
ఏడడుగుల వినోద కౌగిలి
అంతర్జాలమే సహభాగిని
వొంటినిండా ఆన్లైన్ కాలుష్యం
కళ్లనిండా అంతర్జాల పౌరుషం
మనం గడప దాటం దాటనివ్వం
ఏదో గొంతుకలో కొట్టాడుతుంటుంది
చూపులు చేతలను అరగదీస్తుంటాయి
కట్టడులు పీల్చేగాలిని కడుగుతుంటాయి
అందరం ఇల్లు కదలనివారమే
అయినా గుండెగదిన భయం
ఎద నిండా ఎడారి తిన్నెలే
ఎవరు ఎవర్ని బంధిస్తున్నారో
తెలీక పగలైనా చీకటి విరుపే
మనం మీటుతున్నది చరవాణిని
అల్లుతున్నది వర్తమాన చరిత్రని
అయినా
గుర్తుపట్టే చిత్రగుప్తుడివి విగత లెక్కలు
గుర్తుపట్టనివి వ్యాసుని కాలపత్ర పుటలు.

ప్రకృతిపాఠము -- అయ్యగారి సూర్యనారాయణ మూర్తి

శా. ఏ కాలుష్యము లేక పోవుటఁ గదా యీ నాఁడు దూరాన నా
లోకింపన్ గల భాగ్య మా హిమగిరుల్ గూర్చెన్(1); శ్రుతిద్వంద్వమున్
దాఁకున్ శ్రావ్యపికస్వరంబులు(2); వసంతం బెన్నఁ డీ రీతిగా
లేకుండన్ గని డస్సినట్టి మనుజుల్ మేల్కొన్న మే లయ్యెడున్ 1
           (1) ధూళికాలుష్యము లేక (2) శబ్దకాలుష్యము లేక

ఉ. మా కిల సాటి లేరని యమానుషవర్తనమే విలాసమై
యీ కరణిన్ జనావళులు సృష్టికి హాని యొనర్చు చర్యలన్
చేకొని విఱ్ఱవీఁగఁగ; సృజించెను సృష్టియె ‘వైర’ సొక్కఁటిన్
తాఁకుడుఁ దాళలేని జనతామరణంబులె బుద్ధి సెప్పఁగన్ 2

కం. ప్రకృతిసమతుల్య మన్నది
ప్రకృతివరం; బదియె మఱచి ప్రజ్ఞావంతుల్
ప్రకృతికె పాఠము నేర్పఁగ
నొకపరిఁ దా నెవరొ చూపె నుర్వీతలమే 3

కం. ప్రాణులకు మాత ప్రకృతియె
కానన్ గౌరవము గల్గి కానల నైనన్
మానవతఁ జూపి మెలఁగిన
మానవకల్యాణ(1) మొదవి మనుగడ సాగున్ 4
           (1) మా యొక్క క్రొత్త శుభము/మనుష్యుల శుభము

కం. మనపూర్వీకుల పద్ధతు
లనుఁ గాలను రాసి యీ విలయగర్జనతో
కనువిప్పు గల్గి విధిగా
మనపెద్దల మాట వినిన మనఁగల మిలపై 5

తే.గీ. పంచభూతాల కరుణచేఁ బాంచభౌతి
కస్వరూపంబు లవనిలోఁ గల్గెఁ బ్రాణు
లన్నిఁటికి; సృష్టిమూలాల నాదరించు
భరతసంస్కృతి కివె నాదు వందనములు 6

కల్పవృక్ష ప్రసూనాలు -- బులుసు వెంకటేశ్వరరావు

"తానో "లాములు" తండ్రి పేరెవరయా
        "దాచాత మాలాలు"నౌ
లే నాపేరన"నమ్మగాల"నగ నోలిం
    దల్లి "కౌసల్య తం
డ్రీ "నాగా ననబోయి రాక కనులన్
      నీర్వెట్ట "గౌసల్య నౌ
 గానేగానులె  యమ్మనే "యని ప్రభున్
       కౌసల్య ముద్దాడె డిన్!!"
నీ పేరేమిటి ?
 లాములు (రాములు)
మీ నాన్న పేరేమిటి 
 దాచాత మాలాలు (దశరథ మహారాజులు)
 నాపేరేమిటి 
 అమ్మగాలు (అమ్మగారు)
 కాదురా నాపేరు కోసల్య .
  ఆపేరు బాలరామునికి నోరుతిరగలేదు
  పలుకలేడు--కన్నుల్లో నీళ్లు తిరిగాయి.
   అసలే రాజీవలోచనుడు
 బిడ్డ కన్నీరు చూసి ఏ అమ్మ తట్టుకోగలదు??
  " కౌసల్యను కానులే నాయనా! అమ్మనే ! "
 అంటూ రాముణ్ణి ముద్దులాడింది !
 తాను కౌసల్య కావడం కంటే రామునికి తల్లికావడమే
  ధన్యత గా భావించింది .
 అందుకే చెప్పేది ---
  కల్పవృక్షం ఒక ఆత్మీయ కావ్యం -- తెలుగువారికి అని!!

రాధా కృష్ణులు -- వేణు ఆసూరి

యమునా తీరాన ఒంటరిగా రాధ
    సంజె చీకట్లలో ఎదురుచూపుల బాధ
సుడులు తిరుగుతున్న తలపుల వ్యధ
    చల్లని గాలులలో వేడి నిట్టూర్పుల సెగ

“అదిగదిగో పిల్లనగ్రోవి స్వరాలు!
    అవేగా కాలి మువ్వల సవ్వళ్లు!
మసక చీకటిలో కళ్లు విప్పార్చినా,
    కనిపించడాయే నా నల్లనయ్య!”

“అబ్బా, చల్లని మలయ సమీరం!
    ఆహాహా, హరి చందన గంధం!
అయ్యో, ఏదా చక్కని రూపం!
    ఆహా, ఎంత హాయి ఈ ఏకాంతం!”

“ఓహో, నీడలా నన్ను వాటేసుకుంటాడా?
    ఊహూ, నీల మేఘమది నా శ్యాముడు కాదు
ఏమిటీ గిలిగింత, ఎంత పులకింత!
    కనరారా స్వామి నీలో కరిగిపోతాను!”

చెంత చేరిన హరి కంటబడినంతనే
    ఆరాటమే తీరి రాధ అలుక పూనింది
వలపంత కరిగి కన్నీరుగా ఒలికింది
    విరహమే ఎగిసి కంటి ఎరుపుగా మిగిలింది

కన్నుల, కరముల, బుగ్గల, పెదవుల
     మాధవు అధరపు సుధలే కురిసే!
పెదవి తాకిన రాధ వేణువై పోయింది
    అలకలన్నీ తీరి అనురాగమే మిగిలింది

యమునా తీరాన జంటగా రాధ
    సంజె చీకట్లలో వలపు కౌగిలి సుధ
హరితో సిరి తీయని ప్రణయ గాధ
    పరమాత్మ ఒడిలో పవ్వళించిన ఆత్మ

శివసూర్యాభ్యామోన్నమః -- పాలడుగు శ్రీ చరణ్

సీ|| ఇందు సహోదరీ హృదయారవింద బం
           ధుండిందు బంధు శత్రుండినుండు!
     గర్వాంధకారఘ్న కాళరాత్రుండు! ర
          క్షః కాళరాత్రి కులాకరుండు!
     అద్వైత భాస్కరుం డదితి కశ్యప సూను
         డాంజనేయాచార్యు డంబరమణి!
    విష్ణు శివ బ్రహ్మ కృష్ణ పింగళ వేద
         సంధ్యా సమేతుండు సవితృ మూర్తి!

తే|| మాఘ శుద్ధ సప్తమి బొల్చె మఘవ సహజు
     డంశుమంతుండు సప్తహయైక చక్ర
     రథుడు! దీర్ఘాయువొసగు మార్తాండ మూర్తి!
     ప్రాంజలించెద సూర్యనారాయణునకు! ||

శా|| కేదారః కిసలాయతే సకల హృత్ క్షేత్రేషు చైతన్యతో
      ధాన్యాన్యాత్మ విమర్శ నామ నిగమైరోంకార బీజాంకురైః
      గౌరీ మంగళ శక్తి ధాతు సకలాన్యానంద సస్యాని వై
      మాయామృత్యుభయక్షుధోపశమన జ్ఞానామృతాన్నాన్యధి! ||

కాంతి కిరణం -- శేషగిరిరావు

కాంతికిరణం
ఋజుమార్గంలో ప్రసరిస్తుంది.

నీ చేతిలో లేజర్ నుండి వెలువడి
తిన్నగా తెల్లతెర మీద
నువ్వు గురి పెట్టిన చోటికి
విధేయతతో
చేరినట్టే కనిపిస్తుంది.

కిటికీ ద్వారా
బయటికి గురిపెట్టి చూడు మిత్రమా
మార్గంలో ప్రతి బిందువు
వక్రీభవనమే
విస్తరణే
క్షయమే

అవును
కాంతికిరణం
ఋజుమార్గంలో ప్రసరిస్తుంది.

వాసంత నవరాత్రి -- డా. శనగవరపు కృష్ణ మూర్తి శాస్త్రి

తే.గీ. వచ్చె వాసంత నవరాత్రి  తెచ్చె మదికి
         నాటి మా యూరి తిరునాళ్ళ మేటి స్మృతులు
         కమ్ర దృశ్యంబు లెదురుగా కానవచ్చె
         దొరలె నానంద బాష్పాలు పరవశమున

సీ. తిరునాళ్లలోన మందిరము ముంగిట గట్టు
          తాటాకు పందిళ్ల తలపు వచ్చు
    పందిళ్ల వెనుకగా భాసించు గాలిగో
         పురముపై శిల్పాల పొలుపు తోచు
     మామిడి తోరణాల్ మల్లెపూదండలు
          పందిళ్ల నిండుగా నందగించు
     ఉత్సవ దేవుళ్లు ఊరిలో నూరేగి
            ఉత్సాహమున వచ్చి యుందు రంత

ఆ.వె. చైత్ర మాదిగాను చక్కని నాటకం
         బులును, హరికథలును, బుఱ్ఱకథలు
         భరత నాట్యములును, పాట కచ్చేరీలు
         పరగుచుండు జనులు పరవశింప

 

తే.గీ. నవమదివసము శ్రీరామనవమి నాడు
       మూడు వేదికలను తీర్చి ముచ్చటైన
       జంటలను నందు మీదను సంతరించ
       పెండ్లి సందడి పందిట పెల్లెసంగు

సీ.  జానకీరాములు, శైలజాశంకరుల్
          రుక్మిణీమురళీధరులను నిల్పి
    పెండ్లి కుమార్తెల, పెండ్లి కుమారులన్
          సర్వశోభలతోడ సంతరించి
    వేదమంత్రాలతో విధివిధానములతో
         మంగళవాద్యాలు మారు మ్రోగ
    అభిజిత్తు శుభలగ్న మాసన్న మైనంత
         మూడు జంటలకును ముడివడంగ
    
తే.గీ. ముత్యముల తలబ్రాలతో ముదము నంది
       దేవతలు కురిపించగా దీవెనలను
       నిచ్చి నీరాజనమ్ములు నిర్మలముగ
       జనులు బడసిరి తీర్థప్రసాదములను

ఆ.వె. పానకంబును, వడపప్పు, పంచామృతము
         బడసి ధన్యులైరి, పాదరక్ష
         లును, జలములు, గొడుగులును వీవనల్ దాన
         మిచ్చి సంతసమ్ము మీర జనులు

తే .గీ. ఎండ గాడ్పుల తీవ్రత నెదురు కొనుచు
         మరువ లేనట్టి తిరునాళ్ళు మదిని మెదల
         తలపులందున తీయగా నిలిపి యుంచి
         రాకకై చూచెదరు నవరాత్రి మరల

“దేవా” -- రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

నేను నిలబడడానికి
మరొకరిని తొక్కనవసరం లేకుండా చూడు
నా తాతలు తప్పు చేసారని
నాకు శిక్ష పడకుండా చూడు
నిజాయతీగా అబివృద్ధి సాదించే నా ప్రయత్నాలను
కులాలు మతాలు కొల్లగొట్టకుండా కాపాడు
నలుగురితో సుఖంగా సాగే నా ప్రయాణాన్ని
పార్టీల పేరుతో ప్రయాసగా మార్చవద్దు
జగతిన ప్రగతి, సుఖ శాoతుల జీవన జ్యోతిని
స్వార్ధ తిమిరాలు ఆర్పేయకుండా కాపాడు
మతాన్ని మత్తుమందులా కాకుండా
ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకొనేలా చూడు.

వైద్యకందాలు -- నాగరాజు రవీందర్

చెడిన యపెండిక్సు వలన
కుడివైపున కడుపునొప్పి కుళ్ళబొడవగన్
సడలును రోగి పరిస్థితి
వడిగా వైద్యమును జేయ వలయునతనికిన్ 

వరిబీజము వచ్చినచో
సరిగా నడచుటకె రాదు సంకట పరచున్
సరియైన వైద్యమును వే
గిరముగ జేయించుకున్న క్లేశము తప్పున్ 

గజ్జలలో కణితి కలుగ
నుజ్జగొనుచు హెర్నియాను, యొకమారైనా
లజ్జ యనక వెనువెంటనె
వెజ్జున కది చూపకున్న వెలయును కష్టాల్ 

తినకున్న యెడల వేళకు
జనియించును కడుపులోన సలిపెడు పుండే
తినుచును సమయము దప్పక
యనువగు నౌషధముఁ మ్రింగ వ్యాధియె తగ్గున్

చిత్తగును రోగి స్వస్థత
పిత్తాశయమందు రాయి పెరుగుట చేతన్
పిత్తము చెందు ప్రకోపము
తిత్తిని తొలగించినంత తెవులే పోవున్

అలలూ – సెలయేళ్ళూ -- స్వాతీ శ్రీపాద

పైకి ప్రశాంతంగా
ఏమాత్రం అలకదలని
బియాన్ నదిలానే కనిపిస్తారు.
లోలోన పొంగి పొర్లుతున్న నదీ నదాలు
చీకటి మింగేసిన వెన్నెల మాత్రం
గ్రహణం మసకలా
మొహాల మీద పాలిపోయిన నీడలను
తోలుబొమ్మలాడిస్తూ
పైకేమీ కనిపించదు.
గొంతు నొక్కేసిన కలవరింతలూ
లోలోపల అదిమి పెట్టిన అహంకారమూ
ఏదీ చిన్నమెత్తు కూడా ఆచూకీ దొరకదు.

కళ్ళు మూసుకుని యోగనిద్ర నటించే వేళ
పులో పామో ఏదైనా సాధువే
పంజా విసిరితేనో పడగ విప్పితేనో గదా తెలిసేది
ఒక నీలి ప్రపంచం నరనరానా ఇంకి పోయాక
చూసే ప్రతిది నీలి బొమ్మలానే కనిపిస్తుంది
మనుషులేమో అని భ్రమ పడతాము
కాని కామరూపులై మనుషుల్లా సంచరించే పుకార్లు వాళ్ళు
నాలుకలపై అత్తరు చల్లుకుంటే పరిమళ సుమ బాలలు అని భ్రమిస్తాం
కాని బురద పుక్కిట నింపుకు పుక్కిలించే ఉన్మాదులు వాళ్ళు
పాత రాతి యుగంలోనే పనికిరాని మాటల అవశేషాలు వదిలేశామనుకున్నా
అణువు అణువునా పారే పాత రక్తం వెంట
కొట్టుకు వచ్చిన చెత్తా చెదారం
మొండి జలగలా వదలదుగా
రహస్యంగా పక్క వాళ్ళ చెవులకు అతుక్కుపోతుంది.

సాయంకాలాలు సంస్కారం మేకప్ తగిలించుకు
పరస్పరం కరచాలనాల మధ్య ఒలికిన అసహనాన్ని
పెదవుల తేనె వాకల్లో తియ్యతియ్యగా ప్రవహిస్తారు.
భాష సత్తా తెలియని పరిసరాలు
తెల్లబోయి ముక్కున వేలేసుకుంటాయి.

మనిషికీ మనిషికీ మారే భాష గురించి తెలుసా?
మనిషికీ మనిషికీ మారే విలువలు తెలుసా?
మాటల మధ్య పుట్టుకు వచ్చే మనుషులు తెలుసా?
మనుషుల మధ్య మారిపోయే ఊసరవెల్లి తత్వం తెలుసా

తెలియదు కాని
ఉన్నట్టుండి నదులు పొంగి పొర్లుతాయి
నిలువెల్లా ముంచెత్తుతాయి
పైపైకి ఎగిసి చప్పున విరిగి నేలకూలవూ
మిడిసిపడే సునామీ అలలమల్లే

నిదానంగా సాగే పిల్లసెలయేరు
పెదవుల వెనక ఎప్పటిలా
చిన్న చిరునవ్వు

ఆత్మీయనేస్తం -- అరుణ నారదభట్ల

బల్లకింద జారిపడిన తనకు నెమ్మదిగా చెయ్యందించి
బయటకు లాగాను
నా చేతిని విడవకుండా కనీళ్ళు పెడుతున్న తనను చూస్తూ
అలాగే ఉండి పోయ...తన కథవింటూ

తనెవరో అంతగా తెలియదు నాకు
ఐనా తన ఒక్కో జీవనపోరాటం
నన్ను తనవెంట తీసుకెళ్ళింది
తన ఊరు తన బాల్యం
తన ఆకతాయి మాటలు
పరుగెత్తుతున్నప్పుడు తనకు తగిలిన గాయాలు....అక్కడి స్నేహితులు, బంధువులు
పంటలు... ప్రకృతి‌...నదులు, అలలు,
తనలోని తనకు మాత్రమే కనబడే అంతర్మదనం అంతా వరుసగా పూసగుచ్చినట్టు చెబుతుంది

ఐనా ఇంకా తను నాకు తెలియదు
ఎక్కడ పుట్టిందో...ఇక్కడికైతే వచ్చింది
తన ప్రతి ముఖ్యమలుపునూ చెబుతుంది
సమయం దాటిపోతున్నా గమనించని నేను
తనతోపాటుగా తన లోకాన్నంతా
తిరిగొచ్చాను.

చేతులన్నీ తడిసిపోయి
గుండెనిండింది
దుమ్ము తుడిచి కబ్బోర్డ్ లో కూర్చోమన్నాను తనను

తలుపుతెరవగానే
బళ్ళుమని జారిపడ్డారు కుప్పులుగా
సూక్ష్మ రూపాలై మ‌నుషులంతా
ఇంటినిండా మడతలు మడతలుగా పరుచుకున్నారు.
టీపాయ్, టేబుల్, డెస్క్,కుర్చీ, సోఫా, మంచం... కంచం
నేనెక్కడుంటే అక్కడ హృదయాన్ని హత్తుకుని
నన్ను వాళ్ళ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు...
పుటలుపుటలుగా
పుస్తకాలుగా నా చుట్టూ పెనవేసుకున్నారు!!

ఎన్ని సార్లు అడిగినా -- సర్వమంగళ గౌరి

ఎన్ని సార్లు అడిగినా
విసువులేని
దాతవు
పక్షపాత వివక్షల పొంతకు పోవు
చేతపట్టినవారికి
సర్వమూ అర్పించే
చిదానందమూర్తివి
మదిమదిలో
అమూర్తంగా మెరిసిపోయే తారవి
క్షణికమై
శాశ్వతమై పోయే
చిరంజీవివి

Posted in August 2020, సాహిత్యం

2 Comments

  1. D.Nagajyothi

    వాసిలి వారికి నమస్సులు.మీ చీకటి విరుపు ఒక సత్యపు మెరుపు

  2. D.Nagajyothi

    శ్రీ గంగిశెట్టి వారికి నమస్సులు.మీ సంధ్యా సఖి అద్భుతం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!