Menu Close
Galpika-pagetitle
*జనజీవన కాంతారాలు* -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

ఈరోజు కి నలభై రోజులు కి ముందు. నేను ఆఫీస్ కి బయల్దేరుతున్నాను. మా ఆవిడకు పిన్ని ఫోన్ లో వాళ్ళబ్బాయి తో ఫోన్ లో మాట్లాడుతోంది. "ఒరేయ్! సుందరం! రమణికి ఆడపిల్ల పుట్టిందంటావేమిట్రా? మనం స్కానింగ్ తీయిస్తే మగపిల్లాడు పుడ్తాడని చెప్పారు కదురా? ఏంటి? స్కానింగ్ తీసిన డాక్టరు మీ ఆవిడకి బాబాయి కొడుకా?" ... ఈ లోపు మా ఆవిడ "పిన్ని! ఫోన్ ఇటివ్వే!.... ఒరేయ్! సుందు! ఆడపిల్ల పుట్టడమేమిట్రా? పిన్నెంత బాధపడుతోందో తెలుసా?....." ఇంకా ఏదో చెప్పబోతోంది.

"సునందా! కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా!" నా పిలుపు లో తేడా గమనించింది. "ఆ వస్తున్నానండి." ఫోన్ వాళ్ళ పిన్నికి ఇచ్చి మంచినీళ్ళ గ్లాసు తీసుకొని వస్తోంది. "సునంద తన ముగ్గురు అక్కల తరువాత పుట్టింది. వాళ్ళ పిన్నికి ముగ్గురు కూతుళ్ళు. ఆ కూతుళ్ళకి తొలి కాన్పులు కూతుళ్ళే. తరువాత సుందరం పుట్టాడు. వీళ్ళంతా ఆడవాళ్ళై ఉండి కోడలికి ఆడపిల్ల పుడితే పుట్టి పావుగంట కాని పసికందు మీద విస్మయాలు. నిట్టూర్పులు. *స్త్రీ కి స్త్రీ కి ఇంత అంతరమా?* " ... మంచినీళ్ళు తెస్తున్న సునంద నా చూపులో ఇవన్నీ చదివేసింది.

"సుందరం మావయ్య కి కూతురు పుట్టిందా! నాకేమౌతుందమ్మా? మనం ఎప్పుడు చూస్తామమ్మా?" తల్లి కాళ్ళకి అడ్డం పడుతూ అయిదేళ్ళ మా అబ్బాయి. "నువ్వు ఉండరా? వెళ్ళి ఆడుకో! ఇది పెద్ద వాళ్ళ విషయం." వాడు బుంగమూతి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయాడు. *ఇది మరో అంతరం. పెద్ద చిన్న అంటూ.* సునంద నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా "ఇదిగో నీళ్ళు తాగేసి ఆఫీసు కి బయల్దేరండి. కిచెన్ లో గ్రైండర్ ఆన్ లో ఉంది." అంటూ లోపలికి బయల్దేరింది.

నేను ఆఫీసు కి చేరుకునేసరికి మా ఆఫీసు క్రింద ఫ్లోర్ లో ఉన్న కార్పొరేట్ కాలేజీలో చిన్న గొడవ. పేరెంట్ కి, కాలేజీ ప్రిన్సిపాల్ కి మధ్య. "నేను మా అబ్బాయి కోసం ఫస్ట్ ఇయర్ లక్షరూపాయలు కట్టాను. సెకండ్ ఇయర్ లో వాణ్ణి ఇంటెన్సివ్ బాచ్ నుంచి ఫస్ట్ క్లాస్ బాచ్ లోకి తెచ్చారేం?" అని. "ఈ సంవత్సరం రెండు లక్షలిచ్చినవాళ్ళే ఇంటెన్సివ్ బాచ్ లో ఉంటారండి." నెక్స్ట్... అని తరువాత పేరెంట్స్ ని పిలుస్తున్నాడు. ఒకే కాలేజీ లో విద్యార్థుల ఆర్థికస్థితి ని బట్టి ఇంటెన్సివ్ బాచ్, ఫస్ట్ క్లాస్, మీడియోకర్, ఐఐటీ బాచ్... *ఇవన్నీ చదువును బట్టి కాదు. డబ్బును బట్టి. ఇలాగ. ఇదో అంతరం*. ఆఫీస్ లో అడుగు పెట్టాను. అటెండరు వచ్చి జియమ్ సారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారండి. నా కాబిన్లో నా సూట్కేస్ పెట్టేసి జియమ్ దగ్గర కి వెళ్ళాను.

అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కి ఇన్స్ట్రక్షన్స్. "నువ్వు నీపని చూసుకోవాలి. నీ హైయర్ అప్ కి సలహాలివ్వకు. మైండ్ జస్ట్ వాట్ యు ఆర్." ఆపరేటర్ మౌనం గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. *ఇదీ ఒక రకమైన అంతరమే.*

"గుడ్ మార్నింగ్ మహేంద్ర! ఈరోజు మనం ఇద్దరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని ఇద్దరు అసిస్టెంట్ మానేజర్స్ ని రిక్రూట్ చెయ్యాలి. ఒక చిన్న స్ట్రాటజీ. అరవై ఆరు అప్లికేషన్లు వచ్చాయి. చాలా మంది టాప్ రాంకర్సే. ఇన్ ఆల్ రౌండ్స్ సీ దట్ గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్". జియమ్ కేసి చూశాను. "వేరే కారణం లేదు. గర్ల్స్ అయితే వర్కింగ్ అవర్స్ లో ఎక్కువ సేపు సీట్లో కూర్చుని పనిచేస్తారు." జి యమ్ కి ఒకే చెప్పి ఇంటర్వ్యూ హాల్ కి వెళ్ళాను. ఆలోచనలు పరుగెడుతున్నాయి. ఇంట్లో ఆడపిల్ల పుడితే గొడవ. ఇక్కడ ఆడపిల్లల్నే రిక్రూట్ చెయ్యమని జియమ్. *ఇదీ కార్పొరేట్ బెంట్. ఇదీ ఒక అంతరమే*.

ఈ దినచర్య తో రెండు, మూడు రోజులు గడిచాయి. ఈ రెండు రోజుల్లో ఇటలీలో కరోనా మరణమృదంగాలు ప్రపంచంలో తొలిసారిగా కల్లోలాన్ని సృష్టించాయి. దేశమంతా లాక్ డౌన్.

మేం మా కంపెనీకి మరి నాలుగు రోజులు తరువాత మార్చి 23న లాక్ డౌన్ ప్రకటించాము. "లాక్ డౌన్ లో సామాజిక అంతరం తప్పనిసరి చేశారు*. స్వస్థలాలకు బస్సులోకాని, ట్రైన్ లో కాని, విమానాలలో కానీ వెళ్ళకూడదు. అని ఆంక్షలు. మేమూ ఇచ్చాము. ఈరోజు ఏప్రిల్ 24. వర్క్ ఫ్రమ్ హోమ్. వాట్సాప్ వార్తాలాపాలు ఎక్కువయ్యాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ లేని క్షణం ఉండట్లేదు. ఈవారం రోజుల్లో కొద్దిగా తలనొప్పి ఎక్కువ వస్తోంది. కళ్ళు ఎక్కువ లాగుతున్నాయి. ఇంకేమీ లేవు. చిన్న భయం. కోవిద్ 19 కాదు కదా? అని.

మా ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేశాను. నా బాధలు చెప్పాను.

*మీరు ఎంతసేపు మీ మొబైల్ తో గడుపుతున్నారు?* డాక్టర్ అడిగారు."రోజుకి పదహారు గంటలు చేతిలోనే ఉంటుంది." చెప్పాను. మీ తలనొప్పి కి కారణం మీ మొబైల్, లాప్టాప్. పది హేను రోజులు గా నాకు ఇవే కేసులు. ఇవి కోవిద్ కేసులు కావు. మొబైల్ కేసులు".

"మరి మందు?"... *డిజిటల్ డిస్టెన్స్* ద్వారా తగ్గుతుంది.

నేను ఆశ్చర్యపోయాను. *డిజిటల్ డిస్టెన్సా?*. మనుషులతో నే కాదు. యంత్రుడితో కూడా మాట్లాడకూడదన్నమాట. *ఇది యంత్రుడితో అంతరం.*

వెంటనే నా కవి హృదయం స్పందించింది.

*సామాజిక అంతరాలు*
*జనజీవన కాంతారాలు*
*వీర్ని కన్న పుడమితల్లి*
*నిత్యం బాలెంతరాలు*

ఒక నిట్టూర్పు విడిచి నేను *డిజిటల్ డిస్టెన్స్* పాటించడం మొదలు పెట్టాను.

ఆగడం -- రాజేశ్వరి దివాకర్ల

బామ్మ, స్నానం చేసి దేవుని గదిలోకి వచ్చింది. ఎత్తుగా ఉన్న దండెం మీద నుండి, కర్రతో, నాలుగు మడతలుగా ఆరేసిన, తెల్లచీరను తీసుకుంది. తొమ్మిది గజాల వాయిల్ వస్త్రాన్ని, రెండు మడతలుగా చుట్టి కట్టుకుంది. రవికను తొడగడం ఎప్పుడో మానుకుంది. పెద్దగా కొంగును తీసి తలమీదుగా కప్పుకుని భుజం నిండుగా చుట్టుకుంది.

వంటిట్లో రమ హడావుడిగా అప్పుడే వంట మొదలెట్టేసింది, ఎందుకంటే ఇప్పుడందరూ ఇంట్లోనే ఉన్నా, అమ్మాయి ఆన్ లైన్ తరగతులంటూ తలుపు మూసుకుని పాఠాలయ్యాక ఎప్పుడో కాని బయటకు రాదు.. వండి పెట్టేస్తే, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు తింటారు. తను ఆఫీసు పనిలో కూచుందంటే లేచి రావడానికి సమయం దొరకదు. పైగా తను వంట చేసి పొయ్యి తుడిచి బయటకు వెళ్తే మంచిది, బామ్మ అప్పుడు, తనకు కావలసినదేదో చేసుకుంటుంది. పెళ్ళికెళ్ళిన, అత్తయ్యా, మామయ్యలు, కట్టడి, నిషేధాల వల్ల ఆ ఊళ్ళోనే ఉండి పోయారు.

బామ్మకు చికాగ్గా ఉంది అప్పుడప్పుడు అప్రయత్నంగా తలను తడుముకుంటోంది. గుచ్చుకున్నట్టుగా అనిపించి, తలమీంచి చెవి పక్కగా కొంగును లాగి సద్దుకుంటోంది. ఇంట్లో మనుమడు కృష్ణ కు, రమకు, ముని మనుమరాలికి, ఆవిడ తన పద్ధతులను మార్చుకోదని తెలుసు, ఈ కాలంలో కూడా పూర్వాచారాలను వదలని ఆమె, అలాగే తన జీవితం గడపాలనుకుంటోందని, వాళ్ళకు తెలుసు. వృద్ధాప్యం లో ఆవిడను, ఆవిడ విశ్వసించే ఆచారాలకూ అడ్డు రాకూడదని, ఆవిడ తో వాదాలు చేయరు. రమకు తెలుసు, బామ్మకు చికాగ్గా ఉందని, కాని ఇప్పుడెవ్వరూ ఇంటికి వచ్చే వీలులేదు. తను సహాయంచేద్దామన్నా, తనకు చేతకాదు, కృష్ణ బామ్మను గమనిస్తున్నా, బ్యాంకు ఉద్యోగి కాబట్టి, తన పనిలోనూ, ఇంటికొచ్చాక చూసుకోవలసిన లెడ్జర్లతోనూ, మునుపటికంటే పనిలో ఎక్కువగా మునిగి ఉంటున్నాడు.

తలుపు తెరుచుకుని తరగతులయ్యాక. అన్నం తిందామని లోపలికొచ్చిన లావణ్య, బామ్మకు, కొంత అసౌకర్యంగా ఉండడం గమనించింది. నాలుగైదు రోజులనించీ ఈ విషయం గమనించింది. నాన్నను అడిగి తెలుసుకుని రేపు పొద్దున్నే బామ్మ కు చికాకు పోగొట్టాలి అనుకుంది.

మర్నాడు ఉదయమే నాన్నమ్మ స్నానం చేయకముందే లేచి ఆవిడ దగ్గరకొచ్చింది లావణ్య. బామ్మా, పద ..వేపచెట్టు కింద గట్టుమీదకు అంది. ఎందుకే, అన్నట్టు చూస్తున్నబామ్మతో, ‘అప్పుడే రెండునెల్లు కావస్తోంది కదే బామ్మా, నీ కోసమని, తనకు సెలూన్ లో ఎంత పని ఉన్నా ఇంటికొచ్చి జుట్టు తీసే మణి ఇప్పుడు వచ్చే వీలు లేదుకదా! పద నేను నాన్న నడిగి బ్యాటరీ క్షవరం బ్లేడు తీసుకొచ్చాను. తలమీంచి కొంగు తియ్యి. భయపడకు జాగ్రత్తగానే జుట్టు తీస్తానులే’ అంది. పది రోజులుగా అప్పుడప్పుడు తలను తడుముకుంటూ ఇబ్బంది పడుతున్న బామ్మ, తన లేని పోని "ఆగడానికి", మునిమనుమరాలు చేసిన సహాయానికి సంతోషించింది. పేపరు మీద పడిన జుట్టును తీసి ఆ పేపరులోనే చుట్టి చెత్త డబ్బా లో పడేసింది లావణ్య. తేలిగ్గా నిట్టూరుస్తూ, నున్నని తల తడుముకుంటూ లోపలికి నడచింది బామ్మ.

కలవారి స్వార్ధం.... -- గౌరి కాసాల

కాఫీ తాగి గ్లాస్ పక్కనబెట్టి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది గిరిజ. పక్కనే మొబైల్ మ్రోగింది. 'ఇంత పొద్దున్నే ఎవరబ్బా' అనుకుంటూ.. తీసింది.

చిన్నకూతురు వీడియో కాల్.

హాయ్ చిన్నులు, ఆప్యాయంగా పలకరించింది గిరిజ. Tripod మీద ఫోన్ సెట్ చేసి కుర్చీలో వెనక్కి వాలి కూచుంది. "హాయ్ అమ్మా!! నిన్న ఫోన్ చేయలేదు. అక్కకు కూడా చేయలేదుట. అది భయపడుతూ నాకు ఫోన్ చేసింది."

అయ్యో చిన్ను లు ఒక్క రోజుకేనా.. ఏదో చదువుకుంటుంటే నిద్ర పట్టేసిందిరా.

మామూలుగా అయితే పరవాలేదమ్మా కానీ... ఈ కరోనా కలకలం తగ్గేవరకు రోజు ఫోన్ చేయమన్నాను కదా!...చిన్న నిష్ఠూరం.

సర్లే సర్లే ఇక మీదట చేస్తాను కానీ ఏంటి విశేషాలు.."

అమ్మ నీ చిన్న కూతురు ఎంత కమ్మగా వంట చేస్తోందో తెలుసా అంటూ కబుర్లు మొదలు పెట్టింది. బెడ్ రూమ్ చిమ్మేసి హాల్లోకి వచ్చిన మంగి "చిన్న పాప గోర అమ్మగారు" అంటూ చాటంత మొహంతో గిరిజ వెనక చేరి ఫోన్ వైపు తొంగి చూసింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది గిరిజ. మంగి పాపం కొంచెం దూరంగానే ఉంది. అయినా కోపంగా 'నీకెందుకే ముందు నువ్వు నీ పని చూసుకో పో' అని కసిరింది. అది మొహం చిన్నబుచ్చుకుని అవతలికి వెళ్ళిపోయింది.

దీని బాధ భరించలేక పోతున్నా చిన్నులు అన్నీ తనకే కావాలంటుంది అని విసుక్కుంది ఇటు తిరిగి ఫోన్ లో. సర్లే దాని గోల ఎప్పుడూ ఉండేదే గాని ఆ.. చెప్పు ఏం వండావు తల్లీ మళ్లీ ముద్దు గా మారింది గిరిజ గొంతు.

చిన్ను సడన్గా అయ్యో అమ్మ ఒక మెయిల్ పంపాలి. నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది. గిరిజ ఆశ్చర్యపోయినా కూతురి సంగతి తెలుసు కాబట్టి ఫోన్ లో వేరే మెసేజ్ లు చూస్తూ జవాబులు ఇస్తూ ఉండిపోయింది.

ఇంతలో చిన్న కూతురు దగ్గర నుంచి వీడియో మెసెజ్. ఓపెన్ చేసింది.

అమ్మా ఇందాకలా సడన్ గా ఫోన్ పెట్టేసినందుకు వెరీ వెరీ సారీ అమ్మ. కానీ నాకు చాలా చిరాకు బాధ వేసింది. ఆ చిరాకు లో నిన్ను హర్ట్ చేస్తానేమో అని ఫోన్ పెట్టేసాను. మంగి ని మరీ అలా తీసిపారేయకండి. ఇక్కడికి వచ్చాక దాని విలువ ఇంకా తెలుస్తోంది. ఇక్కడ పనికి మనుషులే ఉండరు. వారానికి ఒక సారి వచ్చేవాళ్ళకి సమానగౌరవం ఇస్తాం. అదే న్యాయం కూడా! వాళ్ళు మనలాంటి మనుషులే గా...మంగి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తోంది మన దగ్గర. రెండు రోజుల క్రితం నువ్వే అన్నావు పాపం పిలవగానే వచ్చిందని, మీ అనుమానం తెలిసి రోజుకో రకం మాస్కు లాంటిది ముక్కుకి కట్టుకు వస్తోందని. ఏదో వెర్రి అభిమానం దానికి. నిజంగా ఆలోచిస్తే మన ఇల్లు లేకపోయినా దానికి గడుస్తుంది గాని అది లేకపోతే నీకు గడవదు. నాకు బాగా జ్ఞాపకం అది ఎప్పుడైనా ఎదురింటి ఆవిడి తో మాట్లాడితే నువ్వు భయపడిపోయే దానివి. ఇచ్చకాలాడి ఆవిడ పనికి పెట్టేసుకుoటుందేమో అని. మంగి పని బాగా చేస్తుందని ఫ్లాట్స్ లో అందరి కన్ను దాని మీదే అని అస్తమానం అంటూ ఉండే దానివి కూడ...

ఇంకో విషయం చెప్పనామ్మా!! మీ వల్ల దానికి అపాయం ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో గాని దానివల్ల నీకు ఉండదు. నీకు 60 ఏళ్ళు దాటాయి దానికి ఇంకా 40. అది రోజు సుబ్బరంగా పని చేసుకుంటోంది. సుబ్బరంగా తింటుంది....నీభాషలో మెక్కుతుంది..నీ భయానికి అన్నీ జాగ్రత్తలు పాటిస్తోంది. అదీ నువ్వే చెప్పావు. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్న సిద్ధాంతం ప్రకారము దానికి రోగనిరోధకశక్తి ఎక్కువే ఉంటుంది.

అయినా అమ్మా నువ్వు కాలేజీలో సోషలిజం దళితవాదం అవి చెప్పి ఇంటికి వచ్చి అవే తలుచుకుని ఎంత బాధపడే దానివి. మాకు కూడా చెప్పే దానివి. నువ్వు నిజంగా ఎంత ఫీలవుతూ చెప్పే దానివంటే నేను నాన్న అక్క చెవులు రిక్కించి వినేవాళ్ళం... నీ మాటల్లో ఆవేశం.... కళ్ళల్లో నీటిపొర....

అన్నట్టు నీకు భక్తి ఎక్కువే శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదంటావు. మామ్మ అన్నట్టు సుబ్బడము ఎక్కువే కాబట్టి నీకేమి భయంలేదమ్మా. అన్నట్టు, 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను మంగి తో మాట్లాడతాను... ఇది కూడా నా స్వార్థమే అమ్మా అది నేను మాట్లాడినందుకు మురిసిపోయి ఇంకా విశ్వాసంగా నీకు పని చేస్తుందని.

కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతుంటే వీడియో ఆపేసింది.

చేష్టలుడిగి పోయిన గిరిజ ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడిఈ లోకంలోకి వచ్చింది... అప్రయత్నంగానే మంగి ఉన్న వైపు అడుగులు వేసింది.

లాక్ డౌన్ వెతలు ... 6: ఓ సారి అలా వెళ్లి రా -- అత్తలూరి విజయలక్ష్మి

“అమ్మాయ్! పిల్లలు కూడా లేచేసారు ఇడ్లీలు వేసేయమంటావా! పచ్చడి చేయనా!” అడిగింది అత్తగారు.

“ఇవాళ నో ఇడ్లి ... నో దోశ ... ఇవాళే కాదు.. ఇవాళ నుంచి నో ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ ...”

గరిటతో అన్నం కలియబెట్టి అన్నం గిన్నె మీద మూట పెట్టి గుడ్డతో పట్టుకుని గంజి ఒక గిన్నెలోకి వంపుతున్న కోడలివైపు విచిత్రంగా చూస్తూ అడిగింది ఆవిడ. “ఏంటి అప్పుడే అన్నం వండేస్తున్నావు .. ఇంకా టిఫిన్లె కాలేదుగా”

తిరిగి అన్నం గిన్నె స్టవ్ మీద పెట్టి కొంచెం “ఓపిక పడతారా! మీరు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి.. నేనివాళ మీకో మంచి తాయిలం పెడతాను... దీనికోసం మూడు రోజుల నుంచి కష్టపడుతున్నా” అంది స్వప్న స్టవ్ ఆఫ్ చేసి.

“తాయిలమా? ఏం తాయిలం? నాకు తాయిలలోద్దు నా శ్రాద్ధం వద్దు కానీ ఆ ఇడ్లి స్టాండ్ ఇవ్వు” విసుక్కుంది ఆవిడ.

“మీరసలే ఈ మధ్య చాలా బలహీనంగా ఉంటున్నారు. మీకోసమే ముఖ్యంగా ఇంత కష్టపడుతున్నా.. యూ ట్యూబ్ లో మంచి, మంచి వంటకాలు పెడుతున్నారు. అవన్నీ చూస్తుంటే అయ్యో ఇంత కాలం ఇవన్నీ తెలుసుకోకుండా ఎంత తప్పు చేసాను అనిపిస్తోంది.. ఇవాళ నేను పెట్టేది తిన్నారంటే ఇంక మీరు కూడా ఆ టీవి లో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేస్తా అంటారు” రసం మరుగుతోంటే కొత్తిమీర వేస్తూ అంది.

“తల్లీ! ఆ దిక్కుమాలిన యూ ట్యూబ్ వంటలు నాకొద్దు కానీ నన్నొదిలెయ్ ...” ఆవిడ దణ్ణం పెట్టింది.

“అత్తయ్యా! మీరసలు మీరు పుట్టిన ఊరుని, మీరు ఆ కాలంలో తిన్న వంటలని ఎలా మర్చిపోయారత్తయ్యా! ఒక్కసారి మీ అమ్మమ్మను గుర్తుచేసుకోండి...ఈ తర్వాణిలో ఎన్ని మినరల్స్, ఎన్ని విటమిన్స్... ఇందులో ప్రో బయోటిక్ ఉంది అది ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తుందో మా పూర్ణచంద్ని అడగండి చెప్తాడు.. దగ్గుకి, జలుబుకి, చర్మవ్యాదులకి, ఆఖరికి ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా తగ్గడానికి కూడా ఈ ప్రో బయోటిక్ చాలా అవసరం అని, అది మన బాడీ లోకి ఎలా వస్తుందో ఆయన నెత్తి, నోరు కొట్టుకుని మరీ చెప్తున్నాడు. చెప్తే అర్ధం కాదు మీకు... పదండి అలా కూర్చోండి పిల్లలను కూడా పిలవండి అందరికీ ఒకేసారి ఇస్తాను.”

“అమ్మాయ్ ఓ సారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో.. “ అందావిడ.

స్వప్న ఎడమ భుజం మీద నుంచి ఆవిడ వైపు తిరిగి “ఎందుకో” అంది.

ఆవిడ కుడి వైపు వెళ్లి “ఏది ఇప్పుడో రైట్ టర్నింగ్ ఇచ్చుకో” అంది.

“ఏవిటండి ఈ టర్నింగ్ లు నా చేత మార్చ్ ఫాస్ట్ చేయిస్తారా! ఎక్సర్సైజులు చేయిస్తారా” విసుక్కుంది స్వప్న.

“ఆ పులిసిపోయి, పాచిపోయి, బాక్టీరియా ఫారం అయిన ఆ తిండి తినమంటావా! ఛీ, ఛీ పారేయ్ .. ఇలా మూడు రోజుల నుంచీ కడక్కుండా అదే గిన్నెలో చద్దన్నం అదే గంజిలో వేసి.. యాక్ ఏం ఖర్మ..హాయిగా బ్రెడ్ జాము, లేదంటే ఇడ్లి తింటారుగాని .. నా వల్ల కాదమ్మా”

ఎక్కడో విన్నానే ఈ మాటలు అన్నట్టు ఆవిడ వైపే తెల్లబోయి చూస్తున్న కోడల్ని చూస్తూ అంది ఆవిడ... “యూ ట్యూబ్ రి ప్లే చేసినట్టుందా! ఒక్కసారి ఫుల్ టర్నింగ్ ఇచ్చుకుని ఇరవై ఏళ్ల క్రితం మా ఇంటికి కాపురానికి వచ్చావే ఓ సారి అలా వెళ్లిరా గుర్తొస్తుంది ...” చెబుతూ విస విసా అక్కడినుంచి వెళ్తూ ఆవిడ అంటున్న మాటలు ఎకోలో వినిపించసాగాయి స్వప్నకి. “దిక్కుమాలిన యూ ట్యూబ్లో ఇలాంటి పాత చింతకాయ వంటలా చెప్పేది..”.

“గీ” టీ.వీ. -- డా. సి.హెచ్.సుశీల

ఏమివాయ్ మైడియర్ బ్రదరిల్లా వెంకటేశం! ముఖం వేలాడేశావ్! తెలుగు టీ.వీ. ఛానల్స్ లో సీరియల్స్ చూసి చూసి ఏడుపు అలవాటు అయ్యీ అయ్యీ చివరికి ఇలా ఏడుపుగొట్టు ముఖం యార్పడిపోయిందా! భేష్ ...నీకిదే బాగా సూటయింది.

నేనూ చూస్తూనేవున్నాను సీరియల్స్. వీటిల్లో కధేమిటి చెప్మా అని ఆలోచించడం శుధ్ధ వేష్ట్. సముద్రంలో నీటిబొట్టంత, వడ్లగింజలో ఆవగింజంత. ఓ లైన్ కధ తీసుకొని, దాన్ని సాగదీసి సాగదీసి సంవత్సరాల తరబడి తరువాయి భాగం....తరువాయి భాగం అంటూ మన తల తినేస్తారు. అసలు నేనే కాసులు గుమ్మరించే హిట్ సీరియల్ తీసిపారేద్దును. టెల్గు పీపుల్ కి నచ్చే. సీరియల్స్ వీడు తియ్యగలడా అని ప్రజలు డౌట్ పడ్తారా అని అనుకొంటున్నావా! మనవాళ్ళొట్టి వెధవాయ్ లోయ్. వాళ్ళకి నచ్చినవి, హిట్టయినవి నాలుగు తీసికొని అవే తిరిగేసి మరగేసి , మళ్ళీ వండేస్తే సరి.

ప్రొద్దుటే నాకో బ్రిలియంట్ ఐడియా వొచ్చింది. ది గ్రేట్ జీనియస్ గిరీశం గారు ఛానల్స్ రంగంలోకి జంప్ చేస్తే ఎలా వుంటుంది అని. ప్రొసీడ్అని నాకు నేనే భుజం తట్టుకున్నాను. మరి నేను స్టార్ట్ చేయబోయే ఛానల్ పేరేమిటో తెలుసా! “గీ” టీ.వీ. అంటే గిరీశం టీ.వీ. అన్నమాట.

అసలు విశేషం మర్చేపోతిని. అచ్చు నాకుమల్లే ఎమ్టీ రామారావు అనే మహానుభావుడు యాక్షన్ చేసాట్ట కన్యాశుల్కం అనే బైస్కోప్ లో. ఈరోజు ఈటివి లో 7pm కి వస్తాడట. చూడాలి ఎలా నన్ను ఇమిటేట్ చేసాడో! ముఖ్యంగా బుచ్చెమ్మ, మధురవాణి, పూటకూళ్ళమ్మ ఎలా వున్నారో! చూడాలి మరి. టైమౌతోంది. వెళ్తున్నా.... మళ్ళీ కలుద్దాం....బై బై...!”

Posted in August 2020, కథానికలు

5 Comments

  1. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రాజేశ్వరి గారి
    ‘ ఆగడం’ గల్పిక ప్రస్తుత కరోనా కాలాన్ని
    ప్రటిబింభి.స్తూ రాసినది.
    అందరి సమస్యల్లాంటి దే
    బామ్మ గారిదీ నూ.
    రచయిత్రికి
    శుభాకాంక్షలు.

  2. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సుశీల గారి
    ‘ గీ.టీవి’..గల్పిక బాగుంది.
    కన్యాశుల్కంలోని గిరీశం పాత్ర తొ
    పేరడీ చేయించారు,నేటి పరి స్థితి ని.
    రచయిత్రికి శుభాకాంక్షలు.

  3. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    విజయ లక్ష్మి గారి గల్పిక
    ‘ అలా వెళ్లిరా’ బాగుంది.
    ఇంటిలో ఇలాంటి హస్యపు జల్లులు
    ఒకప్పుడు సర్వసాధారణం.
    ఇప్పుడు అన్నీ మూఖీ సినిమాలే!
    రచయిత్రికి అభినందనలు

  4. AMBALLA JANARDAN

    గల్పికలు బాగున్నాయి. ఆయా రచయితలకు అభినందనలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!