Menu Close
Kadambam Page Title
ఆనందమె జీవిత మకరందం
-- వేణుగోపాల రావు, గుమ్మడిదల

ఆకాశంలోకారు మబ్బులమధ్యన రంగుల హరివిల్లు
అతిసుందరంగా విరిసిందని ముచ్చట పడుతూంటే
అదంతా కాంతి కిరణాల వక్రీకరణమే నంటాడు భౌతిక శాస్త్రవాది,నిజమేనేమో!
బొమ్మలాంటి అందమైన అమ్మాయి ముద్దమందారమై
కిసుక్కున నవ్వుతూ కవ్విస్తుంటే,కళ్ళు అప్పగించి మైమరిస్తే,
అదంతా భ్రమేనంటాడు వేదాంతి, నిజమేనేమో!

నునువెచ్చని ఇసుకలో చల్లటి సాగర అలలు ఘోషిస్తూ
పాదాలకి గిలిగింతలు పెడుతూ ఉంటే, ఆ ఆనందానుభూతి అంతా
చిదాకాశంలో మిధ్యేనంటాడొక  తత్వవేత్త, అదీ నిజమేనేమో!

శరీరానికి గాయమై రక్త మోడుతూ నెప్పితో వేధిస్తూంటే
అది అశాశ్వతమైన శరీరానికే కానీ ఆద్యంతాలులేని
ఆత్మ చైతన్యానికి కాదంటాడు అద్వైతి, బహుశాఅదీ నిజమేనేమో!

ఆకులలో కోయిలమ్మ వీనుల విందు చేస్తూ పరవశింపచేస్తుంటే,
అదంతాఅశాశ్వతం అంటాడు నిరాశావాది,
ఎగిరిపోతున్న పక్షిని చూపుతూ,నిజమే మరి!

అందాలతో విరబూసిన ప్రకృతిని పరవశించి చూడు,
సంగీత రాగ రంజితాల నిమ్నోన్నతాలలో తేలియాడు,
గాలిలో తేలి వచ్చే పుష్ప సుగంధాల నాఘ్రాణించి చూడు,    
చల్లని తెమ్మెరలు తెచ్చే అనుభూతికి జోహారు పాడు,
జీవిత ఆనంద మకరందపు మాధుర్యం చిలికి చూడు,
ఆనందమే కదా జీవిత మకరందం,అంటాడొక ఆశావాది,
అదే నిజం సుమా!

Posted in August 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!