Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఈ)

చూడా కర్మ

పురుష శిశువుకు పుట్టువెంట్రుకలు తొలగించి శిఖ (పిల్ల జుట్టు లేక పిలక) ను ఉంచడాన్ని చూడా కర్మ అంటారని ముందే చెప్పుకున్నాం. ద్విజులకు ఈ చూడా కర్మ మొదటి సంవత్సరం లేక మూడవ సంవత్సరం - వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం చెయ్యాలి.

పుట్టు వెంట్రుకలు తీయడం వల్ల ఆ తరువాత బాలునికి ఒత్తుగా బిరుసైన శిరోజాలు పెరుగుతాయి కనుక అది ప్రయోజనకరమే.

ఉపనయనం

గర్భధారణ సమయం నుంచి ఎనిమిదవ ఏట (అంటే జన్మించిన ఏడేళ్లకు) బ్రాహ్మణుడికి ఉపనయనం చెయ్యాలి. గర్భధారణ నుంచి పదకొండవ ఏట (అంటే పదేళ్ల వయస్సులో) క్షత్రియుడికి, గర్భధారణ కాలం నుంచి పన్నెండవ సంవత్సరంలో (అంటే పదకొండేళ్ల వయస్సులో) వైశ్యుడికి ఉపనయనం చెయ్యాలి.

వేదాలు అధ్యయనం చేసి, వాటి అర్థాలు గ్రహించడాన్ని బ్రహ్మ వర్చస్సు అంటారు. అలాంటి బ్రహ్మ వర్చస్సు ను పొందగోరే విప్ర కుమారునికి గర్భధారణ సమయం నుంచి ఐదవ ఏట (అంటే నాలుగేళ్ల వయసులో) ఉపనయనం చేయాలి.

‘చతురంగ బలో రాజా జగతీ వశమానయేత్‘ (చతురంగ బలములు కలిగిన రాజుకు జగత్తంతా వశమౌతుంది) అని ఆర్యోక్తి. హస్తి లేక గజబలం (ఏనుగులు), అశ్వబలం (గుర్రాలు), రథ బలం (శకటములు), కాల్బలం లేక పదాతిదళం - ఈ నాలుగింటినీ కలిపి చతురంగ బలాలు అంటారు. చతురంగ బలసంపన్నుడు కాగోరే క్షత్రియుడికి గర్భధారణ  కాలం నుంచి ఆరేళ్లకు (అంటే ఐదేళ్ల వయసులో) ఉపనయనం చేయాలి.

వైశ్యుని ధర్మాలు కృషి (వ్యవసాయం), పశుపోషణ, వాణిజ్యం మొదలైనవి. వాటిలో విజయవంతం కావాలని కోరుకునే వైశ్యుడికి గర్భధారణ కాలం నుంచి ఎనిమిదవ సంవత్సరంలో (అంటే ఏడవ ఏట) ఉపనయనం చెయ్యాలి.

ప్రాచీనకాలంలో వేదపాఠాలు చదివే వాడిని విప్రుడు అని మాత్రమే అనాలి. బ్రహ్మజ్ఞానిని మాత్రమే బ్రాహ్మణుడు అనాలి. ఇక్కడ (2-37)  శ్లోకం లో మనువు విప్ర శబ్దాన్ని ప్రయోగించినా, (2-36) శ్లోకంలో ఏడు సంవత్సరాల వయసున్న బాలుడిని బ్రాహ్మణ శబ్దంతోనే వ్యవహరించాడు. మనువు ఇలాంటి  పదప్రయోగమే తదుపరి కొన్ని శ్లోకాలలోనూ చేయడం గమనార్హం. దీనినిబట్టి మనువు కాలం నాటికే జ్ఞాన బ్రాహ్మణ్యం స్థానంలో జన్మబ్రాహ్మణ్యం స్థిరపడిందని మనం గ్రహించవచ్చు.

గాయత్రీ మంత్రోపదేశానికి అర్హమైన వయస్సు

ఆ షోడశాద్బ్రాహ్మణస్య సావిత్రీ నాతివర్తతే  |
ఆ ద్వావింశాత్ క్షత్రబంధోరా చతుర్వింశతేర్విశ : ||  (2 -38)

గాయత్రీ మంత్రం సవితృ (సూర్యుడి) గురించి చేసేది కనుక దానిని ‘సావిత్రి’ అని కూడా అంటారు. గర్భధారణ కాలం నుంచి బ్రాహ్మణుడికి పదహారేళ్లు నిండేవరకు, క్షత్రియునకు ఇరవై రెండేళ్లు నిండేవరకు, ‘విశ :’ అంటే వైశ్యునకు ఇరవై నాలుగేళ్లు నిండేవరకు సావిత్రి నశించదు. అంటే వారు ఆ యా వయస్సులు నిండే వరకు గాయత్రీ మంత్రానుష్ఠానానికి అర్హులే.

వ్రాత్యుడు అంటే ?

ఈ మూడు వర్ణముల పురుషులు ఆ యా నియమిత వయో పరిమితి లోపు ఉపనయనం చేయబడకపోతే, సావిత్రీ పతితులై అంటే గాయత్రి నుండి భ్రష్టులై, ఆర్యులచే విగర్హితులై అంటే శిష్టులచే నిందితులై, వ్రాత్యులని పిలువబడతారు. అంటే అర్హమైన వయస్సులో ఉపనయన సంస్కారం పొందనివాడు వ్రాత్యుడు అన్నమాట. (వ్రాత్యుడు అంటే తన వర్ణం నుంచి బహిష్కృతుడు (an outcast). ‘వ్రాత్యస్తోమము’ అనే యజ్ఞం చేసి ఒక వ్రాత్యుడు ప్రాయశ్చిత్తం చేసుకొని సంస్కారవంతుడై, తాను గతంలో సకాలంలో సంస్కారములు పాటించని కారణంగా కోల్పోయిన హక్కులను తిరిగి పొందవచ్చట. ఇక సమాజంలో కులపరంగా చూస్తే ఒక శూద్ర తండ్రికీ, క్షత్రియ తల్లికీ పుట్టినవాడిని ‘వ్రాత్యుడు’ అని వ్యవహరిస్తారు.)

ఒక బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తం చేసుకొని సంస్కారం పొందని అపవిత్రుడైన ఒక వ్రాత్యునితో ఎట్టి పరిస్థితులలోనూ (ఆపత్కాలంలోనైనా సరే) యజనయాజనాది బ్రాహ్మ సంబంధములు, కన్యాదానాది వర సంబంధములు కలుపుకొనరాదు.

బ్రహ్మచారి వస్త్రధారణ

‘కార్ష్ణము’ అంటే కృష్ణసార మృగము లేక నల్ల ఇఱ్ఱి (The Black Antelope) యొక్క చర్మమును బ్రాహ్మణ బ్రహ్మచారి ఉత్తరీయము (అంటే నడుముకు పై భాగాన్ని కప్పే బయిరవాసము- An upper garment ) గా ధరించాలి. రౌరవము (రురువు అని పిలువబడే నల్ల చుక్కల దుప్పి- Spotted Deer- చర్మము) ను క్షత్రియ బ్రహ్మచారి ఉత్తరీయముగా ధరించాలి. బాస్త అంటే పోతు మేక చర్మాన్ని వైశ్య బ్రహ్మచారి ఉత్తరీయంగా ధరించాలి.(‘బాస్తికమ్’ అనే సంస్కృత శబ్దానికి ‘మేకల మంద’ అని అర్థం). ఇక నడుముకు కింది భాగమునకు ఆచ్ఛాదనగా, నడుముచుట్టూ ధరించే వస్త్రము (Lower Garments) విషయానికొస్తే  బ్రాహ్మణ బ్రహ్మచారి నార వస్త్రమును, క్షత్రియ బ్రహ్మచారి తెల్లటి పట్టుబట్టను, వైశ్య బ్రహ్మచారి ఉన్ని వస్త్రమునూ ధరించాలి.

మొలతాడు

బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ‘మౌంజీ’ అంటే ముంజ గడ్డితో పేనిన, శ్లక్ష్ణమైన అంటే మెత్తని,నున్నగా మెరుస్తూ ఉండే, త్రివృత్సమా (మూడు పేటల) మేఖలా (మొలతాడును) కట్టుకోవాలి. క్షత్రియుడు ‘మౌర్వీ’ అంటే ముర్వ అనే గడ్డితో పేనిన మొలతాడునూ, వైశ్య బ్రహ్మచారి శణ తంతులతో (జనుపనారతో) పేనిన మూడు పేటల మొలతాడునూ ధరించాలి.

ముంజ గడ్డి దొరకనప్పుడు బ్రాహ్మణుడు ‘కుశ’ అంటే దర్భతో మూడు పేటలుగా పేనిన ఒంటి ముడి కలిగిన మొలతాడును కట్టుకోవాలి. అలాగే క్షత్రియుడు ముర్వ గడ్డి దొరకనప్పుడు ‘అశ్మంతక’ అంటే రెల్లుగడ్డితో ముప్పేట పేనిన మూడు ముడులుగల మొలతాడును ధరించాలి. అదే విధంగా వైశ్యుడు జనుపనార లభించని పక్షంలో ‘బల్బజా’ అంటే తుంగగడ్డితో మూడు పేటలుగా పేనిన ఐదు ముడులు కలిగిన మొలతాడు కట్టుకోవాలి.

యజ్ఞోపవీతము - దండము

సంస్కృత భాషలో ‘కార్పాసి’ అంటే పత్తి చెట్టు. కార్పాసము అంటే పత్తి అనీ, పత్తి నూలుతో తయారైన వస్త్రమనీ అర్థం.

ఒక బ్రాహ్మణుడు కార్పాసము అంటే పత్తి నూలుతో తయారైన ఉపవీతాన్ని ధరించాలి. క్షత్రియుడు శణ సూత్రములతో అంటే జనపనార పోగులతో చేసిన, వైశ్యుడు అవికా అంటే ఆడ మేక (Ewe) బొచ్చుతో పేనిన దారపు పోగులతో చేసిన జందెము  వేసుకోవాలి. ఈ మూడు వర్ణాల వారు ధరించే యజ్ఞోపవీతము తొమ్మిది పోగులు కలిగినదిగా ఉండాలి. అది దక్షిణావర్తితముగా అంటే ఎడమ బుజాన్నుంచి కుడి వైపు నడుమువరకు ఉండే విధంగా ధరించాలి.

ఇక బ్రహ్మచారి దండం ఎలా ఉండాలో చెపుతున్నాడు మనువు.

బ్రాహ్మణో బైల్వ పాలాశౌ క్షత్రియో వాటఖాదిరౌ |
పైలవౌదుంబరౌ వైశ్యో దండానర్హంతి ధర్మతః   ||    (2- 45)

బ్రాహ్మణ బ్రహ్మచారి ధరించే దండం బైల్వ అంటే బిల్వ (మారేడు) వృక్షపు లేక పాలాశౌ అంటే పలాశ (మోదుగు) వృక్షపు కొమ్మ నుంచి తయారుచేసినట్టిదై ఉండాలి. క్షత్రియుడు ధరించే దండం వాట అంటే వట వృక్షం (మర్రి చెట్టు) లేక ఖాదిరౌ అంటే ఖదిర  (చండ్ర) వృక్షపు కొమ్మతో తయారైనదిగా ఉండాలి. ఇక వైశ్యుడు ధరించే దండం పైలవ అంటే పీలు వృక్షం కొమ్మనుండి గాని లేక ఔదుంబరౌ అంటే ఉదుంబర వృక్షం (మేడి చెట్టు) కొమ్మనుంచి గానీ తయారైనదిగా ఉండాలి.

ఇక్కడ సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి తమ వ్యాఖ్యానంలో ‘పీలు’ అంటే జువ్వి చెట్టు అని ఇచ్చారు. అయితే అది తప్పు. జువ్వి, పీలు - ఈ రెండూ వేర్వేరు వృక్షాలు. జువ్వి చెట్టు (Ficus infectoria ) ను సంస్కృతంలో ‘ప్లక్ష’, ‘సుపార్శ్వ’ అనే పేర్లతో పిలుస్తారు. పీలు వృక్షం శాల్వడోరేసీ ( Salvadoraceae) కుటుంబానికి చెందిన వృక్షం. Salvadora oleoides అనే శాస్త్రీయనామం కలిగిన ‘పెద్ద పీలు వృక్షం’ కాక అదే కుటుంబానికి చెందిన Salvadora persica అనే శాస్త్రీయనామం కలిగిన ‘చిన్న పీలు’ (ఛోటా పీలు) కూడా ప్రసిద్ధమే. ఈ చిన్న పీలు వృక్షం జన్మస్థలం పర్షియా దేశం. దీనిని పర్షియన్ భాషలో మిస్వాక్ (Miswak) అనీ, ఆంగ్ల భాషలో ‘Tooth Brush Tree’ అనీ అంటారు. తెలుగులో ‘వరగోగు’ అని కొందరూ, ‘గునియా’ అని కొందరూ పిలిచే ఈ వృక్షాన్ని కన్నడంలో ‘గోని మర’ అంటారు. ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలు కలిగిన ఈ చిన్న పీలు వృక్షం కాండం బెరడు నుంచి తయారుచేసిన ‘మిస్వాక్ టూత్ పేస్ట్’  మార్కెట్లో లభిస్తుంది.

బ్రాహ్మణ వటువు ధరించే దండం నేల నుంచి కేశాంతికముగా ఉండాలి. అంటే అది అతడి శిరోజముల చివళ్ళను తాకేటంత పొడవుగా ఉండాలి. క్షత్రియుడు ధరించే దండం లలాట సంమితముగా అంటే అతడి నుదురును తాకేటంత పొడవుగా ఉండాలి. ఇక వైశ్య బ్రహ్మచారి ధరించే దండం నాసాంతికముగా అంటే అతడి ముక్కు కొనను తాకేటంత పొడవుగా మాత్రమే ఉండాలి.

బ్రహ్మచారులు ధరించే దండములు సొగసుగా, వంకరలు, గంట్లు లేనివిగా, మనుష్యులను భయపెట్టనివిగా, వాటి కాండం పై పట్టతో కూడినవిగానూ, ‘న అగ్ని దూషితా’ అంటే  అగ్నిలో కాల్చబడనివిగా, వాటిపై ఎలాంటి కాలిన గుర్తులూ లేనట్టివిగానూ ఉండాలి.

ప్రతి రోజూ బ్రహ్మచారి తనకు ఇష్టమైన దండాన్ని చేతబూని, సూర్యోపాసన చేసి, అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి, తనకు ఉద్దేశించిన నియమాల ప్రకారం భిక్షాటన చేయాలి. భిక్షాటనలోనూ, భోజనములోనూ ఒక బ్రహ్మచారి పాటించవలసిన విధులను గురించి తరువాత తెలుసుకుందాం.

***సశేషం***

Posted in August 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!