Menu Close
Page Title

10. ఆంధ్రుల ఆరాధ్య దైవం

ఆ. మధుర సంగీతంతో రాముణ్ణి కొలుచుకున్న వాగ్గేయకారులు:

Annamacharyaతాళ్ళపాక అన్నమాచార్య ( 1408- 1503): ఆంధ్ర పద కవితామహుడైన అన్నమయ్య అలవోకగా కూర్చిన 32,000 కీర్తనలలో మనకి దక్కినవి పన్నెండు వేలే అయినా ప్రతి ఒక్కటి ఆణిముత్యమై శ్రీవేంకటేశ్వరుని పాదపద్మాలను అలరించాయి. వాటిలో 800 పైచిలుకు కీర్తనలకు  సంగీత కళానిధి మంగళంపల్లి బాలమురళికృష్ణ, 600 కీర్తననలకి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, బాణినికట్టి సాధారణ ప్రజలు పాడుకునేటట్లు చేశారు. వాటిలో రాముని కీర్తించే బహుళ జనాదరణ పొందిన పాటలు కొన్ని: రాంచంద్రుడితడు రఘువీరుడు; రాజీవనేత్రాయ రాఘవాయ నమో;  రామ దశరథ రామ; రామభద్ర రఘువీర; రామ మిందీవర రామ రామచంద్ర; రాముడు రాఘవు; రాముడు లోకాభిరాముడందరికి; రాముడు లికాభిరాముడు త్రైలోక్య;  రాజీవనేత్రాయ అవధారు రఘుపతి అందరిని చిత్తగించు.

Ramadasuభక్త రామదాసు (1620-1680): నెలకొండపల్లిలో కామాంబ, లింగన్న మంత్రులకు జన్మించి, కంచెర్ల గోపన్న గా పెరిగిన భక్త రామదాసు, పాలవంచ పరగణాలకి శిస్తు వసూలు అధికారిగా పనిచేస్తూ,  భద్రునికి సాక్షాత్కరించి, ఎండకు ఎండి వానకు తడుస్తూ అక్కడే వెలసి, కడుబీదరాలు దమ్మక్క సేవించుకొంటున్న రామ సీతా లక్ష్మణుల విగ్రహాలకి గుడి కట్టించాలనే నిర్ణయంతో శిస్తు గా వసూలు చేసిన మొత్తము సరిపోక భక్తజనుల ఆర్ధిక సహాయంతో పూర్తి చేశాడట.  తానీషా అది అప్పుగా నిర్ణయించి తీర్చలేకపోయిన గోపన్నను చెరసాల లో వేసి, పన్నెండు ఏళ్ళు చెరసాలలో ఉంచగా రామ లక్ష్మణులు ఆరు లక్షల బంగారు నాణాలను తానీషాకి ఇచ్చి అప్పు తీర్చి అతనిని విడిపించారట.  చెరసాలలో ఉన్నప్పుడు మరియు అంతకు ముందు, తరువాత కూడా గోపన్న పాడిన గీతాలు మరో గొప్ప ఉత్తర భారత భక్తకవీంద్రుడు కబీరుదాస్  ని కదిలించి అతడిని ‘రామదాసు’ బిరుదాంకితుడిని చేశాయి. వాటిని పాడి వాగ్గేయకారుడైన రామదాసు ధన్యుడు. ఆతని కీర్తనలు విన్నవారి తనువులు భక్తి పారవశ్యంతో పులకింప చేస్తాయి.

అంతా రామమయం బీజగమంతా రామమయం;
అంతరంగమున ఆత్మారాముడ ; నంతరూపముల వింతలు సలుపఁగ |
సోమసూర్యులును సురలు తారలను ; ఆ మహాంబుధుల అవనీజంబులు       ||అంతా||
అండాండంబులు పిండాండంబులు ;  బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ |
నదులు వనంబులు నానా మృగములు ; విదిత కర్మములు వేద శాస్త్రములు         ||అంతా||
ఆష్టదిక్కులును ఆదిశేషుడును ;  అష్టవసువులును అరిషద్వర్గము |
ధీరుడు భద్రాద్రి రామదాసుని ; కోరిక లొసగెడు తారక నామము             ||అంతా||

'దాశరథీ కరుణాపయోనిధీ' అనే మకుటంతో వ్రాసిన దాశరథీ శతకం ఈ నాటికీ తెలుగు వాళ్ళచే ఉదాహరించబడుతోంది. మచ్చుకు:

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ

ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.

Tyagarajaత్యాగరాజు (కాకర్ల త్యాగబ్రహ్మం) (1767-1847): రామబ్రహ్మమం సీతమ్మలకు మూడవ సంతతి గా తిరువారూర్ లో జన్మించి  చిన్నతనంనుంచి సంగీతం పై మక్కువ పెంచుకుని తాతగారి వద్ద లభించిన తాళపత్రగ్రంధాలలో నారదముని గురించి చదివి, ఆతనినినే మానసిక గురువు గా ఎంచుకుని శొంఠి వేంకటరమణయ్య గారి శిష్యరికంలో సంగీతకళానిధి గా ఎదిగి సంగీత ప్రపంచములోనే ఉన్నత స్థితిని సాధించిన వాగ్గేయకారుడు. త్యాగయ్య వ్రాసి పాడిన పాటలు ముఖ్యంగా తెలుగులోనే అయినా కొన్ని సంస్కృతంలోను రాణించాయి. అయన తెలుగు ఎంత భావ గర్భితమైనది, ఉత్కృష్టమైనదంటే ఏ ఒక్క పదాన్ని మార్చ వీలుకాదు. అయన వ్రాసిన వేల కృతులలో ఉదాహరణకు కొన్ని:

  • 'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' -శ్రీ రాగం, ఆది తాళం
  • 'రాగసుధారస పానము జేసి రాజిల్లవే ఓ మనసా' ఆందోళిక, ఆది
  • 'నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా పల్కు మనసా '- కళ్యాణి, మిశ్ర చాపు
  • 'తెర తీయగరాదా' -గౌళి పంతు రాగం, ఆది
  • 'వందనము రఘునందన సేతు బంధన భక్తచందన రామా' -సహన రాగం ఆది
  • 'హెచ్చరికగా రారా హే రామచంద్ర' - యదుకుల కాంభోజి రాగం ఖండ చాపు
  • 'నగుమోము గనలేని నాజాలి తెలిసి ననుబ్రోవగరాదా శ్రీ రఘువర నీ' - ఆభేరి ఆది
  • 'రార మాఇంటిదాక రఘువీరా సుకుమార మ్రొక్కెదరా' - అసావేరి రాగం ఆది
  • 'బంటురీతి కొలు' - హంస నాదంరాగం, ఆది
  • చక్కని రాజమార్గములుండగఁ సందులదూఱనేల ఓ మనసా' - ఖరహర ప్రియా రాగం, ఆది
  • 'దైవము సుఖమా అద్వైతము సుఖమా' - రీతి గౌళ రాగం - ఆది
  • 'ఏమని పొగడుదురా శ్రీరామ నిన్నేమని ' - వీరవసంత రాగం, ఆది
  • 'మరుగేలరా ఓ రాఘవ ' -జనతా శ్రీ రాగం అది;
  • 'మోక్షముగలదా భువిలోన జీవన్ముక్తులు కాని వారలకు' - సారమతి రాగం, ఆది

త్యాగయ్య తెలుగు వాడై పుట్టడం తెలుగుభాష చేసుకున్న సుకృత ఫలం.

Mangalampalli Balamuralikrishnaమంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930-2016): అనంత సృజనాత్మక శక్తి తో భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన దురంధరుడు శ్రీ బాలమురళీకృష్ణ. గణపతి, సర్వశ్రీ (త్రిశతి), మహతి, లవంగి, సిద్ధి, సుముఖం, ఓంకారము , రోహిణి , మోహనగన్ధి , మురళి మనోరమ జనసమ్మోదిని, వల్లభి ప్రతిమధ్యావతి, మోహనాంగి మొదలుగాఁగఁల స్వయంకృత రాగాలతో  మరియు 72 మేళకర్త రాగాలలో దాదాపు 400 కొంగ్రొత్త కృతి, వర్ణ , తిల్లాన , భావగీతాల  కూర్పులని మూడు మరియు నాలుగు స్వరాలలో సరికొత్త తాళ పద్దతిని మలచిన ఘనుడు. సంగీత కళానిధి, సంగీత కళాశిఖామణి గా భాసించిన బాలమురళీకృష్ణని భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదు తో సత్కరించి తనను తాను గౌరవించుకుంది.

సంగీతాకాశంలో మెరిసి, చిరస్థానాన్ని పొందిన తెలుగు వారు మరికొందరున్నారు. వారు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.

ఇ. చిత్రలేఖనం

Damerla Ramaraoదామెర్ల రామారావు (1897-1925): రాజమహేంద్రవరం లో వైద్యకుటుంబంలో పుట్టి చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి 28 ఏళ్లకాలమే జీవించిన గొప్ప కళాకారుడు. అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు 'గోదావరి అఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ' అనే రంగుల చిత్రాన్ని చూసి మెచ్చుకొని కొనుక్కున్నాడట. రాజమండ్రి లోనే 'చిత్ర కళాశాల' అనే చిత్రలేఖనా పాఠశాల ప్రారంభించి చాలామంది కి ఆ కళలో తర్ఫీదు ఇచ్చాడు. అక్కడే 'భారత దేశ చిత్ర ప్రదర్శనం' నిర్వహించాడు. 'సిధార్థ రాగోదయం', 'పుష్పాఅలంకరణ', 'కార్తీక పొర్ణమి', ఋష్య శృఙ్గభంగం' తూర్పు కనుమల్లో గోదావరి' చిత్రాలు చాలా ప్రసిద్ధములయ్యాయి.

బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) (1933- 2014): అందమైన అమ్మాయి కనిపిస్తే 'బాపు బొమ్మలా' ఉందని అందడం ఈకాలపు ఆనవాయితీ. బాపు బొమ్మ, బుడుగు రెండుజెళ్ళ సీతలని వినని తెలుగు వాడు బహుశా ఉండరేమో. ఆయన తీసిన సాక్షి, సీతాకళ్యాణం, త్యాగయ్య, శ్రీనాధ కవిసార్వభౌమ, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం, సంపూర్ణ రామాయణం, ముత్యాలముగ్గు  వంటి కళా చిత్రాలకి ప్రత్యేకత ఉండి అనేక బహుమతుల గెలుచుకున్నాయి.

Bapu picture gallery

చిత్రకారుడిగా, కార్టూనిస్ట్ గా, చలనచిత్ర స్క్రీన్ ప్లే రైటర్ గా దర్శకుడి గా, పుస్తక రచయితగా అనేక దేశ  విదేశ బహుమానాలని సంపాదించుకున్నాడు. ఫోర్డ్ ఆర్ట్ ఫౌండేషన్ కి సలహాదారుగా, పిల్లల పుస్తకాలకి యునెస్కో డెలిగేట్ గాను చాలా సమర్ధవంతం గా చేసి ఖ్యాతి నార్జించాడు. అతి సన్నిహితుడైన రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి ద్వంద కళాకారులుగా ఎనలేని ఖ్యాతి నార్జించారు.

Bapu picture gallery

వడ్డాది పాపయ్య (1921-1992): శ్రీకాకుళంలో పుట్టిన వడ్డాది పాపయ్య చాలా విచిత్ర వ్యక్తిత్వం గల మితభాషట. తన సమాజములోనే ఆయనతో అంతగా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు లేరట. అయన ఎక్కువగా ‘యువ’, ‘చందమామ’, ‘స్వాతి’ పత్రికలకి చిత్రాలు గీశారు. చాలారోజులు మదరాసులోను చివరి కొద్ది ఏళ్ళు వారమ్మాయి దగ్గర అనకాపల్లి వద్ద కశింకోటలో గడిపారట. ఆయన పోయిన తరువాత ఆయన కోరిక ప్రకారం ఎవరికి తెలియకుండానే చివరి సంస్కారాలు జరిగిపోయాయట.

Vaddadi Paapayya

-o0o-

Posted in August 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!