Menu Close
ఒక ‘పిట్ట’ కథ
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

అది సూర్యోదయమవుతున్న సమయం. నెమ్మదిగా తెల్లవారుతూ ఉంది.

అప్పుడప్పుడే వస్తూ ఉన్న తన బుజ్జి బుజ్జి రెక్కలను దగ్గరగా ముడుచుకుని, వెచ్చగా నిద్రపోతున్న ఒక బుల్లి పిట్టపై నులివెచ్చని సూర్యకిరణాలు పడగానే, అది మెల్లిగా కళ్ళు తెరిచి, చిటారుకొమ్మపై ఉన్న తన గూట్లోంచీ కిందికి తొంగి చూసింది.

ఉదయిస్తున్న భానుడి బంగారు కిరణాలలో ఆ ప్రాంతమంతా ఎంతో అందంగా కనబడింది ఆ పిట్టకి!

ఎటు చూసినా దట్టంగా పెరిగిన పచ్చటి చెట్లూ… ఆ చెట్లకొమ్మల మధ్య అటూ ఇటూ ఎగురుతున్న రకరకాల పక్షులు… అవి చేసే కిలకిలా రావాలూ… అన్నీ కలిసి అక్కడి ప్రకృతి అందానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి.

మధ్య మధ్యలో వీస్తున్న చల్లటి గాలిని హాయిగా అనుభవిస్తూ, అక్కడి అందమైన ప్రకృతిని ఆశ్చర్యంగా చూస్తున్న పిట్టకు అంతలో ఆకలేసింది. కానీ, ఆ పిట్టకు ఆకలిగా ఉందని పూర్తిగా తెలిసేలోపే ఆ పిట్ట తల్లి ఎక్కడినుంచో ముక్కుతో కొన్ని గింజలు పట్టుకుని వచ్చి దాని నోట్లో పెట్టింది.

'అబ్బ! ఎంత రుచిగా ఉన్నాయో!', అనుకుంది పిట్ట.

ఇంకొన్ని కావాలన్నట్టు తల్లి వంక చూసింది. తల్లి పిట్ట రివ్వున ఎగిరి ఎటో వెళ్లి కొద్దిసేపట్లో ఇంకొన్ని గింజలు ముక్కుతో పట్టుకుని వచ్చి పిట్ట నోట్లో పెట్టింది. వాటి రుచిని ఆస్వాదిస్తూ తింటున్న పిట్టకు ఒక సందేహం కలిగింది.

వెంటనే, "అమ్మా! ఇంకెన్ని గింజలున్నాయ్?", అని తల్లిపిట్టను అడిగింది పిట్ట.

"ఇంకొన్ని తెమ్మంటావా?", అడిగింది తల్లి పిట్ట.

"ఇప్పుడే వద్దు. నా కడుపు నిండిపోయింది. కానీ నాకు మళ్ళీ ఆకలి వేసే సమయానికి నువ్వు తీసుకొచ్చే చోట గింజలు అయిపోతేనో?", తల్లి వంక అమాయకంగా చూస్తూ కాస్త కంగారుగా అడిగింది పిట్ట.

ఆ ప్రశ్న విన్న తల్లిపిట్టకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అటువంటి సందేహం తనకెప్పుడూ కలగలేదు.

అయితే పిట్ట పడుతున్న కంగారును అర్ధం చేసుకుని, "చిట్టి తల్లీ..! ఒకసారి మన గూటిలోంచి బయటకు చూడు! ఆ కనబడే పచ్చదనమే ప్రకృతిమాత. మనం ఆ ప్రకృతిమాత పిల్లలం. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్రకృతిమాత ఆహారాన్ని అందిస్తుంది! గింజలైపోతాయేమో అన్న భయం నీకు అస్సలక్కర్లేదు. మనముండే ఈ ప్రాంతానికి పక్కనే బోలెడు పొలాలున్నాయి. అవన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. మనకు కావలసినన్ని గింజలు అక్కడినుండి ఏరుకుని తెచ్చుకోవచ్చు! నీకు రెక్కలొచ్చిన తరువాత ఆ పొలాలు చూపిస్తాగా!", అని చెప్పింది తల్లిపిట్ట.

అది విని పిట్ట 'హమ్మయ్య' అనుకుని తన తల్లి రెక్కలలోకి దూరిపోయింది. తల్లిపిట్ట కూడా పిట్ట చుట్టూ తన మెత్తటి రెక్కలు కప్పి గుండెకి హత్తుకుని ప్రేమగా పిట్ట తలపైన ముద్దుపెట్టుకుంది.

'అమ్మ ప్రేమ ఎంత మధురం!', అనుకుంది పిట్ట!

కొద్ది రోజులు గడిచాక పిట్టకు రెక్కలొచ్చాయి.

"అమ్మా! నేను ఎగరగలుగుతున్నా! చూడు!", అంటూ కొమ్మల మధ్య హుషారుగా అటూ ఇటూ ఎగురుతూ అరిచింది పిట్ట.

తల్లిపిట్ట సంతోషించి, "ఇంక నీ ఆహారం నువ్వే తెచ్చుకోవాలి. నీ గూడు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి!", అంది.

కొత్తగా వచ్చిన రెక్కలతో స్వేచ్ఛగా ఆ ప్రాంతమంతా ఎగురుతూ కలియతిరిగింది పిట్ట. తల్లి చెప్పినట్టుగానే తన ఆహారం తనే వెతుక్కుని తినడం మొదలుపెట్టింది. ఆ అనుభూతి చాలా ఆనందంగానూ, గొప్పగానూ అనిపించింది పిట్టకు. ఇక తన సంతోషాన్ని, స్వేచ్ఛనీ ఎవ్వరూ ఆపలేరని అనుకుంది.

అక్కడున్న చెట్లన్నిటిలోకీ పొడవుగా ఉన్న ఒక చెట్టు ఎంచుకుని ఆ చెట్టుకున్న చిటారు కొమ్మలలో తన గూడు కట్టుకుంది పిట్ట. పుల్లలు, పుడకలూ ఒక్కొక్కటిగా ఏరి అంత ఎత్తుకి తీసుకుని వచ్చి గూడు కట్టడం కొంచెం కష్టం అనిపించినా అక్కడైతేనే ప్రతి ఉదయం  ప్రకృతి అందాన్ని మరింతగా ఆస్వాదించొచ్చు అని అనుకుంది పిట్ట.

రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు తెల్లవారుఝామున తన గూట్లో పడుకుని ఉన్న పిట్టకు ఎందుకో వేడిగా, ఉడుకుగా అనిపించింది. మునుపటిలా చల్లటి గాలి వీచడం లేదు. ఎందుకా అని గూట్లోంచి బయటకు తొంగి చూసింది పిట్ట. ఆ ప్రాంతంలో పచ్చదనం తగ్గిపోయింది! పూర్వమున్న పచ్చటి చెట్లు చాలావరకూ మాయమైపోయాయి!

'ఓ! నాకు ఇంతక ముందుకన్నా ఇప్పుడు ఆహారం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం పట్టడానికి అసలు కారణం ఇదేనా?!! ఇదివరకు ఇక్కడికి దగ్గర్లో చాలా పంటపొలాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఎవరో మనుషులు ఇళ్ళు నిర్మించుకున్నారు! అందుకే నాకిష్టమైన గింజలు దొరకడం కష్టంగా ఉంది! అయినా నన్ను కాపాడేందుకు ప్రకృతిమాత ఉందిగా!', అనుకుని ఆహారం కోసం వెళ్ళిపోయింది పిట్ట. తిరిగి గూడు చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది. అలిసి పోయిన పిట్ట, 'ఇవాళ సరిగ్గా గింజలు దొరకలేదే!', అని అనుకుంటూ అర్ధాకలితో నిద్రపోయింది.

మరుసటి రోజు, ఎప్పటిలాగా సూర్య కిరణాల స్పర్శవల్ల కాకుండా, ఒక పెద్ద శబ్దంతో కలిగిన అదురుకి ఉలిక్కిపడి లేచింది పిట్ట!

అది ఉన్న గూడంతా ఎందుకో ఉన్నట్టుండి అదిరిపోతోంది!

'భూకంపం కాబోలు!!', అనుకుని గూట్లోంచి బయటకు తొంగి చూసింది పిట్ట. ఆ ప్రాంతంలో మిగిలిన కొద్దిపాటి పచ్చటి చెట్లు నేలపై అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి! ఆశ్చర్యపోయింది పిట్ట! భయంతో అది ఉంటున్న చెట్టు మొదలుకు దృష్టి సారించింది. అక్కడి దృశ్యం చూసిన పిట్టకు గుండె గుభేల్ మంది!

ఎందుకంటే ఎవరో మనుషులు ఆ పిట్ట ఉంటున్న చెట్టు మొదలును ఏదో యంత్రంతో నరికేస్తున్నారు!

'ఆమ్మో!!', అని రివ్వున గాల్లోకి ఎగిరింది పిట్ట. అంతెత్తు చెట్టు ఒక్కసారిగా పెద్ద చప్పుడు చేస్తూ నేలకొరిగింది. ఆ చెట్టుతో పాటే పిట్ట ఎంతో శ్రమకోర్చి అపురూపంగా కట్టుకున్న గూడు కూడా నేలపై చెల్లా చెదరుగా పడిపోయింది!

అది చూసి తట్టుకోలేకపోయింది పిట్ట.

'అయ్యో! నా గూడు! నా గూడు!', అని బాధపడుతూ ఆ పిట్ట ఎక్కడ వాలాలో తెలియక చాలాసేపు అక్కడక్కడే చక్కర్లు కొడుతూ ఉండిపోయింది!

'నేను ఎగరడం ఒక్క నిమిషం ఆలస్యమైతే నా పరిస్థితి ఏమయ్యేదో!', అని అనుకుంటూ ఆకలిగా ఉందని పొలాల వైపు వెళ్ళింది పిట్ట. ఒకప్పుడు పచ్చగా ఉన్న పంట పొలాలు ఇప్పుడు ఎందుకో ఎండిపోయాయి. వెతకగా వెతకగా కొన్ని గింజలు కనబడ్డాయి పిట్టకు.

సాయంత్రమయ్యేసరికి, 'ఇక నావల్ల కాదు! ఇంటికెళ్లి పడుకుంటా!', అని తన గూడున్న ప్రాంతానికి చేరుకుంది పిట్ట. అప్పుడుకానీ చెట్టు విషయం గుర్తుకు రాలేదు పిట్టకి!

‘ఇంకెక్కడి గూడు?!!', అని నిట్టూరుస్తూ పిట్ట ఆ రాత్రికి పొలంలో పెరిగిన పిచ్చి మొక్కల గుబురులో తల దాచుకుంది.

పోనుపోనూ పూట గడవడం కష్టంగా మారింది పిట్టకు. ఎండలు బాగా పెరిగిపోయి పంటలన్నీ బీడు భూములుగా మారిపోయాయి. ఒకప్పుడు పిట్ట గూడు కట్టుకున్న చెట్టు స్థానంలో ఇప్పుడు పది అంతస్తుల భవనమొకటి వెలిసింది.

ఒక రోజు పగలంతా ఎర్రటి ఎండలో ఎంత వెతికినా ఆహారం దొరకలేదు పిట్టకి. సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన ఆకలితో, దాహంతో, ఇక ఎగరడానికి ఏమాత్రం ఓపిక లేక సొమ్మసిల్లి ఒక ఇంటి ఆవరణలో పడిపోయింది పిట్ట!

కాసేపయ్యాక ఎవరో తనను నిమురుతున్నట్టు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడొక పాప పిట్టను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తోంది.

'అయ్యబాబోయ్ మనుషులు!', అని పిట్ట భయపడ్డా ఎగిరే ఓపిక లేక అలాగే ఉండిపోయింది.

ఆ పాప కొన్ని చుక్కల నీళ్లు పిట్ట నోట్లో పోసాక అది కాస్త తేరుకుని నేలపై నిలబడగలిగింది. అప్పుడు ఎవరో ఒక పెద్దావిడ ఆ పాపకు ఒక గిన్నె ఇవ్వడం కనబడింది పిట్టకు.

ఆ పాప ఆ గిన్నెను పిట్ట ముందు ఉంచి, "ఊఁ! తిను!", అంది.

ఆ గిన్నెలోకి చూసిన పిట్టకు ప్రాణం లేచొచ్చింది.

‘ఆహా! నాకిష్టమైన గింజలు! చూసి ఎంత కాలమైంది ?’, అనుకుంటూ ఆబగా ఆ గింజలన్నీ తినేసింది.

పిట్ట పొట్ట నిండి అది తృప్తిగా పాప వంక చూసింది. పాప పిట్టను తన చిట్టి చేతులలోకి తీసుకుని దాని తలపైన ముద్దు పెట్టుకుంది. పిట్టకు ఒకప్పుడు తల్లిపిట్ట చూపిన 'అమ్మ ప్రేమ' గుర్తుకు వచ్చింది!

సంతోషంతో పిట్టకు ఎక్కడలేని ఓపిక వచ్చి, అది పైకి ఎగిరి, పక్కనున్న గోడపై వాలింది. పాప నవ్వుతూ చెయ్యి ఊపింది. పిట్ట కృతజ్ఞతతో పాపవంక చూసి, 'ఇక సెలవు!', అని గాల్లోకి ఎగిరింది.

ఎటువెళ్ళాలా అని అనుకుంటున్న పిట్టకు తన చిన్ననాటి స్నేహితురాలైన గోరింక కనబడింది.

"మిత్రమా!", అంటూ గోరింకను పలకరించి తన గోడంతా వెళ్లబోసుకుంది పిట్ట.

అప్పుడు గోరింక, "నా పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. అయినా నువ్వు నీవంటి పక్షులుండే ప్రాంతానికి వెళ్లిపోవచ్చుగా? ఇక్కడెందుకు ఉన్నావ్?", అని అడిగింది.

అసలు అలాంటి ప్రాంతమొకటి ఉంటుందని పిట్టకు తెలియదు.

ఆ ప్రాంతం గురించి గోరింకను అడిగితే, "ఇక్కడికి ఉత్తరదిశగా వెడుతూ ఉంటే ఒక చోట కాస్త ఎక్కువగా చెట్లు కనబడతాయి. అక్కడ నీ జాతికి చెందిన పిట్టలు చాలా ఉన్నాయి. బహుశా నీక్కావలసిన ఆహారం కూడా అక్కడ దొరుకుతుందేమో!", అంది గోరింక.

"ఎంత చల్లటి మాట చెప్పావ్! నేనిప్పుడే వెడతాను!", అంటూ బయలుదేరబోతున్న పిట్టతో, "బాగా చీకటి పడింది. నాకు తెలిసీ ఆ ప్రాంతం ఇక్కడికి కొంచెం దూరం. వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టచ్చు. పైగా గాలీ-వానా వచ్చేట్టు ఉంది. ఈ రాత్రికి నాతో ఉండి రేప్పొద్దున్న వెడుదువుగానిలే!", అంది గోరింక.

సరేనని గోరింక దగ్గరే పడుకుంది పిట్ట. ఆ రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఏళ్ళుపూళ్ళు ఏకమయ్యేంత భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు తెల్లవారుతూనే వాన వెలవడంతో గోరింక చెప్పిన ప్రాంతానికి బయలుదేరింది పిట్ట. కానీ వెళ్లేముందు ఒక్కసారి తను గతంలో గూడు కట్టుకున్న చెట్టు ఉన్న ప్రాంతం చూడాలని అనిపించింది  పిట్టకు. ఆ ప్రాంతానికి వెళ్లి చూసిన పిట్టకు అమితాశ్చర్యం కలిగింది!

ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండాల్సిన చెట్టు లేదు సరికదా కొత్తగా కట్టిన పదంతస్తుల భవనం కూడా లేదు!

గాల్లో ఎగురుతూ కిందికి చూసిన పిట్టకు ఆ భవనం కుప్పలా కూలి ఉండటం కనబడింది!

అది చూసిన పిట్టకు గతంలో చెల్లాచెదరుగా పడిపోయిన తన గూడు గుర్తుకు వచ్చింది.

అప్పుడు పిట్ట, "అమ్మ చెప్పింది నిజమే. ప్రకృతిమాత ఈ భూమిలోని ప్రాణులందరికీ తల్లిలాంటిది. అందరూ ఆనందంగా జీవించేందుకు అవసరమైనవన్నీ సమకూర్చి అమ్మప్రేమను ఎప్పుడూ అందరికీ సమంగా పంచుతూ ఉంటుంది ఆ ప్రకృతిమాత! ఒకరి మనుగడకు ఇంకొకరు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే వారు ఇలాంటి ప్రతిఫలం అనుభవించక తప్పదు!", అని అనుకుంటూ గోరింక చెప్పిన దిశగా బయలుదేరింది.

అయితే ఆకాశంలో ఎగురుతూ, ఆ ప్రాంతం వీడుతున్న పిట్ట కిందికి చూసి, ‘ఇక్కడి పచ్చదనం పూర్తిగా కనుమరుగైపోయింది!’, అని అనుకుంటూ ఉండగా తనను కాపాడిన పాప తనను చూస్తూ చప్పట్లు చరుస్తూ ఆనందంతో గంతులు వేస్తూ కనబడింది.

ఆ పాప కేరింతలు పిట్టలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.

అప్పుడు పిట్ట, “అమ్మా.. ప్రకృతిమాతా! ఈ పాపకున్నంత స్వచ్ఛమైన మనసు ఈ కాలపు పిల్లలందరికీ ఇచ్చి భావితరాల వారికి ప్రకృతి పైన ప్రేమ కలిగేలా చూడు తల్లీ! నేను వెళ్ళబోతున్న ఆ కొత్త ప్రదేశానికి ప్రకృతిని పాడుచేసే మనస్తత్వం ఉన్న మనుషులు రాకమునుపే అటువంటివారందరికీ మంచి బుద్ధి కలిగి, అమ్మవైన నిన్ను ప్రేమించే గుణం వారికివ్వు. అన్ని జీవులపై నువ్వు చూపే 'అమ్మ ప్రేమ' ను అందరూ అర్ధం చేసుకునేలా చెయ్యి!”, అని తన మనసులో ప్రకృతిమాతను వేడుకుంటూ ఉత్తరదిశగా ఎగిరిపోయింది ఆ పిట్ట!

**** సమాప్తం ****

Posted in August 2020, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!