Menu Close

Science Page title

ఇది జీవశాస్త్రపు శతాబ్దం!

2

జన్యు సాంకేతికం కూడ కలన యంత్రాలు తొక్కిన దారి వెంబడే వెళ్ళి, కళాకారుడి చేతిలో బంకమట్టిలా, ఒక కుటీర పరిశ్రమలా వర్ధిల్లిన నాడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహిద్దాం.

కొత్త కొత్త జాతుల పువ్వులు, కాయలు, జంతు సంతతి మూడు పువ్వులు ఆరు కాయలు లా వర్ధిల్లుతాయి. పెంపుడు జంతువుల సంగతే చూద్దాం. కొందరికి పంచరంగుల చేపలని పెంచే కుతూహలం ఉంటుంది. ఈ కుతూహలంతో వారు రకరకాల సంకర జాతి చేపలని ‘తయారు చేసి’ అమ్ముతున్నారు. పువ్వుల సంగతీ అంతే. ఈ రోజుల్లో గులాబీలు ఎర్రగానే ఉండక్కర లేదు. ఎర్ర బంతి పువ్వులు, నీలం కనకాంబ్రాలు, రంగు రంగుల జామ పళ్ళు, కొబ్బరి బొండాం పరిమాణంలో బొప్పాయి పళ్ళు, ... ఇలా నా చిన్నతనంలో చూడని పువ్వులు, పళ్ళు ఇప్పుడు బజారులో దొరుకుతున్నాయి. గింజలు లేని ద్రాక్ష, పుచ్చ మొదలైన పళ్ళు కూడా దొరుకుతున్నాయి కదా! ఈ రకాలన్నీ ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి? అభిలాష, అవకాశం ఉన్న వ్యక్తులు ప్రయోగాలు చెయ్యగా పుట్టుకొచ్చాయి. లేదా, ఎక్కడో ప్రకృతి సిద్ధంగా జన్యు పదార్ధంలో ప్రేరేపించబడ్డ ప్రతివర్తిత (mutation) వల్ల పుట్టిన కొత్త జాతిని తీసుకొచ్చి నిలదొక్కుకున్న జాతులతో అంటు తొక్కటం లాంటి ప్రక్రియల వల్ల పుట్టుకొచ్చాయి (గింజలు లేని ద్రాక్ష ఇలాగే మనకి లభిస్తోంది). ఈ రకం ప్రయోగాలు మన పూర్వులు ఐచ్చికంగా కూడ చేసేవారు. కంచర గాడిదలు అలా పుట్టుకొచ్చినవే. అంటు మామిడి అలా పుట్టుకొచ్చిందే. వారసవాహికల (DNA or chromosomes) వైనం అర్ధం అయిన తర్వాత, ఈ రోజుల్లో ఈ ప్రయత్నాలు ఊపందుకొన్నాయి.

Papaya

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల వల్ల వారసవాహికలలో దాగి ఉన్న రహస్యాలు బట్టబయలు అవుతున్నాయి కదా. ఈ విజ్ఞాన సంపద అందరికీ అందుబాటులోకి వస్తోంది కూడ. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి అభిలాష ఉన్న వ్యక్తులు, ఒక కుటీర పరిశ్రమలా, క్రొంగొత్త ఫల పుష్పాలని పుట్టించి ప్రయోగాలు చెయ్యడానికి అవకాశం కలుగుతోంది. ఇలాంటి ప్రయోగాలు చేసి, పులినీ, సింహాన్నీ జత చేసి ‘పుహం’ (tigon), ‘సింలి’ (liger) అనే కంచర జంతువులని పుట్టించేరు కనుక ‘ఎండా వానా కుక్కల నక్కల పెళ్ళి’ అనే పిల్లల పాట నిజం అవుతోంది.

Ligers and Tigons

ఏకసాయం (monoculture) మీద ఆధార పడే వ్యవసాయ పద్ధతులకి బదులు మళ్ళా బహుసాయం వాడుకలోకి వస్తుంది. జన్యు పదార్ధం శిల్పి చేతిలోని బంకమట్టిలా, చిత్రలేఖకుని చేతిలోని రంగుపదార్ధంలా తయారవుతుంది. ఇలా సర్వ వ్యాప్తమైన కుటీర పరిశ్రమలో కొన్ని కళాఖండాలూ పుడతాయి, కొన్ని నాసి రకం సృజనలూ జరుగుతాయి. మనమంతా పోతనలా రాయలేకపోయినా పద్యాలు రాయటం మానుతున్నామా? రాయగా, రాయగా, ప్రయోగాలు చెయ్యగా, చెయ్యగా మరో మహాకావ్యం పుడుతుంది!

మనం ఇలా ఊహించుకుంటూన్న జీవసాంకేతిక విప్లవం నిజంగా సంభవించినట్లయితే మనం, అంటే మానవాళి, ఐదు ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాలి. ఒకటి, ఈ విప్లవ తరంగాలని ఆపు చెయ్య గలమా? రెండు, ఆపు చెయ్యాలసిన అవసరం ఉందా? మూడు, ఈ విప్లవాన్ని ఆపడం మన తరం కాకపోయినా, అలా ఆపడానికి ప్రయత్నిం చెయ్యటం కూడ అభిలషణీయం కాకపోయినా, ఈ విప్లవ జ్వాలలు విశృంఖలంగా నలు దిశలా వ్యాపించకుండా మానవ సంఘం ఏమైనా అదుపులు, కట్టుబాట్లు నిర్దేశించ గలదా? నాలుగు, ఆ అదుపులేమిటో ఎలా నిర్ధారించడం? అయిదు, ఆ అదుపులని ఎవ్వరూ అధిగమించకుండా పర్యవేక్షించి గస్తీ కాయటం ఎలా? జాతీయ స్థాయిలోనా? అంతర్జాతీయ స్థాయిలోనా?

దినదినాభి వృద్ధి చెందుతూన్న ఈ జీవసాంకేతికం ఎలా పరిణతి చెందుతుందో ఈ రోజు చెప్పటం కష్టం – 1950 లో ఫాన్ నోయిమన్ కంప్యూటర్ల భవిష్యత్తు విషయంలో ఎలా పప్పులో కాలేసేరో అలాగే మన ఊహాగానాలు కూడ తప్పుల తడకలే కావచ్చు. మనం  ఇక్కడ చెయ్య గలిగేదల్లా నేను కలలు కంటూన్న కుటీర పరిశ్రమకి కావలసిన సరంజామా ఎలా ఉంటుందో ఊహాగానం చెయ్యటం. జీవసాంకేతిక రంగంలో, కంప్యూటరు రంగంలో లా, కుటీర పరిశ్రమ అంటూ ఒకటి వెలిస్తే దానికి అయిదు హంగులు ఉండాలి. ఒకటి, మొక్కలని ఒక నిర్ధిష్టమైన వాతావరణంలో పెంచటానికి ఒక తోట కానీ, హరితగృహం (greenhouse) కాని, దానికి సంబంధించిన ఉపకరణాలు, రసాయన పదార్ధాలు ఉండాలి. రెండు, అదే విధంగా జంతువులని ఒక నిర్ధిష్టమైన వాతావరణంలో పెంచటానికి సదుపాయాలు ఉండాలి. వీటి అవసరాలకి ఒక పశువుల సాల, దాణా, మందులు, వగైరా కావాలి. వీటితో సామాన్యులు కూడా ప్రయోగాలు చెయ్యటానికి వీలుగా స్నేహశీలత గల (user friendly) పరికరాలు ఉండాలి. నాలుగు, వారసవాహికలలో ఉన్న ఒక బణువు (molecule) యొక్క కట్టడిని వెల్లడించగల పనిముట్టు (sequencer) ఉండాలి. ఆఖరుగా, మనకి కావలసిన విధంగా వారసవాహికలని మలచగల సామర్ధ్యం ఉన్న సంశ్లేషణ యంత్రం (DNA synthesizer) ఉండాలి. పైన చెప్పిన జాబితాలో మొదటి మూడూ మనకి ఇప్పుడు లభ్యమవుతున్నాయి, ఆఖరి రెండూ ఇంకా ఎవ్వరూ తయారు చెయ్య లేదు. రాబోయే దశాబ్దంలో అటువంటి పరికరాలు తప్పకుండా తయారవుతాయి; ఎందుకంటే వ్యాపార వాణిజ్య రంగాలలో వాటి వాడుకకి అవకాశాలు కొల్లలుగా ఉన్నాయి.

ఊహించే శక్తి లేకపోయినా ఒక విషయం తలుచుకుంటే మాత్రం పీడ కల వచ్చినట్లు ఒళ్ళు జలదరిస్తోంది. భవిష్యత్తులో వైద్యులు మృత్యువుని జయించేరనుకొందాం. అప్పుడు ఈ భూలోకం అంతా వయసు మీరిన వయోజనులతో నిండి పోయి కొత్త తరాలకి చోటు లేకుండా పోతుంది. అప్పుడు భవిష్యత్తు శూన్యంగా కనిపించేసరికి మన పిల్లలు తిరగబడతారు. తాము చెప్పిన మాట తమ పిల్లలు వినటం లేదని ఆవేదన పడే తల్లితండ్రులకి ఒక ఊరట మాట: “ముందుంది ముసళ్ళ పండగ!”

నేనిలా అన్నానని భవిష్యత్తు అంతా ఇంత భయంకరంగా ఉంటుందనుకొని కంగారు పడకండి. కీడెంచి మేలెంచమన్నారు కదా అని ముందుగా కొంచెం భయపెట్టేను. కాని విజ్ఞతతో కళ్ళెం వేసి ఈ జీవసాంకేతికాన్ని వాడుకొంటే, ఎన్నో సమస్యలని పరిష్కరించవచ్చు. ఉదాహరణకి, అంగారక గ్రహానికి వలస వెళ్ళవలసి వస్తే అక్కడి వాతావరణానికి అనుకూలమైన క్రొంగొత్త పంటలని, పాడీ పశువులని ఇక్కడే తయారు చేసుకొని మనతో పట్టికెళ్ళచ్చు కదా. చెట్ల ఉనికి వల్లే ఈ భూగ్రహం మన మనుగడకి అనుకూలంగా తయారయినట్లే, అంగారక గ్రహానికి అనుకూలమైన చెట్లని పెంచి, అక్కడి వాతావరణంలో మనకి కావలసిన ప్రాణవాయువుని సృష్టించి, అప్పుడు మనం అక్కడకి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు కదా. ఇలా ఆలోచించిన కొద్దీ అవకాశాలు కనబడతాయి.

కంప్యూటర్ల శక్తిని ఉపయోగించి జన్యు శాస్త్రాన్ని మచ్చిక చేసుకొనే ప్రక్రియ అప్పుడే మొదలయింది. రాబోయే దశాబ్దంలోనే ఎన్నెన్నో ఆకర్షణీయమైన ఉపయోగాలు మనకి కనబడతాయని నా నమ్మిక.

%%% సమాప్తం %%%

Posted in August 2020, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!