Menu Close
Kadambam Page Title
చేయెత్తి "జై" కొట్టి చెప్పు తెలుగువాడా!
-- వెంపటి హేమ

ఇంటింటా ఉంటాయి ఇంగ్లీషు డిక్షనరీలు, కానీ
తెలుగు నిఘంటువు కావాలంటేమాత్రం వెతకాలి!
కన్నతల్లిని కసిరి తరిమి, సవతి తల్లిని సాకుతున్నావు!
"అమ్మా" అనడం అపచారం, "నాన్నా" అంటే నామోషీ-
"మమ్మీ!, డాడీ!" అన్న పిలుపులే మహా పసందౌతున్నాయి!
ఆంగ్లపదం రాకుండా అరవాక్యమైనా పలుకలేవు కదా ...
తల్లిభాష మాటాడే తరుణము రాదాయె నీకు .
ప్రాచీన గ్రాoధికం అసలు పనికిరాదు పొమ్మంటివి,
శిష్ఠవ్యవహారిక మెపుడో శంకరగిరి మన్యాలు పట్టె!
మాండలికా లిప్పుడు మరచిపోయి కూరుచుంటివి ,
నేటి వ్యావహారిక భాష మొత్తం ఆంగరేజీ సంకరం!
తీయనైన తెలుగుభాష తీరే మారిపోయింది,
ఇకనైనా కళ్లుతెరిచి ఇంటిపరువు నిలబెట్టుకో...

అక్షర రమ్యత కలిగిన అందమైన భాష మనది,
తేనెలోని మధురిమలు తెలుగుభాష కే స్వoతం-
అచ్చుల శబ్దంతో పదం ముగియు అరుదైన భాష!
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అంటూ మనభాషను
పరాయివాడు వచ్చి పొగిడి మనకు చెప్పాలా?
అదీ తెలియని అయోమయంలో మన మున్నామా?
"దేశభాషలందు తెలుగు లెస్స"ని పూనికతో మనము,
"లెస్స"న్నది తెలుగేనని లెస్సగ వివరించి జనానికి
ఇకనైనా, చేయెత్తి "జై" కొట్టి చెప్పు తెలుగువాడా !
గతమందు ఘనమైన కీర్తి కలిగున్న మొనగాడా!!

Posted in August 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!