Menu Close
Page Title

నా ముక్తక మౌక్తికాలు

ఒక్క మాటలో చెప్పాలంటే
అల్పాక్షరాలలో అనల్పార్థ రచన ముక్తకం.
అలంకార, వర్ణనాదులతో పఠితకు ఆహ్లాదాన్ని రసానుభూతిని కల్గిస్తూ నిర్ణీత మార్గంలో నడిచే రచన పద్యం.
పై రెండు పఠితకు ఒక దివ్యానుభూతిని మిగిలుస్తాయి. రసానుభూతిని కల్గిస్తాయి.

౧. నా ముక్తక మౌక్తికాలు
“ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది...
ఇప్పుడే అందిన వార్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు బత్తెం పెంచారు”
మరి మిగతా వారికి ఏం పెంచారు? ధరలు మాత్రమేనా!

౨. ఎండాకాలంలో ఎండలే గదా ఎక్కువ
ఏ.సి. రూముల్లో కూర్చొని ఆపసోపాలు పడే ఖుషీ బాబులకు ఏం తెలుస్తుంది అసలైన ఎండ
తిండికోసం బండలు మోసే
పండుముసలికే తెలుస్తుంది
ఆ అసలైన ఎండ. ఆ దౌర్భాగ్యమే
అతని సౌభాగ్యం.

౩. మంచాలుండేది మనుషులు పడుకునేందుకు గాని
ఇంట్లో వస్తువులకు అవి సోపానాలు కావు.

౪. ఆలస్యం అమృతం విషం
నిదానం ప్రధానం. ఏది అనుసరించాలి?
నీ పరిస్థితిని బట్టి నీవే ఆలోచించుకో
ఫలితం సత్పలితమే

౫. ప్రముఖ కవి నాగభైరవ కోటేశ్వరరావు అంటారు-
‘అసమర్థుడు కూడా నలుగురు చుట్టూ చేరితే అతడూ సమర్థుడే’
నోట్: (జరుగుతున్న నిజం)

౬. బెజవాడ గోపాల్ రెడ్డి (ఆమె తళుకులు) గారి ముక్తకం –
‘గద్దలు విశాల గగనంలో ఎగురుచుండినా
దృష్టి నేలమీద చచ్చిన గొడ్లనే వెదుకుచు నుంటాయి.’
నోట్: ఎంత నేర్చినా నీచుడు నీచుడే.

మన పద్య పారిజాతాలు

కళారాధకులకు, కళాహృదయులకు, మహా కవులకు ప్రకృతి ప్రథమ ప్రపంచం. ప్రకృతి లో ఉన్న ప్రతి వస్తువు ముఖ్యంగా కవులకు కవితా వస్తువే. అందుకే శ్రీ శ్రీ వంటి మహాకవి “కుక్క పిల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం” అని అన్నారు.
ప్రకృతి శోభలకు, మానవ జీవన విధానానికి ప్రథమ సోపానం వృక్ష సంపద. అందుకే మన మహా కవులు తమ తమ రచనలను పారిజాత, కల్పవృక్షాదులతో పోల్చి ఆయా పాత్రల, సన్నివేశాల సుగుణాలను మరింత రాణింపజేశారు.

నన్నయ్య నుండి ఇప్పటివరకు మనం గమనిస్తే మన కవుల రచనలలో వృక్ష సౌభాగ్యం, వాటి ప్రాముఖ్యత మనకు ప్రస్ఫుటమవుతుంది. నన్నయ, పోతన, మొల్ల మొదలైన ప్రాచీన కవులు, విశ్వనాథ సత్యనారాయణ, వంటి ఆధునిక కవులు భారత, భాగవత, రామాయణాదులను కల్పవృక్షం తో పోల్చారు. ఆయా రచనలను వారు శ్లేషాలంకార భాసురంగా తీర్చిదిద్ది అటు ముఖ్య కథను, ఇటు వృక్ష వైభవాన్ని తెల్పడం విశేష విషయం. ఒక పదానికి ఒకటికి మించి అర్థాలు ఉన్నట్లయితే దానిని ‘శ్లేష’ అంటారు. ఉదా: ‘కొమ్మ’ అంటే స్త్రీ అని చెట్టుకొమ్మ అని రెండర్థాలు.

శ్రీమదాంధ్ర మహా భారతము – నన్నయ పద్యం
“అమితాఖ్యానక శాఖ లం బొలిచి వేదార్థామల చ్ఛాయమై
సుమహాద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జనో
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై దైపాయనోద్యాన జా
త మహా భారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై”

మహాభారత, భాగవత, రామాయణాది కథలలో ముఖ్యాంశాలు మూడు ఉన్నాయి.
అనగా రచనా విధానంలోనని అర్థం – అవి-

1. ఆఖ్యానము 2. ఆఖ్యానకము 3. ఉపాఖ్యానము

ఆఖ్యానము: ప్రధాన కథ. భారతంలో కౌరవ పాండవులది ప్రధాన కథ.

ఆఖ్యానకము: ప్రధాన కథకు కార్యకారణ సంబంధంగల్గి మూల కథకు పోషకంగా, సహాయంగా ఉండేది. ఉదా: పరీక్షిత్తు శాపవృత్తాంతం.

ఉపాఖ్యానము: కథ చెప్పే కథకుడు తనకు తెలిసిన కథలు గాక ఇతరుల వలన తాను విన్న దానిని గూడా చెప్పే కథలను ఉపాఖ్యానం అని అంటారు (శ్రీమదాంధ్రమహాభారతము, పీఠిక L1). అంటే ఆఖ్యానకం కంటే భిన్నమైనదని, అంటే అది స్వయం సమగ్రంగా ఉండి ప్రధాన కథలో ఏదో ప్రయోజనాన్ని సాధించడానికి చెప్పబడుతుంది. ఉపాఖ్యానాలు స్వీయ ప్రయోజనాలతో పాటు కథకు ప్రయోజనం కల్గించేవిగా ఉంటాయి. ఆఖ్యానక, ఉపాఖ్యానాల గురించి చెప్తూ “ఆఖ్యానానికి అండ (పార్శ్వం)వంటిది ఆఖ్యానకం; దండ (ప్రాపు) వంటిది ఉపాఖ్యానం. ఈ రెండూ ఉంటేనే ఆఖ్యానం నిండుగా ఉండేది. ఇతిహాసం దండిగా పండేది.” అని అన్నారు జి.వి.సుబ్రహ్మణ్యం గారు (ఆది పర్వం 1వ ఆశ్వాసం 66 వ పద్యం, పుట 49) -  జి.వి.సుబ్రహ్మణ్యం ప్రధాన సంపాదకులు, కవిత్రయ మహాభారత ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణ.

**** సశేషం ****

Posted in July 2020, సమీక్షలు

1 Comment

  1. నరేంద్ర బాబు సింగూరు

    చాలా విషయాలు వివరాలు తెలుసుకున్నాం. ఆహ్లాదకరంగా ఉంది చదువుతున్న కొద్ది.
    తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ……

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!