Menu Close
తెలుగు పద్య రత్నాలు 33
-- ఆర్. శర్మ దంతుర్తి --

భగవంతుడున్నాడా? ఉంటే ఏ రూపంలో ఉన్నాడు? ఆయన శివుడా? విష్ణువా? లేకపోతే తపస్సు చేయగానే కోరికలన్నీ తీర్చే బ్రహ్మా? ఈ ముగ్గురూ నచ్చకపోతే మరో దేవుడెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం జనం కొట్టుకుంటూనే ఉంటారు ఎన్ని యుగాలైనా. మా విష్ణువు గొప్పవాడు కనక మీ శివుడు ఆయన కింద నుండే దేవుడు. అబ్బే శివుడే ముందు కనక విష్ణువు ఆయన కింద అనే విషయాలు అనేకం చూడవచ్చు. ఈ ఇద్దరూ కాదు అసలు దేవుడే లేడు, ఉన్నది ఒక్క నిర్గుణమైన ఆత్మ ఒకటే అదే బ్రహ్మం అంటే అనేది మరో వాదన. బుద్ధుడు అయితే ఇవేమీ కాదు అసలు ఈ చరాచర ప్రపంచం అంతా ఒక ధర్మం మీద ఆధారపడి నడుస్తోంది అదే మహా బోధి, తెలుసుకోతగ్గది అనేది ఆయనంటాడు. ఏది ఏమైనా ఎవరెలా వాదించినా ఒకటి మాత్రం నిజం. మనిషి శరీరంలో, చరాచర ప్రపంచంలో ఉండే చైతన్యమే బ్రహ్మం. అదే ఆత్మ అనవచ్చు. దీన్ని పోతన భాగవతంలో “హరి మయము విశ్వమంతయు …” అన్నాడు. శివానందులైతే ఈ ప్రపంచంలో ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదో అదే బ్రహ్మం అంటారు. అది పరిపూర్ణమైన జ్ఞానం. దీన్ని ఉపనిషత్ శ్లోకంలో “ఓం, పూర్ణమదః పూర్ణమిదం … అని వర్ణించారు.” ఈ శివ విష్ణు భేధాలు ఎలాగా తేలేవి కాదు కనక సరదాగా ఈ పద్యంలో ‘నేను సాధన చేస్తున్నాను, నాక్కావాల్సిన బ్రహ్మాన్ని చూపించడానికి నువ్వూ శివుడూ సమయం వ్యర్ధం చేయకండి, ఇద్దరూ తలో చేయి వేసినా నేను బతికిపోతాను’ అంటున్నారు.

హరుడని నీవును నీవని హరుండు వ్యర్ధపుచ్చకుడు
జరిపి నా ప్రార్ధన మీరు మీరు వచ్చందాలు పోయి
చెరియొక చేయివేసినను జాలును చేరితి ముక్తి
నిరుపమాన దయాబ్ది భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ (భద్రగిరి శతకం - 11)

శివుడు ఇస్తాడులే అని నువ్వూ (హరుడని నీవును), రాముడు/విష్ణువు ఇస్తాడులే అని శివుడూ (నీవని హరుండు), సమయం వృధా చేయకండి నా ప్రార్ధన వింటూ (వ్యర్ధపుచ్చకుడు జరిపి నా ప్రార్ధన). మీరిద్దరూ వంతులు వేసుకుని (వచ్చందాలు పోయి) తలో చేయి వేసినా చాలు (చెరియొక చేయివేసినను జాలును). నాకు ముక్తి కలుగుతుంది (చేరితి ముక్తి) అంటున్నారు రాముడితో. ఏ రాముడితో? ఆ రాముడెలాంటివాడు అనేవి చెప్తున్నారు తర్వాత పదాలలో. భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ – పుణ్య క్షేత్రమైన భద్రాచలంలో ఉన్న శ్రీరాముడు, నిరుపమాన దయాబ్ది (నిరుపమానము – ఉపమానము లేనిది, లేదా పోల్చలేనంత దయ కలిగినవాడు) అక్కడున్న శ్రీరాముడు.

ఈ నిరుపమాన దయాబ్ది అనేదాని గురించి చూద్దాం. రామదాసు కధ మనకి తెల్సిందే కదా? ప్రభుత్వం సొమ్ముతో రాముడికీ అమ్మవారికి నగలు చేయించినప్పుడు ఆ డబ్బులు ఇమ్మంటే లేవని చెప్తే కారాగారంలో శిక్ష అనుభవించాడు కంచెర్ల గోపన్న. అయితే అక్కడ కూడా రాముణ్ణి వదల్లేదు ఆయన – నేను చేయించిన నగలు పెట్టుకుని - కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా, నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా - అని వెక్కిరించాడు కూడా రాముణ్ణి. కొరడా దెబ్బలు తింటూ అలా అన్నాను ఏమనుకోకు రాముడా అన్నాడు తర్వాత. అంత నమ్మినవాడు కనకే రామ లక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ అనే పేరుతో వచ్చి ఆ డబ్బు చెల్లించి గోపన్నని విడిపించారని చెప్తారు. అదే నిరుపమాన దయాబ్ది అంటే.

బ్రహ్మ జ్ఞానం కలగాలంటే ప్రపంచాన్ని విడనాడలి (ఆత్మార్ధే పృధ్వీం త్యజేత్). దానికి కోరికలు విడనాడి సన్యసించినప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. ఈ విషయం వామనావతారంలో భగవంతుడు స్వయంగా చెప్పడం చూడవచ్చు. మూడు అడుగుల నేల భూదానం ఇచ్చాక త్రివిక్రముడై అన్నీ ఆక్రమించాక చెప్తాడు ఎందుకలా చేసాడో – ఎవ్వని కరుణింప నిఛ్ఛయించితి..(పోతన భా. 8-661) అంటూ. మొదట్లో ఈ ప్రపంచం వల్ల వచ్చే సంతోషం కాకి బంగారం; అది నిజం కాదు. మరోటి ఏదో ఉంది, అనే జ్ఞానం. ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. దానికి మార్గంలో కోరికలే అన్నింటికీ కారణమైన అసలు గోల అవి తెలుసుకుని వాటిని వదులుకోవడం – దీన్నే సన్యసించడం అంటున్నాం. అయితే బ్రహ్మ జ్ఞానం కావాలనేది కూడా ఓ కోరికే కదా? అది కూడా వదలాలి. మోక్షం కావాలనే కోరిక్కూడా వదలాలి. అప్పుడు కలిగేది గీతాచార్యుడు చెప్పిన మోక్ష సన్యాసయోగం. ఆ పైనది బ్రహ్మ జ్ఞానం. అది కలిగాక శివానందులు చెప్పినది జరుగుతుంది – ఏది తెలిస్తే ఇంకేమీ తెలియనక్కర్లేదో అది తెల్సింది. హరి మయము విశ్వమంతయు అనేది. దానితో జన్మ- మృత్యు పరంపరలోంచి విముక్తి. ఇదంతా అంత సులభం కాదు కనక ముందు ఆయన మీద భక్తి కలగాలి. దానికోసం జప ధ్యానాలు వగైరా. ఆ భక్తిలో భాగమే భగవంతుణ్ణి స్తుతించడం, గోపన్నలా వెక్కిరించడం, ఈ పద్యంలో అన్నట్టూ అడగడం అనేవన్నీ.

ఇంతకీ పద్యం ఎవరు రాసారో తెలిసిందా? జ్ఞానపీఠ గ్రహీత, రామాయణ కల్ప వృక్షం రచయిత శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారే. ఆయన రాసిన తెలుగు షాషాణం అంటారు గానీ సులభంగా అర్ధమయ్యే పద్యాలు చాలా ఉన్నాయి. మన దురదృష్టం ఏమిటంటే ఈ పద్యాలూ ఈ కావ్యాలు దొరకడం అంత సులభం కాదు. ప్రస్తుతం కొందామన్నా దొరికేలా లేవు. ఎక్కడో కొన్ని అంతర్జాల పత్రికలలో పుస్తకాలలో ఉండవచ్చు. అవి దొరికినా కొని చదివేవారూ లేరు తెలుగంటే చులకన అయిపోయిన ఈ రోజుల్లో.

****సశేషం****

Posted in March 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!