Menu Close
తెలుగు భాష భవితవ్యం 3
- మధు బుడమగుంట

మన తెలుగు భాష భవితవ్యం శీర్షికను జనవరి నుండి మొదలుపెట్టి నా ఆలోచనల ప్రవాహంలో ఊపిరిపోసుకుంటున్న అనేక అంశాలను మీతో ప్రస్తావిస్తూ వస్తున్నాను. గత సంచికలో అంటే ఫిబ్రవరి సిరిమల్లె సంచికలో తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని వివరించి తద్వారా ఏ విధంగా మాతృభాష మాధుర్యాన్ని భావితరాలకు అందించవచ్చో అత్యంత సున్నిత పదజాలంతో, సరళమైన వాడుక భాషలో వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా, రెండు రోజుల క్రితం, సంస్కృతాంధ్ర భాషలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుభాషా కోవిదులు శ్రీ అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారితో నా ఆలోచనల విధానాన్ని పంచుకోవడం జరిగింది. అలాగే నేను గత సంచికలో ప్రస్తావించిన భాషా ఔన్నత్యాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన నా ఆలోచనల అక్షరక్రమాన్ని వందశాతం ఏకీభవిస్తూ వెనువెంటనే ఆశువుగా ఈ క్రింది ఆటవెలది, మత్తకోకిల మరియు కంద పద్యాలను నాకు పంపారు. ఇది మన మాతృభాష ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింప జేసింది. వాడుక భాషే కాదు, వ్యాకరణశుద్ధ గ్రాంధిక తెలుగు కూడా ఎంత మధురంగా ఉంటుందో చూడండి.

తెనుఁగుబాససౌరు --- అయ్యగారి సూర్యనారాయణమూర్తి

ఆ.వె. తేనె లొలుకునట్టి తెనుఁగుమాటలు నోట
      పూటపూటఁ బలుక ముద్దు లొలికి
      కొన్నివేలనాడు లన్నియుఁ గదలుచు
      మంచి గూర్చు మదికి మనుగడకును

మ.కో. తేఁటితేఁటికి నందఁజేయుచుఁ దీపితీపినిఁ దెన్గునన్
       మాటిమాటికి వాడవాడల “మాకు, మా” కనఁ బంచు నే
       పాటి సాటియు లేని పల్లెల పాటలాటలుఁ జాటి యా
       నాఁటి నేఁటి రుచుల్ పదమ్ముల(1) నాటినాటి యొసంగురా
             (1)మాటలలో/అడుగులలో

కం. ‘అచ్చటముచ్చట’ యన్నది
     యచ్చట ముచ్చటగఁ గూడ నగు, మనతెనుఁగే
     తెచ్చిన నచ్చిన యిచ్చిన
     యచ్చపుఁ(1)గానుకకు సాటి యస(2) లెటఁ గలదే?
          (1)స్వచ్ఛమైన (2)అసలు

ఆ.వె. ‘అసలుమసలు’(1) వంటి ‘వసలు సిసలే’ కాక
      ‘గుసగుసలు’ను మంచి ‘ముసిముసి’కిని
       కొసరి కొసరి యొసఁగుఁ బస(2) బస(3) సేయఁగా
      ‘ఉసురుసురు’ను(4) బాస కూపిరి నిడి
           (1)అతిశయిల్లు (2)పస=చేవ (3)వాసము (4) నిట్టూర్పు

ఆ.వె. ‘తల్లిదండ్రు’ లన్నఁ ‘దాఱుమాఱు’ను, ‘దిక
      మకలు’ ‘నరులు మరులుఁ(1)’ ‘గొకిబికి’(2)యును
      ‘గజిబిజి’యును లేక ‘గడబిడ’ ‘జిలి
      బిలి’(3)యుఁ ‘జిఱ్ఱుబుఱ్ఱు’ ‘నలబలము’(4)ను
          (1)అరులుమరులు=ముదిమిచే తెలివి తప్పుట
          (2)వికృతమైనది (3)అవ్యక్తమధురము
          (4)అలబలము=సందడి

ఆ.వె. ‘పాడిపంట’ లన్న ‘నీడుజోడ’న్నను
      ‘తోడునీడ’ యన్నఁ ‘గూడుగుడ్డ’
      ‘లించుమించు’ లేక ‘యెగుడుదిగుడు’ ‘నూల
       మాల’(1) ‘యండదండ’ ‘లాలుమగలు’
            (1)ఊలమాల=తహతహ

కం. ఇవి జంటమాట లగు మఱి
    అవి యివి యననేల? కైత లల్లుటకు కయిల్(1)
    కవ(2)లైనను గాకున్నను
    చవు లూరఁగ చవుపదాలఁ(3) జాటిరి తమితో(4)
       (1)కవులు (2)జత (3)నాలుగుమూలల (4)కుతూహలముతో

ఆ.వె. చిట్టిపొట్టిమాట లిట్టి వెన్నిటిఁ జెప్ప
      తనివి తీరఁ దెలుపుఁ దెనుఁగువారి
      బాససౌరుతీరు? పసిఁడిపల్కులతల్లి
      తెలుఁగుతల్లి కాదె తెలివి కిల్లు?

తెలుగు పలుకే ఒక ఆరోగ్య ఆయుధం అంటూ తెలుగు పదాల ఉచ్ఛారణ వలన శరీరంలోని 72 నాడులు ప్రకంపనలతో రక్తప్రసరణ సవ్యంగా జరగడంతో పాటు శుద్ధి కూడా అవుతుంది. పల్లెపదాల స్వచ్ఛత యొక్క తీపిదనం ఎల్లవేళలా సజీవమై వెలుగొందుతూ ఆనందాన్ని అందిస్తుంది. జంట పదాల జాతర నిజమైన భాషానుభూతిని అందిస్తూ మనలో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మాతృభాష నుడికారమే మనలోని తెలివిని ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది.

ఇంతకన్నా అందమైన పద్యాలను మనం మరెక్కడా చూడలేము. చివరగా, ఇంత గొప్ప తేనెలొలుకు తెలుగు భాష మన మాతృభాష అయినందుకు మనందరం గర్వపడాలి. అలాగే మన భాషను పరిరక్షించేందుకు మన వంతు కర్తవ్యాన్ని గుర్తెరిగి అందుకు కార్యోన్ముఖులు అవ్వాలి. అది ఎలాగో వచ్చే సంచికలో చర్చించుకుందాం.

**** సశేషం ****

Posted in March 2024, ఆరోగ్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!