Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు

(పూర్వ జన్మ జ్ఞానము)

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు కాలజ్ఞాన కర్తగా అందరికీ సుపరిచితులు. వారు కేవలం కాలజ్ఞాన కర్త మాత్రమే కాదు తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త కూడా. అంటే వారొక సామాజిక తత్వవేత్త. బ్రహ్మంగారు కాలజ్ఞానమే కాక జీవైక్య బోధ, కాళికాంబ సప్తశతి వంటి గ్రంథాలు కూడా రాశారు. గత వారానికి కొనసాగింపుగా ఈ వారం పూర్వ జన్మ గురించి బ్రహ్మం గారు చేసిన బోధన గురించి తెలుసుకుందాం :-

స్త్రీ పురుషులు రుతు కాలము నందు రతి జేసినప్పుడు ఒకనాటి రాత్రి పురుషుడి శుక్లము స్త్రీ శోణితముతో కలసి ఐదు దినములు నీటిపై బుగ్గ వలె ఉంటుంది. రుతు కాలమంటే - బహిష్టు సమయంలో స్త్రీ స్నానం చేసినది మొదలు పదహారు దినములను ఋతుకాలమందురు.

అందులో మొదటి నాలుగు దినములు రతికి నిషిద్ధము. అయిదవ దినము మొదలు తక్కిన పన్నెండు దినములలో పదకొండు పదమూడు దినములు నిషిద్ధములు.

ఐదు దినములు నీటి బుగ్గ వలె ఉన్నది, పది దినములకు కోడి గ్రుడ్డు వలె మారుతుంది. నెలకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడును. రెండు నెలలకు కాళ్ళు, చేతులు, మూడు నెలలకు కడుపు, నాలుగు నెలలకు ఇరు పార్శ్యములు అనగా భుజములు, ఐదు నెలలకు పాదములు, వ్రేళ్ళు, ఆరవ నెలకు ముక్కు, చెవులు, కన్నులు మొదలైన రంధ్రములు గల అవయవములు ఏర్పడును.

ఈ విధముగా ఏర్పడిన దేహములో ఏడవ నెల యందు జీవుడు ప్రవేశించును.అప్పుడు దేహము ఊర్ధ్వ ముఖమై ఉంటుంది. అప్పుడు 'సూతి' యను పేరుగల ఒక తొడుగు పిండమును చుట్టి ఉంటుంది.

ఎనిమిది, తొమ్మిది నెలలయందు పిండముకు పూర్వ జ్ఞానము కలుగును. భూమి మీద పడే వరకు మల మూత్రాలకు స్థానమైన గర్భము నందు నిలిచి పూర్వ జన్మలో చేసిన పాప కర్మల గురించి దుఃఖించును. రాబోవు జన్మలో ఎట్టి పాపములు చేయకుండా పరమాత్మను నిరంతరమూ ధ్యానింతునని తలంచును. ఇంతలో గర్భము నుండి బయటపడే సమయము ఆసన్నమవుతుంది. అప్పుడు విష్ణు మాయ గప్పి పిండము అధోముఖమై, తల్లి యొక్క అపానవాయు ప్రసారము చేతను, పిండమందుండు ప్రాణాది వాయు ప్రసారము చేతను తల్లికి బాధ కలిగించుచు భూమి మీద పడును. బిడ్డ బయటకు రాగానే మోముపై కలినీళ్లు చల్లుతారు. అప్పుడా బిడ్డ పూర్వ జన్మ వృత్తాంతమంతా మరచి కావురు మని ఏడుస్తుంది.

బెర్ట్రాండ్ రస్సెల్ తన పుస్తకం The Philosophy of Laymenలో ఇలా అంటారు :- “Science is what we know, and philosophy is what we don’t know. But it should be added that philosophical speculation as to what we do not yet know has shown itself a valuable preliminary to exact scientific knowledge.”

బ్రహ్మం గారు పిండం శరీరంగా మారడం గురించి చెప్పినటువంటి విషయాలు శాస్త్రీయంగా రుజువైనప్పటికీ పూర్వ జన్మకు ఇంకా భౌతికమైన ఆధారాలు లభించలేదు. కాబట్టి అంతవరకు పూర్వ జన్మ ఉన్నదని ఘంటాపథంగా చెప్పలేము, అలా అని తిరస్కరించనూ లేము.

బెర్ట్రాండ్ రస్సెల్ పైన రాసిన వాక్యానికి కొనసాగింపుగా ఇలా అన్నారు :- “The guesses of the Pythagoreans in astronomy, of Anaximander and Empedocles in biological evolution, and of Democritus as to the atomic constitution of matter, provided the men of science in later times with hypotheses.”

నిర్దిష్టమైన భౌతిక ఆధారాలు లేనప్పుడు తత్వవేత్తలు మతస్తుల మాదిరి కట్టుకథలు అల్లకుండా తమ అనుభవాల ఆధారంగా చేసే తాత్విక విచారణతో కొన్ని సూత్రాలు రూపొందిస్తారు. కాల గమనంలో అవి నిజమని రుజువవచ్చు, కాకపోవచ్చు, లేదా శాస్త్రీయ ఆవిష్కరణకు పరికల్పనగా ఉపయోగపడవచ్చు.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!