Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

విజయనగర సామ్రాజ్య అంత్య దశ

ఇటలీ పర్యాటకుడు సిజారియో ఫెడెరిసి 1567లో తుంగభద్రా నదీ తీరాన ఉన్న విజయనగరాన్ని సందర్శించాడు. అతను 'విజయనగరం పూర్తిగా విధ్వంసం కాలేదు. ఇళ్ళు నిలిచే ఉన్నాయి కానీ అవి ఖాళీగా ఉండిపోయాయి. లభించిన సమాచారం ప్రకారం అక్కడెవరూ ఉండటం లేదు, పెద్ద పులులు, మిగతా క్రూర జంతువులు తప్ప' అని రాశాడు.

అప్పటి వరకు రెండు శతాబ్దాలకు పైగా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజుకు వైభవోపేతమైన రాజధానిగా వెలుగొందిన నగరానికి విధి పట్టించిన గతి అది. అక్కడ జరిగిన సంపద దోపిడీ అనంతమైనది, జరిగిన జనహననం అపారమైనది. దీనికి దారి తీసిన పరిస్థితులను, తదనంతర సామ్రాజ్య విచ్చతిని పరిశీలిస్తే ... మనకు అనేక విషయాలు తెలుస్తాయి.

ముందుగా నిరంకుశ భ్రాతృత్రయం అంటే ఎవరో చూద్దాం!!!

శ్రీ కృష్ణదేవరాయలుకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. కుమారుడు పిన్న వయసులోనే విష ప్రయోగం వల్ల మరణించాడు. తన పెద్ద కుమార్తెను పులికాట్ నివాసులు, అరవీటి వంశానికి చెందిన రామరాయలుకు, చిన్న కుమార్తెను అతని తమ్ముడు తిరుమలరాయలుకు ఇచ్చి వివాహం చేశారు కృష్ణదేవరాయలు. రామరాయలి ఇంకో తమ్ముడి పేరు వెంకటాద్రి. రామరాయలు, తిరుమలరాయలు, వెంకటాద్రిలను కలిపి నిరంకుశ భ్రాతృత్రయం అని చరిత్రకారులు సంభోదిస్తారు.

ఇంకొక్క తరం ముందుకు వెళితే కృష్ణదేవరాయలి తండ్రి నరసనాయకుడికి తన మూడవ భార్య ఓబాంబిక వల్ల ఇరువురు కుమారులు కలిగారు. అచ్యుతుడు, రంగడు వారి పేర్లు.

క్షీణతకు పూర్వరంగం :-

1530లో కృష్ణదేవరాయలు చనిపోయేముందు తన తమ్ముడు అచ్యుతుడిని రాజుగా అభిషేకించాడు. తన అల్లుడు రామరాయలును రాజ్య సంరక్షకునిగా నియమించాడు.

అచ్యుతరాయలి కాలంలో విజయనగరంలో ఉండి, రాయల దర్బారును తరచూ సందర్శించిన విదేశీయుడు నన్నీజు. నన్నీజు అచ్యుతుడి గురించి ఈ విధంగా రాశాడు :-

“రాజు అచ్చెత్ రావ్ సింహాసనమెక్కగానే వ్యసనాలకు లోనయ్యాడు, నిరంకుశంగా ప్రవర్తించాడు. అతనికి నిజాయతీ లేదు. అందువల్ల ప్రజలు, సేనానులు అతని చెడు జీవితం పట్ల, ఆలోచనల పట్ల అసంతృప్తిగా ఉండేవాళ్ళు.”

అచ్యుతరాయలి పరిస్థితి చూసి ఇబ్రహీం ఆదిల్షా విజయనగరం పైకి దండెత్తాడు. అచ్యుతరాయలు ప్రతిఘటన లేకుండా రాయచూర్ కోటను, ఎంతో విలువైన సంపదను ఆదిల్షాకు ఇచ్చి సంధి చేసుకున్నాడు.

అలా తరిగిపోయిన సంపదను అమరనాయకులు, పాలెగాళ్ళ నుంచీ, ప్రజల నుంచీ నిర్దయగా వసూలు చేసి ఆరు నెలలలో ఖజానా నింపాడని నన్నీజు రాశాడు. అంతే కాకుండా అతను ఆ సంధి చేసుకున్నందుకు, తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమ నుండి బలవంతంగా డబ్బు వసూలు చేసినందుకు ప్రజలు, సామంతులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఒకవేళ ఈ రాజ్యం నశించే పరిస్థితి ఏర్పడితే అది ఈ అచ్యుతరాయలి కాలంలోనే జరుగుతుందని వాళ్ళు అనుకునే వారని కూడా నన్నీజు రాశాడు.

కానీ అలా జరగలేదు.....కాలం మరో విధంగా సాగింది !!!

అచ్యుతరాయలు 1542లో చనిపోయాడు. దానికి ముందు తన కొడుకును యువరాజుగా, అతని రీజెంటుగా తన మేనమామ సలక రాజు తిరుమలను నియమించాడు. సలక రాజు తిరుమలనే హోజె తిరుమల రాయలు అని కూడా అంటారు. అయితే సలకరాజు తిరుమలే అధికారం చెలాయిస్తూ రాజుకు అన్యాయం చేస్తున్నాడని, సాయపడవలసిందిగా, రాజమాత ఒకమారు, అచ్యుతరాయలి తమ్ముడు ఒకమారు బీజాపూర్ సుల్తానును కోరడంతో, అతను విజయనగరం పైకి దండెత్తాడు. మొదటిమారు దానం ఇచ్చి సుల్తానును పంపివేసిన తిరుమల, రెండోమారు ఎదుర్కొని తరిమేశాడు. ఆ విజయం తరువాత అచ్యుతరాయలి కొడుకు వెంకటరాయలిని చంపివేశాడు.  తరువాత తిరుమల ఆగడాలు హెచ్చుమీరాయి. దాంతో రామరాయలి నాయకత్వాన అమరనాయకులు, పాలెగాళ్ళు తిరుగుబాటు చేశారు. తుంగభద్రా నదీ తీరాన జరిగిన యుద్ధంలో తిరుమల చనిపోయాడు. తరువాత అచ్యుతరాయలి తమ్ముడి కొడుకు సదాశివరాయలిని గద్దె మీద నామమాత్రంగా కూర్చోబెట్టి, రామరాయలే అధికారం చెలాయించసాగాడు.

విజయనగర విధ్వంస గాథకు ఆరంభ వాక్యం ఇదే...

- సశేషం -

Posted in June 2023, సాహిత్యం

2 Comments

  1. G.Kumar Babu

    దానం అన్న పదం ఉన్న చోట ధనం అని చదువుకోండి!

  2. ఉమామహేశ్వరరావు

    (రామ)రాయలు పేరైనపుడు ప్రథమావిభక్తి -లు కారాంతంకాగా ఔపవిభక్తిక రూపం -ల అవుతుంది. అప్పుడు రామరాయలు –> (రామ)రాయల అవుతుంది. (*)రాయలి కాదు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!