చరమ సందేశం
తమిళ దేశంలో జన్మించి, తెలుగు దేశంలో జీవ సమాధి నొంది, కన్నడిగులు ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ రాఘవేంద్రస్వామి గురు సార్వభౌములు మఱియు మధ్వమత వర్ధనులు.
సనాతన ధర్మంలోని అనేకానేక విభిన్న మత సంప్రదాయాల్లో మధ్వ మతం ఒకటి. మధ్వ మతం భక్తి ప్రధానంగా, పురాణేతిహాసాలు పునాదిగా రూపొందించబడ్డ మతం.
మధ్వమతంలో శ్రీ మహా విష్ణువు సర్వోత్తముడు. అన్నింటికీ అతీతుడు. విశ్వం ఆయన సృష్టి. అనగా ఆయన అభివ్యక్తీకరణ. శ్రీ మహా విష్ణువు అనంత కళ్యాణ గుణసమన్వితుడు. ఆయన సాకారుడు మఱియు సగుణుడు.
మధ్వ మతం ప్రకారం జీవాత్మ పరమాత్మా వేరు వేరు. జీవులంటే పరమాత్మకు భిన్నులైన జీవాత్మలు. జీవాత్మకు జ్ఞానం,ఇచ్చాశక్తి, క్రియాశక్తి ఉంటాయి. జీవాత్మలు అనంతం. పరస్పరం భిన్నం. దేహం కంటే తాను వేరనే జ్ఞానం లేకపోవడం జీవాత్మకు గల అవిద్య. జీవులు మూడు రకాలు.
- భక్తితో శ్రవణం, మననం, నిధిధ్యాసనాల ద్వారా మోక్ష సాధన చేసే ముక్తి యోగ్యులు.
- కర్మలను చేస్తూ సుఖ దుఃఖాలననుభవిస్తూ జనన మరణ వలయంలో చిక్కుకునే నిత్య సంసారులు.
- పాప కృత్యాలే చేసే తమో యోగ్యులు.
విష్ణు సర్వోత్తమ జ్ఞానమును, తారతమ్య జ్ఞానమును, శ్రీపతి యందు పరమ భక్తిని ప్రసాదించు గురూత్తముడు వాయుమూర్తి అని మధ్వుల సిద్ధాంతం. అందుకనే వీరు పురాణేతిహాసాల్లో వాయువవతారంగా భావించే ఆంజనేయస్వామిని కొలుస్తారు.
సనాతన ధర్మం, మధ్వ సిద్ధాంతాల గురించి శ్రీ రాఘవేంద్ర స్వామి భాట్ట సంగ్రహం, సుధాపరిమళం, న్యాయ ముక్తావళి, చంద్రికా వ్యాఖ్య, సుతంత్ర దీపిక, గీతార్ధ సంగ్రహం, ఋగ్వ్యాఖ్యానం, ఉపనిషద్ ఖండార్ధం వంటి గ్రంథాలు రచించారు.
శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు కృష్ణభట్టు. కృష్ణభట్టు పుత్రుడు కనకాచల భట్టు. ఆయన కుమారుడు తిమ్మణ భట్టు. తిమ్మణ భట్టు గోపికాంబ దంపతులే శ్రీ రాఘవేంద్ర స్వామికి జన్మనిచ్చిన ధన్యులు. సామాన్య శకం ౧౫౬౫ లో జరిగిన తళ్ళికోట యుద్ధానంతరం విజయనగరం పతనమయింది. రాజాశ్రయం కోల్పోయిన తిమ్మణ భట్టు వంటి పండితులనేకులు తంజావూరు చెవ్వప్ప నాయకుని ఆస్థానము చేరారు.
తరువాత తమ కుల గురువు మధ్వ పీఠాధీశుల ఆదేశం మేరకు తిమ్మణ భట్టు కుంభకోణంలోని శ్రీ మఠము చేరారు. అక్కడే మన్మధ సంవత్సరము ఫాల్గుణ శుక్ల సప్తమి గురువారం సామాన్య శకం ౧౫౯౫ లో శ్రీ వేంకటనాథులు జన్మించారు.
సామాన్య శకం ౧౬౨౧ దుర్మతి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విదియ నాడు మధ్వ పీఠాధిపతి శ్రీ సుధీంద్ర తీర్థులు రఘునాధ నాయకుని ఆస్థానము నందు వేంకటనాథులకు సన్యాసమిచ్చి, మూల రామ - దిగ్విజయ రామ - జయ రామ ప్రతిమల నొసగి శ్రీ రాఘవేంద్రులని నామకరణం చేశారు.
సన్యాసాశ్రమం స్వీకరించక మునుపు, స్వీకరించిన తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర జగద్విదితం. అనేక మంది భక్తులకది పారాయణ గ్రంథం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ఉద్ధండులు శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించారు.
అందరి సిద్ధ పురుషుల, అవధూతల మాదిరే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర కూడా మహిమలతో నిండి ఉంటుంది. కోర్కెలు తీర్చే, బాధలను ఈడేర్చే కామ ధేనువు, కల్పతరువుగానే స్వామిని భక్తులు దర్శిస్తున్నారు. అంతకు మించింది వారి అంతరంగ ఆవిష్కరణను అధ్యయనం చేయడం. అదే భక్తుల భవరోగాన్ని పోగొట్టే దారి దీపం.
భక్తికి నమ్మకం, విశ్వాసం కీలకం. పరిశీలన, వివేచన మృగ్యమైతే అవి మూఢ నమ్మకం, అంధ విశ్వాసం అవుతాయి.
శ్రీ రాఘవేంద్రులు విరోధికృత్ నామ సంవత్సరం సామాన్య శకం ౧౬౭౧ శ్రావణ బహుళ విదియ శుక్రవారము నాడు తుంగభద్రా నది సమీపమున మంచాల గ్రామమున సశరీరులై బృందావన ప్రవేశము చేశారు.
ఆ రోజున శ్రీ రాఘవేంద్రులు ప్రార్ధన ముగించి, శ్రీ యోగీంద్ర తీర్థులకు తగు ఉపదేశము చేసి, మహా సంస్థానమును అప్పగించి బృందావన పందిరికి వచ్చారు. అక్కడ పురోహితుల వేద పారాయణము,హరి దాసుల నర్తనములు, భాగవతుల కీర్తనముల తరువాత, మంగళ వాయిద్యములు మ్రోగిన తరువాత శ్రీ రాఘవేంద్రులు భక్తుల నుద్దేశించి తెలుగులోనూ, కన్నడంలోనూ ప్రసంగించారు.
- సరియైన నడత లేనిదే , సరియైన ఆలోచనలు కలుగవు.
- ఫలాపేక్ష లేకుండా స్వధర్మాన్ని నిర్వర్తించాలి, కర్మలన్నింటినీ భగవదర్పణము గావించాలి.
- జీవితంలోని ప్రతి క్షణమూ ఎంతో విలువైనది.
- పరోపకారం కూడా భగవదర్చనమే.
- సరియైన శాస్త్రాల శ్రవణం,స్మృతి పథంలో భగవంతున్ని నిలుపుకోవడం మానవుని ధర్మం.
- సరియైన జ్ఞానం అన్ని మహిమల కంటే గొప్పది.కేవలం మహిమలు ప్రదర్శించే వారికి దూరంగా ఉండాలి. తాను మహిమలు ప్రదర్శించింది కేవలం భగవంతుని శక్తి నిరూపణ కోసమే.
- గుడ్డి నమ్మకం భక్తి కాజాలదు.అది కేవలం మూర్ఖత్వము.
ఈ విధంగా బోధించి,ఇదియే మేము మీకు ప్రత్యక్షముగా ఇచ్చు దీవెన, ఇదియే మా చరమ సందేశము అంటూ అందరినీ ఆశీర్వదించి భక్తుల జయజయధ్వానాలు నడుమ బృందావనంలోకి ప్రవేశించారు.
# పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం యతిరాజాయ నమతాం గురుసార్వభౌమనే #