Menu Close
SirikonaKavithalu_pagetitle

పుట్టి ఏడాదైనా
ఏ కదలికా లేకుండా
నిర్జీవుల్లా నిద్ర నటిస్తున్న గింజల స్వప్నాలకు
ఎక్కడి నుండో
హామీలందుతున్నప్పుడు ...
నీ మనికి మర్మాలేవో
నా గుండెలో దోసెడంత ఆశను క్రుమ్మరించిపోతుంటాయి.

తొలకరి చినుకులైరాలిన
నీ నోటి ముత్యాల మడుగుల్లో
ముద్దగా తడచిన వాటి ముద్దుదేహాలు
సద్దులేకుండా మరునాటికల్లా...
పసరు మొలకలను ప్రసవిస్తున్నప్పుడు
నీ ఉనికి నా సంశయంతో అనురాగ మంత్రాన్ని వల్లెవేయిస్తుంది

వెలికి వచ్చిన కలికి మొలకలన్నీ
అన్నదానవ్రతానికి సన్నద్ధమై
మొక్కవోని దీక్షతో..
కావి సందె కిరణాలను
తావి బిందలతో ముంచుకుని
తలంట్లు పోసుకుంటున్నప్పుడు
నీ అదృశ్య హస్తం
త్యాగకావ్యానికి
నీటైన కోటి టిప్పణులను రచిస్తుంది..

భూమి పొరల్లో..
రవ్వంత నీటి తరగలను పీల్చుకోలేక
ఉక్కిరిబిక్కిరౌతున్న నునులేత వేర్లను
నీ కాలగతుల్లో సానబెట్టి
గండ శిలలను రెండుగా భాగించే
ఏ వటవృక్షమూలాలుగానో..
గాలి పొరల్లోని ఆర్ద్రతను సైతం
అలవోకగా శోషించే..
మరే వాయుగత మూలాలుగానో
శిల్పిస్తున్న...
నీ ఉలి రహస్య విద్యలను
శోధించే ఊహానంతంలో...
నీ ఉనికి నా కలం ములుకుపై
మధురంగా సంతకం చేస్తుంది..

అందుకే...
శుష్కమెంత సాధించినా.
కోశంలోని గింజ
శోకాన్ని బహిష్కరించేది..
చీకటి ఎంత చిక్కబడినా నిశీధి ఆశను చిక్కబట్టుకునేది..
శిశిరమెంత భయపెట్టినా కణుపుగర్భంలోని చిగురు
దిటవుగుండెతో నవ్వుకునేది

ఎన్నెన్నో భావాలను ఎదగనీయక అణచివేసి
ఏమీ రాయడం లేదని చింతపడితే ఎలా?

గగనానికి ఎగరాలని ఆశించే పక్షిరెక్కలను
నిర్దాక్షిణ్యంగా విరిచేస్తే ఎలా?

స్వేచ్ఛగా పెరగాలని ఎదుగుతున్న మొక్కను
ఆదిలోనే తుంచివేసి ఆనందిస్తే ఎలా?

సమభావన, సమజీవన అందరికీ, అన్నిటికీ ఒకటేనని
మరిచిపోతే ఎలా?

ఎవరికోసం పుష్పిస్తున్నావని పూల మొక్క నడిగి చూడు!
అందనంత ఎత్తున కొండమీద ఎవరికోసం ఫలిస్తున్నావని చెట్టు నడిగిచూడు

ఎవరికోసం వసంతంలో రాగాలాపనలని
కోయిలనడిగి చూడు

సృష్టి సమస్తమూ చెప్పే జవాబు ఒక్కటే

ఏ ఎదురుచూపులూ లేని
తమ ఆనందం కోసమే నని!!

ఓ మనిషీ!

నీకు మాత్రమే ఈ కీర్తి కండూతి ఎందుకు?
నీకోసమే నీవు నీ భావాలను పుష్పించనివ్వు!
నీ ఆత్మ సంతృప్తి కోసమే వాటికి అక్షరరూపమివ్వు!
నీకంటూ సహజలక్షణం ఏముందో వెదికి చూడు..
ప్రకృతి నేర్పే పాఠాలను మౌనంగా మననం చేసికో!
సృష్టిలోని ఆనందాన్ని నీ స్వంతం చేసికో!!

సఖి పదము నా ఎద మోప...
మనసంతా నందనమే
చెలి చరణమె నా స్వర్గమవ...
ఇలయంతా నందనమే!!

కనుల కొలను అందాల్లో...
కమలపూల వనరాణివి!
నీ చూపులు సుమశరాలు...
వలపంతా నందనమే!!

అభిషేకం అపురూపం
ప్రేమామృత ధార తాను!
సుధాసార  భావనలతొ..
తలపంతా  నందనమే!!

ఆమనిలో ఆహ్లాదం...
కోకిల గళ మనుకున్నా!
సఖి పాటల లాలనచే...
జగమంతా  నందనమే!!

విరహాలకు అలుపొచ్చెను...
తలపులలో శయనించగ!
ప్రేమపెరగ బంధాల్లో...
సుధలంతా నందనమే!!

చైత్రాలకు సుందరతను...
పూయు బ్రహ్మ గొప్ప వర్ణి !
మదికి రంగు కొమ్మ వేయ  ...
వనమంతా నందనమే!!

శ్రీ కాంత్ నీ! గజల్ నడక...
కిన్నెరసాని పరుగుసరళి!
పదపదమున శృంగారము
ఎదయంతా నందనమే!!

గుడ్డును పగలగొట్టుకుని కోడిపిల్ల బయటపడినట్టు
పాతదనాన్ని వదిలి
కొత్త భావాలకు రంగులద్ది
మెరిసే చీరలా నేయాలి

అవే అచ్చులు వత్తుకుంటూ
ఒకే బొమ్మను
తయారు చేయడం మాని
జవజీవాలు తొణికిసలాడే మంచి విత్తనమై
ఆకుపచ్చగా మొలకెత్తాలి

ప్రపంచపు లోతులను
చూపులతో తవ్వి తీసి
మరో రకంగా ఆవిష్కరించేందుకు
లోపల సముద్రాన్ని
మధించుకోవాలి

చుట్టూ
పూలదారులుగా భ్రమింపజేసే
ముళ్ళపొదల మాయలో
దారితప్పిపోతున్నపుడు
దిశానిర్దేశంచేసుకోవాలి

గూటిలోని పిట్టలు
నోటికందిన గింజలను తిని గాలితో
ప్రయాణించడం నేర్చినట్టు
లోకపు మూలమూలలను పరికిస్తూ
కన్నీళ్ళనూ ఆనందాలనూ
ప్రశ్నలనూ వాటి సమాధాలనూ కనుక్కుంటూ
రెక్కలను దువ్వుకుంటూ
వినీలాకాశంలోకి ఎగరాలి

లోన ఎగసిపడే
అక్షరాలకు తలంటి
తళతళలాడే బట్టలు తొడిగి
నరనరాలనూ మీటుకుంటూ
పరిమళభరిత పూలవాక్యమై పురుడు పోసుకోవాలి

Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!