Menu Close
SirikonaKavithalu_pagetitle

ఆ వసంతానికి ముందు వెళ్లిన వాణ్ణి
ఇప్పుడే ఈ శిశిరానికి ముందు తిరిగి వస్తున్నాను
అప్పుడే పచ్చటాకులు ఎర్రగా మారి పండుబారుతున్నాయి
ఆకు జోళ్ళ కోసం భూమి లెక్కలు వేసుకొంటోంది
రాలిన ఆపిల్ పిందెల్ని దాచుకోలేక గడ్డిపరకలు తలదించుకొంటున్నాయి
కొత్తగా ముఖానికి ముసుగులు వేసుకొంటేనేం
ఎప్పట్లానే అందరూ ఏమీ పట్టనట్లుగా
వెళ్తున్నారు
సుఖానికీ అసుఖానికీ మధ్య
భద్రతకూ అభద్రతకూ మాటున
రాజీసూత్రమేదో కనుక్కొన్నట్లున్నారు
ముసుగులు వేసుకున్న జీవితం కంటే
ముఖాన ముసుగుండటమే మేలనుకొంటున్నారు
ఇప్పుడపరిచితులెదురు పడ్డా బలవంతాన నవ్వు పులుముకోనక్కర్లేదు
పెదాలపై నాగరికత విరుపులు విరవక్కర లేదు
ఎవరికెవరూ తారసపడి నటించక్కర్లేదు
యంత్రాలమా అన్న అంతరంగ ప్రశ్నకు
అవకాశమే ఇవ్వక్కర్లేదు..
నిశ్శబ్దత సమాధానం కోసం గూగుల్ భేతాళుణ్ణి మొయ్యక్కరా లేదు
ఇవ్వాళ ప్రతివారూ తమకు తామే పూర్తి పరాయీలు
అచ్చంగా చెట్టెక్కి దిగే విక్రమార్కులు
తమ గూళ్లకు తామే ఆన్ లైన్ బందీలు
ఆటపాటల్లేని పసితనాలు
మాటమంతీల్లేని వయోనుభవాలు
పిల్లలనుండీ పెద్దలదాకా తమ తమ తనాల్ని పోగొట్టుకున్న దివాళాకోర్లు
చుట్టూ ఎన్నో విషాద వార్తావిలయ తరంగాలు
ఒక్కగానొక్క కొడుకై తండ్రికి కొరివి పెట్టడానికి వెళ్లలేనివాళ్ళు
కన్నబిడ్డల కోసం ఖండాంతరాలు దాటొచ్చి
కట్టుకొన్నవాళ్లు కట్టెలపాన్పెక్కినా కదిలే దారి లేక కూలిపోయినవారు
మరణానికి సాక్ష్యం చెప్పడానికి బ్రతికి ఉన్నవాళ్ళు
బ్రతుకుశిలువ కొయ్యకు తలకిందులుగా వేలాడబడ్డ వాళ్ళు....

తల తిరుగుతుంటేనేం, తమకు తాము పరాయవుతుంటేనేం
అందరూ అన్నిచోట్లా బాగానే ఉన్నట్లున్నారు
బాగోగుల్ని బొమ్మల్లో చూస్తూ బాగోగుల మర్మం ఆరా తీస్తూనే ఉన్నారు
మానవ సంబంధాలకు, చదువూసంధ్యలకు సరికొత్త భాష్యం  అన్వేషిస్తున్నారు
ప్రపంచాన్నే కాదు, తమప్రపంచాన్నే ఇప్పుడు తెరబొమ్మగా చేసి చూస్తున్నారు
ప్రతిదాన్నీ తవ(యూ)గొట్టంలోకి మార్చి, మురిసిపోతున్నారు
రేపటి సంస్కృతికి దృశ్య దస్తావేజులవుతున్నారు
తెలిసినవాళ్లందరూ కొత్తయిపోతేనేం
లోకమే కొత్తగా మారిపోతేనేం
నేనూ బాగానే ఉన్నాను, నిత్యం చదువుకొనే చరిత్ర సాక్షిగా...
నాటి గుహాజీవులనుండి, నేటి గృహజీవుల సాక్షిగా...

రెండు కేకలు
పదహారు నినాదాలు
వెయ్యిన్నూట పదహారు ఆర్తనాదాలు
రహదారి మీదకు దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి.
అడుగడుగునా అశ్లీలం పంచుతూ
శరీరం మరచి శరీరానికి వ్యక్తిత్వం కొలమానం చేస్తూ
నాలుక పలుకలేని మాటలు
నలుగురి మధ్యన నిర్లజ్జగా పంచుతూ
నిలకడలేని నిష్టూరాలు.
సిగ్గుతో చితికి పోయిన భాషా సంస్కృతీ
దిగంతాల మూలన నక్కి
అవమానపు అరుణిమలో సొక్కి
తలలు దించుకు మాట కుదించుకు
చూపుల మూగ సవాళ్ళు.

అదేమిటో గాని
దాపుడు చీరల్లా భధ్రంగా మనసు అరల్లో
పొందికగా రక్షించుకోవలసిన సౌకుమార్యపు
అక్షరాలను
వికృతంగా చెక్కి కొలతల మధ్య బిగించి
కొక్కి రాయి లక్షణాలను ఏరుకొచ్చి
ప్రదర్శనలో పెట్టినట్టు
మానసిక వైపరీత్యాలు
గంజాయి మత్తులా వెదజల్లుతూ
అభ్యుదయం పేరిట
మాస్ హిస్టీరియాలా
పత్రికల వ్యాపార లీల
ముద్దు పళనీ శ్రీనాధుడూ
ముసుగువేసుకుని
మాటలు దిద్దవలసిన గతి
ఆకుఆకునా తెగులు సోకిన సాహిత్యం ఎక్కడ చూసినా
చిల్లుల మయమే.

ఎప్పటికీ వైపరీత్యం ఫీనిక్స్ లా మాడి మసై
మరో కొత్త పక్షి రెక్కలు విప్పుతుంది
మరో సౌందర్య సీమ
కొత్త వెలుగై పిలుస్తుంది.

శబ్దాలు మొలకెత్తనిచోట
చిత్తడి చిరునవ్వై పూసేచోట
ఆకలి కతలకి వరప్రదాయినిలా...
అచ్చంగా అమ్మలా....
అక్కడో పచ్చని ఆశ.

కాలం ఆటుపోట్లు...
పేరాశ గొడ్డలివేటు...
అవసరానికి,విలాసాలకి మధ్య గీత చెరిగిపోతుంది.
వెన్ను విరిగిపోతుంది.
మూలాలు తొలగిపొతాయి.
నిస్సహాయంగా జీవం...

ఓటమిని అంగీకరించని సంకల్పంలా
ఒంటరిగా కూలిపోయి...
వేవేల అంకురాలుగా నేలచేరుతూ...
మట్టరేణువులమీద
విజయ బావుటాలెగరేస్తూ...
రెక్కలు విప్పిన రామచిలుకలా
ఆకాశాన్ని అలంకరిస్తూ....
ఆనందంగా గాలితెరలమీద ఊయలలూగుతూ..
నమ్మకం చేసిన సంతకంలా
అక్కడో పచ్చని ఆశ.

అనుభవాలతో పండిన ఆకుల్ని
రాల్చేసుకుంటూ...
కొత్త ఊపిరితో  పరవశిస్తూ...
కొండల్లో...
కోనల్లో...
కఠిన శిలా మూలల్లో...
కరకు వేడి ఇసుకల్లో...
పట్టుదలకి అలసట తోడురాదంటూ...
దృఢ సంకల్పానికి ఎదురులేదంటూ...
నిరంతర విజేతలా
అక్కడో పచ్చని ఆశ.

Posted in May 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!