Menu Close
SirikonaKavithalu_pagetitle

సమయమే లేదుగా
సమయమే లేదు

జీవితపు పరుగులో
భవితకను మరుగులో
అనుకరణ మెరుగులో
ఆయుష్షు తరుగులో
||సమయమే లేదుగా||

శిశువుకు పాలిచ్చు తల్లి లాలనకూ
ఆలు బిడ్డల సుఖము చూడ పెనిమిటికి।
చదువు వెంబడి పడి ఒడి వీడి బడిచేర
తల్లి ఒడి వెచ్చదనమెరుగనీ పాపలకు||
||సమయమే లేదుగా||

అన్నదమ్ముల కలిమి స్నేహితుల చెలిమి
అయినవారందరీ ఆదరణ బలిమి|
చూపగా కరువాయె కాసింత మేలిమి
గుండె ఆరనిచిచ్చు రగిలేటి కొలిమి||
||సమయమే లేదుగా||

తినుటకు వినుటకు కనుటకు మనుటకు
తలచుటకు పిలుచుటకు నిలుచుటకు కొలుచుటకు|
నెలవులకు విలువలకు తలపులకు వలపులకు
విధివలకు చిక్కిన పలు రంగు చేపలకు
||సమయమే లేదుగా||

ఉచ్ఛ్వాస నిశ్వాసముల లెక్క జేయుటకు
కూడబెట్టిన సొమ్ము కూడి భోగించుటకు।
పెంచుకొనుటయె గాని పంచుతీరిక లేక
కుంచించుకొని పోవు ఆత్మహీనునకు||
||సమయమే లేదుగా||

ఏ దిక్కుల మొగసాల వైపుకో....

అక్షరాల అద్దాల ఏ ఆత్మలు ప్రత్యక్షమయాయో.....
నిక్షిప్తమై ఏ భావ శకలాలు రోదిస్తున్నాయో...
యూగాల నాటి
ప్రేమ ధార ....తప్తధారై రక్తధారై...
నా మనసు కంట
కురుస్తూనే ఉంది
చెట్టు పండవక ....
చేను. పంటవక ...
మింటి చుక్కలు నేల
చూడక...
నది లాస్యం ఎపుడాగి పోయిందో....
సికరి కణ గణములు
సిగ్గునెలా తలవాల్చాయో....
మణి మాణిక్యాలను ముడిచిన మహి ఎండిన ఎడారి గొంతుకై.....
పువ్వులేని...
నవ్వులేని..
అంతటా.....
మోగని మువ్వలే
నిర్దయ వర్జన్య ప్రాఖర్య దుర్మార్గ ఉద్రేకాలే
ఏ ప్రాభవాన్ని పుడమి
ఆశిస్తోందో...
ఏ విషాదాన వియత్తలి
శోకిస్తోందో.....
ఏ జల ఘాతాల గర్జిత
తరగల కడలి
ఘూర్ణమౌతోందో...
ఏ చక్రగ్రాహాలనో చిక్కి. చక్కబడని  స్నేహాల చలించు జనత....నవ యువత
ఏ పరిమితినాశిస్తోందొ...
హృదయాహ్లాద గీతం..
సంగీతం...హితగీతం
మతం...సమ్మతం...
సమ్ముదం ...మరచి...
విడిచి...
ఏ సముత్పత్తి కోసం
ఏ వైపు ప్రయుక్తి. లేని
ప్రయత్న రహిత పయనం...
సమత నవత కనరాని
ఏ దిక్కుల మొక్కుల
మొగసాల వైపుకి......

శీతాకాలపు ఉదయం
మంచుతెరలతో ముఖం కడుక్కుని తాజాగా ఉంది

రహదారంతా పరచుకున్న
పారిజాతాల పాదముద్రలు
మెత్తని తివాచీ పరచాయి

పూలన్నీ మంచుబిందువులను
బుక్కన చుక్కగా అలంకరించుకుని
అల్లరిగా నవ్వుతున్నాయి

భానుడు కిరణాల కత్తులు దూసి
యుద్ధానికి సన్నద్ధమవనా మాననా అనే సందిగ్ధంలో
కొట్టుమిట్టాడుతున్నాడు

లోపలి చలిమంటలను
వెచ్చని చాయ్ తో
చల్లారుస్తూ
గదులలో కబురులనదులు
ప్రవహిస్తున్నాయి

అమ్మలు
మత్తునిదురలో ముసుగుతన్నిన
చిట్టిచామంతుల
బద్దకపు దుప్పట్లపై
ముద్దుముద్రలేసి
బడికి సిద్ధం చేయడంలో
తలమునకలవుతున్నారు

కొందరు
దినపత్రికలకు చూపులతికించి
వార్తాప్రవాహలలో
ఈదులాడుతున్నారు

వాహన కోలాహలాల సంగీతాలు
రహదారులపై నెమ్మదిగా శృతి పెంచుతున్నాయి

కాలం ఉదయరాగాన్ని ఆలాపిస్తూ ముందుకు
కదులుతోంది

ఇన్ని రంగులొలికిన చిత్రాన్ని
కనులలో నింపుకున్న
మనసుకొమ్మను  ఒకమారు మెత్తగా కదిపాను

హృదయమంతా నిండిన
ఎన్ని అనుభూతుల పూలు
కవిత్వమై కాగితంపై రాలాయో....

ఇసుక తెర మాటునుండీ..
జీవితాన్ని చూడటంలో..
ఏదో..ఒక తెలియని ఉద్వేగం!!
ఓ సారి..
జారిపోతున్న రేణువుల్లోనీ
చటుక్కున ముద్దిడుకునే..
ఒక చల్లని స్పర్శ..
ఒకనాటి తీయని చుంబనం!!
మరో సారి..
ఒక రేణువు..
కొలిమిలో కాల్చిన ఇనుప కడ్డీలా..
పెట్టిన వాత తాలూకు జ్వలనం!!
ఇంకో సారి..
వెన్నెల్లో తడిసిన రెల్లు గడ్డిలా
సుతారంగా స్పృశించిన శీతలత్వం!!
అలాగే...
ప్రతి రేణువూ..
జారే ప్రతిసారీ..
ఏదో ఒక అనుభవాన్నిచ్చి,
చల్లగా జారుకుంటుంటే..
ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుందేమిటీ..
పిచ్చి మనసు!!
అది ఇసుక తెర కదా మరి??
నిముషమైనా పట్టదది జారటం.!!.
జీవితమూ అంతేగా!!

ఎగిరిపోవాలని ఉంది
ఎందరినో కలుసుకోవాలని ఉంది

ఇన్నాళ్లు దాచుకున్న
మాటల మూటలు విప్పి
అందరి ఎదతలుపు తట్టి
ఎన్నెన్నో చెప్పాలని ఉంది

ఈ గదిలో
అలముకున్న చీకటిలో
చీకటి మూసిన వాకిటిలో
ఏకాంతంలో నైరాశ్యంలో
ఒంటరినై.. ఓటమినై
ఎంత విసిగి వేసారి పోయానో

పరుగు తీయాలని ఉంది
నా ఎద మరిగే ఊసులు
ఎలుగెత్తి చెప్పాలని ఉంది

ఎందరో ..
ప్రాణమిత్రులు బంధువులు
ఆత్మీయులు చుట్టాలు పక్కాలు
ఎక్కడెక్కడ ఎలా ఉన్నారో
ఏ మూల దాక్కున్నారో
ఎన్ని బాధామయ గాధలు వింటున్నారో
వారి మూగ రోదనలు వినాలని ఉంది

ఎన్నో యుగాలైనట్టుంది
ఎండమావులలో తిరుగాడి నట్టుంది
పెను నిద్దుర ఆవరించినట్టుంది
జీవితం మొద్దుబారి నట్టుంది

ఏదీ ఏమైనా సరే
ఈ విరహం
వియోగం ఓపలేనిది
ఈ నిశ్శబ్దం
నిబిడాంధకారం సైప లేనిది ..

ఈ చీకట్లను చీల్చుకొని
ఈ సంకెళ్లను తెంచుకుని
ఉగ్గబట్టిన
ప్రాణాలుచిక్కబట్టుకొని
ఒక్కపెట్టున
గట్టిగా ఊపిరి పీల్చుకుని

ఈ ఊబి లోంచి
ఉక్కిరిబిక్కిరి లోంచి
ఎగిరిదూకాలని ఉంది

ఈ ప్రకృతిలో
జగతిలో జాగృతిలో
గలగలా ప్రవహించాలని ఉంది.

సూర్యుడు రాకముందె, యిలుశుభ్ర
ము జేసెడివారు రాకమున్
భార్యకు తోడుగానడచి బాధ్యతలన్నియు పంచుకోవలెన్
కార్యములన్ని వేళకగు కంటివెలుంగులు సంతుసిద్ధమై
తూర్యనినాదమాటొ విని, తోడు
ప్రియంవద రేయిముచ్చటౌ

మబ్బునుజూడగా నెమలి మైకము
తోపురి విప్పియాడదే
యుబ్బునుగాదె వేతనమిదోయని
దోసిలిబోయనాడదే
అబ్బి, చనంగబుక్కెడిది యంబలి
త్రావు మటన్న నవ్వ, య
బ్బబ్బ యిదేమిగోలయని పల్కుదు
వేమిర నవ్వ లోకులున్
మూడవపాదంలో త్రావుమటన్నను
అవ్వ అని

వేసవి యెండబాధలన వేడుక తీయని
మావిపండ్లిడున్
త్రాసము గల్గుచుండునన తన్మమందవె మల్లె పొల్పుతో
గోసయె పిల్లగాడ్పులెవి? కూడరె
మన్మలు పిల్లగాలులే
దోసము కాలదూషణము, దుర్బల
కాయము దిద్దుకోవలెన్

Posted in February 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!