సీ|| ఎరుక కావల నిల్చి మృతి జరా జన్మ త్రి
కంబున్నిషేధించి కనులు మూసి
లోని కన్ను దెరచి లోని గానంబున
కానంద తాండవంబావహించి
ఎడమెరుంగని శక్తి నెడమ మేనన్నిల్పి
తానె సర్వంబయి తన్మయించి
నిౙము కేవలమైన నిజము మాత్రంబని
నిజ నమో నిష్కామ యజన మూని
తే|| దేశ కాలాల అస్తిత్వ పాశములను
నిర్వికార నిరంజన నిష్కళంక
నిశిత శూలంబుతో ద్రుంచి నివ్వటిల్లు
ప్రణవ నాద తురీయ శివంబు నేను! ||
అను|| ప్రణతోస్మి హనూమంతమ్
రామ నామ మధువ్రతమ్
సూర్య విద్యార్థినం భవ్య
బ్రహ్మ సింహాసనాధిపమ్! ||
సీ|| కృష్ణపక్ష రహిత వైష్ణవీ వామాక్ష
శైశవ కౌముదీ శశి కిరీటి!
నిగమ విద్యా సాంధ్య నీరాగ నిర్ద్వేష
సుప్రభాతారుణ సుందర జట!
అమరాస్య వన జఠరాహవనీయ ద
క్షిణ గార్హపత్యాబ్ధి శిఖి లలాట!
నైధనాలక్ష్య ప్రణవ నిరంజన కర్ణ
కుండల మండల గండ నికట!
తే|| కమల గర్భ పంచమ మూర్ధ కలుష హారి!
కలుష మన్మథ కామ వికార హారి!
కాల గర్వ విక్రమ విష క్రాంతి హారి!
కమలనాభానుజా మనో హిమ విహారి! ||
(అగ్నిముఖా వై దేవాః, అని వేదమంత్రము.
అట్టి దేవముఖుడు, దావాగ్ని, జఠరాగ్ని,
ఆహవనీయ-దక్షిణ-గార్హపత్య త్రేతాగ్నులు,
బడబాగ్ని - ఏడు అగ్నులని భావన.
శివుని కుండలములు అలక్ష్య, నిరంజన అను
పేర్లు కలవిగా ఆర్యోక్తి)
జీవితం ఎప్పుడూ ఒక సవాలు!
అదృశ్య శక్తి మనిషికి విసిరే సవాలు!
జీవితం ఎప్పుడూ ఒక పందెం!
మనిషి మనిషితో వేసుకొనే పందెం
కాదంటే దేవుడితో వేసుకొచ్చే పందెం
అందుకే అడుగడుగున అన్ని పరీక్షలు
గెలుపు కోసం అగుపడనివాటి కారుణ్యప్రతీక్షలు
మనిషి కష్టించి గెలిచినా, కష్టంతో ఓడినా
గెలుపు పైవాడిదేనన్న నికృష్టపు బుకాయింపులు
కనాకష్టపు కర్మ సిద్ధాంతాల గణింపులు, గణకింపులు
ప్రపంచ చదరంగం బల్లమీద ఇప్పుడు ఏనుగులూ గుర్రాలు లేవు
నాగరిక గుహల్లో నక్కిన పులులూ సింహాలే,
అదునుకోసం చూసే వాటి అపరిమిత కాంక్షా వ్యూహాలే
మనిషికి మనిషిని ఎదురొడ్డి ఆడడం కూడా ఒక ఆటా?
మనిషి మీద మనిషిని ప్రయోగించి గెలవడమూ ఓ గెలుపా?
కరెన్సీ నోటు మీద గాంధీ తాత బోసినవ్వుంటే ఏం ఫలం?
కాగితాల్లా మనిషి బ్రతుకులతో ఆడుకొంటోంది కాలం!
గాలివాటపు లోకంలో ప్రతి శ్వాస సవాలవుతోంటే
మనిషి పందెం కాస్తున్నది ఏ ప్రాణవాయువుతో?
ప్రతిభ చూపుతున్నది ఏ నిప్పుకణంతో!
అనుకూలతల మధ్య బ్రతుకు సాధించిందేమిటి?
ఒట్టి ఊపిరి పచారులు! సుఖ సమాధి సంచారాలు!!
తనతో ఆడుకొని పీడించే అన్ని భూతాల సాక్షిగా
ప్రతికూలతల మధ్య మనిషి వేసే ముందడుగే జీవితం!
•1•
నేను
భూగోళాన్ని
చరాచర గర్భాన్ని
చేతనా పుడమిని
నా చుట్టూ నేను తిరుగుతూ
మనిషి చుట్టూ తిరుగుతున్నదానిని
పరిణామచరిత్రకి నేనే నిత్యసాక్షిని.
•2•
అఖండాకాశం నా గగనతలం
ఖండఖండాంతర ఖ్యాతి నా విశాలత్వం
నన్ను కౌగిట చేర్చుకుని ఎగసిపడే సముద్రం
ఆ ఘోషన ఒదిగిన నా జనజీవన ఉచ్చ్వాస
జవసత్వాలుడుగుతున్న ప్రాణక్రియల నిశ్వాస
ఇంతేనా ఇంతేనా నా మిగిలిన చరిత్ర.
•3•
నేనుగా నిండాల్సిన చరిత్ర పుటలలో
ఏకదిన ప్రభుత్వజ్ఞాపిక నవుతున్నాను
వేదికలకు ప్రాసంగికాంశ మవుతున్నాను
పత్రికలకు పతాకశీర్షిక నవుతున్నాను
ఒక్కరోజుకే అపరిమితవార్త నవుతున్నాను
తక్కినదినాల అప్రస్తుత మవుతున్నాను
ఇంతేగా ఇంతేగా నా సమకాలీన చరిత్ర.
•4•
ఎగదీస్తే మారణహోమాలు
దిగదీస్తే మానభంగాలు
రంగుఅక్షరాల హంతక రాజకీయాలు
నలుపు తెలుపుల రాక్షస మతమతలబులు
కత్తులు లేకుండానే కుత్తుకలు తెగే తంత్రాలు మానవరూపాన నక్కిన దానవ బాంబులు
ఇంతేలే ఇంతేలే నెత్తురోడుతున్న నా చరిత్ర.
•5•
ఎదగటానికి మందు పెరగటానికి మందు కోయటానికి మందు కరగటానికి మందు పువ్వవటానికి మందు పండవటానికి మందు దిగుబడికి మందు ఎగుమతికి మందు
మతమతికి మందు మతిమతికీ మందు
ఏమందైనా నాకు కాదు ఎన్నటికీ మందు
ఇంతేగా ఇంతేగా నా నడుస్తున్న చరిత్ర.
•6•
నేను మనిషి వేగాన్ని మనసు వేగాన్ని
రంగు పులుముకున్న వయసు వేగాన్ని
తోసుకువచ్చి ముందుగా తిష్టవేసిన వేగాన్ని
ఒకప్పుడు పందేలకు పరిమితమైన వేగాన్ని ఇప్పుడు క్షణక్షణానికీ పోటీపడుతున్న వేగాన్ని
మనిషితో మనిషి పోటీపడుతున్న వేగాన్ని
మనిషి తనతో పోటీపడుతున్న వేగాన్ని
యంత్రంతో పోటీపడుతున్న వేగాన్ని
తంత్రంతో పోటీపడుతున్న వేగాన్ని
ఇంతేలే ఇంతేలే వేగవంత నా చరిత్ర.
•7•
పుట్టుకతో నేను పంచభూత క్షేత్రాన్ని
పరిణామంలో మానవ క్షాత్రాన్ని
రానురాను క్షాత్రంలేని క్షేత్ర మవుతున్నాను
క్షేమ మవుతున్న క్షామ మవుతున్నాను
క్షామక్షేత్రమై వాణిజ్యకామన నవుతున్నాను
జీవవైవిధ్యంలేని జీవనవైరుధ్య మవుతున్నాను
ఇంతేలే ఇంతేలే కదలుతున్న నా క్షత చరిత్ర.
మావి చిగురు పలికిందో కోయిల మది కులికిందో
ఆకు ఆకునా ఆగినిలచినా సరిగమలే రాలిరాలి కురిసెనో
లేతాకు పచ్చనీ తోరణమై పలకరించెలే తెరచాటు ఆమని
వెచ్చవెచ్చనీ ఊయలూగుతూ తరలి వచ్చెలే మధుమాస యామిని
కొత్త ఆశలే కోటి వెలుగులై తళుకుమంటు తారలన్ని
నేల చెరుగు నీలి నింగి పూసిన పరిమళాల సిరిమువ్వలే
ఆకు ఆకునా చిరువేప రవ్వలే చేదు చేదునా చెమటల కధలే
కొత్తకుండలో జీవన సారం ఆరు రుచులతో పలికె స్వాగతం
ఒక వైపున ఆనందం అలరారే పులుపు పిలుపు సంరంభం
చురుకుమనే నాలుకకొస కన్నీటిని మెరిపించే దుఃఖపు దెస
ఆరు రుతువులా సంగమ సమయం కనురెప్పపాటు కధల మయం
అరచేతిన రుచి చూపే అది అమవస తదుపరి తొలి వెలుగుల రేఖ
పంచాంగం పుటలెక్కిన మట్టి భవిత మనిషి భవిత రేపటి రూపాల వేట
పదిలంగా కలలన్నీ వడబోసే సాయంత్రం కాస్సేపే ఆ నవ్వుల యంత్రం
లేతాకు పచ్చనీ తోరణమై పలకరించెలే తెరచాటు ఆమని
వెచ్చవెచ్చనీ ఊయలూగుతూ తరలి వచ్చెలే మధుమాస యామిని
మీ ‘ మధుమాసం’ కవిత
మీ వూహా ల్లో
ఆశావాదం అద్భుతంగా ఉంది.
కృతజ్ఞతలు స్వాతి గారూ.
మీవైన శైలి లో
కవితా పంక్తులు సాగాయి.
నా చరిత్ర అంటూ సమాజ
రూపు రేఖల ను పాటకుడి
ముందుంచారు.
తే లికైన పదాలతో కవిత్వ ఘాడత
కలిగిన మీ రచనా నైపుణ్యా నికి
మనసారా వందనం.
మనిషి-జీవితం గురించి
మీరు కవిత్వీకరించిన
విధానం చాలా బాగుంది.
కృతజ్ఞతలు సర్.