Menu Close
Page Title
చాళుక్య యుగం

“క్రీ.శ. 1198 లో ఓరుగల్లులో గణపతి చక్రవర్తి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించేదాకా వర్ధిల్లిన కాలాన్ని మనం చాళుక్య యుగం అని పేర్కొందాం” అని ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని యుగ విభజన చేస్తూ రెండవ యుగానికి “చాళుక్య యుగం” అని పేరు పెట్టాడు.

తెలుగు దేశాన్ని అయిదు వందల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పాలించిన రాజవంశం, తూర్పు లేక వేంగీ చాళుక్యుల వంశం.

చాళుక్య వంశం – ముఖ్యమైన రాజులు

౧. తూర్పు లేక వేంగీ చాళుక్యుల మూల పురుషుడు కుబ్జ విష్ణు వర్ధనుడు (క్రీ.శ. 615- 633)

౨. కుబ్జ విష్ణువర్ధనుని తరువాత 13 మంది రాజులు రాజ్యమేలారు. 13 మంది తర్వాత గుణగ విజయాదిత్యుడు రాజ్యాధికారం చేపట్టాడు. ఈ గుణగ విజయాదిత్యుడు తెలుగు గడ్డ మీద తెలుగు కవిత్వాన్ని పాదుకొలిపాడు. ఇతను ఒక లక్షణగ్రంధం కూడా వ్రాయించి ఉంటాడని పరిశీలకుల మాట. ఇతని సేనాని పండ రంగడు చేసిన దానాన్ని తెలిపే ఒక శాసనం గుంటూరు మండలం లోని అద్దంకి గ్రామంలో ఒక పొలంలో దొరికింది. అందులో ‘తరు వో జ’ అనే పద్యం ఉంది. గుణగ విజయాదిత్యుని తరువాత పదిమంది రాజులు పాలించారు. ఆ తర్వాతి రాజు దానార్ణవుడు. దానార్ణవుని మొదటి కొడుకు మొదటి శక్తి వర్మ. రెండవ కొడుకు విమలాదిత్యుడు. విమలాదిత్యుడు తంజావూరు చోళ చక్రవర్తి రాజ రాజ చోళుని కుమార్తె కుందవ్వను వివాహం చేసుకొన్నాడు. విమలాదిత్యునికి కుందవ్యకు పుట్టినవాడే రాజ రాజ నరేంద్రుడు. ఇతడే నన్నయ చేత సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదింప చేసాడు. విమలాదిత్యునికి మరొక భార్య ఉంది. ఆమెకు, విమలాదిత్యునికి పుట్టినవాడు విజయాదిత్యుడు. ఇతడు వేంగీ దేశాన్ని పాలిస్తున్న రాజ రాజ నరేంద్రుని పైకి పలుమార్లు దండెత్తాడు.

చాళుక్యుల రాజకీయ చరిత్ర – క్లుప్తంగా:

దానార్ణవుని కుమారులు శక్తి వర్మ, విమలాదిత్యుడు అని చెప్పుకొన్నాం కదా. దానార్ణవుడు క్రీ.శ. 972 వీరమరణం పొందాడు. అప్పటికి చిన్న పిల్లలైన శక్తి వర్మ, విమలాదిత్యుడు తండ్రి తర్వాత రాజ్యం కోల్పోయి కాందిశీకులుగా బయలుదేరి తమిళ దేశంలో ఉన్న తంజావూరు దగ్గర ఉన్న తిరువాయూరు లో స్థిరపడ్డారు. కాందిశీకులు అంటే ఆరుద్ర మాటల్లో – ‘రాజవంశం లోని వ్యక్తులు కాందిశీకులయ్యారంటే మంది మార్బలం, దాస దాసీలు, ఆశ్రితులు అందరూ అనుసరిస్తారు.’ అని వివరించారు. రాజులతో పాటు అందరూ వేరొకచోటికి పోతారు. అలా కాందిశీకులుగా వచ్చిన వారందరినీ ఆదరించిన చోళ చక్రవర్తి శక్తి వర్మను, విమలాదిత్యుని చేరదీసి తన కుమార్తె అయిన కుందవ్వ ను విమలాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. విమలాదిత్యునికి రాజ్యం లేదు కాబట్టి శక్తివర్మ, విమలాదిత్యుడు చోళుల రాజ్యంలోని తిరువాయూరు లోని క్రీ.శ.975 నుండి క్రీ.శ.1000 దాకా ఉన్నారు. చివరకు శక్తి వర్మ క్రీ.శ.999 లో వేంగీ రాజ్యాన్ని గెలుచుకొని పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పుడు విమలాదిత్యుడు గూడా వేంగీ చేరుకొన్నాడు.

రాజ రాజ నరేంద్రుని సవితమ్మ కొడుకు విజయాదిత్యుడు పలుమార్లు వేంగీ మీదకు దండెత్తి రాజ రాజాను తరిమివేయడం వల్ల రాజ రాజ మేనమామ ఊరయిన తంజావూరు వెళ్లి వారి సహాయంతో విజయాదిత్యుని ఓడించినా రాజ రాజుకు సుస్థిర రాజ్యం ఏర్పడలేదు. అట్టి సమయంలో నన్నయ తన రాజు కొరకు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొన్నాడు.

నన్నయకు నారాయణ భట్టు మైసూరు మండలంలో సహాధ్యాయి. నారాయణ భట్టు కళ్యానిసే చాళుక్య ప్రభువు అహనమల్ల త్రైలోక్యమల్ల సోమేశ్వరుని ప్రధాని. తన ప్రభువు యొక్క రాజ్యం స్థిరంగా ఉండటం కోసం నన్నయ ఏమి చేశాడనే విషయాన్ని ఆరుద్ర తన సమగ్ర ఆంద్ర సాహిత్య గ్రంధం, పుట 161, మరియు తెలుగు భాషాసమితి విజ్ఞాన సర్వస్వం (౩వ సంపుటి, పుట 166) వివరిస్తూ ఇలా అన్నారు-

“ఈ పరిస్థితులను చూచినా రాజరాజ నరేంద్రుడును అతని కుల బ్రాహ్మణుడు నన్నయ భట్టు రాజనీతిని ప్రయోగించిరి.. ఈ కారణమును పురస్కరించుకొని నన్నయ రాజరాజ నరేంద్రునికి పశ్చిమ చాళుక్యులతో మైత్రి కుదిర్చి, నారాయణ భట్టును తమ ఆస్థానము నందు చాళుక్యుల రాయబారిగా నియమించుకొని రాజమహేంద్రవరమునకు రాజధానిని మార్పించి రాజరాజ నరేంద్రునికి శాంతి చేకూర్చెను.”

అంతకు ముందు కాలం వరకు వేంగీ రాజ్యానికి విజయవాడ రాజధాని. రాజరాజు తన పేరా రాజ మహేంద్రవరం అని గోదావరి ఒడ్డున రాజధానిని స్థాపించి అక్కడికి రాజధానిని మార్పించాడు.

రాజధానిని రాజమహేంద్రవరానికి మార్పించడంలో మరియు మహాభారత రచనలో నన్నయకు ఎంతో సహాయం చేశాడు నారాయణ భట్టు. ఇతను బహుభాషా కోవిదుడు. ‘కవీభవజ్రాంకుశ’ అనే బిరుదు కలవాడు. ఈయన మహా భారత ఘోట రణంబులో ‘నారాయణుడి లాగా భాషా యుద్ధాలలో నన్నయకు అభిమతంగా తోడ్పడ్డాడు. ఇందువల్లనే మహా భారత రచన జరిగిందని ఆరుద్ర గారు నారాయణ భట్టు గురించి గొప్పగా వివరించారు.

**** సశేషం ****

Posted in January 2021, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *