Menu Close
జంతుసంపద
ఆదూరి హైమావతి
LionsTigerReindeerCowCamelsBuffalo

మన జాతీయసంపదల్లో జంతుసంపదకూడా ఒకటి. సంపద అంటే ఐశ్వర్యము, కలిమి.

మరి జంతుసంపద అంటే జంతువులవలన దేశానికి తద్వారా ఆ దేశంలోని మానవులకు కలిగే సంపద. సంపద అంటే కేవలం ఒక దేశానికో లేక మానవునికో ఉండే ధనకనక వస్తువాహనాదికాలు కావు. ఆదేశంలో లభించే, జీవించే, సర్వ జీవుల వలన ఆ దేశానికి వచ్చే ఘనత.

అష్టైశ్వర్యములు అనే మాట కూడా ఉంది. ధనము, ధాన్యము, సంతానము, ధైర్యము, విజయము, ఆయుధబలము, రాజ్యము లేక భూములు, వాహనాలు. ఇవి ఎనిమిది విధాలైన సంపదలు. ఈ సంపదలను అవసరమైన వారికి అవసరమైన విధంగా వాటి ద్వారా సేవ చేస్తేనే వాటికి ఘనత, లేకపోతే మట్టిలో ఉంచిన వస్తువుల్లా వ్యర్ధమవుతాయి.

అష్టసిధ్ధులు – ఎనిమిది రకాలైన విద్యలు లేక విభూదులు. అవే

అణిమామహిమాచైవ గరిమాలఘిమాతథా ప్రాప్తిః
ప్రాకామ్యమీశత్వం వశిత్వంచాష్టభూతయః

అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి- ఇవికూడా సంపదలే. వీటి ద్వారా కూడా మానవసేవ చేయాలి. దుష్టత్వానికి వినియోగిస్తే అవి వ్యర్ధమవుతాయి.

జంతు సంపదలో జంతువుల వలన మన దేశానికి వచ్చే ఖ్యాతి, అందం, గర్వకారణమైన గొప్ప జంతువుల వలన ఘనత, అపురూపమైన జంతువులను కలిగి ఉండటం కూడా సంపదకు ప్రతిరూపాలే.

ఐతే ఏ సంపదైనా అది కలిగి ఉన్న ఒక వ్యక్తికో, దేశానికోకాక విశ్వానికంతా అనుభవైక వేద్యమై ఉండి, సేవాభావనకు దారి చేసేవిగా ఉంటేనే ఆ సంపదకు గౌరవం దక్కుతుంది. జంతువులు కొన్ని అడవుల్లోనూ, మరికొన్ని జనావాసాల్లోనూ కూడా ఉంటున్నాయి.

జంతువు అంటే చతుష్పాదము, నాలుగు కాళ్ళు కలది అని అర్ధం. ఆంగ్లంలో ‘యానిమల్‘ అంటాం. ఈ సృష్టిలో వున్న అనేకానేక జీవుల్లో జంతువులు ఒక విభాగం.

కొన్నిక్రూరమృగాలు, మరికొన్ని సాధు జంతువులు, పెంపుడు జంతువులు ఇలానేక విభాగాలుగా జంతువులు ఉంటున్నాయి. సింహాలు, చిరుతపులులు, లేళ్ళు, కుందేళ్ళు, నక్కలు, కోతులు, అడవి దున్నలు, ముళ్లపందులు, ఏనుగలు, అడవి పిల్లులు, తోడేళ్లు, దుప్పులు మొదలైనవి. వీనిలో కొన్ని కేవలం శాకాహారులైతే, మరికొన్ని కేవలం మాంసాహారులుగా ఉంటున్నాయి. అడవుల్లో ఉండే శాకాహార జంతువులను మాంసాహార జంతువులు తమ ఆహారంగా చంపి తింటుంటాయి.

కొన్నిజంతువులు మానవుల పెంపుడు జంతువులుగా ఉంటున్నాయి. ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు, మేకలు, గొఱ్ఱెలు, గుఱ్ఱాలు, పందులు, ఒంటెలు ఇంకా అనేకానేక జంతువులను మానవులు పెంచుకుంటూ వాటివలన తమ జీవన విధానాలను మెరుగుపరుచు కుంటున్నారు. అలాగే మరి కొన్నింటిని పెంచి ఆహారంగా వినియోగించుకుంటున్నారు కూడా. వ్యాపారనిమిత్తం కొన్నింటిని పెంచుకుంటున్నాడు. కొన్నిజంతువులను పాలకోసమూ, మరికొన్నింటిని వ్యవసాయంకోసమూ, ఇంకా అనేకానేక ఉపయోగాల కోసం వాడుకుంటున్నాడు.

ఇలా జంతువులను గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. అందుకే ఈ శీర్షికను ప్రత్యేకంగా జంతువుల గురించి చెప్పుకోను సృష్టించాము. ఒక్కో సంచికలో ఒక్కో జంతువు గురించిన సమాచారం ఉంటుంది. ఏవైనా తప్పులు ఉంటే పాఠకులు తమ సూచనలు సలహాల ద్వారా తెలుప మనవి.

మొట్ట మొదటగా రారాజు, మృగరాజు అయిన సింహం గురించి తెలుసుకుందాం.

సింహము

Lion

సింహము మన మృగరాజు. అంటే మృగాలన్నింటిలో బాగా బలమైనదని. సింహానికి ఎన్నో పేర్లున్నాయి ఏనుగుగొంగ, కంఠీరవము, కేసరి, గజమోటనము, జడలమెకము, పశురాజము, బహుబలము, మృగపతి, మృగరాజు, మృగేంద్రుడు, మెకములఱేడు. ఆడ సింహాన్ని సింగముఅంటారు.

సింహాన్ని ఆంగ్లంలో ‘లయన్’ అంటాం. ఇది ఒక కౄర జంతువు. మృగాలకు రాజు ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. వీటి పొడవు 5 నుండి 8 అడుగులవరకూ, బరువు 150నుండి  250 కిలోల వరకు ఉంటుంది.

Lion

మగ సింహానికి జూలు ఉంటుంది. మెడనిండా వెంట్రుకలు ఉంటాయి. అది ఉద్రేకంగా ఉన్నపుడు జూలును  ఇదిలించుకుని దూకుతుంది.

సింహాలు రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడు తుంటాయి.

సింహం పేరు వింటేనే సింహం కంటే ఎంతో పెద్దదైన ఏనుగు కూడా భయపడుతుంది, అంటే సింహం అంత బలమైనదన్నమాట. ఇది అడవికి అందాన్నిస్తుంది.

భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని గిర్ అభయారణ్యం లో కనబడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు. సింహాలను  అడవుల్లోకి వెళ్ళిచూడలేము. జంతు ప్రదర్శన శాలల్లో కూడా చూడవచ్చు.

Lioness

సింహము గొప్ప పరాక్రమము కలదని మనకు తెలుసు. దానితో పాటుగా దీనికున్న గొప్పగుణము ఏమంటే అది ఆకలైనపుడు మాత్రమే వేటాడుతుంది తప్ప కనిపించిన జంతువునల్లా చంపేయదు. మాటేసి శబ్దం లేకుండా కూర్చుని దూరంగా వేట జంతువు కనిపించగానే ఒక్క దూకు దూకి మెడ పట్టి కొరికి చంపేస్తుంది. చంపిన జంతువు రక్తం వేడిగా ఉన్నపుడే సింహం తింటుందంటారు.

పరాక్రమానికి ప్రతిరూపమైన ఈ సింహం జగన్మాత అయిన పార్వతీ దేవి వాహనం కూడా.

సింహం నడుము సన్నగాఉంటుంది. అందుకే అందమైన అమ్మాయిలను 'సింహంలాంటి నడుము' అంటారు. సింహావలోకనము అంటారు. అంటే సింహం, అంత బలమైన దైనా వెనక్కు తిరిగి చూసుకుంటుంది, జాగ్రత్తకోసం. మానవులు ఏపనైనా చేసేప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించాలనే భావనతో ఈ మాట వాడుతుంటారు.

Posted in January 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *