Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
అబాబీలు (నూతన వచన కవితా ప్రక్రియ)

అబాబీలు అనే ఈ కొత్త ప్రక్రియలో 5 వరుసలు ఉంటాయి. వరుసక్రమంలో సమస్య, విషయ విశ్లేషణ, వివరణ, ఆత్మాశ్రయం, సందేశం లేదా వ్యంగ్యాత్మక చమత్కారంతో అబాబీ ముగుస్తుంది.

కృష్ణాజిల్లా వినుకొండకు చెందిన కవి షేక్ కరీముల్లా 2019లో బదర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా సూటిగా ప్రక్రియను పాఠకులకు, కవులకు పరిచయం చేశారు. ఆవిష్కరణ అనంతరం పలువురు కవులు ఈ ప్రక్రియవైపుకు ఆకర్షింపబడి తమ కలాలను కదిలిస్తున్నారు.

పీడిత వర్గాలకు మద్దతుగా కవులంతా సాహితీ సేద్యం చేయాలనే పిలుపునివ్వడమే ప్రక్రియ పరిచయ లక్ష్యంగా తెలుపుతున్నారు కవి కరీముల్లా.

ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక విలువలకు ఊపిరులూదడమే తన సాహితీ లక్ష్యంగా ప్రకటిస్తున్నారు.
ప్రక్రియకు అబాబీలు అని పేరు పెట్టడం వెనుకగల చారిత్రక స్ఫూర్తి:-

మహ్మద్ ప్రవక్త జననానికి పూర్వం అబ్రహా అనే రాజు మక్కాపై దండెత్తగా బలహీనులైన మక్కా ప్రజలు రక్షించమని దైవాన్ని ప్రార్థించి తలోదిక్కుకీ పారిపోయారు. అప్పుడు అబాబిల్ అనే పక్షుల గుంపు సైన్యంపై దాడి చేసి వారిని తుదముట్టిస్తుంది. ఈ అబాబిల్ పక్షుల చైతన్యం, ధైర్యం, సామూహిక తత్వం ఇప్పుడు కవుల కలాలకు అవసరమని కవి కరీముల్లా భావిస్తున్నారు. సమస్త పీడిత ప్రజల పక్షాన యుద్దం చేసే ప్రతి అక్షరమూ ఒక అబాబిల్ పక్షి వంటిదే అనే భావనతో ప్రక్రియకు అరేబియన్ పక్షి అయిన అబాబీ పేరును ఖరారు చేశారు.

ప్రక్రియలో తొలి సంపుటి పేరు బదర్ అనగా అరేబియాలోని ఆ యుద్ద మైదానం పేరు. ప్రస్తుతం ఫేస్ బుక్ వేదికగా అనేకమంది కవులు అబాబీలను సృజిస్తున్నారు.

అబాబీలు ప్రక్రియ నియమాలను మరోసారి చూద్దాం.

 1. అబాబీకి 5 వరుసలు ఉండాలి.
 2. మొదటివరుస సమస్య
 3. రెండవ వరుస విషయ విశ్లేషణ
 4. మూడవ వరుస వివరణ
 5. నాలుగవ వరుస ఆత్మాశ్రయం
 6. అయిదవ వరుస సందేశం లేదా వ్యంగ్యాత్మక చమత్కారం.

స్పష్టత కోసం నేను రాసిన కొన్ని అబాబీలను ఉదాహరణగా ఇస్తాను.

ఎక్కడో ఏదో కాలుతోంది
వింత కమురు వాసన
బిడ్డల్ని పొదువుకోవాలి
రాధికా!
బూచోళ్ళు పెరుగుతున్నారు.

ప్రకృతి నిట్టూర్పులు
రాలుతున్న ఎండుటాకులు
శోకించే స్థితి రానీకు
రాధికా!
గొడ్డలి వేటు మామూలైంది.

ప్రసవ వేదన మూలుగు
నరకమనుభవిస్తున్నారెవరో
ఆడా మగా తేడా లేదు
రాధికా!
నిజం ఒప్పుకోవడం కష్టమే మరి.

గుండెలు పిండేసే రోదన
ఎక్కడో ఎవరో తెలీదు
జనంలో స్వార్థం పెరిగింది
రాధికా!
భూమంతా విషమౌతోంది.

సునామీ హెచ్చరికలు
భూకంపం సంకేతాలు
పట్టించుకునేదెవరు
రాధికా!
ఎవరి పరుగు వారిదే.

బంగారం ధర కొండెక్కింది
సరుకుల వెలలు ఆకాశానికి
కిందేం ఉందని వెతకకు
రాధికా!
నీతీ, న్యాయం పాతాళానికి.

వనితలంతా వశం కావాలి
తన పెళ్ళాం పవిత్రంగా ఉండాలి
జాలరి వల చింపేయ్
రాధికా!
స్వభావం పసిగట్టాలి.

రోడ్డంతా చెమట వాసన
నిట్టూర్పుల వడగాల్పులు
వలసకూలీల కాలిన కాళ్ళు
రాధికా!
మబ్బులే పెద్దమనసు చేసుకోవాలి.

***సశేషం***

Posted in January 2021, సాహిత్యం

3 Comments

 1. కవి కరీముల్లా

  ధన్యవాదాలు రాధికారాణి గారు.అబాబీలు చక్కగా పరిచయం చేసారు…కవి కరీముల్లా, వినుకొండ, గుంటూరు జిల్లా

 2. గోదావరి రచయితల సంఘం

  చాలా చక్కటి విశ్లేషణతో కూడిన వివరణ. కొత్తవారికి సులువుగా అర్ధమయ్యే రీతిలో మీ శైలి చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *