Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

‘పులిగాడి కంటే గిలి గాడు చాలా శక్తిమంతుడు’ అనే నానుడి మనం వినే ఉంటాం. శారీరక రుగ్మతల కంటే మానసిక ఆందోళనలే మనలను ఎల్లప్పుడూ బాధిస్తుంటాయి. అందుకే మానసిక ధైర్యం మెండుగా ఉండాలని అంటుంటారు. మన చుట్టూ పదిమంది మన అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు కలిగే బలం ఎంతో ఉన్నతమైనది. ఈ విషయాన్ని శాస్త్రీయంగా చెబితే ఎవరూ వినరు. ఆధ్యాత్మికతను జోడించి వివరిస్తే అందరూ అంగీకరిస్తారు, ఆచరిస్తారు. నలభై ఏళ్ళు దాటితే మానసిక ఒత్తిడి అనేది మెండుగా ఏర్పడుతుందనే భావన మనందరిలో ఉంది. కారణం కుటుంబ బాధ్యతలు, సామాజిక ఉన్నతి కోసం, ప్రతిష్ట కోసం పడే తపన, డబ్బులు ఎక్కువ సంపాదిస్తే రిటైర్ అయిన తరువాత హాయిగా బతకవచ్చు అనే ఆలోచన. కానీ బాధ్యతలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. వాటిని నిర్వర్తించే విధానాలు సరిగా ఉండి, మనం సాధారణ నియమబద్ధ జీవన శైలిని మొదటినుండే అలవరుచుకొని సమతుల్యంతో మన జీవిత ధర్మాలను పాటిస్తే  ప్రతిష్ట, ఆస్తులు, అంతస్తులు అన్నీ వాటంతట అవే సమకూరుతాయి. అంతేగాని, మన సామర్ధ్యాన్ని, స్థితిని మరిచిపోయి విపరీతమైన ఒత్తిడితో జీవితాన్ని గడుపుతూ లేనిపోని జబ్బులను తెచ్చుకుని వాటితో జీవితాంతం సహవాసం చేయడం ఎంతవరకు సమంజసం. మనకు ఉన్నదానితో తృప్తి పడుతూ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తే ఆ జీవన బాట అంతా నందనవనమే అవుతుంది. మన మనసుకు ప్రశాంతత చేకూరాలంటే మనలో విచక్షణ మెండుగా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అలాగే శాంతి, సహనం కూడా అలవర్చుకోవాలి.

ప్రతి మనిషిలోనూ నేను ఇంతకూ మునుపు చెప్పినట్లు అనుభవ పూర్వక ఆత్మపరిజ్ఞానం ఉంటుంది. మనం చీదరించుకునే తాగుబోతు నుంచి కూడా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. మంచి-చెడు అనేవి మందితో కలిసి మనం సృష్టించుకొన్నవే. డబ్బు మీద ఆశ, ధ్యాస ఉన్నవారు ప్రతి విషయాన్ని డబ్బు పరంగానే చూస్తారు. వారు కోరుకున్న సంపద లభించిన నాడు ఇంకా ఎక్కువ కావాలనుకోవచ్చు లేకుంటే కీర్తి ప్రతిష్టల మీద ధ్యాస మరల్చవచ్చు. దైనందిన జీవన సమస్యలతో ఉన్నవారు ఒక పది కాసులు ఎక్కువ వచ్చినా ఎంతో తృప్తి చెందుతారు. మన మనస్సు ఒక విధానాన్ని అలవర్చుకొని తదనుగుణమైన ఆలోచనలతో మనం జీవితాన్ని కొనసాగనిస్తాము. ఆ విధానాన్ని మార్చుకోవాలంటే అంత సులువు కాదు. ఆ మైండ్ సెట్ ను అంత సులభంగా మార్చుకోలేము.

వారసత్వ సంపద వచ్చిందంటే దాంతోపాటు వారసత్వ లక్షణాలు, జన్యు కణాలు, సామాజిక పరిస్థితులు, సాంఘీక తేడాలు ఇలా ఎన్నో ఇతర ధర్మాలు కూడా సంక్రమిస్తాయి. అన్నింటిని సమతుల్యంగా పాటిస్తూ విచక్షణతో వ్యవహరిస్తే పురోగతి కనపడుతుంది.

కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయలేదనే అసహనం, అసంతృప్తి మనలో ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అది అత్యంత సహజమైన ఆలోచన. కానీ ఒక్క విషయం మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అది ఉదాహరణ రూపంలో చెప్పాలంటే:

మనకు రకరకాలైన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అందులో చాలా reward పాయింట్స్ వస్తుంటాయి. ఆ పాయింట్స్ అనేవి మనం చేసే ఖర్చుల ఆధారంగా మరియు సమయానుకూల ఉపయోగాలతో వస్తాయి. అంతేకాదు, ఆ క్రెడిట్ కార్డు కంపెనీ ఇచ్చే ఆఫర్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఆ పాయింట్స్ ని మనం మన అవసరాలకు తగ్గట్లు ఉచితంగా వాడుకోవచ్చు. మరి ఆ rewards లేకుండా మనం అసలు కార్డ్స్ ని వాడకుండా ఉంటె మనకు అవసరమైనప్పుడు ఎలా ఫ్రీ గా వస్తాయి? అలాగే ఇతరులకు సహాయపడే సేవా దృక్ఫదం కలిగిఉండి మనం చేసే మంచి పనులు మనకు మంచి పాయింట్స్ తెచ్చిపెడతాయి. మనకు అవసరమైనప్పుడు వేరెవరో ఆ పాయింట్స్ లాగా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇదంతా ఇచ్చి పుచ్చుకునే మానవ సంబంధ అనుబంధాల ప్రహేళిక. స్వార్థచింతన మెండుగా ఉంటే దానివలన ఇతరులకు ఎటువంటి మేలు జరగదు పైపెచ్చు హాని జరగవచ్చు. మానవత్వంతో కూడిన దయగల మనస్సు మానవులందరిలోనూ ఉంటుంది. అవసరమైనప్పుడు దానిని చూపిన వారే నిజమైన మనిషిగా గుర్తింపు పొందుతారు.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in January 2021, ఆరోగ్యం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *