Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-44 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ది స్టోరీ ఆఫ్ ఎ రైటర్

పిన్నీస్ బుక్కాఫ్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కిన ప్రపంచ ప్రఖ్యాత తెలుగు రచయిత Know bell బహుమతి కొట్టడానికి ఓ అద్భుతమైన సినిమా కథ మొదలు పెట్టాడు.

*** *** *** ***

బలుసుమూడి రిక్షారాములంటే మొత్తం భీంవరానికే వరల్డ్ ఫేమస్. ప్రస్తుతం రిక్షారాములు భార్య మస్కారిటుస్కాన్ అనే వ్యాధితో మంచం పట్టింది. ఎంత రిక్షావోడైతే మాత్రం మామూలు మున్సిపాల్టి ఆస్పిటల్లో చూపించుకుంటే పరువు పోదా? అందుకే తీసికెళ్ళి "ధన్వంత్రీ" అనే త్రీస్టార్ హాస్పిటల్ కి తీసికెళ్ళాడు. కనీసం వారం రోజులైనా ఐసీయూలో పెట్టకపోతే పని జరగదన్నారు. కానీ తెల్లకార్డు బకాయిలు రాలేదు కాబట్టీ చెల్లదన్నారు.

ఎలాగైనాసరే తన భార్యని బతికించుకోవాలి. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు రిక్షారాములు. తిన్నగా హాస్పిటల్లో పెద్దడాక్టర్ గదిలోకి వెళ్ళాడు. తన భార్యని వెంటనే హాస్పిటల్లో చేర్చుకొమ్మన్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. "రిక్షాలాక్కునేవాడివి. లక్షలకి లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించడం నీవల్ల కాదుగాని ఎల్లెల్లవో రాములూ" అన్నాడు.

దాంతో రాములుకి పౌరుషం పొడుచుకొచ్చింది. తిన్నగా హాస్పిటల్ ఓనర్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. పావుగంటదాకా ఓనర్ బయటికి రాలేదు. ఓనర్ తలుపు తెరవగానే, ఆయన మీద విరుచుకు పడ్డాడు,"నా భార్య ఇక్కడ ప్రాణాల్తో ప్రపంచ యుద్ధం చేస్తుంటే నువ్వు లోపల నీ పెళ్ళాంతో కులుకుతావా? నీ ధనమదానికి అడ్డూ ఆపూ ఉండవా? నీ గర్వాంధకారానికి కళ్ళు కనపడవా? మాలాంటి పేదోళ్ళ కడుపులు కొట్టి మేడలు కట్టి మా పెళ్ళాలకి ఎక్కడలేని రోగాలూ పెట్టి మా రక్తాన్ని పొట్టనిండా పట్టి ఎముకల్ని పిండి కొట్టి దాంతో రొట్టెలు చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారా డబ్బున్న గర్విష్టుల్లారా? మా పేదోళ్ళంటే అంత చులకనా? ఏమనుకుంటున్నారు మా పేదోళ్ళంటే? మేం రిక్షా తొక్కితేగానీ మీ కారు నడవదు. మేం రిక్షా తొక్కితేగానీ మీకు తెల్లారదు. మేం రిక్షా తొక్కితేగానీ.."

రాములు డైలాగు కంప్లీట్ కాకముందే అడ్డం పడిపోయాడు హాస్పిటల్ ఓనర్,"ఈ ప్రపంచం నా డబ్బుతో కాకుండా నీ రిక్షాతోనే నడిచేది నిజమైతే నీ రిక్షాతో నా కారుని గెలవగలవా?"

"చెమటంటే నీకింత లోకువా? నీ కారు నడవటానికి ఇం"ధనం" కావాలి. విమానం ఎగరడానికి ఇం"ధనం" కావాలి. రాకెట్లు దూసుకుపోవడానికి ఇం"ధనం" కావాలి. మీ ధనమదాంధుల దగ్గర అంతకంటే ఏముంటుంది ధనం తప్ప. కానీ వంద రాకెట్లు వేల జాకెట్లు లక్షల ఐస్ ఫ్రూట్లు ఎన్నైనా మా చెమట చుక్క ముందు బలాదూర్. నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ముందు నా భార్యని ఐసీయూలో జాయిన్ చేసుకో" అంటూ తొడకొట్టాడు.

ఒకవేళ నువ్వే గెలిస్తే నీ గెలుపుతో ట్రీట్మెంట్ చేయించినట్టు. ఓడిపోతే మా ఉన్నోళ్ళ దయాదాక్షిణ్యాలతో నీ భార్యని బతికించుకున్నట్టు. ఇదే మీ కోట్లాదిమంది పేదోళ్ళమీద మా పదిమంది ధనవంతుల సవాల్" అంటూ వెంటనే భార్యని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ మొదలెట్టమని చెప్పి పోటీకి సిద్ధమయ్యాడు ఓనర్.

కారుకీ రిక్షాకీ మొదలైంది పోటీ. రిక్షారాములు రిక్షా తొక్కుతొన్నాడు. గుండెల్లో ఛాలెంజ్. కండల్లో ఛాలెంజ్. నరనరానా ఛాలెంజ్. ఛాలెంజింగ్ లో ఛాలెంజింగా ఛల్ ఛల్ అంటూ తొక్కుతున్నాడు ఛాలెంజి రిక్షారాములు. చూస్తూండగానే కారుని ఓవర్ టేక్ చేసింది రిక్షా. అంతే భీంవరం పాలకొల్లు నరసాపురం తాడేపల్లిగూడెం, రష్యా అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

అలా తొక్కీ తొక్కీ నీరసించి చెమటంతా ధారపోసి పడిపోయాడని రాశాడు రైటర్. అతని ప్లాన్ ప్రకారం రిక్షారాములు చచ్చిపోవడం క్లైమాక్స్. కానీ అంత పెద్ద ఛాలెంజ్ లో గెలిచిన హీరో చచ్చిపోతే ఆడియన్స్ ఊరుకోరు. కానీ క్లైమాక్స్ లో సింపతీ కావాలి. అందుకే అతని భార్య కారెక్టర్ని చంపేస్తే లేడీస్ సెంటిమెంట్ వర్కౌటవుతుందనుకున్నాడు. సీన్ని హాస్పిటల్ కి కట్ చేశాడు.

ఆపరేషన్ సక్సెస్సయింది. అప్పుడే రిక్షారాములు భార్య రిక్షారాముల్తో కలిసి డ్యూయెట్ పాడేస్తోంది.

"రిక్షారాములు పెళ్ళామా రిక్షారాములు పెళ్ళామా డాన్సులెయ్యకూడదమ్మా. ఆడియెన్స్ ఒప్పుకోరు. వాళ్ళు కన్నీళ్ళు కారుస్తూ బైటికెళ్తే తప్ప సినిమా హిట్టవ్వదు తల్లీ. వాళ్ళు ఏడవాలంటే మీ ఆయన చచ్చిపోవాలి. కానీ ఆయన కారెక్టరైజేషన్ చావడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కథకి మూలం నీకొచ్చిన మస్కారిటుస్కానే కాబట్టీ అది తిరగబెట్టిందనుకుని చచ్చిపోతల్లీ" అని ప్రార్థిస్తూ ఆమె చనిపోయినట్లు రాయబోతున్నాడు.

అంతలోనే రిక్షారాములు భార్య అక్షరాల్లోంచీ ఒక్కసారిగా గావుకేకలు పెడుతూ పైకి లేచింది. రైటర్ మీదకొచ్చింది. కడప కత్తితో రైటర్ మెడ అడ్డంగా నరికేస్తూ సింహంలా గర్జించింది,"జనాన్ని ఏడిపించడం కోసం నన్ను చంపే హక్కు వీడికెవడిచ్చాడ్రా?"

దెబ్బతో రైటర్ ఫట్టు-సినిమా హిట్టు

ఆ సంవత్సరానిగ్గాను no bell ప్రైజాఫ్ గరగపర్రు గాన్ టు ది సేమ్ ఫిల్మ్.

వీడుకోలు -- వింజమూర్ విజయకుమార్

ఉదయం ఐదు కావొస్తోంది. నాకు మెలకువ వస్తోంది. అమ్మ కదలనివ్వకుండా పడుకోమంది. ఒంట్లో ఏదో తెలియని శక్తి ఒళ్ళు విరుచుకోమంటోంది. అమ్మ చేతులు వెచ్చగా తాకుతున్నాయి, మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్నా, ఇంతలో ఎవరో తలుపు తట్టినయ్యింది, మావయ్య వచ్చినట్టున్నాడు, బావున్నావామ్మా అని చల్లగా అమ్మ నుదుటిపైన తాకాడు ఆ ఆప్యాయతకు అమ్మ ఒక్క సారి కదిలిపోయింది. రాత్రి నుండి వేచి చూస్తున్నా ఇప్పుడా వచ్చేది అన్నట్టు చూసింది అమ్మ, ఆయన నిన్న సాయంత్రమనగా వెళ్ళారు నువ్వూ లేకపోతే ఎలా అని మూతి ముడుచుకుంది అమ్మ. రోజూ ఉండే కథే కదా అని నవ్వుతూ నన్ను చూచాడు మావయ్య.  నాకూ అమ్మ ముద్దు ముఖం చూసే సరికి నవ్వొచ్చింది, నన్ను చూసి అమ్మ కూడా నవ్వేసింది.

ఇంతలో కళ్ళెదుట నాన్న వచ్చాడు నారింజపండు రంగులో ఉంటాడు నాన్న, నాన్నని చూడాలన్న ఆత్రుత నాకు, నాన్న నన్ను తాకగానే ఒక్క సారి నా ముఖం విప్పారింది.  పక్కింట్లో కూడా పిల్లలందరూ ఒక్క సారి నవ్వేసారు. అదేంటో, మా నాన్నను చూడగానే అందరికీ అంత ఆత్రుత, ఆనందం! కాదు మరీ! అంత అందంగా ఉన్నాడు నాన్న. కడుపులో ఉన్నపుడు కథలు చెప్పేది అమ్మ, నాన్నకి ఒక పని కాదుట, లోకానికంతటికీ ఆయనే చూసుకుంటాడట. ప్రాణమిచ్చే వాడు, ప్రాణం కాపాడే వాడు, సరిగ్గా నడుచుకోకపోతే వెనక్కి తీసేసుకునే వాడూనట.

పిల్లలందరూ తలలూపుకుంటూ పలకరించుకుంటున్నారు. కొందరు నాన్న రంగులో ఉన్నారు, పండగేమో కొందరు ముఖానికి పసుపు రాసుకున్నట్టున్నారు. పక్కనే మా అక్కా వాళ్ళు మావయ్యతో ఏదో గుసగుసలాడుతున్నారు. నాగురించేనేమో చాడీలు!!

సుప్రభాతం పెట్టారెవరో "లేచి నిను చూడ ఈ వేళ నోచినామో" అని తీయటి ఘంటసాల మాష్టారు గొంతు విని అందరం నాన్న వైపు చూచి దణ్ణం పెట్టేసుకున్నాము.

"కమలాలు వికసించు కాలమాయె నానా సుగంధ కుసుమాలు నవ్వెనవిగో" అంటూ మా నవ్వులన్నీ ఘంటసాల మాష్టారు కంఠంతో శారదా మాత వీణలా షహానా రాగ స్వరసమ్మిళితమై అందరినీ మేల్కొల్పుతున్నాయి.

నేను చూస్తూనే‌ ఉన్నా, పక్కింట్లో తలుపు చాటున ఒకతను అక్కనే చూస్తున్నాడు, అక్కక్కూడా తనంటే ఇష్టమనుకుంటా! ఏంటీ ఇంత నల్లగా ఉన్నాడు ఎట్లా ఇష్టపడిందబ్బా అనుకున్నా! ఎగురుకుంటూ వస్తున్నాడు అక్కయ్య దగ్గరికి సంతోషంతో రమ్మంటోంది అక్క, ఎంతకి తెగించింది!! అమ్మేమో మావయ్యతో ముచ్చట్లలో మునిగి ఉంది. ఇద్దరూ ఏదో రహస్యం మాట్లాడుకున్నారు కొంతసేపు, పెద్దవాళ్ళు ఇలాగే మాటాడుకుంటారు కాబోలు. అతను వెళ్ళి పోయాడు అక్కయ్య‌ మొఖం లో తెలియని‌ కాంతి శాంతి ఒకే మారు గోచరమైనాయి. నాన్న కోప్పడి మండిపోయాడు, మావయ్య నేస్తమనుకుంటా నల్లగా ఉన్నాడితనుకూడా నాన్నతో ఏదో మాటాడినట్టున్నాడు శాంతించాడు. అతను మాటాడుతుంటే నాన్నకు నల్లకోటు వేసినట్టు హుందాగా ఉన్నాడు. నల్లగా ఉన్నా చల్లటి మనసనుకుంటా మా  అందరికీ అమృతాన్ని పంచాడా పెద్దాయన. అమ్మ తడిసి ముద్దయింది, మేమంతా హాయిగా నవ్వుకున్నాము.

రేపు అక్క వెళ్ళిపోతుందట పెద్దవాళ్ళైపోతే అందరూ వెళ్ళిపోవాలట అమ్మ చెప్పింది. అమ్మా నేను వెళ్ళనమ్మా!! ఇలాగే చిన్నదానిలాగానే నీ దగ్గరే ఉండిపోతా అన్నా. నీ వయసులో అక్కకూడా ఇలానే అందమ్మా అని అన్నదమ్మ. నాకు ఒళ్ళు మండింది ముఖం ఎర్రగా మారింది. నా కోపాన్ని చూచి మావయ్య పలకరించడానికి వచ్చాడు ఒక్క సారి ఊగిపోయాను.

అక్కని చక్కగా ముస్తాబు చేసింది అమ్మ. ఎందుకమ్మా అని అడిగితే చెప్పానుగా రేపు పెద్ద పండగ అక్క, వాళ్ళ నేస్తాలు అందరూ వెళ్తారు గుడికి. నేను బెంగగా అక్కతోటే ఉన్నా, రాత్రంతా కంటిమీద కునుకు లేదు.

మరునాడుదయం నేను నాన్న కంటే ముందే, పెందరాళే లేచాను. అంతలో, కఠోర కుఠారాల్లా ఐదు కత్తులు అక్కయ్యను ఆమె నేస్తాల కంఠాలను కోసేస్తున్నాడు నాకు ఏడుపొచ్చేస్తోంది అమ్మా! అమ్మా! చూడు అంటున్నా, అమ్మ మౌనంగా చూస్తోంది. మావయ్య కూడా స్థంభించిపోయి ఉన్నాడు!! ఏంటి ఈ అమ్మ!!! మాతో ఇన్ని మాటలు మాట్లాడుతుంది వీళ్ళతో ఏమీ అనదేమీ ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే!! నాన్నా నువ్వైనా ఆపు నాన్నా!! అయ్యో, నాన్న ఇంకా లేవలేదు నిద్ర!! ఎవరితో చెప్పను? ఏమని చెప్పను? ఆ! మాష్టారుతో చెబుతా నా బాధ!! ఆయన వాళ్ళతో నా మాటగా విలపించాడు "పూజ లేకున్న నీ పున్నెమాయె  కోయబోకు మా పేద కుత్తుకలను" అని, విన్నాడా ఆ రాక్షసుడు!! లేదు!!! తనపనేదో తాను చేసుకు పోతున్నాడు. కోసిన మమ్మల్ని ఆ పెద్దాయన ముందుంచితే అతనికి మోక్షమట!! భక్తి వస్తుందట!! నాబొందట!!! నాకు ఏడుపాగట్లేదు. అరెరె "బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు" నీకు అంతటి మహాత్ముడైనా దయా బుద్ధి నేర్పించలేకపోయాడు, ఎందుకీ మహోత్కృష్టమైన మానవ జన్మ నీకు? అందుకే "మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ" నా బాధంతా అతన్ని తిట్టడంలో వెళ్ళబోసుకున్నా!! ఇతనికెట్లాగూ మా భాష రాదు ఏం లాభం ఎంత తిట్టినా, మరోజన్మంటూ ఉంటే కనీసం మా భాష తెలిసిన కరుణశ్రీ గారింట్లో అమ్మా, అమ్మ కడుపులో నేనూ, పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాను.

నేను అమ్మా మావయ్య నాన్న మరికొందరు పక్కింటి పిల్లలూ మాత్రమే మిగిలి పోయాం కన్నీళ్ళతో మా అక్కా వాళ్ళకి వీడ్కోలు పలుకుతూ...

భలే మంచి చౌక బేరము -- అత్తలూరి విజయలక్ష్మి

సుబ్బారావు బంధుమిత్ర, సకుటుంబ, సపరివారంగా ఉన్న రెండు కార్లు ఆ హాలు గేటు ముందు ఆగాయి. బిల, బిలలాడుతూ అందరూ దిగి గేటులోపలికి నడుస్తుంటే ఒకటీ, రెండూ అంటూ అందరినీ లెక్కపెట్టి. లెక్క సరిగా ఉందని తృప్తిగా తనూ గేటు దాటి వేగంగా లోపలికి నడిచాడు. హల్లో అడుగుపెట్టగానే కర్పూరం వాసన గుప్పుమంది. ఆ వాసన మనసారా ఆఘ్రాణించి హమ్మయ్య అనుకుంటూ హుషారుగా కర్చీఫ్ లు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ హాల్లోకి వస్తున్న ప్రేక్షకుల వైపు చూసాడు..

సుబ్బారావుకి ఎగిరి గంతెయాలనిపించింది. ఎవరన్నా చూస్తే బాగుండదని తన సలహా పాటించిన వాళ్ళందరినీ లోలోపల తలచుకుని మురిసిపోతూ ఆర్గనైజర్ కోసం చూసాడు. ఎక్కడా కనిపించలేదు. ఇతను ఇంకా రాలేదేం! అసలు తన్ని గేటు దగ్గర నుంచే పూలు చల్లుతూ ఆహ్వానిస్తాడనుకుంటే ఎక్కడికి వెళ్లినట్టు! సుబ్భారావుకి కోపం వచ్చింది. తను గత నెల రోజులుగా పడిన కష్టం, పెట్టిన ఖర్చు అంతా వృధా అయినట్టు అనిపించింది.

సుబ్బారావు  సాహిత్యాభిమాని. ఎన్నో ఏళ్లుగా అనేక వార, దిన, మాసపత్రికలే కాక అప్పుడప్పుడు మెరుపులా కనిపించి మాయమయ్యే అనేక పత్రికలు తెప్పించి వాటిలో వచ్చే కధలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలూ, ఎడిటోరియల్స్ ఒకటేమిటి టైటిల్ పేజీ దగ్గరనుంచి ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ దాకా మొత్తం చదవడం, ఆ చదివిన వాటిని పొగుడుతూ ఉత్తరాలు రాయడం అతని హాబీ. అతని ఉత్తరాలకి బోలెడు ప్రైజులు కూడా వచ్చాయి. ఉత్తరాలు అనబడే యాంటిక్ వస్తువుని చూడాలనుకునేవాళ్ళు అంతర్జాతీయ గ్రంధాలయాలకో, మ్యుజియం కో వెళ్ళక్కర్లేదు.. సుబ్బారావు దగ్గరకి వస్తే చాలు. అలాంటి సుబ్బారావు తను చేస్తున్న మహత్కార్యం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆశతో ఎప్పటినుంచో ఫైల్ చేసి దాచుకున్న ఆ ఉత్తరాలన్నీ లేఖా సాహిత్యం అనే పేరుతొ ఒక పుస్తకం గా ప్రచురించి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాడు. అయితే అతిధులకు, మిత్రులకు ఆహ్వానపత్రికలు కూడా పంపించి, శాలువాలు, మెమెంటోలు కొన్నాక పిడుగులాంటి వార్త వచ్చింది. దిక్కుమాలిన విదేశీ జబ్బేదో వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీస్ లు మూసేసి, ఉత్సవాలు, ఊరేగింపులు, పెళ్ళిళ్ళు, సభలు, సమావేశాలు జరపద్దని ప్రజలంతా ఇళ్ళల్లోంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుబ్బారావు గుండె గుభేలుమంది. లేక, లేక ఒక మహాగ్రంధం ప్రచురించి ఆవిష్కరణ సభ పెట్టుకుంటే ఇదేమి అపశకునం రా దేవుడా అని జుట్టు పీక్కుంటుంటే భార్య ఓ సలహా ఇచ్చింది. సుబ్బారావు అదివిని ఎగిరిగంతేసి వెంటనే అందరికీ ఆ సలహా వాట్సప్ లో పంపించాడు. వాతావరణం చూస్తుంటే ఆ సలహా అనుకున్న దానికన్నా ఎక్కువగా వర్క్ అవుట్ అయినట్టు అనిపించింది.

సుబ్బారావు ఆర్గనైజర్ కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఆహ్వానపత్రికలో ఇచ్చిన టైం దగ్గర పడుతోంది. అతిధులు వచ్చే టైం అయింది. సుబ్బారావుకి టెన్షన్ పెరిగిపోయింది. గబగబా హాలు మూలమూలలా వెతుకుతూ హాలు బయట కారిడార్ లోకి నడిచాడు. కారిడార్లో ఒక మూల టేబుల్ మీద రెండు ప్లాస్టిక్ ట్రేలు పెట్టుకుని  కూర్చున్నాడు ఆర్గనైజేర్. అతని చుట్టూ జనం మూగి ఉన్నారు. సుబ్బారావు వేగంగా అతని దగ్గరకు వెళ్లి “ఏంటండి నాగరాజు గారూ! ఏం చేస్తున్నారిక్కడ? అవతల అతిధులు వచ్చే టైం అయింది కంగారుగా ఉంది నాకు”  అన్నాడు.

“ఎందుకండీ కంగారు.. వాళ్ళ కోసమే నేనూ ఎదురుచూస్తున్నా.. ఇదిగో  స్టాక్ కూడా వాళ్ళ కోసమే దాచి ఉంచాను. వీళ్ళంతా మాకివ్వండి, మాకివ్వండి అంటూ నా ప్రాణం తీస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ సుబ్బారావుగారూ! ఉత్తరాలు రాయడంలోనే కాదు, మంచి సలహాలు ఇవ్వడంలో కూడా ఇంత నేర్పరి అని నాకు తెలియదు సుమా... అరె ఏం ఐడియా ఇచ్చారండి. ముద్దకర్పూరం కర్చీఫ్ లో వేసుకుని వాసన చూస్తె ఏ వైరస్ లూ మనలను ఏమి చేయవని కొత్త విషయం చెప్పారు. మీ వాట్సప్ మెసేజ్ చూసిన వెంటనే హైదరాబాదు, సికింద్రాబాదు జల్లెడ పట్టి కొనుక్కొచ్చా .... నా పెట్రోల్ ఖర్చులు పోనూ మాంచి లాభం వచ్చిందనుకోండి... ఇళ్ళల్లో మగ్గిపోతున్న వాళ్ళంతా బ్లాక్ లో కొనుక్కుంటున్నారు. ఎంతైనా వ్యాపారం అంటే సీజనల్ గా ఆలోచించాలండి.” పరవశంగా చెబుతున్న అతన్ని చూస్తూ నోరెళ్ళ బెట్టాడు సుబ్బారావు.

కరోనా కాఫీ... -- డా. శ్రీదేవి శ్రీకాంత్

కన్నా...కాగితం..కలం.తీసుకో...నేను చెప్పేది రాసుకో...

ఊ.. 'చెప్పు బామ్మా'...

కాగిత మేది రా?

"ఫోను.. నోట్స్ లో రాస్తా"...

ఓ అలాగా కన్నా..

"మరి చెరపాలంటే ఎలా? రా....ఏవిటో..

అన్నీ విడ్డూరాలే గాని రాసుకో"...అది సరే

"ఆ యూ టూబ్ అంటారే అందులో పెట్టు.

నేనున్నా లేకున్నా...నా పేరు వుంటుంది పదికాలాలు..

కరోనా కాఫీ, కరోనా కాఫీ...బామ్మ చేతి కరోనా కాఫీ...

మీ ప్రాణాలకు ఈ బామ్మ హామీ..

ప్రొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగండి

కరోనా కాఫీ. తరియించండి". అంటూ బామ్మ చెప్పుకు పోతుంది.

"కాఫీలో ...ఏమి దినుసులు వెయ్యలో చెప్పు బామ్మా"...

"కన్నా...రాసుకో..

దినుసులు..

కరివే పాకు, కరక్కాయ, జీలకర్ర, వాము, శొంఠి, తులసి ఆకులు, సోంపు, యాలకులు, త్రిఫల చూర్ణం, తినే కర్పూరం"...

"బామ్మా... ఆగు ఆగు...తినే కర్పూరం బాగోదేమో"...

ఎదురు చెప్పకుండా రాయి రా కన్నా.

"ఎన్ని దినుసులు పెంచితే అంత బాగుంటుంది"...

"యూ ట్యూబ్ లో మెచ్చు కుంటారట....

ఇదుగో...నన్ను వీడియో తీసేప్పుడు చెప్పు... మీతాత చేయించిన కాసులపేరు వేసుకుంటా....

దీనికి బాగా లైకూలు వస్తే...."కరోనా ఉగాది పచ్చడి" అని మరో వీడియో చేద్దాము...

అయ్యో పై దినుసుల్లో వేపాకు కూడా చేర్చరా కన్నా....చేదో బోదో.

చెప్పలేం...ఈ బామ్మ వైద్యానికి కరోనా హడలెత్తి పారిపోవాల్సిందే.

Posted in January 2021, కథానికలు

1 Comment

  1. P L K Sastry

    మీ పత్రిక లోని శీర్షికలుమాకు నచ్చిఛనాయి. నేను సాహిత్యసమితి, అణుశక్తి
    నగరం BARC లో
    స్ధపించబడింది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!