Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట --
శ్రీమతి కేథరిన్ జాన్సన్
Katherine Johnson

పువ్వు పుట్టగానే పరిమళించిన విధంలో, కొంతమంది తమ చిన్న వయసులోనే అపారమైన మేథాసంపత్తిని కలిగిఉండి తమకు ఆసక్తికలిగిన రంగాలలో అద్భుతాలను సృష్టిస్తూ వివిధ రకాలుగా పరిణత చెంది, బాల మేధావులుగా గుర్తింపు తెచ్చుకొని తద్వారా అతి పిన్న వయసులోనే విశ్వవిద్యాలయ పట్టాలను కూడా పొందుతారు. అటువంటి వారి మేధస్సు ఎంతో ఉన్నతమైన సమాచారాన్ని అందించే అపురూప గనిలా రూపాంతరం చెందుతుంది. సరైన సమయంలో వారికి చేయూతనిచ్చి, సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే, తమ విజ్ఞాన పటిమతో నూతన సృష్టికి మూలకారకులౌతారు. అటువంటి బాల మేధావి, అమెరికా వారి నాసా అంతరిక్ష కేంద్రంలో మూడు దశాబ్దాలు సేవలందించిన కాథరిన్ జాన్సన్ నేటి మన మహిళా ఆదర్శమూర్తి.

ఆగష్టు 26, 1918 వెస్ట్ వర్జీనియా రాష్ట్రం లోని వైట్ సల్ఫర్ స్ప్రింగ్ లో జన్మించిన కాథరిన్, ఊహ తెలిసినప్పటినుండే చలాకీగా ఉంటూ, తన వయసు మించిన విజ్ఞాన పరమైన ఆలోచనలతో తన వయసు వారి కంటే ముందుండేది. చిన్న వయసులోనే చదువులో చాలా చురుకుగా ఉండేది. నల్లజాతీయులకు సరైన విద్యావకాశాలు, శిక్షణలు లేని ఆనాటి కాలంలోనే తన సొంత మేధాసంపత్తితో 18 ఏళ్ళకే ఫ్రెంచ్ మరియు గణితం శాస్త్రాలలో విశ్వవిద్యాలయం నుండి పట్టాను పొందింది. పిమ్మట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి దాదాపు దశాబ్ద కాలం తనకి అత్యంత ఇష్టమైన గణిత శాస్త్ర బోధనలో నిమగ్నమైంది.

1950 కాలంనాటి వరకూ కంప్యూటర్స్ అంతగా వాడకంలో లేవు. అదికూడా అత్యంత వేగంగా గణించే కంప్యూటర్స్ అనేవి నాటికి ఇంకా కనుగొనబడలేదు. కనుకనే అన్ని గణిత గణాంకాలు మనుషుల చేతనే చేయించే వారు. కనుకనే వారిని ‘హ్యూమన్ కంప్యూటర్స్’ అనేవారు. ముఖ్యంగా అంతరిక్షంలోకి రాకెట్ లను పంపేందుకు ఎన్నో గణిత సిద్ధాంతాలు, గణాంకాలు అంతరిక్ష యానాన్ని సుగమం చేయడానికి అవసరమౌతాయి. అందుకు  గణితంలో మేథావులైన వారిని నియమించి వారిచేత అన్ని రకాలైన లెక్కలు వేయించేవారు. 1952 కాలంలో అమెరికా అంతరిక్ష సంస్థ {నా.కా(NACA)}, అంతరిక్ష నౌకల ప్రయోగంలో అవసరమైన గణాంకాలని లెఖ్ఖించుటకు గణితంలో చురుకుగా ఉండి, మెరుగుగా గణించే వారికోసం ప్రయత్నిస్తున్న తరుణంలో కాథరిన్ మేధాశక్తిని గమనించి తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మిగిలిన ‘హ్యూమన్ కంప్యూటర్స్’ మాదిరి చెప్పిన లెక్కలు పూర్తిచేయడం కాకుండా, తనపై అధికారులను తరచూ ప్రశ్నిస్తూ, సంక్లిష్టమైన అంశాలను తనే వివిధ కోణాలలో పరిశీలించి అందుకు తగిన సమాధానాలను నిర్వచిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తద్వారా తను ఉద్యోగం లో చేరిన కొద్ది కాలంలోనే NACA వారి పరిశోధనా విభాగానికి పదోన్నతి కల్పించి పంపించారు.

Katherine Johnson1958 సంవత్సరంలో NACA, NASA గా మారిన తరువాత, మానవసహిత వ్యోమనౌకల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమ నిర్మాణ నిర్వహణ సభ్యుల బృందం లోకి కాథరిన్ ను కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి బాధ్యతాయుతమైన ఉద్యోగంలో చేరి, టీం లోని అందరితో కలిసి ఎన్నో సంక్లిష్టమైన లెక్కలను అతి సులువుగా గణించి రాకెట్ సక్రమంగా అంతరిక్షంలోకి వెళ్లి, క్షేమంగా భూమికి తిరిగి వచ్చేందుకు ఎంతగానో కృషి చేసింది. మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష నౌక మరియు 1969 లో చంద్రుని మీద కాలుమోపిన వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను దిగ్విజయంగా తీసుకెళ్ళి, మరల భూమికి భద్రంగా తీసుకొని వచ్చిన వ్యోమనౌక అపోలో11 నిర్మాణ నిర్వహణలో కాథరిన్ ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. అప్పటి నుండి ఎన్నో అంతరిక్ష వ్యోమనౌకల ప్రాజెక్ట్ లలో తన సహాయాన్ని అన్నివేళలా అందిస్తూ ఎంతో మంది యువ గణిత శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచి, వారికి ఒక మంచి మార్గాన్ని చూపిన కాథరిన్ 1986 లో పదవీ విరమణ చేశారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, 2017 లో NASA క్రొత్తగా నిర్మించిన పరిశోధనా కేంద్రానికి ‘Katherine G. Johnson Computational Research Facility’ అని నామకరణం చేసి, 99 ఏళ్ల కాథరిన్ చేతనే ఆ క్రొత్త భవంతి ribbon-cutting కూడా చేయించి ఆమెను సముచితంగా సత్కరించారు.

ఈమధ్యనే 2016 లో వచ్చిన ‘Hidden Figures’ ఆమె జీవిత స్ఫూర్తితోనే తీయడం జరిగింది. తెరవెనుక ఉండి ఒక సినిమాను సృజనాత్మకంగా నిర్మించేందుకు ఎంతో కృషి చేస్తున్న మేధావుల వలె, పెద్ద పెద్ద ప్రణాళికలు, బృహత్తర కార్యాల వెనుక ఎంతోమంది తమ కృషిని, వినూత్నమైన కల్పనాశక్తిని వినియోగిస్తారు అనేదానికి మన కాథరిన్ ఒక ఉదాహరణ. తను లిఖించిన గణాంకాలు, ఆనాడే అంతరిక్షానికి వ్యోమగాములనే పంపే ప్రక్రియలో నాసాను  ప్రధమ స్థానంలో నిలిపాయి. తన వందేళ్ళ పైచిలుకు జీవితాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొనిన శ్రీమతి కాథరిన్ జాన్సన్, ఫిబ్రవరి 24, 2020 న కాలధర్మం చెందారు. కానీ, ఆవిడ జీవన శైలి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

Posted in January 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *