Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

సత్యాన్వేషణ – 3

సత్యం తెలుసుకోవడమే అసలైన సంతోషానికి నాంది అని మొదటి వ్యాసం లోనూ, ఆ సత్యం తెలుసుకోవడంలో కోరికలేకుండా, చేసే పనినుండి ఏమీ ఆశించకుండా ఉండడం ఎలాగో రెండో వ్యాసంలోనూ చూసాం. ఇప్పుడు అసలు ఈ సత్యం అనేదాన్ని ఎక్కడ, ఎలా దర్శించవచ్చు అనేది చూద్దాం.

మనం ఏదైనా ఊహించుకోబోయే పదార్ధం, మనిషి, లేదా వస్తువు ఎలా ఉంటుందనేది మన మనసు, బుద్ధి, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఉదాహరణకి మీరు దీపావళి నాడో, స్వాతంత్ర దినోత్సవం నాడో బాణసంచా కాలుస్తుంటే చూడ్డానికి వెళ్ళారు. తర్వాత ఎవరో అడిగారు మిమ్మల్ని, “ఎలా ఉంది బాణసంచా?” దీనికి సమాధానం ఏమని చెప్తారు? కొందరైతే “అద్భుతం, ఇటువంటిదెప్పుడూ చూడలేదు, మొదట్లో కొన్ని నక్షత్రాలు, తర్వాత మరో కొన్ని తారాజువ్వలూ…” అంటూ పెద్ద ఉపన్యాసం ఇచ్చి చెప్పవచ్చు. లేదా, “బాగుంది, అంతకు ముందులాగానే ఉంది,” అనొచ్చు. కొంతమంది అయితే, “ఏవుందీ, ఎప్పట్లాగా ఉందిలే,” అని తీసిపారేయవచ్చు. అంటే మనం చూసినది, మనకి అవగతమయ్యేది, మనం చెప్పగలిగేది మన బుద్ధి, మనసులమీద ఆధారపడి ఉంటుందనేది స్పష్టమౌతోంది కదా? అందువల్లే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు ఒకే విషయాన్ని. ఏదైతే మనం వివరించగలుగుతున్నామో అది పూర్తిగా మార్పులేని సత్యం కాదు. మరో విధంగా చెప్పాలంటే మనం చూసినది వేరు, మనం నోటితో చెప్పేది వేరు. ఎందువల్లనంటే మనం నోటితో చెప్పేది చూసినదాన్ని మననం చేసుకుంటూ మన బుద్ధి ఉపయోగించి మాట్లాడుతున్నాం. అయితే మనం చూసినదానినే మరో వ్యక్తి ఇంకో విధంగా చెప్పగలుగుతున్నాడు కదా? అందుకే ఏదైతే మనం వివరించగలుగుతున్నామో అది మార్పులేని బ్రహ్మం కానీ సత్యం కానీ కాదు. మార్పులేనిదైతే అందరూ ఒకే విధంగా వివరించగలిగి ఉండాలి కదా? అయితే మార్పు లేని బ్రహ్మం/సత్యం అనే దాన్ని వివరించడం ఎలా?

దీనికి రామకృష్ణ పరమహంస చెప్పిన కధ చూద్దాం. ఓ ముగ్గురు బాటసారులు నడుస్తూంటే ఓ పెద్ద గోడ కనిపించింది. వీళ్ల ముగ్గురికీ గోడకి అటువైపు ఏముందో తెలుసుకోవాలని అనిపించింది. పైకెక్కితే తప్ప అటువైపు ఏముందో తెలియదు, అంత పెద్ద గోడ. ఇద్దరు సాయం పట్టి మూడో ఆయన్ని గోడమీదకి ఎక్కించారు. గోడ ఎక్కినాయన అటువైపు చూసి, “ఆ, ఆ” అని అటు వైపు దూకేసాడు. ఇటు వైపు ఉన్నవారికి ఏమీ అర్ధం కాలేదు. మిగిలిన ఇద్దరిలో రెండో ఆయన కూడా పైకి ఎక్కాడు. ఆయన కూడా గోడమీదకెక్కాక అటువైపు చూసి, “ఆ, ఆ” అని అటువైపు దూకేసాడు. మూడో ఆయనకీ తెలియలేదు ఏముందో గోడకి అటువైపు. ఈయన కూడా ఏదో విధంగా పైకి ఎక్కాక అటువైపు చూసి, “ఆ, ఆ” అని అటువైపు దూకేసాడు. ఇప్పుడు చెప్పండి, గోడకి అటువైపు ఏముంది?

ఈ సత్యం/బ్రహ్మం అనేది గోడకి అటువైపు ఉన్న వస్తువు వంటిదే. ఓ సారి దాన్ని చూడగానే దానిలో లీనమవ్వడమే తప్ప దాన్ని వివరించలేము. అయితే దాన్ని చూసిన వారు “నేను దర్శించాను, నీకు కూడా ఆ దర్శించే దారి చూపించగలను,” అని చెప్పగలరే కానీ దాన్ని తీసుకొచ్చి అరచేతిలో అరటి పండులా మనకి ఇవ్వ(లే)రు. ఎందుకంటే ఈ గోడ ఎక్కడం అనేది ఎవరికి వారు చేయాల్సిన పని. ఆ సత్యాన్ని దర్శించిన మనిషి మనకి గోడ ఎలా ఎక్కాలో మాత్రమే నేర్పగలరు.  మరి గోడ ఎక్కాక అటువైపు కనిపించినది ఏమిటి అనే దానిక్కూడా రామకృష్ణులే సమాధానం చెప్తారు. “అది ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవడం వంటిది. ఓ సారి ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్లగానే అందులో లీనమైపోతుంది తప్ప దాన్ని తెలుసుకోవడం అంటూ వేరే ఉండదు.” ఇదే పంచ మహా వాక్యాలలో మొదటిది – అహం బ్రహ్మాస్మి. మనమే స్వయానా బ్రహ్మ స్వరూపులం. బ్రహ్మమంటూ వేరే ఎక్కడో లేదు.

ఇప్పటికి తెలిసిన దారి ఇది. ప్రపంచాన్ని వదులుకోవాలి అంటే, కోరికలేకుండా పనిచేయడం, సత్యదర్శనానికి నిరంతరం శ్రమించడం, తపించడం చేస్తూ ఉంటే ఒక జన్మలో చేసిన పనులకి మరో జన్మా, అక్కడ చేసిన పనులకి తర్వాత జన్మా అలా ఒకదాని తర్వాత ఒకటి ఎత్తుతూ ఎప్పటికో ఓ రోజుకి సత్యాన్ని తెలుసుకుంటాం – ఈ జన్మ మృత్యు చక్రంలో నిజమైన సుఖం అనేది కాకి బంగారం వంటిది కనక సత్యం తెలుసుకోవడానికి సాగే మన దారి ఒడిదుడుకులతో మొదలై మెల్లిగా నత్త నడక నడుస్తూ మొత్తానికి ఎప్పటికో ఓ రోజుకి ఈ బ్రహ్మం కేసి సాగుతుంది. పరమహంస యోగానందగారు చెప్పడం ప్రకారం ఒక జీవి బ్రహ్మాన్ని చేరుకోవడానికి అరవై లక్షల జన్మలు పట్టవచ్చుట. ఈ అరవై లక్షల జన్మలలో కనీసం ఓ లక్ష జన్మలు మనిషిగా పుడతామనుకుని, ఒక్కో మనుష్య జీవితం డబ్భై సంవత్సరాలు అనుకున్నా బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒక్కో మానవుడికీ పట్టే సమయం డబ్భై లక్షల సంవత్సరాలన్నమాట. ఇందులో ఓ చిక్కు ఉంది. మనకి ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచాయి, ప్రస్తుతానికి ఏ జన్మలో ఉన్నాం? ముందు ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయి అనేవి తెలియవు. అయితే ఇవి తెలియకుండా ఉండడమే జీవితంలో ఉన్న అతి పెద్ద సంతోషమైన విషయం. ఆ విషయం ముందే తెలిస్తే ప్రతీ జన్మలో ఉండే మాధుర్యం ఉండదు. మన జీవితాలకి మనమే కదా కర్తలం? ఈ జన్మ ఇలా ఉండడానిక్కారణం మనమే అని చూసాం కదా ముందు వ్యాసాలలో?

సరే, ఇప్పుడు ఈ సత్యం తెలుసుకోవడానికి దారి చూడాలి ముందు. అది ఎలాగంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, దానిమీద మనసు కేంద్రీకరించి ధ్యానం ప్రారంభించడం. ఆ లక్ష్యం సత్యమే అయితే మరింత మంచిది. ఇక్కడోసారి ఆగి ఆలోచించండి. సత్యం ఎటువంటిదో, ఎలా ఉంటుందో మనకి తెలియదు; తెలిసాక నోరు విప్పి చెప్పలేం అని ఇప్పుడే కదా అనుకున్నది? ఎలా ఉంటుందో తెలియని ఆ సత్యం మీద మనసు కేంద్రీకరించడం కష్టం కనక ఈ సత్యానికి, లేదా బ్రహ్మానికి, భగవంతుడికి ఓ రూపు ఏర్పాటు చేసారు. అది విష్ణువని కొంతమందీ, శివుడని కొంతమందీ, అల్లా అనీ జీసస్ అనీ వేరు వేరు పేర్లు పెట్టుకున్నారు. అలా ఒక్కొక్క దారిలో వెళ్ళి సత్యాన్ని దర్శించుకున్నవారు – “ఇదిగో ఇదీ దారి నా కూడా రండి,” అని దారి చూపించడం మొదలు పెట్టారన్నమాట. ఇదే రామకృష్ణులు చెప్పినది కూడా. ఓ చెరువులో నీళ్ళు ఉన్నాయి. ఓ బిందెతోనో, మరొక ఏదో పాత్రతో వెళ్ళి కావల్సినన్ని నీళ్ళు తెచ్చుకోవచ్చు. చెరువు దగ్గిరకి వెళ్ళడానికి రకరకాల దార్లు కూడా ఉన్నాయి. ఏ దారిలో వెళ్ళి ఏ పాత్రతో తెచ్చుకున్నా మనం తెచ్చుకునేది ఏమిటి? ఒకే రకమైన నీరే కదా? అదే సత్యం, భగవంతుడూను. ఏ దారిలో వెళ్ళి ఏ విధమైన ధ్యానం అదీ చేసినా చివరకి చేరుకునేది ఒకే బ్రహ్మం. ఈ బ్రహ్మాన్ని దర్శించిన వారు వాళ్ళు వెళ్ళిన దారిబట్టి వివరించగలరు. దీన్నే - ఏకం సత్, విప్రా బహుధా వదంతి, అంటున్నాం. సత్యం అనేది ఎప్పుడూ ఒకటే. విప్రులు, తాము దర్శించిన బ్రహ్మాన్ని అనేక విధాలుగా వివరిస్తున్నారు.

సత్యం ఎలా ఉంటుందో (ఇంకా) తెలియదు ధ్యానం చేయడనికి అలా ఓ రూపం ఊహించడం మొదలుపెట్టారు. వివేకానందులు చెప్తున్నారు చూడండి. “ఓ గేదె భవంతుణ్ణి చూడాలనుకుంటే తాను దర్శించబోయే భగవంతుడు అతి బలమైన, అతి సుందరమైన గేదెలా ఉంటాడని మాత్రమే ఊహించగలదు మొదట్లో. ఉత్తరోత్తరా అది ధ్యానం లో బాగా మెరుగయ్యేకొద్దీ తాను ఊహించిన గేదె భగవంతుడి ఒకానొక రూపం మాత్రమే అని దానికి తెలిసి వస్తుంది. అలా అది ధ్యానం చేసే కొద్దీ మెరుగౌతూ చివరకి భగవంతుడికొక రూపు లేదనీ ప్రపంచం అంతా సర్వం భగవత్స్వరూపమే అని తెలుసుకుంటుంది.” మానవుడిగా పుట్టాం కనక మనం కూడా భగవంతుడు ఇలా మనలాగే, మానవుడిలాగే  కాళ్ళూ చేతులతో ఉంటాడనీ వజ్ర వైఢూర్యాలు ధరించి అతి సుందరంగా ఉంటాడనీ, భగవంతుడు కనక ఏదైనా చేయగలడనీ ఓ రూపు మనకి కావల్సినట్టూ ఏర్పరుచుకుంటున్నాం అన్నమాట. అలాగే భగవంతుడు మనిషికి కావాల్సిన జ్ఞానం అందించడానికి మనిషిగా అవతరించి మనని తనవైపు తిప్పుకుంటున్నాడని చెప్పడం మన పురాణాల్లో చూడవచ్చు. నిశితంగా గమనిస్తే భగవంతుణ్ణి తెలుసుకోవడానికో మార్గం, దానిలో ఉండే సాధకబాధకాలు కూడా మనకి తెలియజెప్పడానికే ఈ అవతారాలు సృష్టించబడ్డాయి అని తెలుస్తుంది. అలా జీవితంలో అష్టకష్టాలు పడే మనకో దారి చూపించడానికే ఈ అవతారాలు అని అర్ధం అవుతుంది.

బ్రహ్మం/సత్యం తెలుసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆ సత్యం/భగవంతుడు/బ్రహ్మం మనకి తోడ్పడానికి పది అడుగులు ముందుకి వస్తుంది అంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనం వెనక్కి ఒక్క అడుగు వేస్తే ఆ సత్యం కూడా పది అడుగులు వెనక్కి వెళ్తుంది. సత్యాన్వేషణలో ధ్యానం గురించి మట్లాడుకుంటున్నాం కనక భగవంతుడి రూపు మనిషిలాగే ఉంటుందని మనం ఊహించుకుని అలా ఓ రూపు తయారు చేసుకుంటున్నాం. మనం ఏ రూపులో ధ్యానం చెసినా, రామకృష్ణుల కధలో చెప్పినట్టూ ఏ దారిలో, ఏ పాత్ర పట్టుకుని చెరువుకేసి వెళ్ళినా మనకి లభించేది ఏమిటి? మార్పులేని ఒకేఒక భగవంతుడు, సత్యం, బ్రహ్మం. అందుకే మనం ఏ విధంగా ప్రయత్నించి, ఎవరిని, ఏ మతంలో అనుసరించినా చేరవల్సిన సత్యం ఒక్కటే. ఇదే సత్యం పరం ధీమహి అంటే.

సరే భగవంతుడికి ఓ రూపు ఇచ్చాం మరి విష్ణువుకి నాలుగు చేతులూ, అమ్మవారికి పదేసి చేతులూ, అనేకానేక ఆయుధాలు చూపించడం దేనికి? వీటికి కారణం ఊహించవచ్చు. వాళ్ళెంత గొప్పవారో, శక్తిమంతులో చెప్పడానికి తప్ప నిజంగా భగవంతుడలా ఉంటాడు అని ఎవరికీ చెప్పడం సాధ్యం కాదు. రామకృష్ణులు చెప్పనే చెప్పారు కదా, ఉప్పుబొమ్మ సముద్రం లోతు తెలుసుకోవడం ఎలా?  భగవంతుడికి ఓ రూపు కల్పించినట్టే ఆయన శతృవులకి కూడా అనేకానేక రూపులు పుట్టుకొచ్చాయి. రావణుడంటే పది తలలు కలవాడనీ, వికృతంగా ఉంటాడనీ వగైరా. నిజంగా ప్రపంచంలో అటువంటి పది తలల మనిషి ఉండడనేది స్పష్టం. అయితే రావణుడు మనలాగే ఒకే ఒక తలతో ఉన్నా ఒకేసారి పది ఆలోచనలు చేస్తూ పది మందిని మట్టి కరిపించగలడు అనుకోండి. లేదా ఒకేసారి పది మందికి సరిపడా ఆలోచనలు చేస్తూ పదిమందిని పది రకాలుగా ఏడిపించగలడనుకోవచ్చు. ఒక్కో పెడబుద్దీ ఒక్కోక్క తల అని బావించుకుంటే రావణుడు మనలాంటివాడే. ఉన్నది ఒకే తల కానీ అది పదిమంది పెట్టు. అలాగే విష్ణువు సుందరంగా ఉండవచ్చు సంతోషానికి ప్రతీకగా; నీలమేఘశ్యాముడై ఉండవచ్చు మనసుకి ఆహ్లాదంగా ఉండడం కోసం. రావణుడు కారు నలుపు శరీరం ఎందుకంటే నలుపు భయం కలిగించేది కావొచ్చు. కానీ రాముడూ నలుపే, ద్రౌపదీ నలుపే. వాళ్ళని నీలమేఘశ్యాములనీ రావణుడి నలుపుని ఏవగించుకోవడానికీ కారణాలు వారి వారి బుద్ధులూ, నడతా, ధర్మ ప్రవర్తనా అని అర్ధం చేసుకుంటే ఎప్పటికైనా గుణగుణాలే మనిషిని ఉన్నతంగా నించోపెట్టేవి కానీ శరీరం రంగు కాదని చెప్పేవి ఈ కధలన్నీ అని తెలుస్తుంది.

ఇప్పటికి తేలినది - సత్యం/బ్రహ్మం అనే లక్ష్యాన్ని సాధించడానికి మనకి ఓ రూపు అవసరం. దానిమీద ధ్యానం చేస్తూంటే సమాధిలోకి వెళ్ళి అక్కడ సత్యాన్ని దర్శించగలం. ఆ సత్యం మార్పులేనిది. మనకున్న వేదాలు, ఉపనిషత్తులూ అన్నీ కూడా ఎప్పుడో మన ముందు సత్యదర్శనం చేసినవారు చెప్పిన వాక్కులే. అటువంటి వాటిలో బ్రహ్మం గురించి ముండకోపనిషత్ లో చెప్పే ఈ శ్లోకం చూడండి.

ప్రణవో ధనుః శ్శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే
అప్రమాత్తేన వేధవ్యం శారవత్తన్మయో భవేత్

ఓం అనే ప్రణవాక్షరం ధనస్సు. ఆత్మ బాణం. ఆ బాణానికి లక్ష్యం పరబ్రహ్మం. ధనస్సు ఎత్తి బాణాన్ని కొట్టవల్సినది ఆత్మనిగ్రహం ఉన్నవాడు. విడిచిన బాణం లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుందో, అలా ఆత్మ బ్రహ్మంతో ఏకమవడమే సత్య దర్శనం.

సత్య దర్శనానికి అడ్డంకులూ, సత్యదర్శనానంతరం తెలిసేది ఏమిటి అనేది ముందు వ్యాసంలో చూద్దాం.

****సశేషం****

Posted in January 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *