Menu Close
గమ్యం
-- డా. వి.వి.బి.రామారావు --

రోడ్డు వంకలన్నింటినీ చక్రాలు తీర్చిదిద్దుతుండగా బస్ రొద చేసుకుంటూ ముందుకు పోతోంది. లోపల ప్రయాణీకులంతా నిద్రలో ఊగిపోతున్నారు. తెల్లవారుఝామునే రైలు దిగి మొదటి బస్సు పట్టుకుని తన మామగారి ఇల్లు చేరడానికి తొందర పడుతున్నాడు రామ్మూర్తి. యువకుడు, సన్నగా, పొడుగ్గా, నల్లగా ఉంటాడు. ఇంజనీరింగ్ ప్రథమ కక్ష్యలో పాసైనాడు. తను ఇంకా హాస్టల్ లో ఉండగానే తన ప్రొఫెసర్లు చెప్పేశారు అతని పరీక్ష ఫలితం “యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, మై బాయ్, విష్ యు అల్ ది బెస్ట్” ప్రిన్సిపాల్ గారి ఆశీర్వచనం.

“డోంట్ గెట్ అప్సెట్ ఇఫ్ యు హావ్ టు వెయిట్ ఫర్ ఎ జాబ్” తన పరిశోధనా వ్యాసాన్ని పర్యవేక్షించిన ప్రొఫెసర్ చేసిన హెచ్చరిక ఇంకా చెవుల్లో గింగురుమంటోంది. నిరుద్యోగ సమస్య కాగితాల మీద, గోడల మీదా చూస్తున్న తనకు నిజంగా భయం వేసింది. తనూ చేరవలసిందేనా ఈ నిరుద్యోగుల క్యూల్లో? ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలి. ఎలాగైనా... ఆలోచిస్తూ పక్కన నిద్దరపోతున్న ప్రయాణీకుల వైపు అసూయగా చూస్తూ సిగరెట్లు తగలేస్తున్నాడు.

తను చాలా సేపు ఎదురు చూసిన బస్సు వచ్చింది. బెడ్డింగ్, ట్రంక్ పెట్టె టాప్ మీద వేసి అటాచ్ కేస్ పట్టుకుని మెల్లగా బస్సు లోకి నడిచాడు. ఆడవాళ్ళ సీట్లు దాటుతుండగా ఓ అందమైన అమ్మాయి కనిపించింది. పరాకుగా చూసాడేమో సీత లాగే ఉంది.. ఆఁ..అయినా ఇక్కడెందుకుంటుంది? సిల్లీ! ఏమిటా ఆలోచనలు!

బస్సులో...

“కాస్త తోవ ఇస్తారా మాస్టారూ?”

వెనకనుండి ఒకాయన పిలుపు. వాస్తవంలోకి వచ్చి మర్యాదగా కళ్ళు దించుకుని ముందుకు నడిచాడు రామ్మూర్తి. సీటులో కూర్చుని మీదకు చూశాడు. పైన రాక్ లేదు. ఎటాచ్ కేస్ ని ఒళ్లోనే పెట్టుకుని కూర్చున్నాడు చంటి పిల్లాణ్ణి కూచో పెట్టుకున్నట్టు.

***** ***** ***** *****

“ఒరేయ్ సూరిగా!”

“చిత్తం బాబూ?” పరిగెత్తుకొచ్చాడు పాలేరు.

“తూర్పు పొలంలో ఆకులు మాడిపోతున్నాయి-చూసుకోరటారా? నీరు పెట్టండని చెప్పానా, ఏం చేస్తున్నావురా? వెధవా ఆకులు చస్తుంటే. సరియైన సమయంలో సరియైన పని చెయ్యకపోతే గింజలెలా వస్తాయ్?” కసురుకున్నాడు సూర్యారావు.

“నీరు చాల్లేదు, బాబయ్యా... మీకు తెలియందేముంది. దచ్చిన వేపు పొలానికి నీరు కడుతున్నాము. పగలంతా తోడేసరికి నీరు ఖాళీ అయిపోయె. మూడు రోజులైంది బాబు, బొత్తిగా అడుగు తగిలేస్తోంది నుయ్యి.” సూర్యారావు కి బాధ అనిపించింది. ఈ నుయ్యి కూడా ఎండిపోతే మరి మడి సంగతి? వెంటనే ఆలోచన వచ్చింది. ఓ గొట్టపు బావి తవ్విస్తే? అల్లుడు రామ్మూర్తి ఎలాగూ వస్తున్నాడుగా. మేనల్లుడితో సంప్రదించి వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలి.

“సరే, సూరిగా! ఉన్నంత మటుకు ఆ పొలానికి ఆపి, తూర్పు మడికి నీరు పెట్టండి.” భుజం మీది కండువా సరిచేసుకొని బయలుదేరాడు ఇంటివైపు.

***** ***** ***** *****

డ్రైవర్ కు సైగ చేసి మెల్లిగా పొమ్మన్నాడు పాసెంజర్. బాక్ సీట్లో కూర్చుని ముందుకు వంగి రెండు పక్కల చూస్తున్నాడు ముసలాయన. దూరాన ఏదో బోర్డు, పక్కగా ఒక బాట కనపడుతున్నాయి. డ్రైవర్ భుజం తట్టి ఆగమని సైగ చేశాడు.

“గంగిగోవుపాలెం సార్!” నమ్రతగా సమాధానం చెప్పాడు టాక్సీ డ్రైవర్. చేత్తో హ్యాండ్ బాగ్ పట్టుకొని పాసెంజర్ దిగిపోయాక మరి కొంత ముందుకు వెళ్లి బ్యాక్ చేసుకొచ్చాడు డ్రైవర్.

రోడ్డు మీద దుమ్ము రేగింది.

రియర్ వ్యూ మిర్రర్ లోంచి తన పాసెంజర్ నే చూస్తున్నాడు డ్రైవర్. కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే మనిషి. బట్టలు మాసి ఉన్నాయి. కాని, ముఖంలో ఏదో హుందా, రాత్రి బెజవాడలో ఎక్కాడు.

“దూరంగా పోవాలి వస్తావా?” అని మాత్రం అడిగాడు.

కారు వెళ్ళిన వైపే చూస్తూ రోడ్డు పక్క సిమెంట్ దిమ్మ మీద కూర్చున్నాడు ముసలాయన. పక్కనే బాగ్ ఉంది.

వూరులోకి తోవ కనబడుతూంది. కానీ, ఏం చెయ్యనా అని ఆలోచిస్తున్నాడు. నిద్రమైకం ఒదిలింది. ఎన్నాళ్ళకు మళ్ళీ మంచి నిద్ర పట్టింది. హుఁ.. నిట్టూర్చాడు. ఎండ బాగా మొహం మీద కొస్తోంది. నెమ్మదిగా ఓ పెద్ద చింత చెట్టు కిందికి చేరాడు.

***** ***** ***** *****

ఠంచనుగా తొమ్మిదిన్నరకు ఆగింది గంగిగోవుపాలెం కంకర రోడ్డు వద్ద రాజమండ్రి బస్సు. రామ్మూర్తి దిగి టాప్ మీద ట్రంక్ పెట్టె, హోల్టాలూ దింపుకున్నాడు. దుమ్ము రేపుకుంటూ బస్సు అదృశ్యమైపోయింది. రామ్మూర్తికి సామాన్లు పట్టుకోవడానికి మనిషిని వెతికే అలవాటు లేదు. ఎటాచ్ కేసు హోల్టాల్లో సర్ది, భుజం మీద హోల్టాల్, ఒక చేతిలో ట్రంక్ పెట్టె పట్టుకొని అమెరికన్ పీస్ కోర్ వర్కర్ లా కంకర రోడ్డున నడుస్తుండగా, దూరాన చింత చెట్టు క్రిందనున్న ముసలాయన్ను చూశాడు. ఆయన ముఖంలో వర్చస్సు చాలా ఆకర్షణీయంగా ఉంది. కష్టం, సుఖం తెలిసిన వాడిలా ఉన్నాడు. లగేజీ మోస్తున్న యువకుడి వైపు చూస్తున్నాడు ముసలాయన. ముసలాయనను చూడగానే ఎందుకో యోగి వేమన గుర్తుకొచ్చాడు రామ్మూర్తికి. కొన్ని క్షణాల వరకూ అలా ఒకర్నొకరు చూస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ.

రామ్మూర్తికి క్యూరియాసిటి ఆగలేదు.

“కొత్త వారిలా ఉన్నారు. ఏ ఊరు వెళ్ళాలి, తాతగారు?” అడిగాడు.

“తాతగారు” అన్నమాట ఎడారిలో పడని వర్షపు బిందువులా స్ఫురించినది ముసలాయనకు.

బోర్డు వైపు వేలు చూపించాడు.

“ఎవరింటికి?”

“నేను...కొత్త” చిన్న నవ్వు నవ్వాడు.

ఏదో అడగబోయి ఊరుకున్నాడు రామ్మూర్తి. తనకు అనవసరమైన విషయాల గురించి క్యూరియాసిటీలో ప్రశ్నలు వేయడం సభ్యతకు విరుద్ధం.

“మా మామగారి ఇల్లు ఈ ఊళ్లోనే. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి.” ఆహ్వానించాడు.

రామ్మూర్తి ముందూ, వెనక ముసలాయనా నడుస్తూ ఊరు చేరుకున్నారు. ముసలాయన్ను వీధి సావిట్లో కూర్చోమని, “సీతా” అనుకుంటూ ఇంట్లోకి నడిచాడు.

“రా, నాయనా, చదువు సాంతం పూర్తయిందా?” అత్తగారి కుశల ప్రశ్నలు.

“ఊఁ” అన్నాడు రామ్మూర్తి బరువుగా.

“అమ్మాయ్, సీతా, బావొచ్చాడు.” పెరట్లోకి కేక వేసింది ఆ ఇల్లాలు.

“ఏమోయ్, అల్లుడూ” అంటూ సూర్యారావు లోపలికి వచ్చాడు. సావిట్లో పెద్ద మనిషికి నమస్కరించిన తరువాత స్నానాలు, భోజనాలు అయ్యాయి. సాయంత్రం వ్యాహ్యాళికి బయలుదేరారు మామ, అల్లుడూ, ముసలాయనా.

ముసలాయన మౌనంగా ఉన్నాడు. సూర్యారావు ఊళ్ళోని విషయాలూ, తన పొలం సంగతులు చెబుతున్నాడు అల్లుడికి. చుట్టూ పొలాలన్నీ చాలా భాగం ఎండిపోయాయి. రెండేళ్లుగా వర్షాలు లేవు. బొత్తిగా వర్షాధారపు భూములు. కనీసం విత్తనాలు కూడా అవడం లేదు. ఊళ్ళో దారిద్యం, ఆకలి ముసురుకుని ఉన్నాయ్. కాస్త పచ్చగా ఉన్నది సూర్యారావే.

పల్లె ప్రజల్లో ఉత్సాహం లేదు. ఎవరి మోహంలో చూసినా ఏదో దైన్యం, కాటకపు లక్షణాలు. ఊరు బొత్తిగా డెజర్ట్ గా అయిపొయింది. ముసలాయన చూస్తూ కాస్త వెనకగా నడుస్తున్నాడు.

“దండాలయ్యా!” ఎవరో ఒకతను సూర్యారావుకి నమస్కరించాడు.

“ఏం, బాబు ఎప్పుడొచ్చారు?” అంటూ రామ్మూర్తిని పలకరించాడు. మామూలుగా అయితే ఊరికి కొత్త మనిషి వస్తే జనాలు పోగయేవారు. కరణం గారింటికి చుట్టాలొచ్చారని చుట్టూ చేరి ప్రశ్నలు వేసేవారు. ఇప్పుడు అలాంటి ఉత్సాహం ఏమీ ప్రదర్శించడం లేదు కనబడ్డ వాళ్ళెవరూ.

“ముసలయ్యకు బాగోలేదయ్యా, ఓ మారు వస్తారా?” దీనంగా అడిగాడు సూర్యారావుని.

“ఆ, ముసలయ్యకా....ఈ మధ్య కనబడడం కూడా లేదు. ఏమిటీ సుస్తీ?”

**** ముగింపు తరువాతి సంచికలో ****

Posted in January 2021, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *