Menu Close
Page Title

విజ్ఞానానికి సంపూర్ణంగా అంతుబట్టని ప్రాణి

'ఆత్మ' శరీరాన్ని ఆశ్రయించి ఉన్నంతకాలమే మనిషి మనుగడ. శరీరంలో ఉన్నంతకాలం చైతన్యమూర్తిగా ఉంచిన ఆ ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విడి పోతుందో అప్పుడది నిర్జీవి అయి కళా కాంతులు లేక కట్టెగానే మిగులుతింది. ఆత్మ శరీరాన్ని ఎప్పుడు వీడుతుందో సాధారాణంగా ఏ కొద్దిమంది జ్ఞానులకి తప్ప ముందుగా తెలియదు. ఆత్మని ప్రభావితం చేసి మన జీవన యానంలో అనుక్షణం సాయపడే పరమాత్మని గురించి మన వేదాలు, ఉపనిషత్తులు, వివరించడం, కొందరు మహాత్ములు యోగదృష్టితో తెలుసుకుని మనకు వివరించడం తప్ప దాని ఉనికిని మానవుడు ప్రత్యక్షముగా గాని తన భౌతిక దృష్టితోగాని యంత్ర సహాయంతో గాని దర్శించిన తార్కాణాలు లేవు.  కొందరు ఋషులు, మహాత్ములు దానిని తాము దైనందిన జీవితంలో భక్తితో కొలుస్తున్న దైవస్వరూపమే సజీవంగా ప్రత్యక్ష మవడమే దైవ సాక్షాత్కారంగాను, సుగమ మోక్ష సాధనంగాను గణుతించడం జరుగుతోంది. ఇంక జీవి శరీరంలో చైతన్యానికి మూలకారణమైన ‘ఆత్మ’ యొక్కఉనికిని, దాని మూలాన్ని విజ్ఞానం ఇకముందు పట్టుకోగలదేమోగాని ఇంతవరకు పట్టుకోలేక పోయింది. అదలావుండగా మనస్సు, బుద్ధి, అహం, చిత్తం మనం అనుభవ పూర్వకంగా గుర్తించగలిగినా అవి ఖచ్చితంగా మానవ శరీరంలో ఎక్కడున్నాయో, ఏరూపంలో ఉన్నాయో, వాటి స్వభావమేమిటో, వాటి కంపనలు జనింపచేసే ఆలోచనలు, ఆవేదనలు, ఉద్రేక భావనల నిజ స్వరూపమేమిటో మనకి తెలిసిన విజ్ఞాన శాస్త్రం వివరించలేకపోతోంది. అవి మస్తిష్కంలో జరిగే 'న్యూరాన్ల' కదలిక కారణంగానేనని గుర్తించినా వాటి పరిణామముగా అవి ఏవిధంగా ఆలోచనా రూపం ధరిస్తున్నాయో, ఆ ఆలోచనలు అత్యంత త్వరితగతిని ఉద్రేకంగా మారి ఏవిధంగా విపరీత ఆవేశాలకు, శరీరభాగాలని కదలిస్తూ అనర్ధాలకు దారితీస్తున్నాయో ఇంకా అంతుబట్టలేదు. అల్లాగే సంగీతంలోని ఒక గమకం వినిగాని, సాహిత్యంలో ఒక చిన్న పద్యభాగం చదివి గాని ఆకళింపు చేసుకున్న వ్యక్తి హృదయంలో ఏవిధంగా రసోత్ఫుల్లత ప్రస్ఫుట మౌతోందో; అల్లాగే ఒక సంఘటన, ఒక కథా సన్నివేశం మనస్సుని ఏవిధంగా ఆర్ద్రం చేస్తోందో; అనురాగం, విషాదం, ప్రేమోద్రేకం కన్నీటిని చిప్పిలిస్తోందో; ఒక చిన్న మాట, ఒకచిన్న స్పర్శ అంతవరకు స్థిర మనస్సుతో తీసుకున్న కఠిన నిర్ణయాన్ని ద్రవీభూతం చేసి మొత్తంగానే మన భౌతిక, మానసిక స్థితులను  మార్చగలుగుతోందో ఇంకా విజ్ఞానం తెలియచెప్పలేకుండాఉంది.

hard-problems-of-consciousnessజీవి శరీరంలో గల ఆత్మ యొక్క ప్రతిరూపమైన 'చేతన' గురించి జరిగిన పరిశోధనలో ‘చల్మెర్స్ డేవిడ్’ యొక్క 'హార్డ్ ప్రాబ్లెమ్ ఆఫ్ కాంషస్నెస్' లో ప్రక్కన చూపిన పటం ఒక భాగం. ఇంకా అనేకులు దీని విచారణలో తలమునకలవుతున్నా శాస్త్రీయ పరిశోధన ఇంకా అంతుబట్టలేదు సరికదా దాని సంపూర్ణ రూప భావన కూడా అవగాహన పరిధిలోకి రాలేదు.

మన వేద విజ్ఞానం ఆత్మ స్వరూపాన్ని భౌతికంగా చక్ష్వేన్ద్రియాలతో చూపించలేకపోయినా, దాని స్వరూపాన్ని, తత్వాన్ని విశదీకరించి అనేక విధాలు ఔన్నత్య సాధనకు మార్గదర్శనం గావిస్తోంది. దుఃఖ భాజనమై జనన మరణ చక్రస్థమైసాగుతున్న మానవుని జీవన ఖేలనుండి విముక్తికి మార్గాలు చూపించగలిగింది. ఎందరో మహానుభావులు వివిధ మార్గాలలో మోక్షసాధన లో కృతకృత్యులయ్యారు.

jeevathma-paramathma

‘నువ్వెరివో తెలుసుకో, నీ ఆలోచనల పుట్టుక స్థానాన్ని గుర్తించు’ అన్నారు శ్రీ రమణ మహర్షి, స్వయం ఆత్మదర్శనాన్నే సూచిస్తూ. మోక్షమంటే ఏమిటి? జీవన్ముక్తునికి లభించే స్వేచ్ఛ ఏమిటి? మనుగడ చాలించి చైతన్యాన్ని కోల్పోయింతరువాత సాధారణంగా జనులు వాంఛించే స్వర్గం కాదు. జీవన్ముక్తుడు జీవిస్తూనే బంధవిముక్తుడై ‘తత్చిదానందం’లో తేలియాడే ఋషి. ఈ ప్రపంచంలో అన్నిటి మధ్య నివసిస్తూనే తామరాకుమీద నీటిబొట్టు వలె వాటి సుఖ దుఃఖ అనుభవాలతో నిమిత్తము లేకుండా ఆత్మానందంలో గడపగల నిర్మల మనస్కుడు, యోగి.

మన అందరికి తెలిసిన 'నిర్వాణ షట్కము' లో ఆది శంకరులు,

“మనోబుద్ధ్యహఙ్కారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రణనేత్రే |
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్||”

జ్ఞానేంద్రియాలైన- చంచలత్వంతో పరుగెత్తించే మనస్సు గాని, విశదీకరించి వివక్షతా జ్ఞానాన్ని పెంచే బుద్ధి గాని, నేను- నాది అనిపించి స్వార్థభావోద్దీపికయైన అహంకారభావం గాని, కోరికలకాలవాలమై హృదయంలో స్థిరంగా నిలచిన చిత్తంగాని  - ఇవేవి నేను కాదు. కర్మేంద్రియాలైన- శబ్ద మాధుర్యాన్ని ఆస్వాదించే చెవులు గాని,  జిహ్వచాపల్యాన్ని తృప్తిపరుస్తున్నట్టుగా అనిపిస్తూనే దానిని పెంచే నాలుకగాని, సువాసనల నాఘ్రాణింపచేసి ఆనందింపచేసే నాసికగాని, ప్రకృతి సౌందర్యాన్ని చూపించి పులకింపచేసి మనోల్లాసాన్ని కలిగించే కన్నుదోయి కానీ, నేను కాదు. అల్లాగే అనంతమైన ఆకాశంగాని, ప్రాణికోటిని భరించే భూమిగాని, లోకాన్నంతా వెలుగు తో నింపే తేజస్సును గాని, జీవకోటికి ఆధారమైన ప్రాణవాయివునిచ్చే గాలిని గాని కాను. చిదానంద రూపుడైన శివుణ్ణి, ఈశ్వరుణ్ణి, ఆత్మని  నేనే.

ఆ ఆత్మని, ఆ శివుణ్ణి పట్టుకుని భవ బంధాలనుంచి మోక్షాన్ని సాధించడం ఎల్లాగ అనే విషయంలోనే చాలామంది భక్తులు, తత్వవేత్తలు, విజ్ఞానఘనులు, ఋషులు తర్జనభర్జనల ద్వారా, తమ ప్రయోగాలద్వారా, తపశ్శక్తి ద్వారా తెలుసుకుని సాధించగలిగినది మనకు తెలియజెప్పారు. అనేక ఉపనిషద్ గ్రంధాలు ఆచరణయోగ్య మార్గాలని సూచించాయి, వాటిలో ఒకటైన 'అమృతబిందు ఉపనిషద్' ఏమి ప్రబోధిస్తోందో చూద్దాము.

'మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః|
బంధాయ  విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృతమ్ ||'

మానవ మనస్సే బంధాలకు మూలం, ఆ బంధాలే మోక్షానికి అడ్డంకులు. మనపరిసరాలలో ఉన్న వస్తులపైన  (బంధు, మిత్రు, జంతు, వృక్ష, పరివారాలపై), భౌతిక విషయాలపై యోగ్య గల ఆసక్తిని మనో నిగ్రహసాధన ద్వారా తగ్గించుకుంటూ, దానిని మొత్తం నిర్వీర్యం చెయ్యలిగితేనే మోక్షం సాధ్యమౌతుంది. దానికి ఏకాంత వాసం గాని, వానప్రస్థానం గాని, సన్యాస దీక్ష గాని, అవసరంలేదు. దానిని సాధించడానికి కావలసినది ధృడ నిశ్చయం, అకుంఠిత ఆచరణ, ఆవిషయమై స్థిరమైన స్వయం సమీక్ష, దిద్దుబాటు మాత్రమే. ఇది ఎవరంతట వారే చేసుకోగల శోధన గానీ ఇతరుల ప్రమేయం వల్ల అయ్యేది కాదు.

అసలు 'ఆత్మ' అంటే ఏమిటి? దానిని క్రింది విధంగా మన ఋషి పుంగవులు నిర్వచించారు.

'యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ |
యచ్చాస్య సంతతే భావః తస్మాదాత్మేతి గీయతే||'

ఏదైతే సర్వవ్యాప్తి చెందుతుందో, సర్వ కాలాల యందు స్థిరంగా ఉండగలదో, ఏదైతే అన్నిటిని పొంది, అనుభవించంచ గలదో అదే ఆత్మ.

భగవద్గీతలో  శ్రీ కృష్ణపరమాత్మ 'ఆత్మ'  కిచ్చిన నిర్వచనం ఇది.

'నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయాంత్యాపో న శోషయతి మారుతః|| 2-23
అఛేద్యోయమదాహ్యో యమక్లేద్యోశోష్య ఏవచ |
నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః || -2 -24’

ఆత్మను శస్త్రములు చ్ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు; అది నిత్యము, సర్వ వ్యాపి, చలింపనిది, స్థిరమైనది, సనాతనము.

దాన్ని ‘మాండూక్యోపనిషద ఈ విధంగా విశదీకరించింది.

'సర్వం హ్యేతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ…'

సర్వం బ్రహ్మమయం, ఈ ఆత్మయు బ్రహ్మమే.

విజ్ఞానగనులైన వివిధ ఉపనిషత్తులలో ‘మహావాక్యాల’ని సమీక్షిస్తే :

'అహం బ్రహ్మాస్మి', ‘నేనే ఆ బ్రహ్మాన్ని’ అంటూ- అని ‘అనుభవ’ వాక్యంగా బోధిస్తోంది యజుర్వేదం లోని ‘బృహదారణ్యక ఉపనిషద్’- 'అద్వైతా' నికి పట్టుకొమ్మయి-

'ప్రజ్ఞానం బ్రహ్మ', 'ఆ చైతన్యమే బ్రహ్మం’ అంటూ- ‘లక్షణ’ వాక్యమై తెలుపుతోంది ఋగ్వేదం లోని ‘ఐతరేయ ఉపనిషద్’ ద్వారా 'ద్వైత’ సిద్ధాంతం-

'తత్వమసి' 'నీవు అదే' అంటూ ఆ బ్రహ్మాన్ని ఉద్దేశించి, ‘ఉపదేశ’ వాక్యమై నిల్చింది సామవేదంలోని ‘చాందోగ్య ఉపనిషద్’ లో ‘విశిష్టాద్వైతా’నికి మూలమై-

'అయం ఆత్మ బ్రహ్మ' ‘నేనే ఆత్మని, బ్రహ్మాన్ని’ అంటూ ‘అభ్యాస’ వాక్యంగా ఉద్యోతిస్తోంది అధర్వవేదం లోని ‘మాండూక్యోపనిషద్’ లో - ‘విశిష్టాద్వైతా’నికి మరో ఆధారమై-

ఆ ఆత్మని, ఆ బ్రహ్మాన్ని, ఆ సచ్చిదానంద మూర్తిని సాధించి జీవన్ముక్తులమౌదాము, అమితానందం అనుభవిద్దాము, అదే ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్క జీవి యొక్క ప్రాధమిక లక్ష్యం.

-o0o-

Posted in January 2021, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *