Menu Close
SirikonaKavithalu_pagetitle
మినీలు.. -- గంగిశెట్టి ల.నా.

రచనదెప్పుడూ రాచ మార్గమే, ఎవరి గోడు పట్టదు
ఎక్కితే ఏనుగంబారీలు, కాదంటే పచారీ కొట్లు
ఉంటే బాజాభజంత్రీలు, లేదంటే తిట్లు

కవులూ రచయితలదెప్పుడూ
ఒన్ వే ట్రాఫిక్కు
వాళ్ళ రాతే వాళ్లకు దిక్కూ, టానిక్కు
నోరు విప్పకున్నా వాయిస్తారు డప్పు
విప్పామా, చెవులకు ముంచుకొస్తుంది ముప్పు

పోరుబందరు మంత్రసాని -- పాలపర్తి

పోరుబందరందు పురిటినొప్పులు పడు
పుతలిబాయి ఏడ్వబోక నవ్వు
పొట్ట నిమురుకొనుచు ముద్దాడుటను చూచి
మంత్రసాని ఇట్లు మదిని తలచె. 1

ఎన్నో కాన్పుల నిట్టె చేసితిని నే నిళ్ళేళ్ళ నీ చోద్యమున్
కన్నారం గననైతి నిప్పటికి ఈ కష్టమ్ము నిష్టమ్ముగా
సన్నాహంబున తాళుకోగలుగు నా శక్తిన్ గనెన్ 'బాపు'రే!
మున్నే వింతలు కల్గబోవునొకదా!ముమ్మాటికిన్ నిక్కమై  2

పుట్టిన శిశువేడ్చుటకై
గట్టిగ కొట్టంగ కెవ్వు గావున నేడ్చున్
కొట్టితి నీతని నేడ్వగ
ఇట్టుల వినిపించె నపుడు 'హేరామ్ హేరామ్' 3

కాలుచేతు లెపుడు కదిలించు చుండును
బోసినోట నవ్వుమొలక తోచు
చెవులు కనులు నోరు చేతులతో మూసి
నట్టులాడుచుండు అర్థమేమొ. 4

ఇంటిపేరు తనకు ఒంటిపేరుగ మారె
జాతిపితగ గాంధి తాత యయ్యె
అతని పుటుక లీల లరసినదాననై
మరల పురుడు పోయ మదిని తలతు

ఏం రాయను? -- అత్తలూరి విజయలక్ష్మి

మనసంతా శూన్యం ఆవరించి చాలకాలమైంది
మూలమూలనా పేర్చుకున్న భావమాలికలన్నీ
ఆలోచనల దారం తెగి  విడివడి చెల్లా చెదురైపోయాయి
పూలన్నీ రెక్కలు రాల్చుకుని మౌన ముద్ర వేశాయి
అక్షరాలకు తలలు తెగిపోయి మొండాలు  గుండె
గోడల మీద వెళ్ళాడుతున్నాయి
తెగిపోయిన తలల కోసం వెతుకుతున్నా ఏదో ఒకటి
అతికించి  ఓ రూపం ఇద్దామని
గిల గిలలాడే భావాలకు ప్రాణం పోద్దామని
ఎంత ప్రయత్నించినా అతుక్కుపోయిన
పెదాలు తెరుచుకోడం లేదు మౌనం చెరలో
నుంచి మాట విముక్తి పొందటం లేదు
బిగుసుకున్న పిడికిలి విచ్చుకోడం లేదు
అందుకే అనిపిస్తోంది ఇంక చెప్పడానికి  ఏమి లేదని
గుండె గోడపై అజంతా చిత్రాలు పూర్తిగా
వెలిసిపోయాయని శిలా రాతలే చెదిరిపోయాయని
వీలైతే విధాతనే రాత మార్చమని
అడుగుదామని
సాధ్యమేనా!

నీడలు -- నాగరాజు రామస్వామి

నీవు
స్వప్న ఛాయలను కప్పుకుని
నా వేపు నడచి వస్తున్న
నిదుర నీడవు.
నేను
కలలను కోల్పోయిన
కల్లోల కడలి కనురెప్పలు దాచుకున్న
అశాంత నిశిని,
దిగంతాల కేసి సాగుతున్న
దినాంత కాంతిని.

నీవు
ఆగామి వెన్నెలలను చుట్టుకొని
నా కేసి నడచి వస్తున్న
పున్నమి నీడవు.
నేను
కోల్పోయిన కలలను
కడలి కన్నులలో దోచుకుంటున్న
ఆత్ర నేత్రాల శరద్రాత్రిని,
దిగంతాల నుండి దిగివస్తున్న
వేకువ నీడను.

నీవు, నా
నిజ జీవన సహచరివి !
సుప్త మానస నెచ్చెలివి !
నీ కాటుక చీకటి రేఖలను,
నీ వన్నె వెన్నెల ఛాయలను
మార్చి మార్చి
నన్ను ఏమార్చుతున్న రాగిణివి!

నా గోడ మీద ఉన్నది నీ నీడే.
ఎన్ని చీకటి రాత్రులు
నీ నీడను తుడిచేసినా
మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూనే ఉంటవి
వెన్నంటే నీ అపురూప ఛాయలు.

ఒక రాత్రి ........... -- స్వాతి శ్రీపాద

1.
సెలవంటూ చెప్పేందుకు ఏవీ మాటలు
కనుకొలుకుల్లో ఒదిగిఒదిగి చెమ్మగిలి
మూగవోయిన మువ్వగా మారాక
ఒక్కో అడుగూ పెంచుతున్న దూరం
నిశ్శబ్దపు ఉద్వేగాల నిప్పు కణికలను
లోలోనే ఎగసందోసి
ఊపిరిగాలి రాజేస్తున్న వేడి ముక్కలయాక
గుక్కతిప్పుకోలేని బెంగ అణువణువునా దూరి
మొనదేలిన కత్తిలా ఎక్కడికక్కడ గాయమవుతున్న వేళ
పరుగెత్తుకు వచ్చి పెనవేసుకోవాలన్న ఊహ
నేలన పాతిన గుంజలా మారి
తనకు తానే దానికి కట్టేసుకున్న లేగదూడయాక
మాట లెక్కడ? ఎండి వాడిన పరిమళాలయాక

2
చూపు వంతెనల తీగల మీద
నిస్తంత్రీ నాదాలై వేలి కొసల మధ్యా
తుళ్ళిపడే సేలయేరయే పులకరింతల తుప్పరలో
పెదవివంపు మలుపులో ఒదిగిన ఒక పలకరి౦తలో
అవిశ్రాంతంగా తెరలు తెరలుగా
కలలు పరచుకుంటూనే ఉంటాయి
ఇటును౦డటూ అటును౦డిటూ
అల్లరిపిల్లల్లా పరుగులుపెడుతూనే ఉంటాయి.
కలబోసుకున్న ఊసులు రాత్రి నాటుకున్నా
తెల్లారేసరికి వెదురు మొక్కల్లా
గజాలు గజాలు పెరిగి పైపైకి దూసుకుపోతాయి
ఉదయం నీరందగానే ఆబగా తాగి తాగి
సొమ్మసిల్లిపోతాయి

౩.
మబ్బుల గంప కి౦ద కమ్మేసిన చుక్కలు
కిక్కురు మనకుండా మాటుమణి గాక
ఒంటిగా నిట్టుర్పుల సెగలో కనలి కనలి
నెలవంక
చెట్ల ఆకుల మధ్య తలదాచుకున్నాకా
పక్కనున్న రాత్రి మౌనంగా నీ రూపమవుతుంది
చల్లగాలి చేతులు తగిలించుకు చెక్కిళ్ళు నిమిరి
గుండెకు హత్తుకుంటుంది.

Posted in September 2020, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!