తిరుమేయాచూర్
భారతీయులలో లలితా సహస్రనామం తెలియని వాళ్ళు, వినని వాళ్ళు, అనుష్టానం చెయ్యని వాళ్ళు తక్కువమంది ఉంటారు. ఈ శ్రీవిద్యని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ మహర్షి అగస్త్య మహర్షికి బోధించారన్న మాట బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. అందుకే లలిత చివరలో 'శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే' అని చెపుతూ ఉంటాము. చాలా సంవత్సరాలుగా ఈ లలితా సహస్రనామం మనకిచ్చిన అగస్త్యుల వారు ఎక్కడ సాధన చేసారో, దాక్షిణాత్యులకి ఈ శాస్త్రం ఎక్కడనించి ఉద్భవించిందో తెలుసుకుందామని కుతూహలం ఉన్నది. కొన్నిఏళ్ల క్రితం విన్న కథనం ప్రకారం కంచి దగ్గిర అని, మరొకచోట అని, విని, కంచికి వెళ్లి అక్కడ శంకర మఠం లోనూ, మిగతా చోట్ల వాకబు చెయ్యడం జరిగింది. ఈ సారి వెళ్ళినప్పుడు, తప్పకుండా తెలుసుకుందామని మొదటే ఒకరికి చెప్పడం, వారు విచారించి మేము వైద్యనాథ ఆలయంలో ఉండగా మాకు చెప్పడంవల్ల, తిరువారూర్ మానేసి, (ఇదివరలో నేను ఎలాగా చూసాను) ఈ తిరుమెయాచూరు - లలితాంబికా క్షేత్రం వైపు తిరిగాము. ఇక్కడ క్లారిటీ కోసం చెపుతున్నాను - హయగ్రీవులవారు అగస్త్యులకి బోధ కాశీ లో చేసినా, అగస్త్యులు దక్షిణాదికి వచ్చేసినందువల్ల ప్రచారం ఈ తిరుమెయాచూరు నించి జరిగింది.
ఈ లలితాంబికా క్షేత్రం తంజావూరుకి 75 కి.మీ. దూరంలో ఉన్నది. చిన్న గ్రామం. అక్కడ వేరే చెప్పుకోవడానికేమీ లేదు. చుట్టూ పొలాలు. చెఱుకు, ధాన్యం పండిస్తున్నారు. దగ్గిర పెద్ద ఊరు మాయావరం. జీవనమంతా గుడిచుట్టూతానే ఉన్నది. ప్రక్కన చూపిన ఫొటోలో మొదటి సారిగా గుడి గోపురాన్ని చూసిన దృశ్యం కనిపిస్తుంది. నా మనసులో ఆనందం, ఉత్సాహం చెప్పలేను. గుడి సాయంత్రం తెరుస్తారంటే, అక్కడ ఆచార్యుల గురించి కనుక్కుని, వారింటికి వెళ్లాము. వీరి పేరు త్యాగరాజన్. చాలా పద్ధతిగా, సౌమ్యంగా ఉన్నారు. తాను అమ్మవారికి ఒక ప్రసాదం పంచే సేవకుడనని మాత్రమే చెప్పుకున్నారు. అక్కడి స్థల పురాణం చెప్పవలసిందిగా వారిని కోరాను. ఆయన చెపుతుండగా తమిళంలో రికార్డు చేసిన వీడియో ప్రమాణం నా దగ్గిర ఉన్నది. ఆ కథ:
అగస్త్య మహాముని హయగ్రీవుల వారి శిష్యుడు. హయగ్రీవులు ప్రత్యక్షమైనప్పుడు, వారి దగ్గిర రకరకాల విద్యలు, పురాణాలు, శాస్త్రాలు వింటున్నారు. అగస్త్యులవారు అనుకుంటున్నారట - గురువుగారు దేవి గురించి ఏమీ చెప్పలేదే - అనీ, హయగ్రీవుల వారు శిష్యుడు అఱ్ఱులు చాచని విద్య చెప్పరాదనీ సంశయిస్తూ ఉన్నారట. అప్పుడు చివరకి అగస్త్యులవారే 'నేను శిష్యుణ్ణి. నేను అడగాలి. స్వామీ, నాకు ఎన్నో తెలియజేసారు - దేవీ మహాత్మ్యం గురించి కూడా చెప్పవలసింది' అనిప్రార్థించారు. దానికి ఎంతో సంతోషించిన హయగ్రీవుల వారు దేవీ భాగవతం, దేవీ ప్రాశస్త్యం, దేవీ పురాణం, అన్నీ చెపుతూ ఒక రహస్య విద్యని నీకు చెపుతానని శ్రీవిద్యయైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అగస్త్యులవారికి బోధించారట. అది విన్న ఆ భక్తాగ్రేశ్వరుడు, 'స్వామీ, నాకు ఆ తల్లి దర్శనం ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఎక్కడ వెలిసి ఉన్నారు?' అని ప్రశ్నించారట. దానికి హయగ్రీవులు, 'ఇక్కడకి (కాశీ క్షేత్రం) దక్షిణంగా "శ్రీపురం, లేక తిరుమేయాచూరు" అనే ప్రదేశంలో, అమ్మవారు "మనోన్మణి" రూపంలో వెలిసి ఉన్నారు. అని వివరించారు. అగస్త్యులవారు చాలా సంతోషించి అక్కడకి వెళ్లి అమ్మవారిని దర్శించి, అక్కడే తపస్సు చేశారని పురాణం. ఇక్కడే అగస్త్యులవారు ఈ శ్రీవిద్యని జనసామాన్యానికి అందించారు. అంత భవ్యమైన క్షేత్రం.
ఇక్కడ లలితాంబికా అమ్మ వారు మనోన్మణి రూపంలో ఉంటారు. ఆవిడ కూర్చుని ఉన్న ఆసనం పంచాసన పీఠం. వీటి రెండిటి గురించి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి అద్భుతమైన వివరణ ఇదివరలోనే విన్నాను కాబట్టి అర్థమయింది. ఆ పంచాసన పీఠం కింద 'లింకె పీఠం' ఉన్నది. అంటే శ్రీచక్ర యంత్రం ఉన్నదని అర్థం. అమ్మవారు నిజంగానే మహారాజ్జ్నీగా కూర్చుని ఉన్న రూపం కనిపిస్తుంది. ఆవిడ సన్నిధి ఒక రాజ్య సభ లాగా ఉంటుంది. ఒక మహారాణీసభలో ఠీవిగా కూర్చున్నట్లు అనిపిస్తుంది. నాలుగు చేతులు, చెఱకు విల్లు, అభయ ముద్ర ఉన్నాయి. విగ్రహం నిలువెత్తు విగ్రహం. కూర్చుని ఉన్నరూపమే మనిషికంటే ఎత్తుగా ఉన్నది. ఎడమకాలు కిందకి, కుడి పాదం మడిచి పద్మ పాదంగా ఉన్నది. అమ్మవారి విగ్రహం బాగా కనపడడంకోసం పొడవాటి చాలా దీపాలున్న సెమ్మె వెలిగించారు. ప్రసన్న వదనం. పెద్ద సన్నిధి. ఆ తల్లి రూపం మన మనసులో ఒకసారి పడిందంటే చెరిగిపోవడం అసాధ్యం.
భండాసుర వధ జరిగిన తరువాత అమ్మవారు చాలా రౌద్రంగా ఉన్నారు. ఈశ్వరుడు ఆ రౌద్రం తగ్గడానికి అమ్మవారిని భూలోకంకి వెళ్లి తపస్సు చెయ్యమని ఆదేశిస్తాడు. అందుకని అమ్మవారు వచ్చి సహస్రకోటి దేవతలనుద్దేశించి తపస్సు చేస్తున్నారు. అలా చాలా ఏళ్ళు తపస్సు చెయ్యగా అమ్మవారి రౌద్రం శాంతించి, మనోన్మణి రూపం వర్తించి, ప్రసన్న వదనంతో ఉన్నారు. ఆ ఆనందంలో తన ముఖము నుంచి ఆవిర్భవించిన ఎనిమిదిమంది వశిన్యాది వాగ్దేవతలని ఉద్దేశించి, తనని వెయ్యి నామాలతో కీర్తించమని చెప్పారట. మనందరి ముఖంలో వేర్వేరు స్థానాల్లో ఉండే ఈ వాగ్దేవతలు సహస్రారంలో ఉండే అమ్మవారి గురించి అద్భుతమైన రహస్య సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని కీర్తించారు. ఈ నాటికీ ఎక్కడైనా అమ్మవారికి సహస్ర నామంతో పూజ చెయ్యాలంటే ఇదే వాడాలి. అలాంటి దివ్యమైన స్తోత్రం ఏర్పడ్డ భవ్యమైన క్షేత్రం ఈ శ్రీపురం - లేక తిరుమేయాచూరు. ఈ స్తోత్రం అంటే తెలియని వారుండరు. అగస్త్యులవారి సన్నిధి ఇక్కడే ఉన్నది.
హయగ్రీవులవారి దగ్గర ఈ సహస్రనామ స్తోత్రం తెలుసుకుని అమ్మవారిదగ్గర అగస్త్యులవారు పారాయణ చేస్తుంటే ఆయనకీ, ఆయన భార్య అయిన లోపాముద్రకి అమ్మవారు మెచ్చి నవరత్నాలు వర్షించారు. ఆ ఆనంద సమయంలో అగస్త్యమహర్షి అమ్మవారినుద్దేశించి 'లలితా నవరత్నమాల - 'మాతా జయ ఓమ్' అనే మకుటంతో రచించారు. సహస్ర నామాలూ 'శ్రీమాతా ' అనే నామంతో మొదలవుతాయని గమనించాలి. ఈ నవరత్న మాలలో ఏవో రెండు శ్లోకాలని అమ్మవారి దగ్గిర ధ్యాన పఠనం చేసిన వారిని అనుగ్రహించాలని అగస్త్యులవారు అమ్మవారిని ప్రార్థించారు. అలా చేసిన వారికి గొప్ప అనుగ్రహం కలిగిందని నిదర్శనాలున్నాయని చెప్పారు త్యాగరాజన్. అగస్త్యులువారు ఇక్కడకి వచ్చి అమ్మవారికి పారాయణ చేసి మెప్పించారని చెప్పటానికి ఆధారం గుడి దగ్గిరలో ఒక నూరు స్థంబాల మంటపం - ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది - కనిపిస్తుంది. దీనిని లలితా సహస్రనామ ధ్యాన మంటపం - అని వ్యవహరిస్తారు.
ఇక్కడ లలితా సహస్రనామాలు ఆవిర్భవించాయని (ప్రచారం చెయ్యబడ్డాయని) అందరికీ తెలియజేయాలని నిశ్చయించిన అమ్మవారు ఒక చిన్న విలాసం చూపించారు. బెంగళూరు ప్రాంతంలో ఉన్న ఒక వైష్ణవ కుటుంబీకురాలి స్వప్నంలో 1991 లో ప్రత్యక్షమై నాకు గజ్జె (గొలుసు అని తమిళంలో అంటారు) కావాలి, నువ్వు వేయించు, అని ఆవిడకి చెప్పిందట. ఆ చెప్పిందెవరో తెలియక ఆవిడ వెతుకుతుంటే ఒక పుస్తకంలో ఇక్కడ ఉన్న అమ్మవారి చిత్రం కనపడిందిట. ఆ చిత్రంలో ఉన్న దేవత, తన కలలో కనబడ్డ దేవత ఒక్కరేనని అర్థమయిన ఆ వైష్ణవి ఆ పుస్తకంలో 'తిరుమేయచూరు, జ్ఞానాలయం' అని చూసి పొంగిపోయి, వెతుక్కుంటూ వచ్చి, 'నాకు స్వప్నంలో వచ్చిన అమ్మవారు, ఈ తల్లి ఒకరే. ఈవిడకి నేను కాలికి గజ్జె వేయించాలి. నాకు ఎంత పొడుగు ఉండాలో తెలియదు. మీరు కొలిచి చెప్పండి, నేను తయారు చేయిస్తానని అర్చకులతో అన్నదట. అప్పుడు త్యాగరాజన్ వంటి అర్చకులంతా చూస్తే విగ్రహంలో గొలుసు (గజ్జె, లేక అందె) వెయ్యడానికి కావలసిన కన్నం కనబడిందట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లుగా చూస్తున్నా మనకి కనపడలేదే, ఈవిడకి ఎలా తెలిసిందో. అమ్మవారి కృప - అని ఆవిడకి కొలత 11.5 అంగుళాలని చెప్పగా ఆవిడ బంగారు గజ్జెలు చేయించి సమర్పించారట. ఇదినాకు తెలిసిన ఘటన అని చెప్పుకొచ్చారు త్యాగరాజన్. "అమ్మవారు, పంచాసన పీఠం కలిసి ఒకే శిలనించి తయారయినట్లు తెలుస్తుంది. కాబట్టి ఆది నుంచి ఈ కన్నం ఉండి ఉండాలి. కానీ ఇప్పటిదాకా మాకెవ్వరికీ తెలియదు. అమ్మవారి కుడి కాలుకి కూడా ఈ కన్నం ఉన్నది. మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి అద్భుతాలు జరిగా" యన్నారు.
మా మాటలు మేము ఇంకా గుడిలోకి వెళ్ళక మునుపే జరిగాయి. ఈ తల్లి సన్నిధికి వెళ్లి మీరేమీ అడగక్కరలేదు. ఆవిడే అన్ని కోరికలూ తీర్చేస్తుంది. భక్తిగా దర్శనం చేసుకుంటే చాలు అన్నారు త్యాగరాజన్. మీరు నమ్మండి, నమ్మక పోండి, నేను అమ్మవారి దర్శనం చేసుకుని ప్రయత్నించి కూడా ఏమీ అడగలేక పోయాను. ఇప్పుడు గుడిలోకి వెళ్లేందుకు తయారవుతున్నాము. ఆ విశేషాలు, వివరాలు మళ్ళీ సంచికలో రాస్తాను. లేకపోతే మరీ పెద్ద వ్యాసం అవుతుంది. ఇంతకంటే పెద్ద పురాణ కథనం కూడా త్యాగరాజన్ వద్ద విన్నాను; అదికూడా వచ్చే సంచికలో పొందుపరుస్తాను.