Menu Close
పెళ్ళిసందడి (నాటిక)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

సంతోషి - "సీతాలు పెళ్లి విషయమేనండి."

ప్రసాద్ - "సీతాలు పెళ్లి బాధ్యత అంతా.. నీమీదే ఉన్నట్టుంది. వాళ్ళయినా ఇంత సీరియసుగా ఆలోచిస్తున్నారో లేదో."

సంతోషి  - "తల్లి తోడు అయినప్పుడు మనకి చేతనయిన సాయం మనం చెయ్యాలి కదండి."

ప్రసాద్ – (వ్యంగ్యంగా)  “నువ్వు అదే కదా చేస్తున్నావ్."

సంతోషి  - "ఏమండీ- మీ మినిస్టరుగారి అమ్మాయి పెళ్ళికి; ఇన్విటేషన్లు వేయించడానికి పెళ్ళికొడుకు పేరు అవన్నీ కనుక్కొన్నారా."

ప్రసాద్ - "ఆ.. కావలిసిన ఆ వివరాలన్నీ మినిస్టరుగారు ఇచ్చేరు. రేపు ప్రింటింగు ప్రెస్ వాళ్ళని పిలిపిస్తాను."

సంతోషి - "మన సీతాలు పెళ్లి ఇన్విటేషన్లు కూడా వాళ్ళ చేతే వేయించేస్తే అదో పని అయిపోతుందండి."

ప్రసాద్ - (వెటకారంగా) "ఎందుకవ్వదూ; తప్పకుండా అయిపోతుంది. మంగళ వాయిద్యాలు వాళ్ళని కూడా ఇక్కడినుండి గుంటూరు పంపిస్తే మరోపని కూడా అయిపోతుంది. ఏమంటావ్."

సంతోషి - "మీరు మరీనండి."

(అంతలో ప్రసాద్ కు ఒక నగల వ్యాపారి నుండి ఫోను వస్తుంది. తన సెల్ ఫోను ఎత్తుకొని)

ప్రసాద్ - "అవును... నేను ప్రసాదే మాట్లాడుతున్నాను......తీరుబాటు...అంటే అదెప్పుడూ ఉండదండి.....సరే.. ఏ పనిమీద వద్దామనుకొంటున్నారు..…..ఆ.. అవును. (చిరునవ్వుతో) మినిస్టరుగారి అమ్మాయి పెళ్లి విషయం మీకు అప్పుడే తెలిసిందన్నమాట. … సరే…మీరు ఒక పని చెయ్యండి...... నగలు కొన్ని; డిఫరెంట్ మోడల్సులో సాంపిల్సు తీసుకొని ఇప్పుడే రండి... మీకు నా ఎడ్రస్ తెలుసా......ఓకే."

(సంతోషి తో) నా కోసం ఒకాయన వస్తున్నాడు. నువ్వు వంటింట్లో పని చూసుకో."

(సంతోషి నిష్క్రమిస్తుంది.)

(కొంత సమయం తరువాత, May I come in sir అని వినిపిస్తుంది)

ప్రసాద్- “కమిన్.”

ప్రసాద్- (మోహన్ లాల్ ప్రవేశిస్తూంటే అతన్ని చూసి) “మోహన్ లాల్ గారూ రండి కూర్చోండి.”

మోహన్ లాల్ - "Thank you sir.”

ప్రసాద్ - "మీ జ్యూయలరీ షో రూమ్ పేరు ఏమిటన్నారు."

మోహన్ లాల్ - "సింగపూర్ జ్యూయెలర్స్ సర్. మా దగ్గర వెండిసామాన్లు బంగారం వజ్రాల నగలు చాలా వెరైటీస్; లేటెస్ట్ డిజయిన్సులో ఉన్నాయి సార్. తమరు సాంపిల్సు తెమ్మన్నారు; తెచ్చేను. చూపించమంటారా సార్.”

ప్రసాద్ - "చూపించండి."

మోహన్ లాల్ - (ప్రసాద్ కు దగ్గరగా వచ్చి, ఒక్కొక్కటి చూపిస్తూ) "దీని ధర 25 లేక్స్ సర్ ... ఇది 42 సర్… ఇది 78 సర్… ఇది 1.2 క్రోర్స్  సర్… ఇది 1.8 క్రోర్స్ సర్"

ప్రసాద్ - "మోహన్ లాల్ గారూ అన్నీ… బాగానే… ఉన్నట్టున్నాయి.... నాకు డైమండ్సు గూర్చి ఐడియా లేదు...మరి నావంటివాడికి ఈ డైమండ్సు రియల్ వో కావో ఎలా తెలుస్తాయండి."

మోహన్ లాల్ - "సార్, మా దగ్గర ఉన్న ప్రతీ డైమండుకు IGI certificate ఉంటుందండి.”

ప్రసాద్ - "IGI సర్టిఫికెటా! అదేమిటండి”

మోహన్ లాల్ - "సార్. International Gemological Institute వారు ప్రతి డైమండును టెస్టు చేసి వాటి క్వాలిటీ కలరు కేరట్స్ అవీ సర్టిఫై చేస్తారండి. మేము అటువంటి సర్టిఫైడ్ డైమండ్సునే వాడతామండి.”

ప్రసాద్ - (మందహాసంతో) "ఈ పెళ్లి ధర్మమా అని నాకు డైమండ్సు గూర్చి కొంత నాలెడ్జ్ వచ్చింది.”

మోహన్ లాల్ - "సార్, మన మినిస్టరుగారి అమ్మాయిగారి పెళ్ళికి కావలిసిన నగలు మా దుకాణం నుండి తీసుకొంటే మా షో రూమ్ first sale శుభకార్యానికవుతుంది సార్. అది మాకు చాలా సంతోషం సర్.  ఆ విషయంలో తమరి రికమెండేషను కోసం.. రిక్వెస్టు  చేయడానికి వచ్చేను సార్.”

ప్రసాద్- “మోహన్ లాల్ గారూ- మీరు చూపించిన సాంపిల్సు నాకు బాగానే కనిపిస్తున్నాయి. కాని డిసైడు చెయ్యడం; మేడం గారు అమెరికానుండి వచ్చేక ఆవిడ చెయ్యాలి. ప్రస్తుతానికి madam గారు అమెరికాలో ఉన్నారు. వారం రోజుల్లో రావచ్చు. So… మీరు ఒక వారం తరువాత నన్ను contact చెయ్యండి.”

మోహన్ లాల్ - “అలాగే sir …తమరి… రికమెండేషను…”

ప్రసాద్- “okay- okay.”

(అంతలో, సంతోషి పట్టకారు పట్టుకొని ప్రవేశిస్తుంటే,)

ప్రసాద్- “సంతోషీ,  మొదట ఆ పట్టకారు కిందకి దింపు.”

సంతోషి- “ఇదెక్కడి గొడవండీ.“

(సంతోషి పట్టకారు table మీద పెడుతుంది)

సంతోషి - (మోహన్ లాల్ తో) మీకు తెలుసుకదా.. పెద్దింటివాళ్ళు.. అందులోనూ అంత status లో ఉన్నవాళ్లు.. latest designs కోసమే చూస్తారుకదా.”

మోహన్ లాల్ - “మీరన్నది నిజమే madam గారూ. మా దగ్గర ఉన్నవి అన్నీ latest and best designs మేడం గారూ. డైమండు నెక్లెసులు 25 lakhs నుండి 2 crores దాకా ఖరీదయినవి ఉన్నాయి మేడం గారూ. సారుకు చూపించేను. మీరు కూడా ఒక మారు చూడండి.”

(మోహన్ లాల్ తను తెచ్చిన నగలు ఒక్కొక్కటి సంతోషికి చూపిస్తాడు)

సంతోషి - "బాగానే ఉన్నాయండి. ఇంకా వెరైటీసు ఉంటే మేడంగారు వచ్చేక ఆవిడకి చూపించండి. ఆవిడకి నచ్చాలి; పెళ్లికూతురుకు కూడా నచ్చాలి కదా."

మోహన్ లాల్ - "అవును మేడంగారూ. మా దగ్గర ఉన్న వెరైటీసు అన్నీ వాళ్లకి చూపిస్తాను. వాళ్ళు తప్పక నచ్చుతారండి."

సంతోషి - "మీ దగ్గర..అన్నీ..మీరు చెప్పిన ఖరీదుల్లోనే ఉన్నాయా; మావంటివాళ్లు కొనుక్కోగలిగే ధరలలో కూడా ఉన్నాయా."

మోహన్ లాల్ - "అన్ని ఖరీదులలోను  ఉన్నాయి మేడం గారూ. తమకు కూడా అవసరముందని నాకు తెలీలేదు. లేకపోతే వాటి సాంపిల్సు కూడా తెచ్చి ఉందును మేడంగారూ."

ప్రసాద్ - (మోహన్ లాల్ తో) “ ఫరవాలేదు లెండి. అది తరువాత చూసుకోవచ్చు.”

సంతోషి- “సరేలెండి; మేడం గారు వచ్చేక ఆవిడే చూసుకొంటారు. నాకు వంటింట్లో పనుంది; వస్తాను."

( సంతోషి నిష్క్రమించును)

మోహన్ లాల్ - “సార్, మా షాపు, inauguration విషయం తమకు చెప్పేను కదా... తమరు...”

ప్రసాద్- (diary తిరగేస్తూ) మినిస్టరుగారికి ఈ నెలంతా tight schedule. అయినా చూస్తా... వచ్చే... బుధవారం…

(అంతలో సంతోషి ప్రవేశించును)

సంతోషి- (అట్లకాడతో  ప్రవేశిస్తూ) “వచ్చే బుధవారమంటున్నారు.. మరచిపోయేరా ఏమిటి.”

(ప్రసాద్, ‘ఏమిటి’ అన్నట్లు expression ఇస్తాడు)

సంతోషి - “ఆ రోజే… కదా ... మీ మినిస్టరుగారి అమ్మాయి పెళ్లి ముహూర్తం.”

ప్రసాద్- “Oh! My God! డైరీలో note చేసుకోడం మర్చిపోయేను.. thank you సంతోషీ .... ఏదో… మాడువాసన… వస్తున్నట్టుంది... సంతోషీ.”

సంతోషి- “అయ్యో - అయ్యో.. కూర కాబోలు…”

(సంతోషి తొందరగా లోపలికి వెళ్లిపోతుంది)

ప్రసాద్- “మోహన్ లాల్ గారూ ....ఇనాగురేషన్ డేటు… మీరు ఒక వారం తరువాత నన్ను contact చెయ్యండి. ఈలోగా మేడం గారు America నుండి వస్తారు. మీ రెండు పనులు ఒకే మారు అయిపోతాయి.”

మోహన్ లాల్ - “Thank you sir... మరి శలవా …”

(ప్రసాద్ అవునన్నట్లు బుర్ర ఊపుతాడు. మోహన్ లాల్ నిష్క్రమించును)

(ప్రసాద్, తన డెయిరీలో ఏదో రాసుకొంటూ ఉంటాడు. కొద్ది సేపట్లో సంతోషి ప్రవేశిస్తుంది. ప్రసాద్ అది గమనించి,)

ప్రసాద్ - "ఏం ఇలా వచ్చేవ్. వంట పూర్తయిందా."

సంతోషి - "అవుతున్నాది. అది సరేగాని; ఆ వచ్చిన మనిషితో నేను మాట్లాడుతూ ఉంటే; తరువాత చూసుకోవచ్చని ఎందుకు చెప్పేరండి..ఏవయినా తక్కువ ధరలలో ఉంటే; కొని సీతాలుకు పెళ్ళిలో  ఇద్దామనుకొన్నాను. (వ్యంగ్యంగా) సరేలెండి; మా అక్కయ్య కూతురు పెళ్లి; మీకెందుకు ఇబ్బంది."

ప్రసాద్ - "సంతోషీ నీ బుర్రలో ఏమిటుందో నాకు తెలుసు. దేనికయినా… ఓ హద్దు ఉండాలి. నువ్వు ఇలా అన్నింటిలోనూ కలుగజేసుకొంటే పెళ్లి ముహూర్తం వేళకు...నేను జైల్లో ఉంటాను. అది జ్ఞాపకముంచుకో."

సంతోషి - "మీరు జైల్లోకి వెళితే నాకేమిటి కలిసొస్తుందండి. అయినా నాకెందుకు. మీ మినిస్టరుగారి కూతురు పెళ్లి. మీరే అన్నీ చూసుకోండి." (చికాకుగా సంతోషి నిష్క్రమించును)

(అంతలో ప్రసాద్ సెల్ ఫోను మోగుతుంది. అది ఎత్తుకొని)

ప్రసాద్ - "హాల్లో, సురేష్... ఇంట్లోనే ఉన్నాను..... for a change ఇవాళ తొందరగా రావడమయింది .... బిజీ ... గిజీ, ఏమీలేదు. నువ్వు రా”

(కొంత సమయం తరువాత సురేష్ ప్రవేశిస్తాడు. ప్రసాద్ ఎదురుగా వెళ్లి షేక్  హేండ్ ఇచ్చి తన ఎడమ  చేతితో సురేష్ కుడి భుజం తట్టి స్వాగతం పలుకుతాడు)

ప్రసాద్ - "ఇలా కూర్చో ."

(ఇద్దరూ ఆసీనులవుతారు)

ప్రసాద్ - "ఫంక్షను, బాగా అయిపోయిందా."

సురేష్ - "ఆ.. దేముడి దయవల్ల ఫంక్షను బాగానే అయిపోయింది."

(సంతోషి ప్రవేశిస్తుంది. నిలబడే మాట్లాడుతుంది)

సంతోషి  - (సురేష్ ను ఉద్దేశించి) "అన్నయ్యగారూ- అమ్మాయి మీతోనే వచ్చిందా. "

సురేష్ - "ఆ.. మాతోనే వచ్చిందండి."

సంతోషి - "అమ్మాయి తేలిగ్గా తిరుగుతోందా."

సురేష్ - (అవునన్నట్లు తల ఊపి) " ఆ.."

ప్రసాద్ - (సురేష్ ను ఉద్దేశించి) "నువ్వేమిటి తీసుకొంటావ్; కాఫీయా, టీయా."

సురేష్ - "No formality... ఏమీ వద్దు. మరో ఘడీపోయి భోజనం చేస్తాను. ఇప్పుడు కాఫీ టీ తాగితే భోజనం చెడుతుంది."

సంతోషి - "అన్నయ్యగారూ వంటింట్లో పని ఉంది; వస్తాను."

(సంతోషి నిష్క్రమించును)

ప్రసాద్ - "సురేష్; నాతో ఏదో పని ఉందన్నావ్. ఏమిటది."

****సశేషం****

Posted in January 2023, నాటికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!