నునువెచ్చని నీరవ నిశీధిలో హాయిగా నిదురిస్తున్న నన్ను
ఒక్కసారి ఎవరో అయోమయ లోకంలోకి బలంగా నెట్టేస్తే
భయంవేసి గొంతు చించుకు ఏడ్చేసాను
ఎవరో పాలిస్తుంటే తాగుతూ ఆ మత్తులో
నా బొజ్జ నిండుతోందనే తెలుసు …
అప్పుడు నాకు తెలియదు నేనెక్కడున్నానో, ఏం జరుగుతోందో
నిద్దురొచ్చి కళ్ళుమండి నేనేడుస్తుంటే
నువ్వు సముదాయిస్తూ ఏదో పాట పాడుతూంటే
ఏడుపునాపి వింటుంటే ఎంత బాగుందో చల్లగా వీనులవిందుగా …
ఆ రాగపు వంపుసొంపులతో కొండలపై తేలుతూ లోయలలోకి జారుతూ
దానితోనే నిద్రలోకి జారుకోవడం మరీ బాగుంది
ఆకారాలు తెలియడం మొదలెట్టాక
ఎగురుతున్న నీ నల్లని ముంగురులతో ఆడుతూంటే
నీ నవ్వు ముఖం ముద్దులిస్తూంటే ఎంతో హాయి
నీ పాలలాగ ఎంతో బాగుండేది తృప్తి నిస్తూ
నిన్ను చూడగానే నవ్వుల కేరింతలు వచ్చేవి, ఎందుకో
నాకు తెలియకుండానే కాళ్లు చేతులు కొట్టుకునేవి…
నువ్వు నన్నొదిలి నువ్వెళ్లి పోతూంటే ఏడుపోచ్చేది … మళ్ళీ
నన్నింత గారం చేసే నువ్వు ఎలా వెళ్ళిపోతావని సందేహంతో
ఆ వచ్చీరాని నా ఏడుపు ముఖం చూసి నీవు
ముద్దొచ్చి నన్ను హత్తుకుంటె ఎంత బాగుండేదో …
అందరు అంటుంటే తెలిసిందప్పుడు నువ్వు నా అమ్మవని!
నువ్వు దెబ్బలేస్తానని చెయ్యెత్తి బెదిరిస్తుంటే
నిజంగానే తగులుతుందని భయమేసి ఏడుస్తుంటే
అప్పుడు నువ్విచ్చే ముద్దు యెంత బాగుంటుందో...
నిన్ను పట్టుకుని గోముగా గారాలు పోవాలనిపిస్తుంది ...
అమ్మఅంత తియ్యగా ఉంటుందని, అమ్మ ఉంటే మరేది వద్దని,
అమ్మే నా ఆనందానికి సీమయని, ఎంత మురిసి పోతానో…