Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

అంశం: అష్టాదశ శక్తిపీఠాలు

9. ఉజ్జయిని మహంకాళి శక్తి పీఠం

ఉజ్జయినీ నవమ శక్తి పీఠ స్థితే కాళీ నమః,
సతీ అధరోధ్భవ శక్తి రూపిణీ కాళీ నమః,
అజ్ఞాన వినాశినీ, మోక్ష ప్రదాయినీ కాళీ నమః,
దుష్ట శిక్షకీ శిష్ట రక్షకీ మహాకాళీ నమః
కాళిదాసును కవిని చేసింది మహాకాళి సత్యా!

10. పురుహూతికా దేవి శక్తి పీఠం

పురుహూతికా దేవీ వెలసిన పుణ్య క్షేత్రం,
గయాసుర మర్దక కుక్కుటేశ్వర పుణ్య క్షేత్రం,
దాక్షాయణీ పీఠభాగోధ్భవ శక్తి పుణ్యక్షేత్రం,
శ్రీపాదవల్లభ రూప కలి దత్త పుణ్యక్షేత్రం,
పిఠాపురం దశమ, అష్టాదశ శక్తి పీఠం సత్యా!

11. శక్తి పీఠాలు-గిరిజా దేవి

సతీ నాభిస్థానోధ్భవీ గిరిజాదేవి నమః,
వైతరిణీ నదీ తీర స్థితే సింహవాహనా నమః,
ఏకాదశ పీఠ ఓడ్యాణ పురేశ్వరి దేవీ నమః,
శ్రీవిష్ణు ప్రియా శక్తి త్రయ రూపిణీ విరిజా నమః
నాభి గయగా ఖ్యాతినొందిన శక్తి పీఠమిది సత్యా!

12. శక్తి పీఠాలు:మాణిక్యాంబ దేవి

సతీ దేహోధ్భవ ద్వాదశ శక్తి పీఠేశ్వరీ నమః,
దక్షారామ భీమేశ్వర సతీ మాణిక్యాంబా నమః,
స్ఫటిక లింగాకార స్వయంభూ శివ ప్రియే నమః,
శ్రీ చక్రాగ్ర స్థితే, ఆర్తత్రాణ పరాయణీ నమః,
ద్రాక్షారామం పంచారామమూ, త్రిలింగ క్షేత్రమూ సత్యా!

13. కామాఖ్యదేవి శక్తి పీఠం

సతీ యోని భాగ జనితా కామాఖ్యా దేవీ నమః,
నీలాచలాగ్రణీ త్రిపుర శక్తిదాయినీ నమః,
ఈశ్వర మనోరంజనీ త్రిపుర సుందరి నమః,
సకల దేవతా పూజితా సింహవాహినీ నమః
మహా యోగ స్థలం త్రయోదశ శక్తి పీఠం సత్యా!

శక్తి పీఠాల పంచపదుల గురించి మీ సూచనలు తెలిపి, అభిప్రాయాలు పంచుకొనగలరు.

*** సశేషం ***

Posted in October 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!