Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 2
సత్యం మందపాటి

స్పందన

ఆ రోజుల్లో మన సమాజంలో, ముఖ్యంగా తెలుగు నాట, చాలమందిలో వున్న కుల గజ్జి, మత పిచ్చీ చూశాక ఆ విషయం మీద ఒక కథ వ్రాయాలనిపించింది. దాని ఫలితమే నాకు ప్రత్యేకాభిమానం వున్న ఈ నా కథ ‘సర్వం జగన్నాథం’. ఆనాడు బెంగుళూరునించి వచ్చిన ‘ప్రజామత’ తెలుగు వారపత్రికలో ప్రచురింపబడటమే కాక, ఈ కథ నాకెన్నో అభినందనలని అభిమానులనించి సంపాదించిపెట్టింది. కాకపోతే ఎంతో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ కథ వ్రాసి అర్ధ శతాబ్దమయినా, ఇంకా మన తెలుగు దేశాన ఆ కుల గజ్జి, మత పిచ్చి ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గలేదు. ఇంకో యాభై ఏళ్ళలోనైనా అవన్నీ పోయి, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ సాటి మనుష్యుల్ని మనుష్యులుగానే చూసే రోజు వస్తుందని ఆశిద్దాం.

సర్వం జగన్నాథం

(ఈ కథ ‘ప్రజామత’ వారపత్రిక అక్టోబర్ 25, 1972 సంచికలో ప్రచురింపబడింది)

Sarvam-Jagannadham

విడిదిలో హడావిడిగా తిరుగుతున్న ఆవిడ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆవిడ తనని తదేకంగా చూడటం గమనించి ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. ముహూర్తం వేళ సమీపిస్తున్నది. మగపెళ్ళివారు విడిది వదలి పెళ్ళి మండపం దగ్గరకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతున్నది. ఆడపెళ్ళివారు మేళతాళాలతో మగపెళ్ళివారిని ఆహ్వానించడానికి వచ్చారు. ఆవిడ ఆ ప్రయత్నంలో వుండగానే ఎదురుగా ఆయన కనపడ్డాడు. ముందు ఆయన్ని చూసి గుర్తుపట్టలేకపోయింది. క్రమంగా గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. కొంచెంసేపటికి ఆశ్చర్యంలోనించి తేరుకుంటూ ముందుకు నడిచింది.

ఇదే నలభై ఐదేళ్ళ క్రితం అయితే ఆవిడ సిగ్గుపడేది. తల వంచుకుని పారిపోయేదేమో! కానీ ఈనాడు ఆ అవసరం లేదు. అందుకే ధీమాగా ముందుకు నడిచింది. అయినా కాళ్ళల్లో ఏదో వణుకు. మనసులో ఏదో ఆరాటం. అయినా మనిషిలో అదో ఆనందం.

ఆయనా ఆమెను తదేకంగా అలానే చూస్తున్నాడు. ఇదే నలభై ఐదేళ్ళ క్రితం అయితే ఆయన ముఖమాట పడేవాడు. ఎవరన్నా చూస్తున్నారేమోనని భయపడేవాడు. కానీ ఈనాడు ఆ అవసరం లేదు. అందుకే ధైర్యంగా ఆమె వేపు చూశాడు. అయినా కళ్ళల్లో ఏదో నదురు. పెదవుల్లో ఏదో వణుకు. అయినా మనిషిలో ఏదో ఉత్సాహం.

సరాసరి వచ్చి ఆయనకు ఎదురుగా ఆగింది ఆవిడ. ఒక క్షణం సూటిగా చూసింది.

“ఎన్నాళ్ళకి చూశాను జగన్నాథం!” మాటలు కూడబలుక్కుంటూ అన్నదావిడ.

“నువ్వు ఆనాటి పార్వతివే అంటే నమ్మలేకుండా వున్నాను సుమా!” నెమ్మదిగా అన్నాడాయన. ఆవిడ చిన్నగా నవ్వింది.

“నేనిప్పుడు పార్వతిని కాదు జగన్నాథం. పార్వతమ్మగారిని” అన్నది.

ఆవిడని తేరిపార చూశాడు జగన్నాథం. ముఖం అక్కడక్కడా ముడతలు పడుతున్నది. తల చాలవరకూ పండిపోయింది. మనిషిలో పూర్వపు పటుత్వం, బిగి లేవు. కళ్ళల్లో చిలిపితనం, చురుకుతనం బదులు అదో విధమైన ధీమా, వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి. కళ్ళ క్రింద సన్నటి నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి.

“చాల మారిపోయావు పారూ! వృద్ధాప్యం మీద పడుతున్నది” అన్నాడు జగన్నాథం.

ఆవిడ మళ్ళీ నవ్వింది.

“పారూ అనే పిలుపు ఎన్నాళ్ళకి విన్నాను జగన్నాథం. నువ్వలా పిలిస్తే నా మనసు ఆ రోజుల్లో వురకలు వేసేది. పరుగులు తీసేది. కానీ ఇప్పుడు నువ్వలా పిలుస్తుంటే నవ్వు వస్తున్నది. మన మనవలూ, మనవరాళ్ళూ నువ్వు నన్నలా పిలవటం విని అపార్ధం చేసుకోకపోయినా ఎగతాళిగా నవ్వుకుంటారు”

కొంచెంసేపు ఆగి ఆవిడ మళ్ళీ అన్నది.

“నా ఒక్కదాని మీదే వృద్ధాప్యం పడిపోయినట్టు మాట్లాడతావేం? నువ్వూ ముసలివాడివైపోయావు సుమా!” అన్నదావిడ ఆయన్ని దీక్షగా చూస్తూ.

ఆయన ముఖం ముడతలు పడింది. తల తెల్లగా ముగ్గుబుట్టలా వుంది. మనిషిలో పూర్వపు శక్తీ, ఉత్సాహం లేవు. కళ్ళల్లో కవ్వింపూ, మెరుపూ బదులు అదో విధమైన ఆప్యాయత, కరుణ తొణికిసలాడుతున్నాయి. కళ్ళకి మందమైన జోడు కూడా వచ్చింది.

“అవును పారూ, ఇద్దరం ముసలివాళ్ళమైపోయాం!” నిట్టూర్చాడాయన.

“ఏమండోయ్ పార్వతమ్మగారు, ఇక్కడున్నారా? త్వరగా రండి. మీ కోసమే చూస్తున్నాం” కేకేసింది ఒక ముత్తైదువ.

“ఆఁ! వచ్చే… అది సరేగానీ జగన్నాధం, మీ ఆవిడ కూడా పెళ్ళికి వచ్చిందా?” ఆత్రంగా అడిగింది పార్వతి.

“లేదు పారూ. ఆవిడ చనిపోయి కూడా పదేళ్ళయింది”

పార్వతి అనుకున్నట్టు జగన్నాధం కళ్ళు తుడుచుకోలేదు.

“మరి మీ ఆయన్ని చూపించవూ” పార్వతి నుదిటి మీద పెద్ద సైజు కుంకుమ బొట్టుని చూస్తూ అడిగాడు.

మళ్ళీ పార్వతమ్మగారిని “వస్తున్నారా?” అంటూ కేకేసింది ఆ ముత్తైదువ.

“ఆఁ! వచ్చే… అదంతా ఒక కథ జగన్నాధం. చెబుతాలే. మళ్ళీ కనబడతాలే!” చకచకా వెళ్ళిపోయింది.

ఆ క్షణం నించీ ఇద్దరినీ ఆలోచనలు ఈగల్లా ముసురుతున్నాయి. ఇద్దరూ పరధ్యాన్నంగానే వున్నారు. మళ్ళీ ఆవిడని పెళ్ళి పందిట్లో చూశాడు జగన్నాధం. పందిట్లో ఇటూ అటూ హడావిడిగానే కాక, చాల చనువుగా తిరుగుతున్నది.

తననే దీక్షగా చూస్తున్న జగన్నాధాన్ని ఆవిడ గమనించి చిన్నగా నవ్వింది. జగన్నాధం తెల్లని దుబ్బు మీసాల వెనుక చేసిన మందహాసం ఆవిడా చూడకపోలేదు.

పెళ్ళి అనుకున్నదానికన్నా కూడా బాగా జరిగింది. భోజనాలు చేస్తుండగా లడ్ల పళ్ళెం పట్టుకుని వచ్చింది ఆవిడ. రెండు లడ్లు ఏకంగా ఒకేసారి విస్తట్లో పడేసరికీ విస్తుబోయి తలెత్తాడు జగన్నాధం.

ఆవిడ నవ్వుతూ, “తిను జగన్నాధం. లడ్లు ఆరోగ్యానికి భంగకరం కాదులే” అన్నది.

ఆయన కూడా నవ్వి, “అదికాదు పారూ… పార్వతీ, ఎక్కువ తింటే మళ్ళీ అరగదు. తర్వాత అనవసరంగా మళ్ళీ బాధపడాలి. అదీకాక నమలటానికి నాకు అన్ని పళ్ళూ లేవుగా” అంటూ నోరు తెరిచి చూపించాడు.

ఆవిడా నవ్వి, “అయితే నాకేమీ తీసిపోనంటావు” అంటూ వెళ్ళిపోయింది.

జగన్నాధం మనసు మనసులో లేదు. ఆవిడతో చాలా మాట్లాడాలి. చాలా… చాలా... కానీ ఎలా? ఆ రోజల్లా ఆయన ఇదే ఆలోచనలో వున్నాడు. ఆవిడ ఎదురుపడితే చాలనుకున్నాడు. కానీ వీలు కలుగలేదు.

“రండి తాతయ్యగారూ, ఊరేగింపు బయల్దేరబోతున్నది” అన్నాడు ఒకాయన హడావిడిగా వచ్చి.

ఉలిక్కిపడ్డాడు జగన్నాధం. ఆయనకి తాతయ్యగారూ అని పిలిపించుకోవటం అలవాటే అయినా, పార్వతి వూహల్లో వున్న సమయంలో ఆ మాట అదోలా అనిపించింది. తనని అవమానిస్తున్నట్టే అనిపించింది.

“నేను రాను!” సూటిగా అన్నాడు జగన్నాధం కొంచెం కోపంగా. బిత్తరపోయాడు పిలిచిన ఆ పెద్దమనిషి. మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత ఇంకొకాయన వచ్చి, “పెద్దవారు. మీరు కనీసం మాకోసమయినా రావాలి. ఊరేగింపులో మీలాటి పెద్దలు వుంటేగానీ బాగుండదు” అన్నాడు.

జగన్నాధం ఒక్క క్షణం సర్దుకుని, “సరే! వస్తున్నాను. మీరు పదండి” అన్నాడు.

ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. పార్వతి గురించి వస్తున్న ఆలోచనలలో తను యువకుడిని అయిపోయాననుకుంటున్న జగన్నాధంకి తాతయ్యగారూ, పెద్దవారు అని అందరూ అంటుంటే తేళ్ళూ జెర్రులూ పాకినట్టుంది.

బయటనించి మళ్ళీ పిలుపు వచ్చింది. ఇక తప్పదన్నట్టు లేచి ఆయన ఊరేగింపులో కలిశాడు. వంద గజాలైనా నడవకముండే నీరసం అనే సాకు చెప్పి వెనక్కి తిరిగాడు జగన్నాధం.

పందిరి అంతా ఖాళీగా వుంది. ఏవో పనులు చేసుకుంటున్నవారు తప్ప, ఎవరూ లేరు. ప్రక్కనే వున్న మెట్లు ఎక్కి డాబా మీదకు వచ్చాడు జగన్నాధం.

నలభై ఐదేళ్ళ క్రితం పార్వతి యవ్వనంలా విరగ కాస్తున్నది వెన్నెల. ఆనాటి పార్వతి శరీరంలాగా ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్ల మీదుగా వస్తున్న చల్లని గాలి గిలిగింతలు పెడుతున్నది. అక్కడే వాల్చి వున్న మడత మంచం మీద పడుకుని ఊహాలోకంలో తేలిపోతున్నాడు జగన్నాధం.

“ఏం జగన్నాధం, పెద్ద ఎత్తు వేశావే ఒంటరిగా కలుసుకోవటానికి” అన్నది పార్వతి అప్పుడే వస్తూ.

“ఎత్తూ లేదు, నా మొఖం లేదు. కొంచెం నీరసంగా వుంటేనూ...” చిన్నగా గొణిగాడు జగన్నాధం.

ఆవిడ బిగ్గరగా నవ్వింది.

“నువ్వేం మారలేదు జగన్నాధం. ఆనాటి అభిమానం. అతిశయం నీలో ఇంకా తగ్గలేదు. నేను ప్రొద్దుటినించీ నీ వరస కనిపెడుతున్నానులే! నేను ఒంటరిగా కనపడతానేమోనని నువ్వు అదే పనిగా ఎదురు చూడటం నేను గమనించలేదనుకున్నావా?” కొంటెగా అంది ఆవిడ.

“మరి ఊరేగింపుకి నువ్వెందుకు వెళ్ళలేదు… నువ్వూ అంతేగా” అన్నాడు జగన్నాధం.

“వెళ్ళాను. కానీ నువ్వు వెనక్కి తిరిగిరావటం చూసి, నేనూ వెనక్కి తిరిగాను” అంది ఫెళఫెళా నవ్వుతూ.

“కూర్చో పారూ!” అన్నాడు జగన్నాధం, మంచం మీద కొంచెం ప్రక్కకు జరుగుతూ.

“జగన్నాధం. మనం పెద్దవాళ్లమైపోయాం. మరచిపోకు” అంటూనే నేల మీద పిట్టగోడకి ఆనుకుని కూర్చున్నది పార్వతి.

జగన్నాధం నవ్వాడు. “ఈ వయసులో ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదులే పారూ. ఇవి ఆ రోజులు కావులే!”

అతని మాటలకు అడ్డం వస్తూ అన్నది పార్వతి. “నీ చిలిపితనం ఇంకా పోలేదు. అది సరే మనం చివరిసారిగా కలుసుకుని ఎన్నాళ్ళయింది?”

“నలభై ఐదేళ్ళ పైన” అన్నాడు జగన్నాధం, గతం మరీ లోతుగా వుండటం గమనించి. ఆవిడా ఏదో ఆలోచనలో పడింది. “నీకెంతమంది పిల్లలు?” అడిగింది.

“ఒక్కడే కొడుకు. వాడి దగ్గరే వుంటున్నాను. నీకు?” అడిగాడు.

“ఇద్దరు కూతుళ్ళు. రెండో అమ్మాయి మొగుడి అన్నయ్య కూతురికే ఇప్పుడు పెళ్ళి. అన్నట్టు నీకు మగపెళ్ళి వారెలా తెలుసు?”

“సరే! అడిగావూ. నా ప్రాణ స్నేహితుడు రామబ్రహ్మం మనవడే కదా పెళ్ళి కొడుకు. నేను రాకపోతే ఈ పెళ్ళి జరుగుతుందా అసలు. నేనంటే గొప్ప ప్రేమ వాళ్ళకి”

“అవును, నువ్వంటే ప్రేమ లేనిదెవరికి? ఆరోజుల్లో నేనూ నీ మీద ఆశలు పెంచుకోవటానికి కారణం కూడా అదే కదూ!”

జగన్నాధం మాట్లాడలేదు.

“ఏమైతేనేం. ఇన్నేళ్ళ తర్వాత నిన్ను కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు జగన్నాధం”

“అవును, ఎలా అనుకుంటాం. నీ పెళ్ళితో నీదో దారి, నాదో దారి అయింది. అన్నట్టు మీ ఆయనేడీ?”

“ఏం చెప్పను జగన్నాధం. రెండేళ్ళయిందేమో… కాశీకని వెళ్ళి తిరిగి రాలేదు. ఉత్తరమూ లేదు. ఇంకా నా ఐదవతనం వుందనుకుంటూ అలానే నెట్టుకొస్తున్నాను”

నిట్టూర్చాడాయన.

“నీకూ జీవితంలో కష్టాలున్నాయన్నమాట” అన్నాడు చివరికి.

“అదేమిటి? నువ్వు నన్ను కాదన్న నాటినించీ నాకు కష్టాలు ప్రారంభమైనాయి”

జగన్నాధం మాట్లాడలేదు.

కొంచెం సేపు ఆగి, “జగన్నాధం, నీకో తమాషా కథ చెప్పనా?” అడిగింది పార్వతి.

“ఊఁ!” అన్నాడు జగన్నాధం పట్టేసిన నడుముని సరిచేసుకుంటూ.

“కాలేజీలో చదివే ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి వైజాగులో చదువుతున్నది. ఆ ఆబ్బాయి కూడా వైజాగులోనే హాస్టల్లో వుండి చదివేవాడు. వాళ్ళ ప్రేమ పక్వానికి వచ్చింది”

“ఇది కొద్ది మార్పులతో మన కథలాగానే వుంది!” అన్నాడు జగన్నాధం భుజాలు తడుముకుంటూ.

“ముందు విను జగన్నాధం. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు. ఆ అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులతో ఆ విషయం మాట్లాడాడు కూడాను. ఆ అబ్బాయి కూడా వాళ్ళకి బాగా నచ్చాడు. కానీ అసలు సమస్య అప్పుడే వచ్చింది. ఇరు పక్షాలవారి కులమూ ఒకటి కాదు. తూచా తప్పకుండా కులమతాలు పాటించే ఆ రెండు కుటుంబాలవారికీ ఆ వివాహం నచ్చలేదు. దానితో వాళ్ళ వివాహం, జీవితం దుఃఖాంతం అయిపోయాయి..”

“పారూ, ఇది పూర్తిగా మన కథే. అసలేం జరిగిందంటే…”

ఆయన మాటలకు అడ్డు వస్తూ అన్నది పార్వతమ్మ.

“పూర్తిగా చెప్పనీ జగన్నాధం. ఆ అమ్మాయి ఏం చేసిందీ? అతనితో గట్టిగా చెప్పేసింది. ఏమనీ? నేను ప్రేమించింది నిన్ను. నా కులాన్నీ, నీ కులాన్నీ కాదు. నువ్వు నన్ను కాదంటే నేను బ్రతకలేను. చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని. ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయంటే ఇష్టమే. కానీ పెద్దవాళ్ళ మాట కాదనలేడు. ఏ సంగతీ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. ఆ అమ్మాయి అతని మౌనం భరించలేకపోయింది. చివరికి అతనితో లేచిపోయి పెళ్ళి చేసుకుంటానని గట్టిగా చెప్పింది. కానీ అతను దానికీ ఒప్పుకోలేదు. అసలు...”

“పారూ! ఇక చాల్లే ఆపు. అసలే జరిగిన పొరబాటుకు నేను అప్పటినించీ ఇప్పటి వరకూ బాధపడుతూనే వున్నాను. ఎందుకు నన్నింకా బాధ పెడతావ్? నావల్లే పెద్ద తప్పు జరిగిపోయింది. నాకానాడు మా వాళ్ళని ధిక్కరించే ధైర్యం లేకపోయింది. నిన్నులేవదీసుకు పోయే ధైర్యం అసలే లేదు. నాకు ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంటే ఎంత నిస్సహాయంగా కుమిలిపోయానో తెలుసా? నువ్వు మీ వాళ్ళతో ఆ వూరు వదలి వెళ్ళిపోయినా, నా హృదయంలోనించి మాత్రం నువ్వెక్కడికీ వెళ్ళలేదు. ఇది నిజం, పారూ!” అన్నాడు జగన్నాధం.

ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది.

“జగన్నాధం. నేనూ నీ కోసం ఎన్నేళ్ళు విలపించానో తెలుసా? కానీ కేవలం నీ అధైర్యం వల్లనే అలా జరిగింది అంటాను. ఆడపిల్లని లేవతీసుకు పోవటం తప్పే కావచ్చు. కానీ మనమే సృష్టించుకున్న ఈ కులాలు, మతాలను పట్టుకుని వ్రేలాడుతూ జీవితాలు పాడు చేసుకోవటం కన్నా, అదే చాల నయం కదూ! ఏమంటావ్?”

“ఏమంటాను. జరిగింది చాల పెద్ద తప్పు అని ఒప్పుకుంటున్నానుగా” బాధగా అన్నాడు జగన్నాధం.

“జగన్నాధం. ఇందాక నేను చెప్పిన కథ మనదొక్కరిదే కాదు. పెద్ద చదువులు చదువుకోలేని అసహాయ స్థితిలో వుండి, ఆర్ధిక స్థిరత్వం లేని ఎంతోమంది యువతుల కథ. యువకుల కథ. ఇది ఆనాటిదే కాదు. ఈనాటిది కూడా. ఇప్పుడదే సమస్య నా మనవడు ప్రసాదుకి కూడా వచ్చింది”

చటుక్కున తల ఎత్తాడు జగన్నాధం.

“అవును, జగన్నాధం. ప్రసాద్ విషయంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. వాడు ఏం చేయాలో నిర్ణయించుకోలేక నన్ను సలహా అడిగాడు. నేనంటే వాడికి చాల ప్రేమ. నా మాట కాదనడు”

‘ఇంకా ఆలోచన ఎందుకు, పారూ! ఒకసారి జరిగిన తప్పు, ఏవో పిచ్చి నమ్మకాలతో మళ్ళీ చేయటమా? వద్దు. వెంటనే పెళ్ళికి ఒప్పేసుకోండి. మనలాగా వాళ్ళూ బాధపడకుండా చూడటం నీ బాధ్యత కదూ!”

“అవును జగన్నాధం. నువ్వు చెప్పింది నిజమే. అలా చేయటం నా బాధ్యత ఒక్కటే కాదు. నీది కూడా. మావాడు ప్ర్రేమించిన పిల్ల ఎవరో కాదు. నీ కొడుకు కూతురు వసంత. యూనివర్సిటీలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారిందిట. అమ్మాయి తరఫు వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారనీ, ఆ అమ్మాయి వీడు కాదంటే బ్రతకలేదనీ... ఆనాడు నేను అన్న మాటలే ఆ అమ్మాయి కూడా అన్నదని తెలుసుకుని బాధపడ్డాను. కానీ నువ్వే ఆ పెద్దమనిషివని తెలియలేదు. మధ్యాహ్నం మావాడు నిన్ను పందిట్లో చూసి గుర్తుపట్టి నాతో ఆంతా చెప్పాడు. ఏం జగన్నాధం, మాట్లాడవు? మనకు జరిగిందే వాళ్ళ విషయంలోనూ జరగాలంటావా?”

పడుకుని తల క్రింద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్న జగన్నాధం ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.

చటుక్కున పార్వతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

“లేదు పార్వతీ, అలా జరగటానికి వీల్లేదు. ఆనాడు నేను చేసిన తప్పు నా బలహీనత. అది తప్పు అని తెలిసీ, మళ్ళీ అలా చేయటం ఇప్పుడు మూర్ఘత్వం. విచక్షణా రహితం. నేనీ వివాహనికి మానస్పూర్తిగా ఒప్పుకుంటున్నాను. నా కొడుకు, కోడలు చేత కూడా ఒప్పిస్తాను. నువ్వు బెంగపడకు. ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.

ఆవిడ కళ్ళల్లో వెలుగు కనిపించింది.

“ఆనాడు నువ్వు చేయలేని ధైర్యం, ఈనాడయినా చేస్తున్నందుకు సంతోషంగా వుంది జగన్నాధం!” అన్నది అతని చేతిని మృదువుగా వత్తుతూ.

ఆయన నవ్వాడు.

“ఆఁ! నాదేముంది పార్వతీ. అంతా వాడి దయ. సర్వం జగన్నాధం” అన్నాడు.

“అవును! సర్వం జగన్నాధం!” అన్నది ఆవిడ కూడా నవ్వుతూ!

****సశేషం****

Posted in October 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!