Menu Close
"వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం
-- సుభద్ర ద్రోణంరాజు --
vikshanam-120

2012 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లో నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్న "వీక్షణం" సాహితీ గవాక్షం సెప్టెంబరు 11, 2022 న ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం దశమ వార్షికోత్సవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లో అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఉదయం కార్యక్రమానికి శ్రీ మధు ప్రఖ్యా అధ్యక్షత వహించారు. అధ్యక్ష ఉపన్యాసంలో భాగంగా తనకు వీక్షణం సాహితీ వేదికతో ఉన్న అనుబంధాన్ని, ఆగకుండా గత పదేళ్లుగా జరుగుతున్న వీక్షణం సభల వైనాన్ని సభకు తెలియజేసారు. తరువాత శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ సుభాష్ పెద్దుగార్లు వీక్షణం ఎందరికో స్ఫూర్తిని ఇచ్చిందని కొనియాడుతూ ప్రారంభ ఉపన్యాసాలు చేసారు. ఆ తరవాత శ్రీ హర్షుడు రాసిన నైషధ గ్రంథం మీద శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు వివరణాత్మకమైన ప్రసంగం చేసారు. నలుని చరిత్ర, శ్రీనాధుని వ్యక్తిత్వం, హంస రాయబారంలోని పద్య సౌరభం, దమయంతి వర్ణన, దశావతార స్తుతి మొదలైన అంశాల్ని సభకు వివరించారు.

వీక్షణం దశమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత అవధాని శ్రీ మేడసాని మోహన్ విచ్చేసి, అవధాన ప్రక్రియ-ప్రత్యేకత అనే అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ రచయిత డా. అక్కిరాజు రమాపతిరావు గారు "వీక్షణం జీవన సాఫల్య పురస్కారాన్ని" శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ కోమటి జయరాం గార్ల చేతులమీదుగా అందుకున్నారు. డా. అక్కిరాజు రమాపతిరావు గారికి వీక్షణం "సాహితీ భీష్మ" బిరుదుని కూడా ఇచ్చి ఘనంగా సత్కరించింది.

ఆ తరవాత  శ్రీ మేడసాని మోహన్ వీక్షణం ప్రత్యేక సాహితీ సంచిక, గత పదేళ్ల సాహితీ సమావేశాల సంచికల ఆవిష్కరణ చేసారు. ఇందులో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ శ్రీచరణ్ పాలడుగు, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి మున్నగువారు పాల్గొన్నారు.

ఉదయం కార్యక్రమంలో చివరిగా వీక్షణం జీవన సాఫల్య పురస్కార గ్రహీత డా. అక్కిరాజు రమాపతిరావు గారు తన స్పందనని తెలియజేసారు.

భోజనవిరామానంతరం శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షతని జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక కవులు డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల, శ్రీమల్లవరపు సాయికృష్ణ, శ్రీమతి ఆచంట స్వాతి, డా. ఏ.కే. ప్రభాకర్ మొ.న వారు కవితాగానం చేసారు. తరువాత "అపరాజిత" (గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం 1993-2022), అసింట (డా.కె.గీత కవిత్వం-పాటలు) పుస్తకావిష్కరణలు జరిగాయి. డా. ఏ.కే. ప్రభాకర్ "అపరాజిత" పుస్తక పరిచయం చెయ్యగా, డా.కే.వి.రమణారావు "అసింట" కవిత్వాన్ని పరిచయం చేసారు. ఇదే వేదిక మీద డా.కె.గీతగారికి ఇటీవల 'తెన్నేటి హేమలత- వంశీ సాహిత్య పురస్కారం' లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని గీతగారిని శ్రీమతి క్రాంతి పాతూరి సన్మానించారు.

ఆ తరవాత శ్రీ కిరణ్ ప్రభ "సాహితీ క్విజ్" ని నిర్వహించి సభని అలరించారు. తరవాత జరిగిన "కొత్తకథ దిశ- గమనం" అనే అంశంమీద శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతన జరిగిన చర్చలో డా. ఏ.కే. ప్రభాకర్, డా.కే.వి.రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ శ్రీధర్ రెడ్డి, డా||కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు, డా. అక్కిరాజు రమాపతిరావు మున్నగు వారు పాల్గొన్నారు.

ఆ తరవాత శ్రీమతి సుభద్ర, డా||కె.గీత, చిరంజీవి వరూధిని లలిత గీతాల్ని ఆలపించి సభని మైమరిపించారు. చివరిగా శ్రీ కిరణ్ ప్రభ సమాపనోపన్యాసం చేసి సభను ముగించారు.

ఆద్యంతం వైభవోపేతంగా జరిగిన ఈ సభలో శ్రీ & శ్రీమతి దేవరకొండ శ్రీనివాసరావు, శ్రీ నల్లమోతు ప్రసాద్, శ్రీమతి అక్కిరాజు అన్నపూర్ణ, శ్రీ అక్కిరాజు బిలహరి, శ్రీ రఘునాథ్ దెందుకూరి, శ్రీమతి జయమాల తాటిపాముల, శ్రీ వేణు ఆసూరి, శ్రీతులసి తుమ్మల, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీమతి సుభద్ర ద్రోణంరాజు, శ్రీ వేణుగోపాల్, శ్రీమతి నిర్మల, శ్రీ చంద్ర రెంటచింతల, శ్రీ దేవేందర్ బాబు మొ.న స్థానిక సాహితీ వేత్తలు, సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు.

Posted in October 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!