Menu Close
తెలుగు పద్య రత్నాలు 16
-- ఆర్. శర్మ దంతుర్తి --

మానవుడిగా పుట్టి అనేకానేక జన్మలు గడిచాక, నేను చేసే పని ఇది, అలా చేసినందువల్లే నాకు ఇలా కష్టనష్టాలు సంప్రాప్తమౌతున్నాయి, అసలు నేనే ఈ జన్మ పరంపరలు కలగడానిక్కారణం అనేది తెలిసాక జ్ఞానం రావడం – ముముక్షత్వం మొదలౌతుంది. అప్పుడీ సంసారంలోంచి తప్పించుకునే మార్గాన్ని వెతకడానికి ఉద్యుక్తులౌతాం. అప్పుడు సన్యాసం – అంటే అన్నీ వదులుకోవడం, తర్వాత మళ్ళీ మళ్ళీ భగవంతుడి గురించి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో కిందా మీదా పడ్డాక అందులో విజయం సాధించగల్గితే అప్పుడు మాత్రమే భగవద్దర్శనం కలుగుతుంది. పరమహంస యోగానంద గారు చెప్పడం ప్రకారం ఒక ప్రాణికి అలా మోక్షం కలగాలంటే దాదాపు అరవై లక్షల జన్మలు గడవాలిట. దీనికెంత కాలం పడుతుందో మనలో ఎవరికివారు లెక్కపెట్టుకోవాల్సిందే. అయితే ఏ జన్మలో అయినా సరే ధర్మం తప్పకుండా ఉండగల్గితే చివరికి బుద్ధుడిలాగా సరిగ్గా ఏడేళ్లలో జ్ఞానం సంపాదించవచ్చు. మరి అలా ఏడేళ్ళలో జ్ఞానం కలగడానికి ముందు ఆయన ఎన్ని రకాల జన్మలు ఎత్తాడో, ప్రతీ జన్మలోనూ ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉన్నాడో భోధిసత్వుడి కధల్లో మనం చూస్తాం. ఎటువంటి జన్మ ఎత్తినా మనసు మాత్రం ఆ ధర్మం/భగవంతుడి మీద ఉండాలి, మనం చేసే పనులెనా ఉన్నాసరే. అయితే అన్నింటికన్నా సులభమైన పని శరణాగతి. “నీవేతప్ప నితఃపరంబెరుగని… కావవే రక్షింపు భద్రాత్మకా..” అన్న జ్ఞానం కలిగినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. దీన్నే రమణులు అనడం ప్రకారం “నీ కష్టాలన్నీ తీర్చడానికి నేనిక్కడ ఉన్నానని చెప్తుండగా ఇంకా దేనికి చింత నీకు?” ఈ నెల పద్యంలో ధూర్జటి చెప్పేది అదే – నిన్నే శరణు అంటున్న నన్ను చూసుకోవల్సింది నువ్వే అంటున్నాడు.

శా.
ఱాలన్ రువ్వగ చేతులాడవు, కుమారా రమ్మురమ్మంచునే
చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేగాను, నా
శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా శ్రీకాళహస్తీశ్వరా (శ్రీకాళహస్తీశ్వర శతకం. 17)

ఓ బోయవాడికి పూజ చేద్దామంటే పువ్వులు దొరకలేదు. అక్కడే ఉన్న రాళ్ళు తీసి అవే పువ్వులుగా భావించి శివపూజ పూర్తి చేసాడు. మనసు భగవంతుడిమీద ఉంది కనక శివుడు బోయవాడికి మోక్షం ఇచ్చాడు. అలాగే సిరియాళుడి కథలో శివుడు పార్వతితో వృధ్ధ దంపతులుగా వచ్చి, సిరియాలుణ్ణి, ‘నీ స్వంత కొడుకుని చంపి వండిపెట్టాలనీ, లేకపోతే విస్తరి ముందు కూర్చునేది లేదనీ’ చెప్తాడు. దానికి ఒప్పుకుని వండి పెట్టాక, ‘నువ్వూ మీ ఆవిడా కూడా మాతో కలిసి తినా’లంటాడు. దానికీ ఒప్పుకున్నాక ‘మరి నీ కొడుకో? మరి వాణ్ణి కూడా పిలు తినడానికి’ అంటాడు మారువేషంలో ఉన్న శివుడు. ‘వాడు తర్వాత వస్తాడులెండి మీరు కానివ్వండి’ అని సిరియాలుడు చెప్పినా ఒప్పుకోడు. “కొడుకు రావాల్సిందే, పిలు,” అని పట్టుబట్టాక, సిరియాళుడు పిలుస్తాడు, ‘కుమారా రా,’ అని. ఆ కుర్రాడు పరుగెట్టుకుంటూ బయటనుంచి ఇంట్లోకి రావడం చూసి జరిగే కధ అర్ధమవ్వక పీటమీద కూర్చున్న వృధ్ధ దంపతులకేసి చూస్తాడు సిరియాలుడు. అక్కడ పరమేశ్వరుడు అమ్మవారితో నవ్వుతూ కనిపిస్తాడు నిజస్వరూపంతో.

మూడో కధలో తిన్నడు కళ్ళు తీసి ఇస్తే శివుడు ఆయనతో చెప్పేది మనకి తెల్సినదే, “ఎంతోమంది కంటి చూపుకోసం నన్ను కాళ్ళావేళ్ళా పడుతూ అడుగుతూంటారు కానీ నువ్వు ఒక్కడివే నాకు కళ్ళు ఇవ్వడానికి సిధ్ధపడ్డావు,” అని. ఈ మూడు కధలనీ ఉటంకించి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో పద్యం ఇది.

ఈ ముగ్గురూ అలా నిన్ను పూజచేసి – మనసు నీమీదే పెట్టి, శివసాన్నిధ్యం సంపాదించారు బాగానే ఉంది మరి నా సంగతో? రాళ్లతో పూజ చేసి నిన్ని మెప్పించాలంటే నాకు చేతులు రావడంలేదు (ఱాలన్ రువ్వగ చేతులాడవు). నా కొడుకుని చంపి వండి పెట్టి, ‘ఒరే అబ్బాయ్ ఇలా రా భోజనం చేయడానికి’ అని పిలడానికి నాకు చేతకాదు (కుమారా రమ్మురమ్మంచునే చాలన్ చంపగ), కన్నప్పలాగా కళ్ళు తీసి ఇవ్వడానికి నాకు శక్తి లేదు (నేత్రముల్దివియగా శక్తుండనేగాను). ఇంక నా శీలం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది (నా శీలంబేమని చెప్పనున్నదిక). మరి నాకున్నదేమిటి? శరణాగతి ఒకటే. నిన్ను శరణు కోరాను, అందువల్ల నన్నేం చేస్తావో నీ ఇష్టం వచ్చినట్టూ చేసుకో. నా భాగ్యం ఎలా ఉందో కదా? (నీ చిత్తంబు, నాభాగ్యమో). నీ దయ కలగడమే నా భాగ్యం అంటున్నాడు. ఈ పద్యంలో ధూర్జటి శివుణ్ణి ఏమంటున్నాడంటే, ‘విష్ణువు చే పాద పూజ అందుకునే శివా (శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా), శ్రీకాళహస్తీశ్వరా!’

ప్రస్తుతంలోకి వస్తే మనకున్న ధనం, ఇల్లూ వాకిలీ వాహనాలూ అన్నీ భగవత్కృపతో వచ్చాయనుకుంటే, ఇవ్వన్నీ ఇచ్చిన భగవంతుడికి మనం ఏం ఇవ్వాలి? గుడికి వెళ్ళినప్పుడు వందో/వెయ్యో రూపాయలిచ్చి నేనెంత గొప్పపని చేసాను అనుకుంటే ఆయన విలాసంగా నవ్వుకోడూ? ఎందుకంటే నెల నెలకీ మనకి జీతం, ఇల్లూ వాకిలీ ఇస్తే మనం ఆయనకి వెయ్యి రూపాయలిచ్చి ఎంతో సంతోషం పొందుతున్నాం. ఎంతటి దారుణమైన స్థితి ఇది? అందుకే శ్రీశంకర భగవత్పాదులు అంటారు శివానందలహిరిలో – నీ చేతిలో బంగారు కొండ ఉంది, కుబేరుడు నీ స్నేహితుడే, చల్లదనాన్నిచ్చే చంద్రుడు నీ తలమీదే ఉన్నాడు, నీ ఇంట్లో కామధేనువూ, కల్పవృక్షం, చింతామణి వజ్రం ఉన్నాయి. వీటివల్ల నీకేం కావాల్సినా ఒక్క క్షణంలో అమరుతాయి కదా? అఖిలమైన శుభాలన్నీ నీ పాదాల దగ్గిరేఉన్నాయి.  అందువల్ల నీకు నేను ఇచ్చేది ఏముంది ఈ లోకంలో? అంటే శ్రీశంకరులేమంటున్నారంటే, అందరికీ అన్నీ ఇచ్చే నీకు నేను ఇవ్వగలిగేదేముంది? అందువల్ల నామనస్సే నీదవుగాక (భవతు భవదర్ధం మమ మనః). అందుకే మన మనస్సు భగవంతుడికి అర్పించడం కోసం, మంచి ఆలోచనలు రావడం కోసం శివాలయాలలో రుద్రాభిషేకం, పూజా చేసేటపుడు, శివసంకల్పం చెప్తారు - తన్మేమనః శివసంకల్పమస్తు – నా మనసు మంచి ఆలోచనల్తో నిండుగాక అంటూ. ఇక్కడ శివసంకల్పం అంటే శుభకరమైన సంకల్పం అని అర్ధం.

****సశేషం****

Posted in October 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!