Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

మధ్యాహ్నం రెండు కావస్తోంది... అప్పుడే భోజనాలు ముగించి వంటగది సర్దుకుని సంధ్య, లక్ష్మి పెరట్లోకి వచ్చారు. చెట్ల నీడన నులక మంచం మీద సంధ్య కూర్చుంటే, ఆమె ఎదురుగా సామాన్ల గది మెట్టు మీద లక్ష్మి కూర్చుంది. మగవాళ్ళు ఇద్దరూ విశ్రాంతి తీసుకోడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇల్లంతా ఆ రోజు చేసిన వంటల ఘుమ, ఘుమలుతో నిండిపోయింది. ఇద్దరూ కలిసి గుమ్మడి ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి పులుసు, ముద్దపప్పు, చిక్కుడుకాయల వేపుడు చేసారు.

అన్నీ పెరట్లో కాసినవే.. నవనవలాడుతూ ఉత్తవే తినాలనిపించేలా ఉన్న ఆ కూరగాయలు చూస్తోంటే సంధ్యకి వంట చేయడం సరదాగా అనిపిస్తోంది. ఏ పూట కా పూట రకరకాల వంటలు చేసేస్తోంది. లక్ష్మి అన్నీ తరిగి ఇస్తోంటే, చేతికింద సాయంగా సింహాచలం అన్నీ అందిస్తోంటే ఆమెకి పెద్ద కష్టంగా కూడా అనిపించడంలేదు.

అయితే, ఆమెని బాధ పెడుతున్న విషయం ఏమిటంటే ఈ వయసులో కూడా కోడలి చేతి వంట అమృతం లా భావించి సుష్టుగా భోజనం చేసే ఆంజనేయులు ఈ నాలుగు రోజులుగా సరిగా తినకపోవడం, అన్యమనస్కంగా ఉండడం, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా అస్తమానం ఒంటరిగా గదిలో పడుకుని ఉండడం ఆమెకి మింగుడు పడడం లేదు. తను కాపురానికి వచ్చిన ఇన్నేళ్ళలో మావగారు అంత గంభీరంగా ఉండడం ఆశ్చర్యాన్నే కాదు ఇంచుక ఆవేదన కూడా కలిగిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉల్లాసంగా ఉండే మావగారు అలా ఎందుకున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు. ఆమెకి తెలిసి తనేం తప్పు చేయలేదు అనుకుంటోంది. కొడుకు మీద కోపమా అంటే దీపక్ ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు.. ఇక స్మరణ ... దాని మీద మమకారమో, వాత్సల్యమో దాన్ని ఏమి అననీకుండా అడ్డుపడుతోంది కానీ స్మరణ పద్దతి ఆయనకీ నచ్చలేదేమో అనిపిస్తోంది. ఒకటి, రెండు సార్లు ధైర్యం చేసి “ఏం మావయ్యా.. అలా ఉన్నారేం ఆరోగ్యం బాగాలేదా” అని అడిగింది కూడా. కానీ ఆయన పల్చగా నవ్వి “బానే ఉన్నానమ్మా ... అనవసరంగా ఆందోళన పడకు” అనడంతో మౌనంగా ఉండిపోయింది.

“ఏటమ్మగారూ ఏటాలోచన?” అడిగింది లక్ష్మి పరధ్యానంగా ఉన్న సంధ్యని.

సంధ్య సన్నగా నవ్వి “ఏమిలేదే.. మావయ్యగారు ఎందుకో చాలా ముభావంగా ఉంటున్నారు ఎందుకా అని ఆలోచిస్తున్నాను” అంది.

“ఆరు పెద్దారు అవుతుండారు కదండీ.. ఆరోగ్యంలో తేడాలొత్తాయి” తేలిగ్గా అంది లక్ష్మి.

“అంతేనంటావా..” అనుమానంగా అడిగింది సంధ్య.

“ఊరుకోండి.. మరీ ఎక్కువాలోచిత్తున్నారు.. అంతకాక మరేతుంటాది.” చనువుగా మందలించి కొంచెం స్వరం తగ్గించి రహస్యం చెబుతున్నట్టుగా చెప్పసాగింది.. “అవును గానీ అమ్మగారూ మీకో ఇసయం చెప్పాలని అనుకుంటూనే మర్సిపోతున్నానండి.. మరేమో హెడ్డు మేష్టార్ గారి కోడలు గుర్తుందా ఆయమ్మ పేరు బిందు..”

“అవును హిమబిందు... నాతోపాటేగా ఈ ఊరికి కాపురానికి వచ్చింది.. పాపం చాలా కష్టాలు పెట్టాడు కదూ మొగుడు.. అల్లాగే గడిపింది.. ఇప్పుడేమన్నా మారాడా! వాళ్ళు కాకినాడ వెళ్ళాక మళ్ళీ ఎలాంటి కబురూ లేదు..” హిమబిందుని తలచుకుని జాలిపడుతూ అంది సంధ్య.

“మారారో లేదో గానీ ఆ యమ్మగారు ఇడాకులు తీసుకుని మారు మనువు చేసుకున్నారటండి..”

“ఏంటి?” నిర్ఘాంతపోతూ అడిగింది. “మారు మనువా... అంటే మళ్ళీ పెళ్లి చేసుకుందా! ఇద్దరు పిల్లలు కూడా కదూ.”

“అవునండి... రెండో బర్త మనూరు అయ్యగారే నంటండి కలకటేరు ఆఫీసులో పని చేత్తారటండి.. ఆల్లిద్దరూ సిన్నప్పటి నుంచీ పెమించుకున్నారటండి... అది తెలిసే ఆవేగారి పెనిమిటి అనుమానంతో కాల్సుకు తిన్నడటండి.”

“అదిసరే... పిల్లలు ఏమయారు? “

“పెద్దాడు ఉజ్జోగం కోసం ఇదేసాలకు ఎల్లారటండి.. కూతురు కాలెజీ లో సడువుకుంటున్నారండి..“

“నీకెలా తెలుసు ఈ విషయాలన్నీ” విస్తుబోతూ అడిగింది సంధ్య..

“పెళ్ళికొడుకు అక్కగారు కుటుంబం, చెల్లెలిగారి కుటుంబం అందరూ కాకినాడ పెళ్ళికి ఎల్లారు కదండీ..”

“పెళ్ళికి వెళ్ళడం ఏంటి? అందరినీ పిలిచి చేసుకుందా!”

“అందరినీ పిలవడం ఏంటండి? అంగరంగ వైభోగంగా చేసుకుందిటండి..మొదటి మొగుడి మీద కోపంతో నువ్వెంత... నీ బతుకెంత అన్నట్టు కళ్యాణ మంటపంలో సంప్రదాయకంగా చేసుకుని బోల్డు మందిని పెళ్ళికి పిలిచిందిట.. కొడుకు, కూతురు దగ్గరుండి పెళ్లి జరిపించారటండి..”

“అయ్యో!” సంధ్య నోటి మీద చేయేసుకుంది..

“ఇప్పుడు హాయిగా ఉందిట.. అయ్యగారు కూడా కాకినాడ బదిలీ చేయించుకుని వెళ్లిపోయారట..”

సంధ్యకి లక్ష్మి మాటలు వినిపించలేదు.. ఆమె కళ్ళ ముందు వెల్లివిరుస్తున్న ఆనందంతో పెళ్లి పీటల మీద తలవంచుకుని కూర్చుని తాళి కట్టించుకుంటున్న హిమ కదిలింది. ఆమె వెనకాల నిలబడిన పద్దెనిమిదేళ్ళ కూతురు, ఇరవై ఏళ్ల కొడుకుల కళ్ళల్లో ఇంతకాలం మాది అనుకున్న అమ్మ మరి కొన్ని గంటల్లో మరెవరికో చెంది తమకు దూరం కాబోతోందన్న ఆవేదన కనిపిస్తోంది. ఇది విషాదమా! వినోదమా! ఎదిగిన పిల్లల ఎదురుగా తల్లి తాళి కట్టించుకోడం, తలంబ్రాలు పోసుకోడం ఊహించడానికే అసహజంగా అనిపిస్తోంది. పాపం కళ్ళతో చూసిన ఆ పిల్లల మనోభావాలు ఆ సమయంలో ఎలా ఉండి ఉంటాయి! రెండో పెళ్లి చేసుకోడం తప్పు కాదు.. పడని వాడితో పాట్లు పడుతూ బతికేకన్నా విడిపోయి పెళ్లి చేసుకుంది మంచి పనే... కానీ ఆడదానికైనా, మగవాడి కైనా వివాహం అనేది ఒక పవిత్రమైన కార్యం.. అది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. ఆ తరవాత ఎన్నిసార్లు జరిగినా మొదటి సారి విన్న వేదమంత్రాల్లోని శక్తి, పవిత్రమైన భావన, మాధుర్యం, అనూహ్యమైన అనుభూతులు రెండోసారి ఉంటాయా!

సంధ్యకి ఆ వార్త అసహనాన్ని, ఆవేదనని కలగచేసింది. పెళ్లి అనేది ఒక ఒడంబడిక.. పరస్పరం ఒకరి మీద ఒకరికి ఆర్ధిక పరమైన హక్కులు ఏర్పడడానికి చేసుకున్న ఒడంబడిక.. శారీరకావసరాలకే అయితే పెళ్లి ఎందుకు ఈ రోజుల్లో. హక్కులు, అధికారాల కోసం పెళ్లి అనే పవిత్రమైన తంతుని ఉపయోగించుకోవడం అదీ ఎదిగిన పిల్లల సమక్షంలో ఎంతవరకు సమంజసం! ఒకవేళ వాళ్ళిద్దరికీ ఇష్టమై కలిసి జీవిస్తే సమాజం ఆమోదించదని భయమా! సమాజం ఈ పెళ్లిని ఎంతవరకు ఆమోదిస్తుంది! హిమ చేసింది తప్పా! ఒప్పా! చేసుకున్నా ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో, గుళ్ళోనో నలుగురు పెద్దల సమక్షంలో దండలు మార్చుకోవాలి కానీ శాస్త్రోక్తంగా చేసుకోడం శాస్త్రాలను అపహాస్యం చేయడమేమో! తల్లి పెళ్లి పిల్లలు చూడడం ధర్మ విరుద్ధం అని శాస్త్రాలు చెబుతున్నాయి.. అలాంటప్పుడు హిమ చేసిన దానిలో ధర్మం ఉందా! స్వార్ధం ఉందా!

“ఎంటమ్మ గారూ ఆలోచిస్తున్నారు?” లక్ష్మి ప్రశ్నకి ఉలిక్కిపడింది సంధ్య..

“ఏం లేదు... బిందు అమ్మ తప్పు చేసిందా ఒప్పు చేసిందా అర్థం కావడం లేదు..”

“ఇందులో తప్పు, ఒప్పు ఏవుంది లెండి.. మా ఇళ్ళల్లో మారు మనువులు మామూలే.. కానీ ఇట్టా అంగరంగ వైభవంగా మాత్రం చేసుకోములెండి.. సర్లెండి.. ఎవరిష్టం వారిది.. పెద్దయ్యగారు నిద్దర నుంచి లేచే యాలైంది.. టీ ఎడతాను “ అంటూ లేచింది లక్ష్మి.

ఆమెతో పాటు తనూ లేస్తూ “బజ్జీలు వేయమంటారేమో అడుగుతాను మావయ్య గారిని” అంటూ సంధ్య ఆంజనేయులు గది వైపు నడిచింది. లోపల మంచం ఖాళీగా ఉంది.. ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ తిరిగి వెనక్కి వచ్చి పెరట్లోకి వెళ్లి చూసింది.. వాకిట్లో ఆయన రోజూ సాయంత్రాలు విశ్రాంతిగా కూర్చునే వేపచెట్టు కింద చూసింది.. గదులన్నీ వెతికింది. దీపక్ మంచం మీద పడుకుని టి వి చూస్తున్నాడు.

సంధ్యకి చిర్రెత్తుకొచ్చింది... నగరం కాలిపోతుంటే పియానో వాయిస్తున్న రోమ్ చక్రవర్తి.. తిట్టుకుంటూ గట్టిగా పిలిచింది.. “హలో రాజేంద్ర భోగి ... కాస్త మా లోకంలోకి వస్తారా..”

వెకిలి కామెడీ కార్యక్రమం నవ్వుతూ చూస్తున్న దీపక్ విసుగ్గా ఆమె వైపు చూసాడు.. “ఏంటి..” అన్నాడు.

“మునిగారా.. తేలారా“ వెటకారంగా అడిగింది..

“ఏదో చేసాను కుళ్ళు మొహమా.. చెప్పు ఎందుకు పిలిచావు”

“అవును ఆ దిక్కుమాలిన కార్యక్రమం మేము చూసి తరించడం లేదని మాకు కుళ్ళు... సరేనా.. ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా” అడిగింది.

“ఎక్కడికి వెళ్ళడం ఏంటి ఇంట్లోనే ఉన్నాడు.. పడుకున్నాడేమో చూడు” అన్నాడు దృష్టి టివి మీదకి మళ్ళించి.

అతని చేతిలో రిమోట్ లాగేసి “కాస్త మీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి..” అంది.

దీపక్ విసుక్కుంటూ మంచం దిగి “ఏమైంది ఇప్పుడు ప్రపంచం తల్ల కిందులు అవుతోందా!” అన్నాడు.

అవును.. తల్లకిందులు అవుతోంది అనుకుంటూ “భోజనం చేసాక పడుకున్నారు అనుకున్నాను.. బజ్జీలు వేయమంటారేమో అడగడానికి వస్తే మంచం ఖాళీగా ఉంది.. ఎప్పుడు వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు.. అలా వీధిలోకి వెళ్లి చూడండి.. అసలే ఆయన ఆరోగ్యం బాగాలేదు. నేను నాలుగు బజ్జీలు వేస్తాను” అంటూ వంట గదివైపు వెళ్ళింది సంధ్య.

ఈయనొకడు తిన్నగా ఉండడు.. ఎక్కడికి వెళ్లినట్టు.. అయినా చిన్న పిల్లాడా ఎక్కడికి వెళ్తాడు ఈవిడ కంగారు గాని.. కాసేపు కనిపించకపోతే గాభరా పడుతుంది.. ఎక్కడో ఉంటాడులే అని తనంటే తనకి ఆయన మీద ప్రేమ లేదని, బాధ్యత లేదని క్లాసు పీకడం ... ఆయన తండ్రి తనకా తన భార్యకా... దీపక్ సంధ్య మీద కారాలు, మిరియాలు నూరుతూ షర్టు తొడుక్కుని వీధిలోకి బయలుదేరుతూ ఉండగా గేటు తీసుకుని ఆంజనేయులు, ఆయన వెనకే ఆయన స్నేహితుడు సుబ్బారావు లోపలికి రావడం జరిగింది. గేటు శబ్దానికి వంట గదిలోంచి హడావుడిగా వచ్చిన సంధ్య చెప్పులు వసారాలో విడిచి లోపల అడుగు పెడుతున్న ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తూ “ఎక్కడికి వెళ్ళారు మావయ్యా” అని అడిగింది.

ఆయన సమాధానం చెప్పకుండా అలసటగా సోఫాలో వాలాడు.

ఆయన సమాధానం చెప్పకుండా కూర్చోడం చూసిన దీపక్ కొంచెం కోపంగా అన్నాడు “ఎండలో ఎక్కడికి వెళ్లావు నాన్నా.. అసలే ఒంట్లో బాగాలేదు కదా“.

“ఏమైంది... ఒంట్లో బాగాలేదా.. నాతో ఒక్క ముక్క కూడా అనలేదే” కంగారుగా అన్నాడు సుబ్బారావు.

ఆంజనేయులు కుడి చేయి ఎత్తి “నాకేం కాలేదు... దివ్యంగా ఉన్నాను..ఎవరేం కంగారుపడకండి” అన్నాడు.

“ఏం దివ్యంగా ఉన్నారు... నిన్న కూడా పెరట్లో పడబోయారు.. మీరలా చెప్పా, చేయకుండా వెళితే నాకెంత కంగారుగా ఉంటుందో ఆలోచంచరేం” సంధ్య ఆందోళన చూస్తూ “ఎంత అదృష్టవంతుడివి ఆంజనేయులూ.. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కోడలుంది.. నువ్వు చేస్తున్నది చాలా మంచిపని.. మంచి నిర్ణయం తీసుకున్నావు.. ఇలాంటి కోడలు దగ్గర ఉండిపోడం కన్నా ఏం కావాలి మనకి ఈ వయసులో..” అన్నాడు సుబ్బారావు.

“నిర్ణయమా! ఏం నిర్ణయం?” వింతగా చూసాడు దీపక్ తండ్రివైపు.

“చెప్పరా” ఆంజనేయులు భుజం తట్టాడు సుబ్బారావు.

ఆంజనేయులు, సుబ్బారావు చిన్ననాటి స్నేహితులు.. ఎరా... ఒరే అనుకునే చనువున్న స్నేహితులు.. సుబ్బారావు భార్య ఇటీవల మరణించింది... ఇద్దరు మగపిల్లలు ఆస్ట్రేలియా లో స్థిరపడ్డారు. ఆయన ఒక్కడే ఉంటాడు.. ఆంజనేయులు ఆయనకీ తోడూ. ఈ మధ్య ఆంజనేయులు హైదరాబాద్ లో ఉండడంతో ఆయన ఒంటరి అయినట్టు బాధపడుతున్నాడు.

లక్ష్మి అందరికీ బజ్జీలు తెచ్చింది.

“ఓ ఘుమఘుమలు అరటికాయ బజ్జీలు అన్నాడు సుబ్బారావు వేడిగా ఉన్న బజ్జీ చేతిలో పట్టుకుని ఊదుతూ.

దీపక్ కూడా బజ్జీ తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఉండగా నెమ్మదిగా చెప్పాడు ఆంజనేయులు,..”ఇల్లు అమ్మకానికి పెట్టానురా.. మంచి ధరే వస్తోంది” దీపక్ చేతిలో బజ్జీ కిందపడి పోయింది.. సంధ్య చేతుల్లో మంచినీళ్ళ గ్లాసు, దడ, దడశబ్దం చేసింది. ఇద్దరూ ఒక్కసారే ఉలిక్కిపడ్డారు.

“ఎందుకు?” అడిగాడు దీపక్ అయోమయంగా.

“ఎందుకేముందిరా! నేనిప్పుడు ఇక్కడ ఉండడం లేదుకదా! ఇప్పట్లో తిరిగి వస్తానని కూడా అనుకోడం లేదు. పైగా నాకూ వయసు పెరుగుతోంది.. ఎన్నాళ్ళు ఉంటాను? నేనున్నప్పుడే అన్నీ సెటిల్ చేస్తే మంచిది కదరా.”

సంధ్య మనసులో ఎవరో గునపంతో గుచ్చినట్టు అయింది. ఆ ఇల్లంటే ఆమెకి ప్రాణం.. విశాలమైన గదులు, అంతకన్నా విశాలంగా ఉండే పెరడు.. ఎప్పుడూ కళ కళలాడుతూ ఎంతో బాగుంటుంది. ఆ ఇంటితో ఆమెకి ఇరవై ఐదేళ్ళ అనుబంధం ఉంది. అక్కడ ఉండకపోయినా, ఏడాదికి ఒకసారి వచ్చి ఓ పది రోజులు ఆ ఇంట్లో గడిపి వెళ్తే ఆ అనుభూతి ఏడాదంతా తనని చలాకీగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేస్తా అంటుంటే బాధగా అనిపించింది. వద్దు అనడానికి తనకి మాత్రమే చెందిన ఇల్లు కాదు కదా! ఆయనకీ ఇంకో కొడుకు ఉన్నాడు.. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఆడపిల్లలు కూడా తండ్రి ఆస్తిలో భాగస్తులే.

మ్లానమైన కోడలి మొహం, రక్తం లేనట్టు పాలిపోయిన కొడుకు మొహం ఆయన నిర్ణయాన్ని మార్చబోవు అన్నట్టు ధృఢమైన స్వరంతో అన్నాడు ఆంజనేయులు.

“తప్పదురా.. నా తదనంతరం ఈ కాస్త ఆస్తి కోసం మీ ముగ్గురి మధ్యా ఎలాంటి గొడవలు రేగడం నాకిష్టం లేదు..”

దీపక్ సంధ్య వైపు చూసాడు.. రెప్పలు దాటని రెండు నీటి బిందువులు ఆమె కనుకొలకుల్లో నిలిచి ఉన్నాయి. అవి చెక్కిళ్ళ మీదకు జారకుండా పెదాలు బిగించి ఆపుకుంటోంది. దీపక్ తన వైపు చూస్తున్నాడని అర్ధమై అక్కడ నుంచి తప్పుకుంది. ఈ మధ్య నాకూ, మావయ్య గారికీ ఎందుకింత దూరం పెరుగుతోంది.. ఏ విషయంలోనూ నన్ను సంప్రదించకుండా ఏ పని చేయని మావయ్య గారు ఇంత పెద్ద విషయం ఎవరితో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోడం ఏంటి? ఎలా జరిగింది ఇది? ఆలోచిస్తూ నిలబడిపోయింది వంటగదికి పెరటికి వెళ్ళే గుమ్మం దగ్గర.. పొడుగాటి పోట్లకాయలు బరువుగా కదులుతున్నాయి ఆమె హృదయంలాగా.

****సశేషం****

Posted in October 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!