Menu Close
ఆదర్శ మహిళ (కథ)
-- వాసవి కరకవలస --

నా భార్య ఇందు నాల్గు రోజులనుండి తెగ ఆలోచిస్తూ తన స్నేహితులతో ఫోన్ లో దేని గురించో సమాలోచనలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటోంది.

"ఏంటి మేడం బ్యాంక్ కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తున్నారా ఏంటి" అన్నాను సరదాగా.

"అంత అదృష్టం మాకు ఎక్కడిది మహాశయా! బ్యాంకులకు వెళ్ళకుండానే బ్యాంకుల్లో ధనాన్ని కొల్లగొడుతున్నారు" అంది చురుకుగా..

"ఉమెన్స్ డే" కి ఇంకా రెండు రోజులే మిగిలి ఉందండి..ఎవ్వరిని ఎంపిక చెయ్యాలో అర్ధం కావటం లేదు" అంది నీరసంగా.

###

మేము వుండే అపార్ట్ మెంటు లో ప్రెసిడెంట్ పదవిని అందుకున్న తరువాత తను చేస్తున్న మొదటి కార్యక్రమం ఇది. అందుకేనేమో కొంత ఒత్తిడికి గురౌతుంది. నా భార్యకు ముందు అపార్ట్ మెంటు ప్రెసిడెంట్ గా వెంకటరావు మాస్టర్ వుండేవారు. వాళ్ళ ఫ్లాట్ ని అద్దెకు ఇచ్చి వాళ్ళ అబ్బాయి దగ్గరకు ఆయన వెళ్లిపోయేసరికి కొత్త ప్రెసిడెంట్ అవసరం పడింది. ఎవరు బిజీ లో వాళ్ళు ఉండటం వల్ల నాతో సహా ప్రెసిడెంట్ గా ఎవ్వరూ వుండము అని చెప్పేసాం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనేవారకు కాలంతో పోటీపడి పనిచేసే సమాజం. నా పక్క ఫ్లాట్ అతను తో పరిచయం అవడానికి నాకు మూడు నెలలు పట్టింది. కుటుంబం తో కాలం గడపడానికే సమయం దొరకటం లేదని ఒకరు ఈ పని మాకు రాదని మరొకరు చురుకుగా ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుందని ఇంకొకరు..అలా చివరికి శ్రీమతి ఇందు అయితే బాగుంటుందని ఆ బాధ్యతను నా భార్యకు అప్పజెప్పారు. అప్పటి నుంచి తనదైన ప్రత్యేకతను చాటుకోవలని ప్రయత్నం చేస్తోంది.

ఏ పని అయినా ఆలోచించి సమర్ధవంతంగా చేయగలటం …అందరితో కలిసిపోయే మనస్తత్వం …చెప్పిన ప్రతి పనిని అమలుపరచడం వంటి కారణాలతో అతి తక్కువ సమయం లోనే మంచి పేరు సంపాదించుకుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ చదువులకి, నా ఆఫీసుకి దగ్గరగా ఉంటుందని అయిదు ఏళ్ళ కిందట ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాం.

###

"మూర్తి గారు" అంటూ కాఫీ కప్పుతో హల్లో నేను కూర్చున్న చోటుకి వచ్చింది. ఇందు అప్పుడప్పుడు నన్ను మూర్తి గారు అని సరదాగా పిలుస్తుంటుంది. వత్తిడికి సరిగా నిద్రపోలేదేమో ముఖం లో కళ తగ్గింది."

ఇంతకీ ఎవరిని ఎంపికచేశారు అని అడిగాను ఆత్రంగా".

"ఎక్కడా! ఎంపిక అంత సులువుగా అవుతుందా. ఆదర్శ మహిళకి చాలా ఆర్హతలు ఉండాలి మూర్తి గారు"

ఏంటో అవి? అన్నాను ఆశ్చర్యంగా.

“సహనం …చతురత …ఆర్థిక అవగాహన.. చదువు ..హోదా..పలుకుబడి..సమాజంలో గుర్తింపు ..నాయకత్వ లక్షణం..క్రమశిక్షణ…ఆత్మస్థర్యం..” అంటూ సాగుతున్న తన మాటల ప్రవాహాన్ని ఎదురెళ్లి ఆపలేక ఒక్కసారిగా చప్పట్లు కొట్టాను.

"ఇన్ని గుణాలు కలవారు దొరికారా?"అని అడిగాను.

"ఆ ప్రయత్నం లోనే ఉన్నామండి. కానీ అన్ని గుణాలు ఒక్కరిలో వుంటాయంటారా? అంది సందేహంగా.

"ఉండక పోతే మహిళలందరు ఆదర్శ వంతంగా జీవించనట్టేనా?" తిరిగి అడిగిన ప్రశ్నకు ఆలోచనలో పడింది.

"పైన చెప్పిన ఆర్హతలు అందరిలోను ఉండవు ఇందు, కానీ ప్రతీ మహిళ తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో వీటన్నింటినీ ఒక్కొక్కటిగా సాధించి తీరుతుంది అని నా అభిప్రాయం.

"మరి ఈ "ఉమెన్స్ డే" ఎందుకు జరుపుతారు మూర్తిగారు" అంది నవ్వుతూ.

"ఏమో ఆలోచిస్తే నీకే తెలుస్తుందిగా" అన్నాను తిరిగి నవ్వుతూ. ఆ రోజు అంతా ఆలోచించి చివరికి తన మనస్సుకి తృప్తి కలిగిందో ఏమో గాఢ నిద్రలోకి జారుకుంది.

###

మరుసటి రోజు "సాయంత్రం వనజరావు గారి ఇంట్లో మీటింగ్ ఉందండి. మీరు, పిల్లలు టైం కి తినెయ్యండి నేను రావడం లేట్ అవుతుంది" అని అంది.

"అది సరే అందరూ వస్తున్నారా! మీటింగ్ కి" అని ఇందుని అడిగాను.

"లేదండి కొంతమందే వస్తున్నారు. మిగతా వాళ్ళంతా వర్కింగ్ ఉమెన్స్ కదా? వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టెయ్యమన్నారు" అంది.

నిజమే ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్యన మాటలు కరువైన ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకి తీరిక ఎవరికి ఉంటుంది? నా ఆలోచనల్లో నుండి బయటికి లాగినట్టు,

"అమ్మగోరూ. అమ్మగోరూ..” అంటూ వచ్చింది ముత్యాలు…"పెద్దమ్మ గోరు బేగి రమ్మంటున్నారు …అమ్మ" అని నా శ్రీమతి దగ్గరికి హడావిడిగా అరుస్తూ వచ్చింది. ఒక్క సారిగా ఉలిక్కి పడింది ఇందు.

"కాస్త నెమ్మదిగా మాట్లాడవే తల్లీ, గుండె ఆగిపోయినంత పని అయ్యింది" అని విసుక్కుంది ఇందు.

###

ముత్యాలు మా పనమ్మాయి. పల్లెటూరు వాతావరణం నుండి వచ్చిన తనకు గట్టిగా అరుస్తూ సంభాషించడము మాములే..ఇందూకి మొదట్లో కాస్త ఇబ్బంది గా అనిపించినా పోనుపోను అలవాటు అయిపోయింది ..అయినా మధ్య మధ్యలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.. వయస్సు లో పెద్ద అవ్వటం వలన మా కో రెసిడెంట్ వనజారావుగారిని పెద్దమ్మగారు అంటూ ఉంటుంది.

###

ముత్యాలు భర్త మా అపార్ట్మెంట్ లో వాచ్ మెన్. అతని పేరు శివుడు. వీళ్లకు ముగ్గురు సంతానం. బతుకు తెరువు కోసం వచ్చిన అమాయకపు పల్లె మనుషులు. ఇద్దరికి వయసు తేడా ఎక్కువ..వ్యవసాయం కలిసి రాక కూలి పనులు చేసే ఓపిక లేక మా లాంటి అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా తక్కువ జీతానికి పనిచేస్తుంటారు.

ఈ మధ్య శివుడికి ఆరోగ్యం బాగుండడం లేదు అపార్టమెంటు లో శివుడి పనులు కూడా ముత్యాలే చూసుకుంటుంది. దగ్గరలో ఉన్న మునిసిపల్ స్కూల్ లో పిల్లలని చదివిస్తున్నారు. గొప్ప కోరికలు ఏమి ఉండవు వీళ్ళకి..తమ కష్టం తమ బిడ్డలకు రాకుండా ఉంటే చాలు అనే ఒకే ఒక్క ఆశ తప్ప.

###

"ఉమెన్స్ డే" రానేవచ్చింది. అందరికీ వీలవుతుంది అని ఆ రోజు సాయంత్రం సెల్లార్ లో కార్యక్రమంను ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు అంతా చేరేసరికి బాగా సందడి వాతావరణం నెలకొంది. మహిళలు అంతా చిన్నపిల్లలా అయిపోయారు కొంతమంది పాటలు పాడారు. కొంత మంది కవితలు చెప్పారు. ఎవరి ప్రతిభ వాళ్ళు కనబరుస్తున్నారు. అందరూ చిన్నచిన్న బహుమతులతో సత్కరించుకున్నారు. ఇక అందరు ఎదురు చూస్తున్న విషయం ఈ సంవత్సరం ఆదర్శ మహిళగా ముత్యాలుని ఎంపిక చేసాం అని చెప్పేసరికి అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు.

ముత్యాలు చాలా ఆశ్చర్యంతో సిగ్గుపడిపోయింది."నేనేంటి అమ్మగార్లు" అని ఆనందబాష్పలు కార్చింది.. ముత్యాలను కూర్చోబెట్టి కొత్తచీర గాజులు పెట్టి అందరూ సత్కరించారు. ఇందు మాట్లాడటం మొదలు పెట్టింది.

“ముత్యాలును నిజంగా ఒక ఆదర్శ మహిళగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ ఎలా అయితే ఇంట్లోనూ, బయట కూడా తన విధి నిర్వర్తిస్తుందో అంత కన్నా ఎక్కువ మన ముత్యాలు నిర్వర్తించింది అని చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్న తన భర్తకు తల్లిలా సేవచేస్తూ శివుడు చెయ్యాల్సిన పనులు తానే చేస్తూ వాచ్ మన్ అయ్యింది. ఇంకా వనజారావు గారికి కరోనా వస్తే ఎవరు చెయ్యని సాహసం చేసింది. ఒక నర్స్ గా ఆమెకి టైంకి మందులు భోజనం అందించింది. ఇన్ని పనులు చేస్తూ తన పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఏ రోజు కూడా తన అలసటని బయటకు కనిపించకుండా చిరునవ్వుతో తన పని చేసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరం కలిసి ముత్యాలుని ఆదర్శ మహిళగా ఎన్నుకున్నాం.

శివుడి ఆరోగ్యం కోసం ముత్యాలు పడుతున్న కష్టం అందరికీ తెలుసు. అందుకే మన అందరి తరుపున వనజారావు గారి చేతి మీదుగా ముత్యాలుకి "పదివేలు" బహుమతి గా అందిస్తున్నాము.”

హర్షధ్వానాల మధ్య సభ ముగిసింది.

ఇదంతా కలా నిజమా అని ముత్యాలుకి అర్ధం కావటం లేదు. సిగ్గు పడిపోతూ మీ అందరివి మంచి మనసులు అమ్మగార్లు అని కన్నీరు పెట్టుకుంది.

నిజమే కదా ఒక పరిపూర్ణ మహిళకి ఉండవలసిన అర్హత పేద, ధనిక కాదు…ఆ ధరణి అంత సహనం సౌశీల్యం వుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలి.

"కార్యేషు దాసీ కరణేషు మంత్రి"

"రూపేచ లక్ష్మీ క్షమయే దరిత్రి"

"భోజ్యేషు మాత శయనేషు రంభ"

అని స్త్రీ మూర్తి లక్షణాలు వివరిస్తుంది మన శాస్త్రం.

ఈ స్త్రీ మూర్తులు అందరూ ఎంత చక్కగా నిష్పక్షపాతంగా మంచి నిర్ణయం తీసుకున్నారు.

"యత్ర నార్యస్తూ పూజ్యంతే రమతే తత్ర దేవతః"

********

Posted in October 2022, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!