Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
సద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు
Sri-Adi-Sankaracharya

అనంత కాలచక్ర పరిధిలో ఎన్నో కోట్లాది జీవరాశుల పరిణామ క్రమంలో ఏర్పడిన మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది గా పరిగణింపబడుతున్నది. అందుకు కారణం మనిషి లో సహజంగా ఏర్పడిన మేధోసంపత్తి, తదనుగుణంగా స్పందించేందుకు వీలుగా అమరిన శరీరాకృతి, అంతులేని భావోద్వేగాలు, సహజ జీవన విధానంతో జరుగుతున్న సృష్టి కార్య విధివిధానాలు, తద్వారా ఏర్పడిన కుటుంబ వ్యవస్థ, అది పెరిగి సమాజ వ్యవస్థగా రూపొందిన వైనం, కాలంతో పాటు మనిషి ఆలోచనల కృషితో ఏర్పడిన నాగరిక జీవన వ్యవస్థ, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సౌలభ్యం...ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది.

వందల సంవత్సరాల కాలానుగుణంగా ఏర్పడిన ఈ జీవన పర్యవస్థిత క్రమంలో మనిషి ఒక నిర్దిష్టమైన జీవన శైలికి రూపకల్పన చేసుకొని దానిని నిబద్ధతతో ఆచరిస్తూ, అనుకరిస్తూ జీవితాన్ని కొనసాగించడం జరుగుతున్నది. ఆ క్రమశిక్షణను పాటించేందుకు మనిషికి ఆధ్యాత్మిక చింతన తోడవుతుంది. అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవులందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేందుకు భగవంతుడే మానవరూపంలో అవతరించడం జరుగుతుంది. అటువంటి తత్వవేత్తలకు ఆది గురువై అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భగవత్పాదులు, సిద్ధ పురుషులు శ్రీ ఆదిశంకరాచార్యులు నేటి మన ఆదర్శమూర్తి.

ఈ భూమి మీద భౌతిక దేహంతో నివసించిన భగవంతుని అంశం మన శంకరాచార్యులు. ఆయన అందించిన జీవన సూత్రాలు నేటికీ మన జీవితంలో ఎన్నో వెలుగులను ప్రసాదించేందుకు దోహదపడుతున్నాయి. జీవించిన ముప్పైరెండు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు కేవలం కాలినడకనే ఎన్నో వేల మైళ్ళు యావత్ భరతఖండం అంతా పర్యటించి తను ఆకళింపు చేసుకొన్న జీవన పరమార్థ తత్వాన్ని సంస్కృత శ్లోకాల రూపంలో బోధిస్తూ, సగటు మనిషి యొక్క జీవన అభివృద్ధి, మానసిక ఎదుగుదల కొరకై ఎన్నో తత్వాలను రూపొందించారు. అంతేకాక మానవులకు ఆధ్యాత్మిక చింతన ఎంత అవసరమో వివరిస్తూ తద్వారా జీవనసాఫల్యాన్ని సిద్ధింప చేసుకునేందుకు మార్గాన్ని చూపించారు. నేటికీ తన శిష్యపరంపర ద్వారా ఆ బోధనలు, క్రమశిక్షణ సూత్రాలు సగటు మానవునికి అందుతూనే ఉన్నాయి.

ఆసేతుహిమాచలం అంటే హిమపర్వత శ్రేణుల (కాశ్మీరు) నుండి కన్యాకుమారి వరకు కాలినడకనే పర్యటించి మొత్తం భారతదేశం అంతా తన తత్వాలను బోధిస్తూ హిందూ మత ఉద్ధరణకు ఎంతగానో కృషి చేస్తూ నేటి  హిందూమత వ్యాప్తికి ముఖ్య కారకులైన శంకరాచార్యులు దేశం నలుదిక్కులా అద్వైతపీఠాలను సంస్థాపించారు. వీటినే శంకరమఠాలనికూడా అంటారు. వీటిలో, ముఖ్యంగా చెప్పుకోదగినవి కంచి, శృంగేరి, కాశీ, పూరీ, బదరీనారాయణ, పుష్పగిరిలలో ఉన్నాయి. ఈ పీఠాలలోనే కాక నేడు దేశమంతటా ఎన్నో వేదాధ్యయన కేంద్రాలు ఈ మఠాల మార్గదర్శకంలో నడుస్తూ అద్వైత సిద్ధాంతాలను అనుకరిస్తున్నాయి.

మనిషి సరైన జీవన క్రమంలో నివసించడానికి అంతర్లీనంగా మనలో దాగివున్న సనాతన విలువలను, ఆధ్యాత్మిక చింతలను వెలికితీసి అర్థం చేసుకొనాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి అద్వైత తత్వాలతో వివరించిన వారు శ్రీ భగవత్పాదులు ఆదిశంకరాచార్యులవారు.

ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నారు అనే సత్యాన్ని గ్రహించి పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని శంకరాచార్యుల వారు బోధించిన అద్వైతం తెలుపుతున్నది.  'ఏకమేవా ద్వితీయం బ్రహ్మ' 'ఏకం సద్విప్రా బహుధా వదంతి' 'సర్వం ఖల్విదం బ్రహ్మ' 'జీవో బ్రహ్మైవ నాపరః' 'తత్త్వమసి' వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. ప్రతి జీవాత్మ పరమాత్మరూపమే అనే సత్యాన్ని మనిషి జ్ఞానంతో గ్రహించిన నాడు ప్రతిజీవిలోనూ మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తారు. ఇలాంటి జ్ఞానంపొందడం ప్రపంచంలో అందరికీ సాధ్యంకాదు. కనుకనే పరమాత్మకు ఒక నిర్దిష్ఠ రూపం కల్పించుకొని ఇష్ట దేవతగా భావించుకొని ఆ దేవత నారాధించడంద్వారా సంసారులు క్రమశః జ్ఞానంపొంది మోక్షసిద్ధికి ప్రయత్నించవచ్చు అని శ్రీ ఆది శంకరులు వివరించారు. 'జగమంతా మాయ, పరమాత్మ లీల' అని ఉపనిషత్తులలో మాయా సిద్ధాంతాన్ని విపులపరచి, అద్వైతంలో ఒక అంతర్భాగంగా రూపొందించి ఒక మతంగా బోధించిన మహనీయులు - శంకరులే.

దాదాపు వంద మతాలతో విభిన్న సిద్ధాంతాలతో విరాజిల్లుతున్న హిందూ తత్వాన్ని ఏకీకృతం చేసి కేవలం ఆరు వర్గాలుగా శ్రీ శంకరాచార్యులు విభజించారు. కనుకనే ఆయనను ''షణ్మత స్థాపకః'' అని కూడా అంటారు. శంకరాచార్యుల కన్నా ముందే అద్వైత సిద్ధాంతాలను నిర్వచించడం జరిగింది. కానీ వాటి ప్రాధాన్యతను గుర్తించి తగిన విధంగా ప్రజల మనసులలో నింపి ప్రాచుర్యం కల్గించిన ఘనత శ్రీ శంకరుల వారిదే.

ఆదిశంకరులు రచించి నేటికీ ఎంతగానో ప్రాచుర్యంలో ఉన్న పవిత్ర గ్రంథాలలో ఉపనిషద్భాష్యాలు, వేదాంతసూత్రభాష్యం, భగవద్గీతాభాష్యం, సర్వసిద్ధాంతసంగ్రహం, వివేకచూడామణి, శివానందాదిలహరులు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణింపబడుతున్నవి.

అతి తక్కువ కాలంలోనే పూర్తి మానవ జీవిత సాఫల్యాన్ని, పరమార్థాన్ని, తన పుట్టుక యొక్క ఉద్దేశ్యాన్ని అవగతం చేసుకొని తద్వారా తన జీవన మార్గాన్ని ఎంచుకొని కోట్లకొలది మానవులకు భక్తి తత్వాలను, జీవిత గమ్యాల దిశా నిర్దేశాలను అర్థమయ్యే రీతిలో తను బోధించడమే కాక తన పరంపర శిష్యుల ద్వారా నేటికీ అందిస్తూ మానవజీవితానికి మహోన్నత వెలుగు రేఖలను ప్రసాదించిన శంకరాచార్యులు, ఆది శంకరులు అనడం సబబే అవుతుంది. ఆయన తత్వాలను ఆకళింపు చేసుకొని వాటిని ఆచరిస్తూ మన జీవిత పరమార్థాన్ని గుర్తించి ఆ పరమార్థ సాఫల్యం కొరకు చిత్తశుద్ధితో ఆచరించడమే మనం ఆయనకు అందిస్తున్న ఘన నివాళి. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. ఈ మానవ జన్మ ముఖ్య ఉద్దేశ్యం మనకు అర్థం కావాలి.

Posted in October 2022, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!