Menu Close
Kadambam Page Title
పొలం ఒక బంధం
గవిడి శ్రీనివాస్

కాసిన్ని చినుకులు రాలటం కాబోలు
నాల్గు మడి సెక్కలు
సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి.

ఉత్సాహం ఉత్సవమౌతూ
కళ్ళల్లో వరి కలల కాంతులు
దర్శిస్తున్నాడు రైతు.

గుంపు కొంగల బారులా
వరినాట్లు నాటిన ఆడోళ్ళు.

నిజమే కదా
మట్టిని తాకిన పాదాలు
మొక్కలై ఎదుగుతుంటాయి.
నడిచిన మట్టి మీద
మమకారపు పొరలు విప్పుకుంటాయి.

అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని
పంట చేల కోసం
పాట మొలుస్తుంది.

రేపటి భయాలని
తలపాకలో చుట్టిన
ఇప్పటి సౌందర్యం.
రేపటి ఆకలి తీర్చటం లో
ఆర్ద్రత నిండిన అనుభవం ఎదురౌతుంది.

పంట సాగులో
పరిమళాన్ని కళ్ళకు ఎత్తుకుని
సంబరాన్ని ఇంతింతగా
ఈ వర్షాకాలం లో
మోసుకుపోతుంటాడు రైతు.

పక్షుల పలకరింపుల్ని
అలంకరించుకుని
ఆకుపచ్చగా మెరిసే రైతు.
పొలాల మధ్య వికశిస్తూ
పరిమళాన్ని జీవన జ్యోతిగా
పొలం ఒక బంధం గా వెలిగిన రైతు.

Posted in October 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!