Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

అంశం: అష్టాదశ శక్తిపీఠాలు

4. చాముండేశ్వరి

క్రౌంచీ నిలయా మహిషాసుర మర్దినీ చాముండేశ్వరీ,
దుష్ట భయంకరీ కాళికా రూపిణీ చాముండేశ్వరీ,
శిరోజోధ్భవ చతుర్థ శక్తి పీఠ స్థితా చాముండేశ్వరీ,
భక్తజన రక్షకీ, వర ప్రదాయినీ చాముండేశ్వరీ,
చాముండేశ్వరీ తల్లికి శతసహస్ర వందనాలు సత్యా!

5. జోగులాంబ

సతీ దంతోధ్భవ శక్తి స్వరూపిణి జోగులాంబ,
అష్టాదశ పీఠ ఆలంపూర్ స్థిత పంచమాంబ,
బాలబ్రహ్మేశ్వర స్వామి జత కూడిన జగదంబ,
నవబ్రహ్మాలయాల చెంత వెలసిన యోగులాంబ,
చండీముండీ శక్తి అంబకు భక్తి నమస్సులు సత్యా!

6. శ్రీ శైల భ్రమరాంబిక

అష్టాదశ ఆరవ శక్తి పీఠ స్థిత భ్రమరా నమః,
సతి కంఠోద్భవ శ్రీమల్లేశ్వర పత్నీ భ్రమరా నమః,
పునర్జన్మ రహిత వరప్రసాదినీ భ్రమరా నమః,
భూమండలపు నాభిస్థాన క్షేత్ర స్థితే భ్రమరా నమః,
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ముక్తిని పొందుదాము సత్యా!

7. శ్రీ మహాలక్ష్మీ

కరవీరపుర నివాసినీ శ్రీ మహాలక్ష్మీ నమః,
చతుర్బాహు, వజ్ర కిరీట ధారిణీ శ్రీలక్ష్మీ నమః,
కాశీ దర్శన సమాన పుణ్య ప్రదాతా లక్ష్మీ నమః,
అష్టాదశైకపీఠ స్థితే వరమహాలక్ష్మీ నమః,
అంబాబాయి నామ లక్ష్మీ దేవికి నమస్సులు సత్యా!

8. ఏకవీరక దేవి

మహూరు గ్రామ స్థితా ఏకవీరికా దేవీ నమః,
సతీ దక్షిణ భుజోద్భవ భవానీ దేవీ నమః,
ధర్మ రక్షణ తత్పరా మహాశక్తి దేవీ నమః,
అష్టాదశాష్టమ శక్తి పీఠ స్థితే దేవీ నమః,
శక్తి పీఠాలు దర్శనీయ పుణ్యక్షేత్రాలు సత్యా!

శక్తి పీఠాల పంచపదుల గురించి మీ సూచనలు తెలిపి, అభిప్రాయాలు పంచుకొనగలరు.

*** సశేషం ***

Posted in September 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!