Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

శరభాంకుడు, శ్రీగిరి అయ్యగారు, రావిపాటి అప్పన్న

శరభాంకుడు

ప్రతాపరుద్రుణ్ణి డిల్లీ సేనలు తీసుకొని పోయినపుడు అతనితో గూడా అతని ఆస్థాన జనం కూడా వెళ్ళారని ప్రతాపరుద్ర చరిత్ర చెబుతున్నది. మల్లికార్జున భట్టు మొదలైన బ్రాహ్మణ విద్వాంసులు..గజంబులు ఎనిమిది నూర్లును, శివదేవయ్య, శరభాంకుడు, మల్లికార్జునుడు, రంగనాథుడు మొదలైన వారు ప్రతాపరుద్రునితో వెళ్ళారు. ఈ సందర్భంగా శరభాంకుడు ఈ పద్యం చెప్పాడని తెలుస్తున్నది.

‘చాపముగా సహార్యమును జక్రిని బాణము గాక...పాపపు ఢిల్లి మీద దెగ బాపగదే శరభాంక లింగమా!’

‘చ’ కారంతో ప్రారంభం, ఆరవస్థానంలో ‘హ’ కారం ఉండడం వాళ్ళ ఇది శక్తివంతమైన పద్యమని తెల్పారు. ఇతన్ని, తరువాత కవులైన ఎడపాటి ఎర్రయ్య కవి మొదలైన వారు స్తుతించారు.

శరభాంకుడు ‘శరభాంక లింగమా’ అనే మకుటంతో శతకం రచించాడు. ఇందులోని అయిదు పద్యాలను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తన ‘చాటుపద్యమణిమంజరి’ చివరి భాగంలో ప్రచురించారు. ఈ శతకంలో 4 పాదాల పద్యాలు ఉన్నాయి. అయిదు పాదాల పద్యాలు నలభై వరకు ఉన్నాయి. ఆరు పాదాల పద్యాలు కూడా ఉన్నాయి.

శరభాంకుడు దొంగ యోగులను గూర్చి, మంచి యోగులను గూర్చి తెల్పాడు. బొందితో కైలాసం అనే జాతీయానికి ‘బొందితో శ్రీశైలం’ అని 72 వ పద్యంలో వాడాడు. శరభాంకుని శతకం పూర్తిగా దొరకలేదు.

శ్రీగిరి అయ్యగారు

ఒక కవి ఒక పద్దతిలో చెప్పిన దానికి మరొకరు ఇంకొక విధంగా చెప్పడం మన సాహిత్యంలో ఉన్నదే. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యం, పండితారాధ్య చరిత్ర. దానిని శ్రీనాథుడు పద్యకావ్యంగా రూపొందించాడు.

శ్రీగిరి అయ్యగారు నవనాథ చరిత్రను పద్యకావ్యంగా వ్రాశాడు. దానిని గౌరన ద్విపదలో కావ్యంగా రచించాడు. దీనిని గౌరన చేత రచింపజేసినది శ్రీశైలం లోని శాంత భిక్షావృత్తి మఠాధిపతి. ద్విపదలో శైవమత వ్యాప్తి బాగా జరుగుతుందని మఠాధిపతి భావించారు.

శ్రీగిరి కవిని అయ్యగారు అనడం – శైవాచార్యులను ‘అయ్యగారు’ అని వైష్ణవాచార్యులను ‘అయ్యంగారు’ అని పిలవడం జరిగింది. దీనికి సంబంధించిన రెండు శాసనాలు గోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో దొరికాయి.  శ్రీగిరి కవికి రాజు దానమిచ్చిన విషయం తెల్పే శాసనాలవి. ఒకదానిలో దానమిచ్చిన కాలం – క్రీ.శ.1315 లో దానం ఇచ్చినట్లు చెప్పబడింది. (శక సంవత్సరం 1232) దానం చేసిన రాజు, రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి (క్రీ.శ.1315-53).

ఈ సందర్భంగా శ్రీశైల విశిష్టతను, శైవులలో గల ఇరవైనాలుగు రకాల శైవులను ఆరుద్ర వివరించారు. కొన్ని కారణాల వలన శైవ, వైష్ణవాది మతాలు గూడా శాక్త్యాన్ని తాంత్రిక విధానాలను (శక్తి సంబంధమైనవి) స్వీకరించారు. సిద్ధులు కాల తంతులను ప్రచారం చేశారు. నవనాథులు ఈ సిద్ధుల నుండి వచ్చారు. వీరి ఆచార వ్యవహారాలూ కాపాలికుల లాగా ఉంటాయి. చతుర సిద్ధులు – 84 మంది. సిద్ధులు, నవనాథులు ఈ మార్గ ప్రవర్తకులలో ప్రసిద్ధులు. మంత్ర, హఠ, లయ,రాజ యోగాలే గాక రసయోగంలో కూడా ఈ నవనాథులు నిష్ణాతులు. శ్రీశైలానికి తూర్పు, పడమర ద్వారాలయిన త్రిపురాంతకం, అలంపురం వీరికి ఉనికి పట్టులు. (స.ఆం.సా. పేజీలు 510-12).

నవ సిద్ధులలో గోరక్షనాథుడు, గోరఖ్ నాథ్ గా ప్రసిద్ధుడు. యితడు గోరక్ష సిద్ధాంత సంగ్రహం అనే గ్రంథం వ్రాశాడు.

శ్రీగిరి కవి శైవం నుండి వైష్ణవానికి మారి శ్రీరంగ మహత్యం అనే కావ్యం వ్రాశాడని పండితుల అభిప్రాయం. నవనాథ చరిత్ర పద్యకావ్యంగా నుండగానే ప్రసిద్ధి చెందిందని చెప్పే సాక్ష్యాలున్నాయి. జక్కన విక్రమార్క చరిత్రలో నవనాథుల ప్రసక్తి ఉంది.

అధినాథుని యాపరావతారము పూని
       మత్స్యేంద్ర నాథుని మదింప దనరి
సారంగ నాథుని సామర్ధ్యమును బొంది
       గోకర్ల నాథుని గుణము దాల్చి .....

శ్రీగిరి కవి వ్రాసిన పద్యకావ్యాలైన నవనాథ చరిత్ర, శ్రీ రంగ మహత్యము దొరకలేదు. మడికి సింగన పుణ్యమా అని మనకు ఒకే ఒక పద్యం దొరుకుతున్నది. ‘రాజునకు కొరగాని గుణములు’ అనే శీర్షికతో దీనిని సింగన ఉదహరిచించాడు. మడిక సింగన గ్రంథం పేరు చెప్పాడే గాని దాన్ని రచించిన రచయిత పేరు చెప్పలేదు. అందుకే శాసనాలలో కనపడే ప్రమధ కవి శ్రీ గిరి, నవనాథ చరిత్ర వ్రాసిన శ్రీ గిరి ఒకరేనా కాదా అన్నది తేలని విషయం.

రావిపాటి తిప్పన్న

రావిపాటి త్రిపురాంతకుడు అనే కవిని రావిపాటి తిప్పన్న అని పిలవడం జరిగింది. ఇతడు ఎంత ప్రసిద్ధుడో ఆరుద్ర మాటల్లో తెలుసుకొందాం. “ఆంద్ర దేశంలో అక్షరాస్యులెవరైనా నన్నయ్య గారి పేరు చెప్పినా, తిక్కన గారి పేరు చెప్పినా చేతులెత్తి దండం పెడతారు. ప్రాచీన కవులలో రావిపాటి తిప్పన్న కూడా ఆ కోవకు చెందినవాడని శ్రీనాథుడు వల్లభదాయని క్రీడాభిరామంలో కీర్తించాడు” అని ఆరుద్ర “నన్నయ భట్టు తిక్క కవి నాయకులన్న ....” అన్న శ్రీనాథుని పద్యాన్ని ఉటంకించాడు.

ఇతని కాలం గూర్చి స్పష్టంగా తెలియదు. స్పష్టంగా తెలియదు. కాకతీయ ప్రతాపరుద్రుని చెరపట్టినప్పుడు అతని వెంట ఢిల్లీ కి వెళ్ళిన కవుల పేర్లలో త్రిపురాంతకుని పేరు లేదు. అయితే “త్రిపురాంతకుడనే కవి ద్వితీయ ప్రతాపరుద్రుని యాస్థానమున నున్నట్లు ప్రతాప చరిత్రమున గలదు” అని ఆంద్ర సాహిత్య  పరిషత్పత్రిక సం.7, పుట 7 ప్రమాణంగా చూపిస్తూ నిడదవోలు వెంకటరావు గారు వ్రాశారు. చాగంటి శేషయ్య గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రచురించిన విజ్ఞేశ్వర చరిత్రము లోని ప్రతాప చరిత్రలో త్రిపురాంతకుడనే కవి పేరు కనపడదు. బంగారు పల్లకీలో ప్రతాపరుద్రుని ఆస్థానమునకు వస్తున్నా కవులలో త్రిపురాంతకుని పేరు లేదు. దీనికి కారణాలను ఆరుద్ర ఇలా తెల్పారు. త్రిపురాంతకుడు క్రీ.శ.1300 ప్రాంతంలో పుట్టి ఉంటాడని ఒక పద్యం చూసి చాగంటి శేషయ్య గారు చెప్పారని, ప్రతాపరుద్రుడు రాజ్యం చేసే కాలంలో త్రిపురాంతకుడు పాతికేళ్ళ వాడు. అందుచేత ఆ ఆస్థానంలో అప్పటికి అతని ప్రవేశం కలిగి ఉండదు. అతనికి పేరు వచ్చేసరికి కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. (స.ఆం.సా. పేజీలు 514-16).

నాటకాభిలాష గల త్రిపురాంతకుడు దశ నాటకాలలో ఒకటైన వీధి నాటకాన్ని ప్రేమాభిరామం అనే పేరున రచించాడు. ఇది సంస్కృతంలో వ్రాయబడింది. దీనిలోని శ్లోకాలను తదనంతర కవులైన పెదకోమటి వేమారెడ్డి (సాహిత్య చింతామణి) మొదలైన వారు వాడుకొన్నారు. వృత్త రత్నాకర వ్యాఖ్య లో ఉన్న ఒక శ్లోకం రావిపాటి తిప్పన్న వ్రాసిన ప్రేమాభిరామం లోనిదని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించారు.

సంస్కృతంలో ఉన్న ప్రేమాభిరామాన్ని అనుసరించే శ్రీనాథుడు క్రీడాభిరామం వ్రాశాడు. ఆరుద్ర సంస్కృతాంధ్ర గ్రంథాలలోని శ్లోకాలను పద్యాలను సరిపోల్చి చూపించారు ఆయా రచనల నుండి. ఈ సందర్భంగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించిన రెండు శ్లోకాలు తప్పించి ప్రేమాభిరామం లోని మరే భాగాలు మనకు దక్కలేదని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీలు 517).

ప్రేమాభిరామం శృంగార రస గ్రంథం. తిప్పన్న కామ శాస్త్రాన్ని బాగా చదివి ‘మదన విజయం’ అనే గ్రంథం వ్రాశాడు. ఇది ఎనిమిది ఆశ్వాసాల గ్రంథం. దీనిని మానవల్ల రామకృష్ణ కవి గారు మాత్రం చూచారట. అప్పటికే అది శిధిలావస్థలో ఉన్నది. అందులోనుండి రామకృష్ణ కవి గారు తెల్పిన రెండు పద్యాలను ఆరుద్ర ఉదహరించారు. తెలుగులో కొక్కోకం వ్రాసిన కూచిరాజు ఎర్రన కవి తన గ్రంధాదిలో రావిపాటి త్రిపురాంతకుని ఇలా స్తుతించాడు.—

పృధివి రావిపాటి త్రిపురాంతక కవి శృంగార కవులనెల్ల గారవించి....

రావిపాటి తిప్పన్న అంబికా శతకం అనే సున్నితమైన శృంగారంతో గూడిన మరొక రచన చేశాడు. ఆది దంపతుల ఆనందమయ శృంగారానికి ఎక్కడా రసా భాస కానివ్వకుండా ఉదాత్తంగా వర్ణించాడు. ఇందులోని నూరు పద్యాలకు గాను ఏడు పద్యాలు మాత్రం లభ్యమవుతున్నాయి. ఈ పద్యాలు ప్రబంధ రత్నావళి లో ఉన్నాయి ఆ ఏడు పద్యాలను ఆరుద్ర ఇచ్చారు.

సంస్కృతంలో ఒకటి తెలుగులో వ్రాసిన రెండు గ్రంధాలు త్రిపురాంతకునివి, ఒకటి రెండు పద్యాలు తప్ప మరేమీ దొరకలేదు. త్రిపురాంతకుడు వ్రాసిన త్రిపురాంతకోదాహరణం ఒక్కటి మాత్రం మనకు సంపూర్ణంగా లభించింది.

ఉదాహరణ, ఆరుద్ర వివరణ – “ఈ వాజ్ఞయం పైన ప్రథమంగా అమోఘమైన పరిశోధన చేసిన నిడదవోలు వెంకటరావు గారు ఈ కావ్య బేధం దేశీ సాంప్రదాయంలో జనించినదని చక్కగా ఋజువు చేశారు.” అని రావుగారు ఇచ్చిన వివరణాత్మక విషయాలను ముందుంచారు. ఉదాహరణమంటే భాషలో ఉన్న విభక్తులను, సంబోధనా విభక్తిని ఉదహరించే లఘు – అలాగే కళికలు,రగడలు మొదలైన వాటిని చెప్పి రగడలు శాతవాహనుల కాలం నుండి ఉన్నా సంస్కృత పండితులు, కవులు వీటిని అంగీకరించరని అటు తర్వాత అనంతామాత్యాదులు వివరించారని తెల్పారు. (స.ఆం.సా. పేజీలు 518-22).

 

**** సశేషం ****

Posted in September 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!