Menu Close
Kadambam Page Title
నేను ఎవరు ??
శ్రీనివాసమూర్తి వేములపాటి

అల అనుకుంటుంది తను వేరు, పక్క అల వేరు అని
పోటీ పడి లేస్తుంది పక్క అల కంటే పైకి ఎగరాలని
ఎక్కడో దూర తీరాలకు వెళ్తుంది వెతుక్కుంటూ
వెతుకులాట దేనికో అసలు తెలీదు, అంతులేని ఆరాటం
పక్క అలని మించి పోవాలని శక్తి లో అలుపెరగని పరుగు
పక్క అలలు పడి పోవడం చూస్తూనే ఉంటుంది
కొత్త అలలు పుట్టడం కూడా తెలుస్తూనే వుంది
కానీ తను పడనని నమ్మకం, పడిన అలలు శక్తి లేక పడి పోయాయని మరొక నమ్మకం
అలలకు జన్మనిచ్చి మరల తనలో కలుపుకొనే ఆ అంబుధికి అంటవు ఇవి ఏవీ
పడి లేచే అలలు, అవి పడే ఆరాటం అన్ని చూస్తూనే ఉంటుంది బ్రహ్మానందం తో
సాగరానికి ఎరుక ఆలలను కమ్మిన “మాయ”

మాయ తొలగి, వేరే అలలు లేవని, తను ఏ అలతో పోటీ పడ అక్కర లేదని
ఏ అలని ద్వేషించ అక్కర్లేదని, ఎక్కడికి ఏదో వెతుకుతూ పరుగులు తీయ అక్కర లేదని
తను తపన పడే ఆ పరమానందం తనలోనే వుందని, అది అనంతమైన సముద్రం అని
తను సముద్రంలో లేచిన ఒక అల కాదని, తానే సముద్రం అని
ఏదో ఒక రోజు ప్రతి అల తెలుసు కొని సముద్రంగా నిండుగా ఉండి పోతుందని ఆశ
ఆ దయా “సాగరునకు” పెద్ద ఆశ అలల “మాయ” తొలగాలని
ఆ పరమాత్మ ఆశ జీవుల “మాయ” తొలగాలని

Posted in September 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!