Menu Close
దీపపు వెలుగు (కథ)
గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం

విశ్వనాథంగారు, ఏదో ఆలోచించేరు. బ్యాంకు ఉద్యోగస్తులకు, సంవత్సరంలో ఒక మారు, వారు కోరిన పండుగ జరుపుకోడానికి, నిర్ధారించిన ఋణం, వడ్డీ లేకుండా పొందడానికి అవకాశం ఉంది. విశ్వనాథంగారు, ఆ దృష్టికోణంలో ఆలోచించి,

"రెడ్డిగారూ, సుభద్రమ్మగారు, ఈ సంవత్సరం ఫెస్టివల్ లోన్ తీసుకున్నారా." అని, వాకబు చేసేరు.

"లేదు సార్. అందరూ పెద్దపండక్కి తీసుకొంటారండి. కాని, సార్, పెద్దపండక్కి ఇంకా బాగా టైము ఉందండి."

"దగ్గరలో మరే పండుగ లేదా."

"నాకు తెలిసినంతవరకూ ఏ పండుగ లేదండి." ఒక్క క్షణం ఆగి, "మన కేషియరు అవధానిగారిని అడిగితే తెలుస్తుందండి. ఆయన దగ్గర పంచాంగం ఉంటుందండి."

"ఆయనకు, రోజూ పంచాంగంతో పనేమిటి."

"ఆయన జాతకాలు బాగా చూస్తారండి. ముహూర్తాలు కూడా పెడుతూంటారండి."

"అయితే, ఆయన్ని ఒకమారు పంచాంగం పట్టుకు రమ్మనండి."

అవధానిగారికి మెసేజ్ వెళ్ళింది. రెండు నిమిషాల్లో, ఆయన పంచాంగంతోబాటు హాజరయ్యేరు. విశ్వనాథంగారు నొక్కి చెప్పడంతో, కుర్చీలో ఆసీనులయ్యేరు.

"అవధానిగారూ, నాకు ఇప్పటివరకు తెలీలేదు. మీరు జాతకాలు బాగా చూస్తారట. ముహుర్తాలు కూడా పెడతారట." విశ్వనాథంగారు చిరునవ్వుతో, కొనియాడేరు.

"మా తండ్రిగారిదగ్గర నేర్చుకున్నాను సార్. కాలక్షేపానికి, ఎవరయినా అడిగితే చెప్తూ ఉంటాను."

"మంచి సోషియల్ సర్వీస్ చేస్తున్నారు. మీ సర్వీసు మాకు కొద్దిగా అవసరం పడ్డదండి."

"చెప్పండి సార్. ఏమిటో అది."

"అవధానిగారూ, దగ్గరలో మన పండుగలు ఏవయినా ఉన్నాయండి."

"నాకు తెలిసినంతవరకు ఏవీ లేవు సార్."

"అయినా, ఓ మారు పంచాంగం చూడండి. ఏదయినా ఉందేమో."

అవధానిగారు పంచాంగం చూసి,

"వచ్చే వారం ఒకటుంది సార్. ఏదో సుబ్బారాయుడుషష్టి అని ఉంది సార్. ఆ పండుగేమిటో మనవాళ్ళెవ్వరికి తెలీదు సార్. ఎవరూ చేసుకోడం కూడా నాకు తెలీదు సార్."

"థాంక్సండి, అవధానిగారు. మీ పని చూసుకోండి."

అవధానిగారు నిష్క్రమించేరు.

"సార్, ఫెస్టివల్ లోనుకు ఛాన్సు లేదన్నమాట." రెడ్డిగారి అభిప్రాయం.

"రెడ్డిగారూ, తొందరపడకండి. సుబ్బారాయుడు షష్టి ఒక పండుగ, అని పంచాంగంలో ఉంది. అవధానిగారు పంచాంగం చూస్తూంటే, దాని కవరు పేజీ చూసేను. అది తిరుపతి దేవస్థానం వారి పంచాంగం. అందులో తప్పులుండవు."

"అయితే ఏమిటి చేద్దామంటారు సార్."

"సుభద్రమ్మగారిచేత, సుబ్బారాయుడుషష్టి, వారి కుటుంబలో, ఆచారంలో ఉన్న ఒక ముఖ్యమయిన పండుగని, అది జరుపుకోడానికి ఫెస్టివల్ లోను కావాలని, ఎప్లై చెయ్యమనండి...జూనియర్ ఆఫీసర్లకు ఫెస్టివల్ లోను లిమిట్… పదిహేనువేలు కదండీ.”

"అవును సార్."

“ఆవిడ ప్రాబ్లెమ్ సాల్వయింది. ఓ.డి. అయితే ఇంటరెస్ట్ ఉంటుంది. ఫెస్టివల్ లోను, ఇంటరెస్ట్ ఫ్రీ. మీరు ఆవిడ ఫెస్టివల్ లోను అప్లికేషను పుటప్ చెయ్యండి."

"అలాగే సార్." రెడ్డిగారు కుర్చీలోనుండి లేస్తూండగా.

"రెడ్డిగారూ, అవధానిగారి పంచాంగంలో, పండుగల లిస్టులో సుబ్బారాయుడుషష్టి రాసి ఉన్న కాగితం, జిరాక్సు కాపీ తీసుకొని ఫైలులో ఉంచండి. ఇన్స్పెక్టర్స్ అడిగితే చూపించవచ్చు."

"అలాగే సార్." అని, రెడ్డిగారు నిష్క్రమించేరు.

ఓ గంటలో, సుభద్రమ్మగారి ఎకౌంటులో పదిహేను వేలు జమ అయ్యేయి. ఆవిడ, విశ్వనాధంగారికి స్వయంగా ధన్యవాదాలు చెప్పుకొంది. ఆయన, "మీ మేనమామగారి అబ్బాయి, అమెరికానుండి మీకోసం చాక్లెట్స్ తప్పక తెస్తారు. మరచిపోకుండా వాటిలో ఒకటి రెండు నాకు తేవాలి." అని చిన్న చిరునవ్వుతో స్పందించేరు.

ఆమె కూడా, చిన్న చిరునవ్వుతో, “తప్పకుండా సార్" అని వినయంగా చెప్పి శలవు తీసుకొంది.

తక్కువ వ్యవధిలోనే, విశ్వనాథంగారు, బ్రాంచిలోని ఉద్యోగస్తులందరకు చేరువయ్యేరు. వారందరు, ఆయన వారి శ్రేయోభిలాషి అని నమ్మసాగేరు. వారి గౌరవానికి పాత్రులయ్యేరు. విశ్వనాధంగారి ప్రణాళికలోని మొదటి ఘట్టంలో ఆయన కోరిన ఫలితాలు లభించేయి. ఇక క్లిష్టమయిన సవాళ్ళను సరిదిద్దే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేరు.

ఒక రోజు, సుమారు పన్నెండు గంటల సమయం. విశ్వనాథంగారు ఆఫీసు పనిలో నిమగ్నమయి ఉన్నారు. ఆయన క్యాబినులోనికి విలాసరావు హడావిడిగా ప్రవేశించి,

"ఎటండెన్సు రెజిస్టరు ఇలా ఇవ్వండి సార్; సంతకం చెయ్యాలి." అని అడిగేడు.

"ఇవాళికి ఎటండెన్సు రిజిష్టరు క్లోజ్ చేసేశాను." అని పనిచేసుకొంటూనే సమాధానమిచ్చేరు, విశ్వనాథంగారు.

"నేనింకా సంతకం చెయ్యాలి సార్."

"అఖ్ఖర్లేదు."

"ఏమిటి సార్ మీరు చెపుతున్నారు."

"ఇవాళకి మీకు ఆబ్సెంట్ మార్కు చేసేను. అంచేత మీరు సంతకం చెయ్యవలసిన అవసరం లేదు."

"నేను వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను. నా వైపు చూడకుండానే సమాధానాలిస్తున్నారు. నేనొక యూనియను లీడరునని రెస్పెక్టు కూడా ఇవ్వడం లేదు."

"నా కేబినులోనికి మర్యాదగా నా అనుమతితో ప్రవేశించిన వారిని, నేను తగు మర్యాదతోనే ఆహ్వానిస్తాను. ఇహపోతే, మీరు చెపుతున్న విషయం, నా బ్రాంచిలో పనిచేస్తున్న క్లర్కు, నియమిత బ్రాంచి పనివేళలో, హాజరు కానందున, బ్యాంకు నియమావళి ననుసరించి, నేను తీసుకొన్న నిర్ణయం. దయచేసి నన్ను డిస్టర్బు చెయ్యకండి. జి.ఎమ్. గారికి అర్జెంటు గా మెయిలు పంపిస్తున్నాను."

"మీరు డెసిషన్ మార్చుకోరన్నమాట." గట్టిగా నొక్కి అడిగేడు విలాసరావు.

అవునన్నట్లు తల ఊపేరు, విశ్వనాథంగారు.

మరో మూడు గంటలు గడిచేయి. విలాసరావుతోబాటు మరో ఆరుగురు విశ్వనాధంగారి క్యాబినులోనికి దూసుకు వచ్చేరు. ఇష్టానుసారం కుర్చీలు. లాక్కొని, నలుగురు కూర్చున్నారు. కుర్చీలు లేక మిగిలిన ఇద్దరు నిలబడ్డారు. విశ్వనాథంగారు తన పనిలో నిమగ్నమయి ఉన్నారు.

వారిలో ఒకాయన, "సార్, మేము ఎంప్లాయీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్సుమి. విలాసరావుగారు మా జనరల్ సెక్రటరీ. మేము మీతో అర్జెంటు గా మాట్లాడడానికి వచ్చేము.” అని కొద్దిగా స్వరం హెచ్చించి అన్నాడు.

ఆ వ్యక్తిని ఉద్దేశించి, "మీరంత బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేదు. పైన, బ్యాంకు పని చేస్తున్నవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంతకూ, మీకు నాతో అంత అర్జెంటు గా మాట్లాడవలసిన విషయం ఏమిటి." అని, కొద్దిగా తన అసహనం వ్యక్తబరుస్తూ అన్నారు, విశ్వనాథంగారు.

"ఇంపార్టెంటు యూనియను లీడర్సు మీ దగ్గరకు వస్తే, మర్యాదకు కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు; సరికదా, మా వైపు కన్నెత్తికూడా చూడకుండా మీ పని మీరు చూసుకొంటున్నారు. నేను గట్టిగా మాట్లాడబట్టే, మీరు మా వైపు చూసేరు.” అని, కొంత వ్యంగ్యంగా స్పందించేడు, ఆ వ్యక్తి.

"చూడండి, మీ పేరేమిటో నాకు తెలియదు..." అని విశ్వనాథంగారు ఏదో చెప్పబోతూంటే.

"వివేకానంద"

"వివేకానందగారు, మీరు పధ్ధతి ప్రకారం వచ్చి ఉంటే, నేనే మీకు, కుర్చీలు చూపించి ఉండేవాడిని. తగు మర్యాదలు చేసి ఉండేవాడిని. ఎవరయినా వచ్చేముందు, నా అనుమతి కోరడం, ఒక మర్యాద. ఎంచేతనంటే, నేనా సమయంలో బిజీగా ఉంటే, వారిని కలియడానికి, నాకు ఎప్పుడు వీలవుతుందో, తెలియబరచగలను. దానివల్ల, నా సమయం వృధా కాదు. వారి సమయమూ వృధాకాదు. కాని మీరు చేసినదేమిటి. నేను ఆఫీసు పనిలో బిజీగా ఉన్న సమయంలో, ముందుగా చెప్పా చెయ్యక, నా క్యాబినులోనికి దూసుకు వచ్చి, మీ ఇష్టానుసారము కుర్చీలు లాక్కొని, గట్టిగా మాట్లాడి, నన్ను, బ్రాంచిలోని మిగిలిన ఉద్యోగులను డిస్టర్బు చేసేరు. అది మర్యాద అంటారా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలండి. శాసిస్తే రాదు. ఇంతకూ మీరు నన్ను డిస్టర్బు చేసి రావలసిన పని ఏమిటి."  అని విశ్వనాథంగారు కొంచెం ధృడంగా మాట్లాడేరు.

ఈ మేనేజరు, తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాడని యూనియను లీడర్లు బోధపరచుకొన్నారు.

గోపాలకృష్ణ, అనే మరో లీడరు, తన పరిచయం చేసుకొని, "మేనేజిమెంటు, యూనియన్లు, మ్యూచువల్ కోపరేషను చేసుకోవాలి, సార్." అని, ఏదో రాజీ సూత్రం చెప్పబోయేడు.

"I agree." చిరునవ్వు ముఖంతో బిగువుగా అన్నారు, విశ్వనాథంగారు.

గోపాలకృష్ణగారు, "సార్, మా జనరల్ సెక్రటరీగారి, ఇవాళ ఎటండెన్సు విషయంలో, మీరు కొంచెం కోపరేటు చెయ్యాలండి. మీరు మాతో కోపరేటు చేస్తూంటే, మేము కూడా మీతో ఎంత కోపరేటు చేస్తామో, ముందు ముందు, మీకే తెలుస్తుందండి." అని, అంటీ అంటని, వినయంతో ఉవాచ.

"గోపాలకృష్ణగారూ, మీరు ఆశిస్తున్నది, మ్యూచువల్ కోపరేషను అనిపించుకోదండి. బ్యాంకు పనిలో, నా తప్పుల్ని మీరు కప్పిపుచ్చుతూ, మీ తప్పుల్ని నేను కప్పి పుచ్చుతూ ఉంటే, అది, మనకు జీతాలిచ్చి పోషిస్తున్న బ్యాంకుకు, మనం కలసి చేస్తున్న మోసం అవుతుందండి.”

"అయితే సార్, మీ నిర్ణయం ఏమిటి. మా జెనెరల్ సెక్రటరీగారి అటెండెన్సులో ఇవాళ ఆబ్సెంట్ మార్కే ఉంటుందా." గోపాలకృష్ణ నొక్కి అడిగిన ప్రశ్న.

"ఇవాళ, విలాసరావుగారు, నిర్ధారిత సమయంలో బ్యాంకు విధులలో చేరలేదు కాబట్టి, బ్యాంకు రూల్సు ప్రకారం, ఆయనకు ఆబ్సెంట్ మార్కు చెయ్యడమయింది." అని మృదువుగా చెప్పేరు, విశ్వనాథంగారు.

"మీ ఫైనల్ డెసిషను, అదేనా ."

“నేను, ఏ డెసిషనయినా, ఆలోచించి తీసుకొంటాను. దానిలో మార్పు ఉండదు."

"ఆ డెసిషను, ఎలా మార్చుకోరో చూద్దాం. పదండి, మనం చెయ్యవలసింది చేద్దాం." అని, విశ్వనాధంగారివైపు ఎర్రగా చూస్తూ, విలాసరావు గొంతుక పెంచి అన్నాడు. విశ్వనాథంగారు పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యేరు. యూనియను లీడర్లు నిష్క్రమించేరు.

ఆ తరువాత, విశ్వనాధంగారిని లోబరచుకోడానికి, విలాసరావు, యూనియను లీడర్సుతో కలసి, ఒత్తిడి వ్యూహాలు పన్నేడు. విశ్వనాధంగారి దిష్టిబొమ్మను, బ్రాంచి ఎదురుగా తగలబెడుతూ, 'విశ్వనాధం, డౌన్ డౌన్. తానాషాహీ నహీ చలేగా, నహీ చలేగా.' అని కొంతసేపు గట్టిగా అరిచేరు. విశ్వనాథంగారు ఆ ఒత్తిళ్లకు మెత్తబడలేదు. వాటన్నింటిని బ్యాంకు నియమావళితోనే ఆయన త్రిప్పికొట్టేరు. బ్రాంచిలోని ఉద్యోగులు విలాసరావును, దూరం చేయ నారంభించేరు. విలాసరావు ఆటలు కట్టయ్యేయి. ఈ బ్రాంచిలో ఉంటే, రోజూ తప్పక వేళకు వచ్చి వెళుతూండాలి, అని గ్రహించుకొన్నాడు. అది అతడికి జరిగే పని కాదు. విలాసరావు, ఊరిలోని, మరో బ్రాంచిలోని ఒక ఉద్యోగితో, మ్యూచువల్ ట్రేన్స్ఫరు పెట్టుకొని, ఆ బ్రాంచికి మారిపోయేడు. బ్రాంచిలో నెలకొన్న అనుకూలమయిన వాతావరణంతో, విశ్వనాథంగారి బ్రాంచి, ప్రతి సంవత్సరం, ఉన్నతాధికారులు నిర్ణయించిన లక్ష్యాలను, చేరుకోవడమే గాక కొన్ని విషయాలలో అధిగమించేయి. ఆ సత్ఫలితాలు, ఆయన పదోన్నతికి దారి తీసేయి. బ్రాంచిలో చేరిన అయిదు సంవత్సరాలకు, ఛీఫ్ మేనేజరుగా, మరో పెద్ద పట్టణంలోని బ్రాంచికి, బదిలీ అయ్యేరు.

విశ్వనాథంగారు, తనదయిన పద్ధతిలో కొత్త బ్రాంచిని నిర్వహించ నారంభించేరు. విశ్వనాధంగారి గుణము, నైజము గూర్చి, ఆయన పనిచేసిన, మునుపటి బ్రాంచినుండి, పూర్తి వివరాలు, ఈ బ్రాంచికి చేరేయి. బ్రాంచి ఉద్యోగస్తులందరూ, ఆయనతో సహకరించి పని చేస్తే, తమకు మేలే జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చేరు. యూనియను లీడర్లు కూడా, ఆయనను అర్థం చేసుకొన్నారు. విశ్వనాథంగారు, ఉద్యోగులందరితో కలసికట్టుగా పనిచేస్తూ, త్వరలో, వారికి సన్నిహితులయ్యేరు. బ్రాంచ్, పురోభివృద్ధి బాటలో, ముందుకు సాగుతోంది.

విశ్వనాధంగారికి, తన బ్రాంచిలో, చెప్పుకోదగ్గ సమస్యలు తలెత్తడం లేదు. కాని, రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమయ్యేయి. తన బ్రాంచిలో, క్రమశిక్షణా చర్యగా, సస్పెన్షనులోనున్న, ఒక ఉద్యోగిని, విధులలో చేర్చుకోమని, అధికార పార్టీకు చెందిన ఒక రాజకీయ నాయకుని సిఫార్సు, బ్యాంకు హెడాఫీసుకు, అందింది. వారది, విశ్వనాధంగారికి, సత్వర చర్యకై పంపేరు. ఒక అమ్మాయి ముఖం మీద ఘోరంగా యాసిడ్ జల్లినందుకు, హైకోర్టు వారు, ఆ ఉద్యోగికి విధించిన శిక్ష, అది. ఆ విషయం తెలియబరుస్తూ, తానేమీ చేయలేనని, గౌరవంగా చెప్పి, సమస్యను పరిష్కరించేరు, విశ్వనాథంగారు. అంతటితో విశ్వనాధంగారిపైన రాజకీయ ఒత్తిళ్లు ఆగలేదు. కేంద్రంలోని ఒక మంత్రిగారి బావమరిది, ఒక పెద్ద ఫేక్టరీ స్థాపించబోతున్నారు. అది, విశ్వనాధంగారి బ్రాంచి పరిధిలో రానుంది. యంత్రాలు కొనుగోలుకు, కార్మికులు. ఉద్యోగస్తుల జీతాలు మున్నగు ఖర్చులకు, 12,750 కోట్ల రూపాయల ఋణం కోరుతూ బ్రాంచికి అప్లికేషను వచ్చింది. అంత పెద్ద మొత్తం, బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంజూరు కావాలి. తొందరగా ఆ ఋణం సిఫార్సు చేస్తూ, ఆ దరఖాస్తు పంపమని, ప్రధాన కార్యాలయం నుండి, విశ్వనాధంగారికి ఫోను ద్వారా ఆదేశాలందేయి. విశ్వనాధంగారు, స్వయంగా ఆ దరఖాస్తును పరిశీలించేరు. ఆయనకు, కొన్ని ముఖ్యమయిన విషయాలలో, పెద్ద లోపాలు కనిపించాయి. ఆయన, తను పరిశీలించిన ప్రతి లోపాన్ని విశదీకరించి, ఆ ఋణం మంజూరుకు తన అసమ్మతి తెలియబరుస్తూ, ఆ దరఖాస్తును, ప్రధాన కార్యాలయానికి పంపేరు. పధ్ధతి ప్రకారము, ఛీఫ్ మేనేజరు తిరస్కరించిన రుణాన్ని, హెడాఫీసు వారు మంజూరు చేయలేరు. మినిస్టరుగారి బావమరిదికి, బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు, ఋణ మంజూరు విషయంలో, తమ నిస్సహాయత, వినయంగా వివరాలతోబాటు విన్నవించుకొన్నారు.

వారం రోజులు గడిచేయి. ఒకరోజు ఉదయాన్నే, C.B.I. అధికారులు, విశ్వనాధంగారి ఇంట్లో, సోదాలు ప్రారంభించేరు. విశ్వనాథంగారు చెక్కుచెదరలేదు. వచ్చిన అధికారు లకు చిరునవ్వుతో సహకరించేరు. మరునాటి స్థానిక పత్రికలు, ప్రభుత్వాన్ని దుయ్య బట్టేయి. నిజాయితీ గల విశ్వనాధంగారిపై, కక్షసాధింపు చర్యను, తీవ్రంగా విమర్శిం చేయి. సోదాలో, ఆయనకు అక్రమార్జనగా నిరూపించగల, చెప్పుకోదగ్గ ఆస్తి ఏదీ లేదని నిర్ణయానికి వచ్చి, C.B.I. వారు, కేసు మూసివేయడం జరిగింది. విశ్వనాధంగారి నిజాయితీని, ప్రభుత్వం, C.B.I. ద్వారా, చెప్పకనే చెప్పించింది.

C.B.I. సోదా జరిగిన నెల్లాళ్లకు విశ్వనాధంగారికి బదిలీ అయింది. ఆయన, బ్యాంకు శిక్షణాకేంద్రానికి ముఖ్య శిక్షణాధికారిగా విధులలో చేరేరు. చేరిన రెండు మూడు వారాలు, శిక్షణా కేంద్రం పని తీరు నిశితంగా పరీక్షించేరు. శిక్షణా కేంద్రానికి ఒక నూతన దిశకు ప్రణాళిక వేసేరు. బోధనా పద్ధతిలోను, విషయాలలోను, కాలానుగుణంగా చేయవలసిన మార్పులను చేబట్టేరు. ఆయన రాకతో, శిక్షణా కేంద్రం, బ్యాంకులోని ఒక ముఖ్య భాగంగా పేరు తెచ్చుకొంది.

దీపం ఎక్కడ ఉన్నా, వెలుగునే ఇస్తుంది. చీకటిని ఛేదిస్తుంది. విశ్వనాధంగారు వంటి, కొందరి విలువల దీపాన్ని, ఏ సుడిగాలీ, ఆర్పజాలదు.

-00- సమాప్తం -00-

Posted in September 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!