Menu Close
sravanthi_plain
వరదలు
అయ్యగారి సూర్యనారాయణ మూర్తి
తే.గీ.
వాగులును వంకలును నదుల్ వంతెనలను
ముంచి పొర్లుచు సాగుభూములనుఁ బల్లె
వాసములఁ జేరి వెడలక ప్రజల జీవ
నవ్యవస్థనుఁ బరిమార్చె నలువు రడల(1)
(1) దుఃఖించగా
కం.
వరదలు మిగిల్చె బురదలు
వరదలుగాఁ గంటినీరు ప్రవహింపంగా
వరదాభయహస్తం బొక
పరి యైననుఁ జేరనట్టి పల్లె లవెన్నో?
కం.
ఎన్నం డెఱుఁగని కష్టం
బన్నం బిడువారిఁ జేసె నన్నార్తులుగా
ఉన్నవి మునుఁగఁగ నూపిరి
యున్న దదేలనొ యటంచు నూళ్ళే యేడ్వన్
కం.
శిశువుల యాకలి దీర్పఁగ
వశ మెన్నఁడొ యనుచుఁ గుంద వలవల తల్లుల్
పశువుల గ్రాసము లేమిన్
పశువుల యజమానులకును వంతలె మిగిలెన్
ఉ.
ప్రాణముఁ జేతఁ బట్టుకొని పర్విరి పెద్దలుఁ బిన్న లందఱున్
వానలధాటికిన్ విడిచి వస్తుచయంబును దిండిగింజ లే
వానయు వందయేండ్ల నిటువంటి వినాశముఁ గూర్పలేదుగా
దీనముఖంబులే మిగిలెఁ దెల్గుజనాళిదురంతసాక్షిగా
కం.
పుడమియె గడముల మడుగై
పడవలపై వీధులందుఁ బయనించు నెడన్
తడవకుఁ దడవకు హడలెడు
బుడతల తల్లులనుఁ జూడఁ బుట్టదె వడఁకే?
కం.
పల్లెలె ప్రగతికి జీవము
పల్లెలె పోషించు నగరవాసుల; నిపు డా
పల్లెలె యల్లాడఁగ నే
యుల్లంబులు తల్లడిల్ల కుండఁగల వొకో?
కం.
బీభత్స మిట్లుఁ గలుగుట
కే భూతము లాగ్రహించె నేమో సృష్టిన్?
శ్రీభూధరుఁ డౌ పంకజ
నాభుఁడె శాంతింపఁజేయ నమ్మి భజింతున్
Posted in September 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!