Menu Close
ఆదర్శమూర్తులు
-- డా. మధు బుడమగుంట --
‘భారతరత్న’ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
Sarvepalli Radhakrishnan

“మాతృదేవోభ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధి దేవోభవ”- మనకు తల్లిదండ్రులు జీవితాన్ని ప్రసాదించి, జీవన సౌఖ్యాన్ని అందించి మన బాల్యాన్ని బలపరిస్తే, గురువు మన ఆశలకనుగుణంగా, జ్ఞానసాధనకు దోహదకారిగా పనిచేసి జీవన సాఫల్యాన్ని సిద్ధింప జేస్తారు. అటువంటి గురువులు ఎందఱో వివిధరూపాలలో, వివిధ దశలలో మన జీవన పథంలో సదా తోడుండి మనిషి జీవితంలో స్థిరత్వాన్ని పొందేటందుకు సహాయపడతారు. కనుకనే మనందరం ‘గురువు’ అనే పదానికి విలువనిచ్చి గౌరవించడం జరుగుతున్నది. అటువంటి గురువులను గౌరవించే రీతిలో మన సంప్రదాయ పద్ధతులు రూపుదిద్దుకొన్నాయి. బాలల భవిష్యత్తు, బంగారు బాటలో సాగాలని భావించి ఎంతోమంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మన విద్యా విధానాలకు రూపకల్పన చేశారు. అటువంటి రూపకర్తలలో ముందు వరుసలో నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొని నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించాలని, పిల్లలందరూ ఎంతో ఆసక్తితో పాఠశాలకు వెళ్లి చక్కగా చదువుకొనే విధంగా విధానాలను రూపొందించిన మన స్వతంత్ర భారత రెండవ రాష్ట్రపతి, విద్యావేత్త, తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నేటి మన ఆదర్శమూర్తి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేపల్లి వీరస్వామి అక్కడి జమిందారు వద్ద తహసిల్దార్‌గా పనిచేసేవారు. తల్లి సీతమ్మ. రాధాకృష్ణన్ గారి మాతృభాష తెలుగు. అంటే ఒకవిధంగా వీరు మన తెలుగువారు. బాల్యం లోనే అసాధారణమైన తెలివితేటలతో స్ఫురద్రూపియై రాధాకృష్ణన్‌ అందరినీ ఆకట్టుకోనేవారు. ప్రాథమిక విద్య తిరుత్తణిలో, తదనంతర విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరులో పూర్తిచేశారు. ఆ పిమ్మట మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా తన వృత్తిని ప్రారంభించిన రాధాకృష్ణన్ గారు తన ప్రతిభతో, బోధనా విధానంతో విద్యార్థులను ఆకట్టుకొన్నారు. ఆయన బోధించే ప్రక్రియ ఆ తరువాత వచ్చిన ఎందఱో అధ్యాపకులకు ఆదర్శంగా నిలిచింది. మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యునిగా నియమితులైన ఆయన ఆటు తరువాత కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్యునిగా కూడా పనిచేశారు. అలా ఎన్నో పదవులను అధిరోహించిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లరుగా 1931 సంవత్సరంలో నియమితులైనారు.

పాశ్చాత్య విద్యావిధానాలను మన విద్యా భోదనలకు అనుగుణంగా మార్చుకొని ఎలా బోధించవచ్చో స్వతహాగా ఆధ్యాపకుడైన రాధాకృష్ణన్ తన తాత్విక దృష్టితో శ్రమించి రూపకల్పన చేశారు. కనుకనే నేటి ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో మన భారతీయులకు కూడా ఒక స్థానాన్ని, కాదు కాదు ప్రత్యేకమైన హోదాతో కూడిన స్థానాన్ని కలిగివున్నాము. నాడు రాధాకృష్ణన్ వంటి వారు చూపిన దిశానిర్దేశం, విధివిధానాలు, నేడు మన శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి మూలకారకాలు. కనుకనే అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరుతో విద్యార్ధి వేతనాలను, పారితోషకాలను అందిస్తున్నారు. ఎంతో విలువైన సమాచారాన్ని కలిగి అత్యంత ఉపయోగకరమైన పుస్తకాలను ఆయన రచించారు. ఎన్నో ప్రతిష్టాత్మక దేశ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చక్కటి సాహిత్య, తత్వశాస్త్రాలపై ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది.

ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి మరియు నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎన్నో సార్లు ప్రతిపాదించడం జరిగింది. ఒక తత్వవేత్తగా భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, ఎన్నో విద్యా అభివృద్ధి పధకాలకు కారణభూతుడైన రాధాకృష్ణన్ గారు ఏప్రిల్ 17, 1975 సంవత్సరంలో మరణించారు. కానీ భారత విద్యా విధానంలో ఆయన చూపిన తాత్విక సిద్ధాంతాలు నేటికీ ఉపయోగకరంగా ఉన్నాయి. కనుకనే ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5, ‘ఉపాధ్యాయ దినోత్సవం’ గా నేటికీ పరిగణింపబడుతున్నది.

Posted in September 2022, వ్యాసాలు

1 Comment

  1. Gopal Nemana

    ఆయన వ్రాసిన పుస్తకాల్లో The Indian Philosophy (2 vols) The Pricipal Upanishads Oxford ప్రచురణలు. తల మానికలు. నా కెంతో సహకరించేయి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!